అందుకే ప్రతిపక్షాలకు కడుపు మంట.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు
నవరత్నాలతో ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికలు వస్తున్నాయంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నా వాళ్లు అంటూ కల్లబొల్లి మాటలు చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమవుతాడు అంటూ టీడీపీ అధినేతపై విరిచుకుపడ్డారు.. ఇక, బీసీలను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మాయమాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపుల ఓట్ల కోసం చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా..? అనే చంద్రబాబు మాటలు ప్రజలు మర్చిపోరన్నారు.. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర దేశం అంతా తెలుసు.. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు చేసిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబోరని తెలిపారు. నవరత్నాలతో ప్రజలకు మంచి చేస్తుంటే చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలు కడుపు మంటతో ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు కలిసివచ్చినా.. కుయూక్తులతో వచ్చినా.. సీఎం జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది.. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డే ఉంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
ఆ ముగ్గురిపై చాలా నమ్మకం.. తెలంగాణకు ఆయనే సీఎం కావాలి..
తనకు ముగ్గురిపై చాలా నమ్మకం ఉంది.. ఒకరు ప్రధాని నరేంద్ర మోడీ అయితే.. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావే అన్నారు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విపక్షాలపై విరుచుకుపడ్డ ఆయన.. కేంద్రంలో ఎప్పుడూ బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటా.. తెలంగాణలో మళ్లీ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటా.. ఏపీలో జగన్ సీఎం కావాలనే కోరుకుంటానన్నారు.. వైఎస్ జగన్ ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు పోసాని.. తాన మరిది చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేడని.. నా మరిది సీఎం అయితే నాకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపిస్తాడని.. కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తాడని పురంధేశ్వరి ఈ స్కెచ్ గీశారంటూ ఆరోపణలు గుప్పించారు.. ఇక ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు పోసాని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు… అపర మేధావి, హానేస్ట్ ఫెలో, విపరీతమైన అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ అంటూ ప్రశంసలు కురిపించారు ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి.
అందుకే జగన్ హీరో.. లోకేష్ జీరో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు ఉందా? అని నిలదీశారు. ప్రజల గుండెల్లో నుంచి వచ్చాడు గనుకే వైఎస్ జగన్ హీరో అయ్యాడని తెలిపిన ఆయన.. తండ్రి ఇస్తే లోకేష్ కు మంత్రి పదవి వచ్చింది.. వార్డు మెంబర్ గా కూడా గెలవని లోకేష్ జీరో అయ్యాడని కామెంట్ చేశారు. ఇక, 23 మంది మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు నైతిక విలువలు గుర్తుకు రాలేదా లోకేష్ కు? అని నిలదీశారు. ఈ విషయాలను కూడా గవర్నర్ కు చెప్పి ఉండాల్సింది కదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడ్డారు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ. 3,300 కోట్ల రూపాయలను లూటీ చేశారు.. ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.. మరోవైపు.. లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అట.. ఏ జాతికి ప్రధాన కార్యదర్శి? అంటూ సెటైర్లు వేశారు మంత్రి జోగి రమేష్.
గోషామహల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్
జీహెచ్‌ఎంసీ పరిధిలోని కీలక స్థానమైన గోషామహల్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. నందకిషోర్ వ్యాస్ పేరును గులాబీ బాస్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ తరపున అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాస్త బలంగా కనపడుతున్నారు. కానీ ఈసారి ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోడానికి బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే అభ్యర్థిని కూడా చివరి వరకు ప్రకటించలేదు. తాజాగా ఆ స్థానాన్ని నంద కిషోర్ వ్యాస్ బిలాల్ కు కేటాయించారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నంద కిషోర్ బీ ఫామ్ అందుకున్నారు. కాగా, గోషామహల్ నియోజకవర్గం నుంచి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీజేపీ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా రాజాసింగే కావడం గమనార్హం. దీంతో ఈసారి ఎలాగైనా గోషామహల్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ భావించింది. సరైన నేతను బరిలో పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు ఆలస్యం చేసింది. చివరకు నందకిషోర్ వ్యాస్‌ను ఖరారు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్..
119లో కేసీఆర్ ఒక్క ముదిరాజు బిడ్డకు కూడా టికెట్ ఇవ్వలేదంటే ఆయనకు వాళ్ల ఓట్లు అక్కర్లేదన్నట్టేనా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ ముదిరాజులకు 4 టికెట్లు ఇచ్చిందన్నారు. ముదిరాజులకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందన్నారు. మక్తల్‌లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. నియోజకవర్గంలో ఇసుక దందా, భూ ఆక్రమణలు ఎక్కడ జరిగినా ఇక్కడి ఎమ్మెల్యే పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాల్లోనూ కమీషన్లు దండుకుంటున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేకు కప్పం కట్టనిదే ఏ పనీ జరగడం లేదన్నారు. మక్తల్‌కు ఎమ్మెల్యే చేసిందేం లేదన్నారు. ఇసుక దోపిడీ, భూ ఆక్రమణ, పేదలను గన్‌మెన్‌లను మెడపట్టి గెంటించడమా ఈ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు. నువ్వు మెడపట్టి గెంటడం కాదు.. ప్రజలే నిన్ను మెడపట్టి ఈడ్చేస్తారన్నారు. రైతులకు ఉచిత కరెంటు పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. 24గంటల కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని విమర్శలు గుప్పించారు. ఎవరొస్తారో రండి.. సబ్ స్టేషన్‌కు వెళ్లి లాగ్ బుక్‌లు చూద్దామంటూ సవాల్ విసిరారు. 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేయమంటూ ఛాలెంజ్ చేశారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారన్నారు. మీ కల్లబొల్లి కబుర్లు నమ్మడానికి రైతులు సిద్ధంగా లేరన్నారు. రెండు సార్లు అధికారం ఇస్తే లక్ష కోట్లు దోచుకున్నారని.. మూడోసారి ఇస్తే ఇంకో లక్ష కోట్లు దోచుకుంటారని ఆరోపించారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తాం..
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, యాదాద్రీశుడిని నమస్కరిస్తూ మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇదే గ్రౌండ్‌లో ప్రజలు ఆశీర్వదించడంతో ప్రధాని అయ్యానన్నారు పీఎం మోడీ. ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారు. ఎల్బీ స్టేడియంతో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీని సీఎం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాటి సభలో తన ప్రసంగం కోసం టికెట్ పెట్టారని.. భారత చరిత్రలో అది ఒక కొత్త ప్రయోగమన్నారు. 9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని ప్రధాని మండిపడ్డారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించిందని.. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ సీ టీమ్ అని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలో 3 అంశాలు కామన్‌గా ఉన్నాయన్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ లక్షణాలు అంటూ ప్రధాని మోడీ విమర్శించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదన్న ప్రధాని మోడీ.. నీళ్లు, నిధులు, నియామకాలు మరిచిపోయారన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోందన్నారు ప్రధాని. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది బీజేపీనేనని.. లోక్ సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే అంటూ ఆయన తెలిపారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీకి చెందిన తనను ప్రధానిని చేశారని వెల్లడించారు. కేంద్ర కేబినెట్‌లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారన్నారు. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలు ఇచ్చింది బీజేపీనే అంటూ వ్యాఖ్యానించారు. బీసీ యువతకు బీఆర్‌ఎస్ ఏమి చేయలేదన్నారు. బీసీలకు రూ.లక్ష ఇస్తామని బీఆర్‌ఎస్ వాగ్దానం చేసిందని.. కానీ ఆ వాగ్దానాన్ని బీఆర్‌ఎస్ నెరవేర్చలేదన్నారు. మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు ప్రధాని మోడీ.
రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదంపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి.. ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జరా పటేల్ అనే ఒక బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లూయెన్సర్ నల్లటి దుస్తులు ధరించి లిఫ్టులోకి ప్రవేశించే వీడియోలో డీప్‌ఫేక్ వీడియోలో రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోపై చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో సహా చిత్ర పరిశ్రమ రష్మికకు మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే ఇది వివాదం కావడంతో రష్మిక వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇలా డీప్‌ఫేక్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఐటీ నిబంధనల ప్రకారం, కేసులు నమోదు చేసి పరిష్కారం పొందాలని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధించడం ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారమ్‌ల చట్టపరమైన బాధ్యత అని రాజీవ్ చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. యూజర్స్, ప్రభుత్వ అథారిటీ నుంచి నివేదికలు అందిన 36 గంటల్లో అటువంటి కంటెంట్‌ను తప్పనిసరిగా తీసేయాలని ఆయన తెలిపారు. ఇందులో విఫలమైనే సదరు ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫారంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీ చట్టంలోని రూల్ 7 ప్రకారం బాధితులైన వ్యక్తులు కోర్టులను ఆశ్రయిస్తారని, ఈ ముప్పును ఎదుర్కొవడానికి ఫ్లాట్‌ఫారమ్స్ చురుకైన చర్యలు తీసుకోవడం అత్యవసరమని మంత్రి వెల్లడించారు. పౌరుల భద్రత, విశ్వాసాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయని తెలిపారు. డీప్‌ఫేక్‌ల సృష్టించడం, సర్క్యులేషన్‌కు రూ. 1 లక్ష జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని కేంద్రం తెలిపింది.
జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు..
కులగణన, రిజర్వేషన్ల అంశంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. ఇప్పుడున్న రిజర్వేషన్లను 50 శాతం నుంచి 65 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చర్చ సందర్భంగా నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘జనాభా నియంత్రణ’పై ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే జేడీయూ మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు మాత్రం నితీష్ కుమార్‌కి మద్దతు తెలుపుతున్నాయి. జనాభా నియంత్రణపై మాట్లాడుతూ.. గతంలో 4.3 శాతం సంతానోత్పత్రి రేటు ఇప్పుడు 2.9 శాతానికి పడిపోయిందని ముఖ్యమంత్రి చెబుతూ.. ‘‘సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఈ తరం అమ్మాయిలకు బాగా అవగాహన పెరిగింది. ‘ఏ టైంలో ఏం చేయాలో వారి బాగా తెలుసు’. అందుకే జనాభా తగ్గుతోంది’’ అని సీఎం చెప్పాడు. అయితే ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఒకింత షాక్‌కి గురయ్యారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వింతగా ఉన్నాయంటూ మహిళా ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఈ వ్యాఖ్యల్ని అసభ్యకరమైనవిగా పేర్కొంది. ‘‘భారత రాజకీయాల్లో నితీష్ కుమార్ కన్నా అసభ్యకరమైన నాయకుడు లేడు. నితీష్ కుమార్ అడల్ట్, బీ-గ్రేడ్ చిత్రాల కీటకాలు కాటు వేసినట్లు కనిపిస్తోంది. అతను డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై నిషేధం ఉండాలి.’’ అని బీజేపీ ఎక్స్(ట్విట్టర్)లో విమర్శించింది. ముఖ్యమంత్రికి 70 ఏళ్లు దాటినా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, మేం చెప్పలేని పదాల్ని ఉపయోగించారని, దీనిపై నిరసన తెలియజేస్తామని బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి దేవీ అన్నారు.
2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2024 ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నారు. దీంతో ఆయన 2030 వరకు అధికారంలో ఉండేందుకు మార్గం సుగమం అవుతుందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది. 1999లో బోరిస్ యెల్ట్సిన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన పుతిన్ అప్పటి నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తర్వాత రష్యాకు అత్యధిక కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. రష్యాలో మార్చి 2024లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నెలలో క్రెమ్లిన్ ప్రతినిధి డెమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. పుతిన్ పోటీ చేయాలనుకుంటే, మరెవరు కూడా అతనిపై పోటీ చేయలేరని అన్నారు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన అధ్యక్షుడు 6 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు. దీంతో 2024లో పుతిన్ మళ్లీ ఎన్నికైతే 2030 వరకు అత్యున్నత పదవిలో కొనసాగుతారు. 2021లో రష్యా ప్రజలు కేవలం రెండుసార్లు మాత్రమే అధ్యక్ష పదవికి పోటీ పడేలా చట్టంపై పుతిన్ సంతకం చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం పుతిన్ మరో రెండుసార్లు పోటీ చేసే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం 71 ఏళ్ల పుతిన్ మరోసారి అధ్యక్షుడు కావాలని చాలా మంది రష్యన్ నేతలు కోరుకుంటున్నారు. 80 శాతం మద్దతు ఆయనకే ఉంది. అయితే పుతిన్‌కి పోటీ ఇచ్చే వారు ప్రస్తుతం రష్యాలో లేరు. ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి పుతిన్ ఎన్నిక లాంఛనమే అవుతుంది.
స్పెషల్ ట్రెడ్‌మిల్‌పై రిషబ్ పంత్ రన్నింగ్.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారణంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్ 2023లో ఆడలేకపోయాడు. అయితే నాసాలో శిక్షణ పొందుతున్న రిషబ్.. ట్రైనింగ్ సెషన్‌లో బాగా చెమటలు పట్టిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రిషబ్ పంత్ యాంటీ గ్రావిటీ ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంతేకాకుండా.. ఈ వీడియో క్యాప్షన్‌లో షార్ట్‌కట్‌లు లేవు, పూర్తి హార్డ్ వర్క్ అని రాశాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోపై అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్ నడుస్తున్న ట్రెడ్‌మిల్ అంతర్జాతీయ అథ్లెట్ల పునరావాసంలో ఉపయోగిస్తారు. అయితే.. నాసా సహకారంతో ఈ ప్రత్యేక ట్రెడ్‌మిల్‌ను తయారు చేశారు. వ్యోమగాములను సిద్ధం చేసేందుకు నాసా ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించింది. నాసా తయారు చేసిన ఈ ట్రెడ్‌మిల్ ధర దాదాపు 4 నుంచి 7 కోట్ల ధర ఉంటుంది.
పుష్పలో అల్లు అర్జున్ కొన్ని తప్పులు చేశాడు.. అనసూయ ఏమన్నదంటే ..?
అనసూయ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా పుష్ప గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిందని వార్తలు వచ్చాయి. “ఇటీవల కాలంలో తన డ్యాన్స్‌కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను గమనించిన అల్లుఅర్జున్.. ఆ ఫీడ్‌బ్యాక్ తీసుకుని పుష్ప 2లో తన డ్యాన్స్ మూవ్స్‌పై ఫోకస్ చేసాడు. డ్యాన్స్ మాత్రమే కాకుండా పుష్పలో కొన్ని తప్పులు కూడా చేశాడు. ఇక వాటిని కూడా గమనించి.. అలాంటి తప్పులు మళ్లీ రీపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు” అని అనసూయ చెప్పినట్లు ట్విట్టర్ లో వార్త వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలను అనసూయ ఖండించింది. ” నేను అల్లు అర్జున్ గురించి ఇలాంటి మాటలు ఎప్పుడు అనలేదు. ఇది తారుమారు చేసిన ప్రకటన” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఈ వార్తను కొట్టిపారేస్తున్నారు. మరి ఈ సినిమాతో అనసూయ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
మంగళవారం కోసం రంగంలోకి నేషనల్ అవార్డు విన్నర్..
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు అజయ్ భూపతి. అంత బోల్డ్ కథతో అజయ్ చేసిన ప్రయోగం రికార్డులు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో అతని పేరు ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత మహా సముద్రం అనే సినిమా తెరకెక్కించాడు. మొదటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో.. రెండో సినిమా అంత డిజాస్టర్ టాక్ ను అందుకుంది. దీంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అజయ్.. తాజాగా మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాయల్ రాజ్ పుత్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమా ప్రై రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ 11 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఈవెంట్ కు నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. బన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడం.. కొత్త నటీనటులకు సపోర్ట్ గా నిలవడం బన్నీకి ఎప్పటినుంచో వస్తున్న అలవాటు. ఇక బన్నీ గెస్ట్ అనగానే ఈ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ ఏం మాట్లాడతాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.