కుటుంబ గొడవల కారణంగా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్ డివిజన్ ఆస్మాన్‌ఘడ్ ఎస్టీ బస్తీకి చెందిన జాతావత్ కిరణ్ (36) ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం తాగే అలవాటు ఉన్న అతను భార్యతో తరచూ గొడవపడేవాడు. నాలుగైదు రోజులుగా సెలవు తీసుకుని ఇంట్లోనే ఉన్న కిరణ్, మంగళవారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. ఆ ఘటన అనంతరం బుధవారం సాయంత్రం అతను ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
డొనాల్డ్ ట్రంప్ హోటల్ ముందు పేలిన టెస్లా సైబర్‌ట్రక్..
అమెరికాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రక్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించాగా.. ఏడుగురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు చెప్పుకొచ్చారు. అలాగే, న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ప్రమాదంలో దాదా15 మంది మరణించారు.
CMR కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం.. గొడవ పడుతున్న విద్యార్థి సంఘాల నేతలు
హైదరాబాద్‌లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ సీవరేజీ ఓవర్ ఫ్లో నివారణ డ్రైవ్ విజయవంతం
హైదరాబాద్ నగరంలో సీవరేజీ సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ నేటితో విజయవంతంగా ముగిసింది. గాంధీ జయంతి రోజున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 90 రోజులుగా నిర్విరామంగా సాగిన ఈ డ్రైవ్ ద్వారా నగరంలోని 17,050 ప్రాంతాల్లో 2,200 కిలోమీటర్ల సీవరేజీ పైపులైన్, 1.75 లక్షల మ్యాన్ హోళ్లను శుభ్రం చేశారు. ఈ చర్యల ఫలితంగా సీవరేజీ ఫిర్యాదులు 30 శాతం తగ్గాయి.
వాహనదారుడి మెడకు చుట్టుకున్న చైనా మాంజా.. తీవ్ర రక్తస్రావం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్‌కి తరలించారు.
నిర్వహణ , నిషేధ ఆదేశాలున్నప్పటికీ, చైనా మాంజా ఇప్పటికీ మార్కెట్‌లో విరివిగా లభిస్తోంది. దాని ప్రమాదకరమైన ధారాలు అత్యంత పదునైనవి కావడం వల్ల ప్రయాణికులు, పక్షులు ,ఇతరులు గాయపడి ప్రాణాలు కోల్పోవడం తారసపడుతోంది. చైనా మాంజా తగిలి గతంలోనూ అనేక చోట్ల ప్రమాదాలు సంభవించాయి. పతంగి పోటీల్లో ఉత్సాహంతో పిల్లలు చైనా మాంజా కొనుగోలు చేసి పతంగులను ఎగరేస్తున్నారు. అయితే, దాని వినియోగం వల్ల తీవ్ర పరిణామాలు కలగవచ్చని వారు అవగాహనలో లేకపోవడం దురదృష్టకరం.
తనిఖీ చేస్తుండగా.. కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లిన కారు!
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేటుగాళ్లు కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కానిస్టేబుళ్ల పైనుంచి కారు వెళ్లినా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై జగ్గంపేట సీఐపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసాపై.. పనికి మాలిన వాడు.. పని లేనోడు విమర్శలు చేస్తారు
రైతు భరోసా పై… పనికి మాలిన వాడు… పని లేనోడు విమర్శలు చేస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. RRR లో 12 వేల కోట్ల అవినీతి అని కేటీఆర్ అంటున్నాడని, టెండర్ పిలిచింది 7 వేల కోట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేటీఆర్..హరీష్ మానసిక పరిస్థితి సరిగలేదని ఆయన సెటైర్ వేశారు. అధికారం ఇక రాదని అర్థమైంది వాళ్లకు అని, 7 వేల కోట్లకు టెండర్ పిలిస్తే… 12 వేల కోట్లు అవినీతి అంటే అర్ధం ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ వి పిచ్చి మాటలు తప్పితే.. టెండర్ కి కూడా ఇంకా రెండు నెలలు టైం ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి.
హిందూ సన్యాసి చిన్మోయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన బంగ్లాదేశ్ కోర్టు..
బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు గాను 2024 నవంబర్ 25వ తేదీన హిందూ ప్రచారకర్త, ఇస్కాన్ మాజీ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్ కోర్టు ఈరోజు (జనవరి 2) తిరస్కరించింది. కాగా, ఈరోజు చిన్మోయ్ కృష్ణ బెయిల్ కోసం సుప్రీంకోర్టులోని న్యాయవాది అపూర్బా కుమార్ భట్టాచార్జీ నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ మధ్య వాదనలు జరిగాయి. సుమారు 30 నిమిషాల పాటు ఇరువురి వాదనలు విన్న మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం ఈ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చారు.
సీఎంఆర్ కాలేజ్ ఘటన.. కీలక విషయాలు వెల్లడించిన ఏసీపీ
మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టల్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లలో రహస్యంగా కెమెరాలు అమర్చి, వీడియోలు తీస్తున్నారనే ఆరోపణలతో విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ పరిణామాలపై హాస్టల్ వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. విద్యార్థినులు నినాదాలు చేస్తూ యాజమాన్యాన్ని వెంటనే స్పందించాలని కోరారు.
పుష్ప-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట
పుష్ప -2 రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు చిత్ర హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర నిర్మాతలు, మైత్రీ మూవీస్ అధినేతలు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ యెర్నేనిపై కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసులో తమపై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్. అసలు థియేటర్ భద్రత తమ పరిధి కాదని, తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామని, సమాచారం ఇచ్చాము కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని, అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకొని ఘటన జరిగింది, జరిగిన ఘటన కు సినిమా ప్రొడ్యూసర్లు నిందితులుగా చేరిస్తే ఎలా అని వాదనలు వినిపించారు పిటిషనర్ తరపు న్యాయవాది. ఈ కేసులో ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం పుష్పా 2 ప్రొడ్యూసర్స్ కు భారీ ఊరట కల్పించింది. పుష్ప -2 ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.