Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Story Board Political Parties Freebies Vs Welfare Impact On Indian Economy

Story Board : ఉచితాలపై పార్టీలు ఎందుకు మోజు పడుతున్నాయి..?

Published Date :February 23, 2026 , 5:10 pm
By Gogikar Sai Krishna
  • సంక్షేమం వర్సెస్ ఉచితాలు.. సుప్రీంకోర్టు క్లారిటీ
  • అప్పుల ఊబిలో రాష్ట్రాలు - ఆగుతున్న అభివృద్ధి
  • ఓటు బ్యాంకు రాజకీయాలు - ఆర్థిక వ్యవస్థకు చేటు
  • సోమరితనానికి పురిగొల్పుతున్న ఉచితాల సంస్కృతి
Story Board : ఉచితాలపై పార్టీలు ఎందుకు మోజు పడుతున్నాయి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజలందర్నీ సమానంగా ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందరికీ కనీస జీవనప్రమాణాలు అందివ్వటమే లక్ష్యంగా పాలన సాగాలి. కానీ నిరుపేదలకు ఆసరా ఇవ్వటానికి ఉద్దేశించిన సంక్షేమం రూపు మార్చిన ప్రభుత్వాలు.. ఇష్టారాజ్యంగా ఉచితాలతో బరితెగిస్తున్నాయి. ఈ పోకడలే పుట్టి ముంచుతాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఉచితాలపై కొంతకాలంగా కొనసాగుతున్న చర్చకు సుప్రీంకోర్టు తెరదించింది. ఉచితాలను, సంక్షేమాన్ని కలగలిపి చూడొద్దని దిశానిర్దేశం చేసింది. ఆర్థికవ్యవస్థను కుదేలు చేసే ఉచితాలను పక్కనపెట్టి.. నిరుపేదల కనీస అవసరాలు తీర్చే విధంగా సంక్షేమం కొనసాగించాలని విలువైన సూచన చేసింది. ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఉచితాల కారణంగా రాష్ట్రాల ఆదాయమంతా ఉద్యోగుల జీతాలు, పథకాల పంపిణీకే పోతోందని, ఇక అభివృద్ధికి నిధులెక్కడ్నుంచి వస్తాయని సుప్రీం నిలదీసింది. రెవిన్యూలోటుతో కునారిల్లుతున్న రాష్ట్రాలు ఎందుకు ఇంకా కొత్త ఉచితాలను ప్రవేశపెడుతున్నాని ప్రశ్నించింది. అసలు అన్నీ ఉచితం అంటే.. ప్రజలు కష్టపడటం మానేస్తారని, కూర్చుని తినటానికి అలవాడు పడుతారని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తం మీద రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనకు విపరీతార్ధాలు చెబుతూ.. ఓటుబ్యాంకు కోసం ఉచితాలకు తెరతీసిన పార్టీలు.. విజయవంతంగా ఆర్థికవ్యవస్థలకు చేజేతులా చేటు కొనితెచ్చుకున్నాయి. కనీసం ఏడాది ఆదాయంలో పాతిక శాతమైనా అభివృద్ధి పనులకు కేటాయించాలనే కట్టుబాటు తీసుకోవాలన్న సుప్రీం సూచన శిరోధార్యమనడంలో సందేహం లేదు.

Also Read

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Story Board: దీదీ హెచ్చరికలు పనిచేస్తాయా? మోడీ మసాలా మరమరాల సంగతేంటి?
  • Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మళ్లీ షాక్..! 54 ఓట్ల తేడాతో..
  • Story Board: నియోజకవర్గాల పునర్విభజన..! తెలుగు రాష్ట్రాలకు వరమా? శాపమా?

ఒక హామీ ఇచ్చే ముందు.. అది సాధ్యమా కాదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా, ఐదేళ్ల పాటు నడిపించగలమా లేదా అనేది చూసుకోవడం కనీస ధర్మం. కానీ మాయమాటలు చెప్పటానికి లెక్కలు చూసుకోవాల్సిన పనిలేదంటున్నాయి పార్టీలు. గల్లా పెట్టెలో డబ్బుల్లేకపోయినా పథకాలు అమలుచేస్తే.. అది భవిష్యత్‌ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే.. ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. పథకాలు ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అదే జరిగితే.. భవిష్యత్‌ తరానికి చెడ్డపేరు తప్ప మరొకటి మిగలదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పార్టీల ధోరణి ఎప్పుడూ ఉచిత పథకాలు ఇస్తేనే జనం ఓట్లేస్తారు అన్నట్టుగా ఉంటుంది. ఒకప్పుడు వడ్డించిన విస్తరిలా పథకాలు ఉండేవి. ఆ తరువాత.. కలుపుకుని తినే కర్మ నీకెందుకని.. ముద్ద కలిపి నోటికే అందించడం మొదలుపెట్టారు. ఆ తరువాత.. నమిలి, అరాయించుకోవాల్సిన కర్మ నీకెందుకు.. ఆ పని కూడా మేమే చేసిపెడతాం అన్నంత వరకు వచ్చింది కథ. తెలుగు రాష్ట్రాలే ఇందుకు ఎగ్జాంపుల్. సో, ఎవరొచ్చినా పథకాలైతే ఆగవు కదా అనేంతగా దిగజారింది పరిస్థితి. ఈ భావన రావడంతో.. పార్టీలపై, నాయకులపై ప్రజల్లో కృతజ్ఞతా భావం తగ్గింది. ఫలానా ప్రభుత్వంపై గానీ, ఫలానా ముఖ్యమంత్రి విషయంలో గానీ రుణపడి ఉండడం అనేది తగ్గిపోయింది. ప్రజల్లో రాజకీయ స్పృహ బాగా పెరిగింది. ఎవరు సీఎం అయినా.. ఉచిత పథకాల పేరుతో పంచేది వాళ్ల డబ్బులు కావు కదా అనే ఓ స్పృహతో ఉన్నారు. అవి జనం డబ్బు. అంటే తమ డబ్బు. మా డబ్బులు మాకు పంచుతున్నారు అనే వివేకం కలిగింది ప్రజల్లో. కానీ ప్రజల్లో వివేకం పెరిగిన తర్వాత కూడా.. రాజకీయ పార్టీలు మాత్రం మూస పద్ధతిలో ఎన్నికలు రాగానే కొత్త స్కీముల ప్రకటనలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. చివరకు సుప్రీంకోర్టు కూడా పార్టీల వైఖరితో విసిగిపోయి.. కాస్త గట్టిగానే చీవాట్లు పెట్టింది. చివరకు రాష్ట్రాలు ప్రభుత్వం ఎలా నడపాలో, ఆదాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దిశానిర్దేశం చేసింది. ఇప్పటికైనా మన నేతలు మారతారా.. ఉచితాలు పక్కనపెట్టి అభివృద్ధిని పట్టించుకుంటారా అనేది చూడాల్సి ఉంది.

కొంతకాలంగా ఉచితాలను, సంక్షేమాన్ని కలగలిపి చూసే ప్రక్రియ నడుస్తోంది. రాజకీయ పార్టీలు కూడా అందుకు తగ్గట్టుగా ఉచితాలు వద్దంటే.. సంక్షేమం లేకపోతే పేదల సంగతేంటనే వాదన ఎత్తుకుంటున్నాయి. దీంతో అసలు ఏది ఉచితం..? ఏది సంక్షేమం..? అనే ధర్మ సందేహాలు పుట్టుకొచ్చాయి. వీటిపై కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావన ఏంటో స్పష్టంగా విశదీకరించింది. విద్య, వైద్యం విషయంలో ఏం చేసినా.. ఉచితాల కిందకు రాదని, కానీ ఎన్నికల్లో గెలుపు కోసం, ఓటుబ్యాంకును కాపాడుకోవడం కోసం ఇష్టారాజ్యంగా ఇచ్చే పథకాలు మాత్రం తీవ్ర అభ్యంతరకరమని తేల్చిచెప్పింది. సంక్షేమం అంటే నిరుపేదలకు కనీస అవసరాలు తీర్చాలనే కానీ.. పలుకుబడి ఉన్న వ్యక్తులకు అన్నీ దోచిపెట్టమని కాదని.. సుప్రీం ఘాటుగానే వ్యాఖ్యానించింది. అసలు రెవిన్యూలోటుతో సతమతమౌతున్న రాష్ట్రాలు.. ఎక్కడ్నుంచి డబ్బులు తెచ్చి పథకాలిస్తాయని కూడా సుప్రీం ప్రశ్నించింది. ఈమధ్యకాలంలో తెలివిమీరిన పార్టీలు.. చేయాల్సిన సంక్షేమాన్ని కూడా గాలికొదిలేసి.. కేవలం ఉచితాలపైనే ఫోకస్ పెంచిన వాస్తవం మన కళ్ల ముందే ఉంది. ఈ బరితెగింపు వైఖరినే సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

గెలుపే ధ్యేయంగా నడుస్తున్న నేటి ఉచిత రాజకీయాలు దేశాభివృద్ధికి పెనుముప్పుగా తయారయ్యాయి. ప్రభుత్వాల బడ్జెట్లను, దేశవనరులను ఆవిరి చేస్తున్న ఉచితాలు ప్రజలపై రుణ భారాన్ని నానాటికి పెంచుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెడుతున్న పార్టీలు ఆర్థికవ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను చెరిపివేస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి ప్రజలకు రోజువారి కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకు ఇచ్చే సంక్షేమ పథకాలను, ఎలాంటి హేతుబద్ధత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపజేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెబుతున్నాయి. సాధారణ బడ్జెట్ కంటే ఉచిత బడ్జెట్ ఎక్కువగా ఉంటుందని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

గెలవాలంటే ఉచితాలకు మించిన అస్త్రం లేదు. ఇదే ఆలోచనతో.. ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టిపెడుతున్నాయి. ఉత్పాదకతను పెంచడం, శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవరికీ ఆసక్తి ఉండటం లేదు. ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే పనిగా మారిపోయింది. ఈ పోకడ ఏ ఒక్క రాష్ట్రానికో ఇది పరిమితం కాదు.. అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలనే ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఉచితాలు లేకపోతే కొంప మునిగిపోతుందని, రాజకీయ మనుగడే ఉండదన్నంతగా ఫీలైపోతున్నాయి. అందుకే ఇదే పోకడ కొనసాగితే.. ప్రజలెందుకు పనిచేయాలని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న వెనుక లోతైన ఆలోచనతో పాటు గురుతర బాధ్యత కూడా ఉంది. గతంలో ఎన్నోసార్లు దేశానికి కీలక సందర్భాల్లో దిశానిర్దేశం చేసిన సుప్రీంకోర్టు.. ఇప్పుడు ఉచితాల ఔచిత్యమేంటనే ప్రశ్నను లేవనెత్తడమే కాకుండా.. దానికి సహేతుకమైన జవాబు కూడా చెప్పి.. మరోసారి సరైన మార్గం చూపే ప్రయత్నం చేసింది. మరి సుప్రీం చూపిన బాటలో పార్టీలు నడుస్తాయా.. లేదంటే ఇలాగే ఆర్థికవ్యవస్థను కుదేలు చేస్తూ.. ఉచితాల్నే నమ్ముకుంటాయా అనేది చూడాల్సి ఉంది.

 

సమాజంలో అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు ఉండాల్సిందే. అలాగే ఎవరికి నచ్చినట్టుగా వారు ఎదిగేందుకు వీలుగా సర్కారు చేయూత ఇవ్వాల్సిందే. కానీ సంక్షేమ అమలులో యుక్తాయుక్త విచక్షణ కీలకం. ఎవరికి ఏది అవసరమో అది అందివ్వాలే కానీ.. అనవసరంగా అవసరం లేనివారికి అప్పనంగా పథకాలు ఇవ్వకూడదు. ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడుదిగుడు సమాజంలో అట్టడుగు నుంచే బడుగు,బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పైగా, మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారినీ భాగస్వాముల్ని చేసేలా సమ్మిళిత ప్రగతి అవసరం. అందుకై చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు దండుకునే యావతో ఎవరెవరికో ఉచితాలు ఇవ్వడం, నగదు బదిలీ చేయడం పట్లనే అభ్యంతరాలు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేసి, అన్నీ సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించటాన్ని ఎవరూ క్షమించరు.

ప్రజాకర్షక పథకాలతో ఇష్టారీతిన ఉచితాల పంపకం మున్ముందు ఆర్థిక వినాశనానికి దారి తీస్తుంది. ఉచితాల ద్వారా తన కుడి జేబులోకి కొంత వస్తున్నా తర్వాత్తర్వాత ఎడమ జేబుకు ఎంత కోత పడుతుందో సగటు పౌరుడు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఉచితాలు అనుచితమని అందరూ అంటారు. కానీ, అమలు పరిచే సమయం వచ్చే సరికి అన్ని రాజకీయ పక్షాలూ ఒకే తాను ముక్కలు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు. ఎన్నికల ఏరు దాటి, అధికారపు ఆవలి గట్టు చేరేలా, లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు తప్పకుండా అభివృద్ధికి అవరోధమే.సమ్మిళిత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఒక గాటన కట్టలేం. సదరు సంక్షేమ కార్యక్రమాలకు, ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకూ మధ్య నుంచే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో.. సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థల్ని ఛిద్రం చేస్తున్నాయి.

రాజ్యాంగంలో చెప్పిన సంక్షేమ రాజ్య భావనకు అనుగుణంగా ప్రవేశపెట్టిన పథకాలు చాలావరకు విజయవంతమయ్యాయి.
పేదలకు రేషన్ పథకం.. ఆకలిచావుల్ని దాదాపుగా అరికట్టింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆకలితో చనిపోయే పరిస్థితి ఎవరికీ లేదు. మధ్యాహ్న భోజన పథకం.. స్కూల్ డ్రాపవుట్స్ సమస్యకు చెక్ పెట్టింది. గణనీయ సంఖ్యలో పిల్లలు బడిబాట పట్టారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, సబ్సిడీలు.. ఆహారధాన్యాల సమస్యను తీర్చేసింది. ఇలా ఎన్నో పథకాలు అంచనాలకు మించిన విజయాలు సాధించాయి. కానీ పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటిస్తున్న పథకాలే.. కొంప ముంచుుతన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటిపైనే అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్య, వైద్య రంగాల్లో ఏం చేసినా తప్పు కాదని సుప్రీం చెప్పడం.. ప్రభుత్వాలకు కళ్లు తెరిపిస్తుందేమో చూడాలి.

ఒక దేశ ఆర్థికాభివృద్ధి ఎంత ముఖ్యమో.. సామాజిక పురోగతి కూడా అంతే ప్రధానం. సామాజిక అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలు ముందడుగు వేయాలి. అట్టడుగు వర్గాలకు చేయూత ఇవ్వడం తప్పనిసరి. అప్పుడే వారి జీవన ప్రమాణాలు మెరుగై.. దేశాభివృద్ధిలో భాగం పంచుకోవడం కుదురుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకునే రాజ్యాంగంలో సంక్షేమం రాజ్య భావనకు పెద్దపీట వేశారు. దీనికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పథకాలు అమలు చేసి.. మెరుగైన ఫలితాలు సాధించాలి. స్కీముల్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలే కానీ.. ఎన్నికలు రాగానే ఓటర్లను భ్రమల్లో ముంచెత్తే ఉచితాలకు ఇకనైనా తెరదించాలి. సుప్రీంకోర్టు సంక్షేమానికి, ఉచితాలకు మధ్య ఉన్న తేడాను నిర్వచించిన విధానాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి.

మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ రంగానికి రైతులు, పారిశ్రామిక రంగానికి కార్మికులు, సేవా రంగానికి శ్రామికులు చాలా కీలకం. ఈ వర్గాల్లో ఎక్కడ సంఖ్య తగ్గినా.. ఆ ప్రభావం మొత్తం రంగం మీద ఉంటుంది. అందు కేవలం ట్యాక్స్ పేయర్స్ నే కాకుండా.. పేదల్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అందరి సర్వతోముఖాభివృద్ధి కోసం సంక్షేమం అమలు చేయాలి. అంతిమంగా ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరగడమే లక్ష్యం కావాలి. అంతే కానీ పేద, ధనిక అంతరాలు మరింత పెరిగేలా పథకాల ప్రకటనతో మాత్రం నష్టమే ఎక్కువగా జరుగుతుంది. పార్టీలతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నవారు, పలకుబడి ఉన్నవారికి మాత్రమే పథకాలు అందితే.. అది ప్రజాధనాన్ని దోచిపెట్టడమే అవుతుంది. అదే నిజంగా పేదరికంలో ఉన్నవారికి గౌరవంగా బతికేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. సంక్షేమ రాజ్య భావన పరిపూర్ణమవుతుంది. ఇలా సంక్షేమానికి, ఉచితాలకు మధ్య ఉన్న సన్నటి విభజన రేఖను పార్టీలు కూడా చిత్తశుద్ధితో అర్థం చేసుకోవాలి.

ప్రజాస్వామ్య యుగంలోనే కాదు.. గతంలో నాగరికత మొదలైనప్పట్నుంచీ చూసుకున్నా.. ప్రజల్ని ఏదో రూపంలో పాలకులు ఆదుకోవడం ఉంది. దీనికి పేరు ఏం పెట్టినా.. అన్నింటి ఉద్దేశం పేదల్ని ఆదుకోవడమే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి కొంత డబ్బు పేదలకు ఖర్చు చేయడాన్ని అభ్యంతరపెట్టాల్సిన పనిలేదు. వారు కూడా సమాజంలో భాగమే. కానీ అలా పేదల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు దుర్వినియోగమౌతున్నాయనేదే సుప్రీంకోర్టు ఆవేదన. ఎవరికి ఏది అవసరమో అది అందకపోగా.. అవసరం లేని వారికి చాలా ఎక్కువగా అందటమే.. ఆర్థిక అసమానతల్ని మరింతగా పెంచుతోంది. ఇప్పటికే సహజంగా ఉన్న అంతరాలు సరిపోవని.. ప్రభుత్వాలు పనిగట్టుకుని ఉచితాల పేరుతో ప్రకటనలు, వాటి అమలులో చూపిస్తున్న బాధ్యతారాహిత్యంతో.. అవి మరింతగా పెరుగుతున్నాయి.

సంక్షేమం ఎప్పుడూ తప్పు కాదు. పథకం ఏ లక్ష్యంతో ప్రారంభించారు. ఎంతవరకు లక్ష్యం సాధించారనే విషయాలపై చర్చ జరిగితే అందరికీ మంచిదే. అలాగని ఉచితాలను సంక్షేమంతో కలిపి చూడకూడదు. ఇక్కడ సంక్షేమం పేదప్రజల బతకులు బాగుచేయాలనే సంకల్పం నుంచి పుట్టింది. అవే ఉచితాలు మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పురుడు పోసుకుుంటున్నాయి. అలా చూసినప్పుడు ఉద్దేశంలోనే స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఇక్కడ సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. అది పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వం కొనసాగించాల్సిన అంశం. కానీ ఉచితాల దగ్గరకు వచ్చేసరికి పార్టీని బట్టి, రాష్ట్రాన్ని బట్టి వాటి ప్రకటనలు, అమలు తీరు మారిపోతుంటుంది. అలా చూసుకున్నా సంక్షేమానికి ఉన్న విలువ ఉచితాలకు ఎప్పుడూ ఉండదు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు తాత్కాలిక ప్రయోజనాలే లక్ష్యంగా భాబరితెగించి ఓటర్లకు ఉచితాల వల విసురుతున్నాయి. అలా కాకుండా బాధ్యతగా, సమాజ హితం కోసం చేయాల్సిన సంక్షేమాన్ని మాత్రం గుదిబండగా భావించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ప్రభుత్వాలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఉంది. కానీ సంక్షేమం పేరుతో ఉచితాలకు పెద్దపీట వేస్తూ.. అసలైన సంక్షేమాన్ని విస్మరించాయి. అదే సమయంలో నిధుల్లేవనే సాకుతో అభివృద్ధిని అసలే పట్టించుకోవడం లేదు. ఈ ధోరణి భవిష్యత్తుకు మేలు చేయదని సుప్రీం గట్టిగా హెచ్చరించింది. ప్రజా శ్రేయస్సును విస్మరించే ప్రభుత్వాలున్నా, లేకున్నా ఒక్కటే. ప్రభుత్వ పథకాల ఫలాలను అట్టడుగువర్గానికి అందించడమే అసలు సిసలు బాధ్యత. అన్ని వర్గాల వారి ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వాల బాధ్యత. ఉచితంగా ఉన్న విద్య, వైద్యాలను అమ్మకపు సేవలుగా మార్చి వేశారు. అందుకే మొదట వాటి సంగతి చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా హితవు చెప్పింది. ఆ రెండు రంగాలను ఉచితం చేసినా.. అది సంక్షేమం కిందకే వస్తుందని స్పష్టంగా చెప్పింది. ఉచితాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు మంచివి కాదని… దురదృష్టవశాత్తూ.. వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదని స్పష్టం చేసింది. ఉచితంగా రేషన్‌, డబ్బులు అందుతున్నాయని…ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినా…కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని సూచించింది. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా..?. ప్రజలు కట్టే పన్నుల డబ్బును సద్వినియోగం చేయడం కూడా ప్రభుత్వా బాధ్యతే అని కోర్టు గుర్తుచేసింది. ఉచితాల కోసం వేల కోట్లు తగలేస్తున్న ప్రభుత్వాలు.. అభివృద్ధికి పైసా వెచ్చించలేని దుస్థితిలో ఉన్నాయని ఆక్షేపించింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు, పథకాల అమలుకే పోతుందన్నది వాస్తవం. కొందరు ముఖ్యమంత్రులే స్వయంగా ఇదే విషయం చెప్పారు. ఆర్థిక స్థితిగతులు విషమిస్తున్నా సరే.. ఉచితాలపై పార్టీలకు మోజు పోవడం లేదు.

సంక్షేమ పథకాల్లో భాగంగా బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాల్సిందే. అయితే కేవలం ఓట్ల కోసం ప్రకటించే అనుచిత వాగ్దానాలతోనే అసలు సమస్య. సంక్షేమం పేరుతో పథకాలు అమలు చేయడం…తప్పేమీ కాదు. ఎవరు అర్హులో…ఎవరు అనర్హులో గుర్తించి ఇవ్వాలి. అలా అని అందరికి ఇవ్వడం కూడా ధర్మం కాదు. ఎన్నికల్లో లబ్దిపొందడం కోసం ఉచితాలు ఇవ్వడమన్నది మాత్రం క్షమించరాని నేరం. ఉచిత పథకాలు అందరికి ఇవ్వడం వల్ల జనాన్ని సోమరులుగా మార్చేసినట్లే. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఉచిత పథకాలు అమలు చేయడం కారణంగా…పని సంస్కృతిని చంపేస్తున్నాయి. ఉపాధి…సంక్షేమం…రాయితీలు…వీటికి చాలా తేడా ఉంది. సంక్షేమం పేరుతో ఉచితాలు ఇష్టారాజ్యంగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలన్నట్లు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ముందు హామీలి ఇచ్చేద్దాం…అధికారంలోకి వచ్చాక పథకాల సంగతి చూద్దాం అన్నట్లుగా పార్టీల తీరు ఉంది.

వ్యవసాయ రంగానికి, రైతులకు రాయితీలు ఇవ్వడం మంచిదే. అయితే రాయితీ ఇవ్వడం వల్ల అన్నదాత నిలుబడతాడు. కానీ మొత్తం పథకాలు ఇచ్చేయడం మాత్రం…సరైన నిర్ణయం కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్‌ను తగ్గించడానికి…చాలా రాష్ట్రాలు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా, చైనా లాంటి దేశాల్లోనూ ఈ పథకం అమలవుతోంది. అయితే కనిపించిన ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు ఇస్తూ పోతామంటే…జనాన్ని సోమరిపోతులుగా మార్చేయమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌..చెన్నైలో భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్మాణరంగంలో కార్మికుల వలసలు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని…ఉచిత పథకాల వల్లే కార్మికులు పని చేయడానికి ఇష్టపడటం లేదన్నారు.

ఎన్నికల వాగ్దానాల ఫలితంగా ప్రజలకు పంపిణీ చేస్తున్న ఉచితాలలోని లోపాలపై జరుగుతున్న చర్చ దేశానికి కొత్తేమీ కాదు. కానీ, ఉచితాలు అంటే ఏమిటనే దానిపై ఇంకా గందరగోళం నెలకొంది. ప్రభుత్వం దేశ పౌరుల కోసం రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన సేవలను కూడా ఈ కేటగిరీ లోకే కలుపుతున్నారు. ఇవి వనరులను వృధా చేస్తున్నాయని, ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న ఆర్థిక వనరులపై మరింత భారం పడుతుందని.. ప్రధానమైన వాదనలు ఉన్నాయి. ఇలాంటి చర్చల్లో ఉచితాలు అంటే టెలివిజన్లు, బంగారు గొలుసుల లాంటి వస్తువులు మాత్రమే కాక ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉచిత లేదా సబ్సిడీలతో కూడిన రేషన్‌, మధ్యాహ్న భోజన పథకం కింద వండిన ఆహారం, అంగన్వాడీల ద్వారా అనుబంధ పోషకాహారంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనిని సమకూర్చే పనులు కూడా చేర్చకూడదనే వాదన ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనకే మద్దతిస్తూ.. అవసరాలు తీర్చడం వేరు.. ప్రలోభపెట్టడం వేరు అని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం తెలిసినా.. పార్టీలు తెలియనట్టుగా అమాయకత్వం నటిస్తున్నాయనడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కొత్త విషయం ఏమీ కాదు. అందరికీ తెలిసినదే. కాకపోతే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టుగా సుప్రీంకోర్టు డైరక్షన్ ఇస్తే కానీ.. ఏమీ చేయని తోలుమందం వ్యవస్థ తయారైంది. మరిప్పటికైనా సుప్రీం సూచనలు పాటించి.. ఉచితాల సంస్కృతికి చరమగీతం పాడి.. సంక్షేమ రాజ్యాన్ని సాకారం చేస్తారా.. లేదా అనేది చూడాలి.

పేదరికం ఏటా పెరుగుతూనే ఉంటుంది. కోట్లమంది బతకటానికే కష్టపడుతుంటారు. ఇలాంటి దేశంలో సంక్షేమ పథకాలు కావాలి. వాటిని ఓ క్రమపద్ధతిలో.. ఓ లక్ష్యంతో అమలు చేయాలి. అలాగే వాటి అమలు తీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. అంతేకానీ నోటికొచ్చిన ప్రతి వస్తువును ఫ్రీ అని చెప్పేసి, ఎన్నికలప్పుడు ఆపదమొక్కులు మొక్కేసి.. తర్వాత అప్పుులు తెచ్చి మరీ ఉచితాలకు తగలెట్టడం మాత్రం కచ్చితంగా తప్పే కాదు.. సమాజానికి ద్రోహం కూడా అనడానికి సందేహించాల్సిన పనేం లేదు. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వాలు.. తోచినట్టుగా డబ్బు తగలేయటం.. భవిష్యత్ తరాలపై అవాంఛిత భారం మోపుతుంది. ప్రస్తుత పార్టీల రాజకీయ ప్రయోజనాలకు భవిష్యత్ తరాలు ఎందుకు మూల్యం చెల్లించాలనేది సమాజం నుంచి దూసుకొస్తున్న ప్రశ్న.

దేశానికి ఉన్న వనరులు, ప్రజలు పన్నులుగా కడుతున్న మొత్తాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పని చేయడం లేదు. పూర్తిగా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఆ సొమ్మును ఓటు బ్యాంకుకు పంపిణీ చేసి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఇది చాలా ప్రమాదకమైన ఆట. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే.. ఇప్పుడు వంద ఇస్తే తర్వాత వెయ్యి రూపాయలు కోరుకుంటారు. ఇవ్వకపోతే అసంతృప్తికి గురవుతారు. ఒకప్పుడు ప్రభుత్వాలపై అసంతృప్తి అంత ఎక్కువగా ఉండేది కాదు. ఐదేళ్ల తర్వాత ప్రజలు తీవ్రంగా తిరస్కరించేవారు కాదు. పరిపాలన ఎలా ఉందో చూసి ఓటు వేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చూస్తే గొప్ప సంక్షేమం పేరుతో పథకాలను ఇచ్చిన వారిని అంతే గట్టిగా పాతాళానికి తొక్కేస్తున్నారు. పథకాలు ప్రకటించని పార్టీ ఒక్కటి కూడా ఉండటం లేదు. ఒక్క పార్టీ అయినా పథకాలు ప్రకటించకుండా..తాము సుపరిపాలన అందిస్తామని చెప్పడం లేదు. ఇలాంటి పోకడలతో దేశాన్ని సమస్యల సుడిగుండంలో నెట్టేసి.. వినోదం చూస్తున్నాయి. పార్టీలకు రాజకీయమే పరమావధి కావడంతోనే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందనేది చాలా మంది ప్రజల్లో ఉన్న భావన. కానీ ఈ భావనకు మసిపూసి మారేడుకాయ చేసి.. ఎప్పటికప్పుడు సరికొత్త తాయిలాలతో ఓటర్లను ఆకట్టుకోవటమే పాలన అన్నట్టుగా ప్రభుత్వాల తీరు ఉంది. సుప్రీం మందలింపు తర్వాత కూడా పద్ధతి మారకపోతే.. చేజేతులా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చుకున్న పాపం మనదే అవుతుంది. అంతదాకా పరిస్థితులు విషమించకుండా.. ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలి. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి.. ఓటుబ్యాంకు ఉచితాలకు పూర్తిగా మంగళం పాడాల్సిందే.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • development
  • Economic Crisis
  • election promises
  • fiscal deficit
  • Freebies

తాజావార్తలు

  • Tamilnadu Assembly Election 2026: సరికొత్త రికార్డు సృష్టించిన తమిళనాడు ఓటర్లు..

  • Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!

  • West Bengal Election: 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. తమిళనాడులో 82 శాతం.. రికార్డ్ స్థాయిలో పోలింగ్..

  • TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి

  • Driver Subrahmanyam Case: మూడు రోజులకే సర్పవరం సీఐపై బదిలీ వేటు..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions