ప్రచారంలో మమత దూకుడు.. మహిళలతో కలిసి డ్యాన్స్
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక పార్టీ అధ్యక్షులైతే.. తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల నుదిటకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకున్నారు. గాయం నుంచి కోలుకోవడంతో ప్రచారంలో స్పీడ్ అందుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో గాలి, వానతో పలు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. దీంతో సోమవారం మమత బాధితులను పరామర్శించారు.
రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్న ఏపీ సర్కార్..
రేపటి నుంచి పెన్షన్ల పంపిణీకి ఏపీ సర్కార్ సిద్ధమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. కాగా.. వృద్ధులు, వికలాంగులకు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 6 లోపు పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ పెన్షన్ల పంపిణీ విషయంలో గత రెండ్రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెన్షన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన పెన్షన్ల పంపిణీ చేసే అంశంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలను ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చని పలువురు జిల్లాల కలెక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలి…
హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడానికి రాహుల్ గాంధీ తెలంగాణలోని తుక్కు గూడా కి 6వ తేదీన రావడం జరుగుతుందన్నారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఆమె పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లిక్కర్ స్కాం, ఫోన్ ట్రాపింగ్ లో బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి పనులు ఒకొక్కటి బయటపడటం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల లో ఎక్కువ మెజారిటీ తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య నీ భారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నామన్నారు కొండా సురేఖ. జైలు లో కవిత జపమాల కావాలంటుందని ఆయన ఆమె సెటైర్ వేశారు.
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారు..
ఎన్నికల సందర్భంలో పింఛన్ పంపిణీని ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రశ్నించారు. సంక్షేమం అనేది నిరంతరాయం.. అందుకు తగిన విధంగా ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని అడిగారు. మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి, మీ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మీ వైఖరి కనపడుతోందని ఆరోపించారు. సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు ఎందుకు రూపొందించుకోలేదని ప్రశ్నించారు.
ఏపీ సహా ఐదు రాష్ట్రాల అధికారులపై వేటు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారుల తీరుపై ఈసీ కొరడా ఝుళిపించింది. తాజాగా మంగళవారం ఐదు రాష్ట్రాలకు చెందిన అధికారులపై వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అధికారులను బదిలీ చేసింది. అస్సాం, బీహార్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 8 మంది జిల్లా మేజిస్ట్రేట్ (DM), 12 మంది పోలీసు సూపరింటెండెంట్ (SP)లను బదిలీ చేసింది.
ఖమ్మం నగరంలో రోజుకి ఒకసారి కరెంట్ పోతుంది
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన తర్వాత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న పంటలు అన్ని ఎండిపోయాయని, పంటలకు ఒక్క తడి నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. దానిపై కలెక్టర్ కు వినతి పత్రం అందించేందుకు సమయానికి వస్తె కలెక్టర్ సమయానికి రాలేదన్నారు. రైతులకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించామని, ఇప్పటికే ఖమ్మం నగరంలో బోర్లు వేయడం మొదలు పెట్టారన్నారు.
డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి..
మదనపల్లెలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉండాలి.. పేదల భవిష్యత్తు కోస జరిగే యుద్ధంలో పాల్గొనడానికి అందరూ సిద్ధంగా ఉండండని తెలిపారు. ఇంటింటికి మంచి చేశాను.. 175కి 175, 25 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా తగ్గకుండా ప్రజలందరూ గెలిపించాలని సీఎం జగన్ కోరారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చానని పేర్కొ్న్నారు.
మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆప్
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇద్దరు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అభ్యర్థులతో కూడా జాబితా అధిష్టానం విడుదల చేసింది. హోషియార్‌పూర్ నుంచి రాజ్ కుమార్ చబ్బెవాల్, ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి మల్వీందర్ సింగ్ కాంగ్ పోటీ చేయనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో ఆప్ సీట్ల షేరింగ్ జరిగింది. ఢిల్లీలో మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తోంది. పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు పోటీ చేస్తారని.. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలోకి దింపుతున్నట్లు ఆప్ నేతలు వెల్లడించారు. తాము పోటీ చేసే ప్రతి సీట్లలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వృద్ధులకు, వికలాంగులకు ఇతర పింఛన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్ అందివ్వాలి..
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్ ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ టీడీపీ జనసేన ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా.. వింజమూరు ఎంపీడీవో కిరణ్ కుమార్ కు వింజమూరు మండల నాయకులతో కలిసి కాకర్ల సురేష్ మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు, వికలాంగులకు, ఇతర పింఛను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పింఛన్ల పంపిణీ పై వైసీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
“ఇది 1962 నాటి భారతదేశం కాదు”..చైనాకు కేంద్రమంత్రి వార్నింగ్..
డ్రాగన్ కంట్రీ చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్‌లో పలు ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదని, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ వివాదంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం బలమైన సరిహద్దు విధానానని కలిగి ఉందని, ఇదే చైనాను చికాకు పెట్టిందని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ప్రస్తతం భారతదేశం 1962 నాటిది కాదని, ప్రతీ అంగుళాన్ని కాపాడుకుంటామని అన్నారు. 1962 నాటి ఇండియా-చైనా యుద్ధం గురించి ప్రస్తావించారు. బెదిరిస్తే భయపడటానికి భారత్ చిన్న, బలహీన దేశం కాదని ఆయన చెప్పారు. సరిహద్దు విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరించే ప్రభుత్వం భారతదేశంలో ఉందని, ఈ విషయాన్ని చైనీయులు అకస్మాత్తుగా గ్రహించి ఉంటారని ఆయన అన్నారు. సరిహద్దుల్లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, ఇతర పనుల గురించి చైనా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.
ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య
తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు, ఆత్మ గౌరవ పతాకను ఎగురవేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని ఆయన త్యాగాన్ని, ఆయన ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొంది ప్రజా పాలన ఏర్పడేందుకు దొడ్డి కొమురయ్య ఉద్యమ స్పూర్తిని అందిపుచ్చుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య త్యాగం చిర స్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు భారీ షాక్ తగిలింది. రూ.184 కోట్లకు పైగా సర్వీస్ ట్యాక్స్, పెనాల్టీ ఆర్డర్ అందిందని జొమాటో పేర్కొంది. ఇప్పటికే ఐటీ శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న జొమాటోకి తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్టీ నోటీసు జారీ అయింది. 2014 నుంచి జూన్ 2017 వరకు కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థలు, కంపెనీ బ్రాంచ్ లు భారత్ బయట ఉన్న శాఖలు, దాని కస్టమర్లకు చేసిన నిర్దిష్ట విక్రయాలపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఈ నోటీస్ పంపినట్లు ఐటీ శాఖ తెలిపింది. దానికి ప్రతిస్పందనగా ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా తగిన పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో పాటు వివరణ ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అయితే తాము అందించిన ఆధారాలను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని జొమాటో ఆరోపించింది.
కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కులగణనతో పాటుగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. రైతుల సమస్యల పేరిట ఇక్కడ దీక్ష చేస్తున్న ఎంపి బండి సంజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ముందు దీక్ష చేయాలని, బండి సంజయ్ ఓట్ల కోసం మొన్నటిదాకా రాముని ఫోటో పెట్టుకున్నారు, ఇప్పుడు రైతుల పేరిట ముసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాలేశ్వరం కుంగిపోతే నాలుగు నెలలుగా మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నాడని, 6) రాజకీయా డ్రామాలు పక్కనపెట్టి రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా కేంద్రం నుండి బండి సంజయ్ నిధులు తేవాలన్నారు పొన్నం ప్రభాకర్.