*ఆవిర్భావ వేడుకలకు తప్పకుండా రావాలి.. కేసీఆర్ కు రేవంత్ ఆహ్వానం
ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. వ్యక్తిగత ఆహ్వాన పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని సిబ్బంది తెలిపారు. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో లోగో లొల్లి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగో మార్పు వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంది. అది రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని సర్కారు భావిస్తోందని బీఆర్ ఎస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం చెప్పారు. ఇంకా నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపమేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయమేది జరగలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహాలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు.
*రాష్ట్ర గీతంగా “జయ జయహే తెలంగాణ” ..ఆవిర్భావ వేడుకల్లో జాతికి అంకితం
“జయ జయహే తెలంగాణ” గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఈ ఏడాది జూన్ 2వ తేదీ నాటికి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ధి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే వేడుకల సందర్భంగా జయ జయహే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఉద్యమ కాలంలో అందరినీ ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా, అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ ఇరవై ఏండ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతథంగా అమోదించినట్లు ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతో పాటు స్వరాలు కూర్చారు. సచివాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకల నిర్వహణపై చర్చించారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రెండు వర్షన్లలో తయారు చేశారు. 2.30 నిమిషాల నిడివితో ఒక వర్షన్, 13.30 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్ రూపొందించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలో ఉన్న మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గేయం ఉంటుందని సీఎం ప్రకటించారు. ఈ రెండింటినీ రాష్ట్ర గీతంగానే పరిగణిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కీరవాణి సంగీత సారథ్యంలోని యువ గాయనీ గాయకుల బృందం ఆలపించిన ఈ గీతం అందరినీ అలరించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు టీజీగా మార్పు చేశామన్నారు. కేబినేట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం జరిగిందని సీఎం చెప్పారు.
*తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడులకల షెడ్యూల్ ఇదే..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పేరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియాగాంధీ ప్రసంగం, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు జయ జయహే తెలంగాణ ఫుల్ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.
*ఏపీ సీఈవో జారీ చేసిన మెమోను వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో జారీ చేసిన మోమోలను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఏపీ సీఈవో జారీ చేసిన మెమోపైనే వైఎస్సార్‌సీపీ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేయడంతో వైసీపీ కోర్టును ఆశ్రయించింది.
*ఐదేళ్ల క్రితం ఇదే రోజున అధికారంలోకి వచ్చాం.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్!
ఐదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి 2029 మే 30న వేలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. మే 30న సరిగ్గా మధ్యాహ్నం 12.23 గంటలకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన జగన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి దాదాపు 40 వేల మందికిపైగా ప్రజలు హాజరయ్యారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. “దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది.” అని సీఎం జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
*కన్యాకుమారిలో ప్రధాని పర్యటన.. భగవతి అమ్మన్‌లో పూజలు
దేశ వ్యాప్తంగా గురువారం ఏడో విడత ఎన్నికల ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. దీంతో నేతలంతా రిలాక్స్ అవుతున్నారు. ప్రధాని మోడీ.. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచి దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక నోటిఫికేషన్ వెలువడ్డాక కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దాదాపు 200కి పైగా పబ్లిక్ మీటింగ్స్, 80 ఇంటర్వ్యూల్లో మోడీ పాల్గొన్నారు. ఇక ప్రచారాలు ముగియడంతో ధ్యానం కోసం తమిళనాడులోని కన్యాకుమారికి ప్రధాని చేరుకున్నారు. కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మే 30 సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు స్వామి వివేకానంద ధ్యానం మండపంలో ధ్యానం చేయనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలకు శ్రీకారం చుట్టడం తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఆయన మే 30న కన్యాకుమారి చేరుకుని జూన్ 1 వరకు ఉండనున్నారు. 2019లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్‌నాథ్‌ను సందర్శించారు. 2014లో శివాజీ ప్రతాప్‌గఢ్‌ను సందర్శించారు. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈసారి 370 సీట్లకు పైగా స్థానాలు కైవసం చేసుకుంటామని ప్రధాని మోడీ తెలిపారు. ఇక ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లకు పైగా స్థానాలు సొంతం చేసుకుంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
*దేశ వ్యాప్తంగా ప్రచారాలకు ఫుల్ స్టాప్.. అందరి కళ్లు ఫలితాలు పైనే!
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి గురువారంతో ఫుల్ స్టాప్ పడింది. ప్రచార మైకులన్నీ మూగబోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారాల్లో మునిగిపోయారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగిసి.. నేతలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా చివరి విడత ప్రచారానికి కూడా ముగింపు పలికారు. ఇక ఏడో విడత పోలింగ్ మాత్రమే ముగిలి ఉంది. జూన్ 1న ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. శనివారం 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. యూపీ 13, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్ 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్‌ప్రదేశ్ 4, చండీగఢ్ 1, జార్ఖండ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బరిలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండీ నుంచి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు. ప్రధాని మోడీ సహా బరిలో 598 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక ప్రచార ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ ఓటర్లకు వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘భక్తి, శక్తి, విరక్తికి ప్రతీక కాశీ.. వారణాసి ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని.. సంగీతం, శాస్త్రాలకు కాశీ నిలయం.. కాశీ విశ్వనాథుని కృపవల్లే కాశీకి ప్రాతినిథ్యం.. గంగానది నన్ను అక్కున చేర్చుకుంది. జూన్ 1న కాశీ ప్రజలు కొత్త రికార్డు సృష్టించాలి’’ అని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. జూన్ 1తో ఏడు దశల పోలింగ్ ముగియనుంది. జూన్ 4న మాత్రం ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఇప్పుడు కళ్లలన్నీ ఫలితాలపైనే ఉన్నాయి. ఇప్పటికే మూడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా అంచనా వేస్తోంది. మరీ అధికారం ఎవరిని వరిస్తుందో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
*సూర్యుడిపై భారీ పేలుడు.. భూమి వైపు దూసుకువస్తున్న ‘‘సౌర తుఫాన్’’
సూర్యుడి నుంచి మరో శక్తివంతమైన ‘‘సౌర తుఫాన్’’ భూమి వైపుగా దూసుకువస్తోంది. ఇది రేడియో బ్లాక్అవుట్, అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్లకు దారి తీస్తుంది. నాసా spaceweather.com ప్రకారం, మే 27న సన్‌స్పాట్ AR3664 నుంచి ఈ తుఫాన్ ఉద్భవించింది. ఇది X2.8 తరగతిగా వర్గీకరించారు. ఇది ఇటీవల సంవత్సరాల్లో అత్యంత తీవ్రమైన సౌర సంఘటనగా మారింది. ఎక్స్-తరగతికి చెందిన సౌరజ్వాలలు చాలా శక్తివంతమైనవి. వీటిని ‘‘కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME)’’ గా పిలుస్తుంటారు. ‘‘శక్తి, కాంతి, అధిక వేగం వచ్చే కణాలను అంతరిక్షంలోకి పంపే భారీ పేలుళ్లు’’గా నాసా వీటిని అభివర్ణించింది. సౌర తుఫాను కారణంగా భూమి ఇప్పటికే షార్ట్ వేవ్ రేడియాలో అంతరాయాన్ని ఎదుర్కొంది. సూర్యుడిపై భారీ పేలుళ్లు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ వెలువడటానికి కారణమైంది. సౌర తుఫాను కాంతి వేగంతో భూమి వైపు ప్రయాణిస్తుంది మరియు అది మనకు చేరుకున్నప్పుడు గ్రహం యొక్క వాతావరణం యొక్క పైభాగాన్ని అయనీకరణం ( ఎలక్ట్రిక్ ఛార్జ్) చేస్తుంది. ఈ ఆవేశిత కణాలు తాకిన తర్వాత, రేడియో ఫ్రీక్వెన్సీలోని ఎలక్ట్రాన్లు ఢీకొట్టుకోవడం ఎక్కువ అవుతుంది. దీంతో సిగ్నల్స్ క్షీణించి కమ్యూనికేషన్ వ్యవస్థ అంతరాయాన్ని ఎదురవుతుంది. ప్రస్తుతం విస్పోటనం జరిగిన సూర్యుడిపై ఉన్న AR3664 ప్రాంతం జూన్ 6న భూమికి అభిముఖంగా వస్తుంది. ఆ సమయంలో మరో భూ అయస్కాంత తుఫానును సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం సూర్యుడు తన జీవితంతో 25వ ‘‘సౌరచక్రం’’లో ఉన్నాడు ప్రతీ 11 ఏళ్లకు సూర్యుడి ధృవాలు మారుతుంటాయి. ఈ సమయంలో సూర్యడి వాతావరణం చాలా క్రియాశీలకంగా ఉంటుంది. భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగా సన్‌స్పాట్స్ ఏర్పడుతుంటాయి. వీటి నుంచి ఒక్కసారిగా పేలుళ్లు జరిగి అయస్కాంత క్షేత్రాలు, ప్లాస్మా సౌర కుటుంబంలోకి ఎగిసిపడుతుంది. ఇది ప్రయాణిస్తూ గ్రహాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే, భూమికి ఉండే వాతావరణం విశ్వం నుంచి వచ్చే అనేక ఆవేశిత కణాల నుంచి భూమిని రక్షిస్తోంది. ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే సౌరజ్వాలలు, సౌర తుఫానులను భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది. ప్రమాదకరమైన కిరణాలు భూమిని తాకకుండా కాపాడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరిగే సందర్భంలో పవర్ ఫుల్ మాగ్నిటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఇది భూమి చుట్టూ ఆవరించి ఉంటుంది. ఇలా సౌర తుఫానులు భూమిని తాకగానే భూ అయస్కాంత తుఫానులు(జియోమాగ్నెటిక్ స్ట్రోమ్స్) ఏర్పడుతాయి. ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం కమ్యూనికేషన్ వ్యవస్థ, శాటిలైట్లు, విద్యుత్ గ్రిడ్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
*క్రికెట్ కు గుడ్ బై చెప్పి.. జావెలిన్ త్రో చేస్తున్న దినేష్ కార్తీక్..
టీ20 ప్రపంచకప్‌లో ఎలైట్ వ్యాఖ్యాత ప్యానెల్లో ఒకరైన దినేష్ కార్తీక్ ఇటీవల ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఐపీఎల్ 2024 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయాలలో భాగమైన కార్తీక్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమిని చవిచూసిన టోర్నీ నుండి మాత్రమే కాకుండా తన ఐపీఎల్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపాడు. అంతర్జాతీయ, ఫ్రాంచైజీ క్రికెట్ రెండింటికీ వీడ్కోలు చెప్పిన ఈ మాజీ ఆటగాడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. వైరల్ అవుతున్న వీడియోలో దినేష్ కార్తీక్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రదర్శించాడు. అందులో చోప్రా సలహా మేరకు కార్తిక్ జావెలిన్ ఎలా విసరాలో నేర్చుకున్నాడు. రెండో ప్రయత్నంలో 25 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరాడు దినేష్. ఇక ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ.. అందుకే మీరు క్రికెట్‌ను విడిచిపెట్టారా..? అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు.. క్రికెట్ కు గుడ్ బై చెప్పారు కదా ఇక జావెలిన్ త్రో తో మళ్లీ ట్రాక్ పైకి వస్త్ర అంటూ కామెంట్ చేస్తున్నారు.
*సంచలనం.. కార్ల్‌సెన్ పై ప్రజ్ఞానంద తొలి విజయం..
స్టావాంజర్‌లో జరిగిన 2024 నార్వే చెస్ టోర్నమెంట్ మూడో రౌండ్ సందర్భంగా క్లాసికల్ గేమ్ లో రమేశ్‌బాబు ప్రగ్నానంద ప్రపంచ నం. 1 మాగ్నస్ కార్ల్‌సెన్ ను మొదటిసారి ఓడించాడు. 18 ఏళ్ల ఈ భారత గ్రాండ్ మాస్టర్ కార్ల్‌సెన్ ను తన సొంతగడ్డపై తెల్లటి పావులతో ఆడి ఓడించాడు. దాంతో 5.5 పాయింట్లతో సిరీస్ ఆమోదటి స్థాననికి చేరుకున్నాడు. కార్ల్‌సెన్, ప్రజ్ఞానంద ఈ ఫార్మాట్‌లో వారి ముందు మూడు గేమ్ లను డ్రా చేసుకున్నారు. వాటిలో రెండు 2023 ప్రపంచ కప్ ఫైనల్ లో జరిగినివి. బుధవారం రాత్రి, 18 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రగ్నానంద మాగ్నస్ కార్ల్‌సెన్ ను ఓడించాడు. ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్ పై ప్రగ్నానంద విజయం సాధించిన తర్వాత, సోషల్ మీడియాలో అభినందన పోస్టులతో నిండిపోయింది. భారతదేశం నుండి తాజా ప్రపంచ సంచలనం.. అంటూ ఒక అభిమాని X లో రాసుకొచ్చాడు. ఈ సందర్బంగా అనేక మంది ప్రముఖులు సంచలనం సృష్టించిన ప్రగ్నానందకు విషెస్ తెలుపుతున్నారు.