*వికసిత్ భారత్ మాత్రమే కాదు.. వికసిత్ ఏపీ మా లక్ష్యం: ప్రధాని మోడీ
ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారమంటూ ప్రధాని మోడీ తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. నిన్ననే షెడ్యూల్ విడుదలైందని.. ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు రావాలి.. ఎన్డీఏకు ఓటేయాలన్నారు. ఏపీలోని చిలకలూరిపేటలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఫలితాలు జూన్ 4వ తేదీన రాబోతున్నాయని.. ఫలితం కూడా 400కు పైగా ఎంపీ స్థానాలు రాబోతున్నాయన్నారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలన్నారు. రాష్ట్రాల ఆశలు నెరవెరుస్తూ.. దేశం కోసం ఎన్డీఏ పని చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ ఏపీ ప్రజల కోసం పని చేస్తున్నారన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ ఎన్డీఏ లక్ష్యమన్నారు.ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటుందన్నారు. పేదలకు సేవ, పేదల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమని ప్రధాని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టామన్నారు. ఏపీలో జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా లబ్ది పొందారన్నారు. పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు చేకూరుస్తున్నామన్నారు. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని మోడీ కోరారు. మేం పేదల అభ్యున్నతికి కృషి చేస్తాం.. ఇది మోడీ గ్యారెంటీ అని హామీ ఇచ్చారు.
“చంద్రబాబు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడింది.. చంద్రబాబు, పవన్ ఏపీ కోసం కష్టపడుతున్నారు.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది.. జూన్ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది.. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.” -ప్రధాని మోడీ
ప్రాంతీయ ఆకాంక్షలు, జాతీయ ప్రగతి ఆధారంగానే ఎన్డీయే ముందుకు వెళ్తోందని.. ఎన్నో విద్యాసంస్థల్ని కేంద్రం ఏపీకి కేటాయించిందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఏపీని విద్యా కేంద్రంగా చేయాలని సంకల్పించామన్నారు. తిరుపతి ఐఐటీ, కర్నూలులో ఐఐఐటీ, విశాఖలో ఐఐఎం, మంగళగిరికి ఎయిమ్స్ కేటాయించామన్నారు. ఎన్డీయేలో మేము అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. ఎన్నికలకు ముందే ఇండియా కూటమిలో పార్టీలు గొడవ పడుతుంటే, తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట రోజున తెలుగు ప్రజలు ఎంతో ఆనందించారని మోడీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి పాత్రలతో మెప్పించారని.. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ వ్యతిరేకించే వారన్నారు. పేదల కోసం ఎన్టీఆర్ నిరంతరం తపించారని.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్‌ను ఇబ్బందులు పెట్టిందన్నారు. పీవీకి ఎన్డీయే ప్రభుత్వం భారతరత్న ఇచ్చింది, ఆయనను కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరికీ తెలుసన్నారు. సిద్దాంతాలు కలవకున్నా.. కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో చేరాయని.. ఇండియా కూటమికి దేశం మీద చిత్తశుద్ధి లేదని ప్రధాని విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “ఏపీ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసింది. ఎన్డీఏ ఏపీ ఆత్మగౌరవాన్ని కాపాడింది. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేశాం. పీవీ నరసింహారావుకు భారత రత్న ఇచ్చాం. ఎన్డీఏ పార్టీలకతీతంగా దేశ నేతలను గౌరవిస్తుంది. ఎన్డీఏను తిరిగి అధికారంలోకి తేవాలి.. ఏపీలో ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని దించేయాలి. ఏపీ ప్రభుత్వం ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ మంత్రులు అవినీతి మీదే ఫోకస్ పెట్టారు. ఐదేళ్లల్లో ఏపీ అభివృద్ధి కుంటుపడింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అర్థమైంది. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరు అనుకోవద్దు. రెండూ పార్టీలూ ఒకటే. రెండు పార్టీల్లోని నాయకత్వాలు ఇద్దరూ ఒకే కుటుంబం నుంచి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు వెళ్లేలా చేస్తున్నారు. ఏపీ ప్రజలు ఈసారి తప్పు చేయకూడదు. వచ్చే ఐదేళ్లల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏపీ అభివృద్ధి జరగాలంటే లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లోని ఎన్డీఏ కూటమికే ఓటేయాలి. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ప్రజాస్వామ్యంలో వెలుగులు వెలిగించేలా సెల్ ఫోన్లో లైట్లు వేయాలి.” అని ప్రధాని పేర్కొన్నారు.
*ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా: చంద్రబాబు
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని వెల్లడించారు. మోడీ భారత దేశాన్ని విశ్వ గురుగా మారుస్తున్నారన్నారు. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారని చంద్రబాబు తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారన్నారు. ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారన్నారు. వికసిత్ భారత్ మోడీ కల.. వికసిత్ ఏపీ మనందరి కల కావాలని చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీకి మేం అండగా ఉంటామన్నారు. దేశాన్ని జీరో పావర్టీ నేషన్‌గా చేయడం మోడీ వల్లే సాధ్యమన్నారు. 2014-19 మధ్య కాలంలో ఏపీలో 11 కేంద్ర సంస్థలను తెచ్చామన్నారు. మోడీ చేతుల మీదుగా రాజధాని శంకుస్థాపన జరిగిందన్నారు. ఐదేళ్లల్లో ప్రజల జీవితాల్లో ఆనందమే లేదన్నారు. గంజాయి సరఫరా, వినియోగం పెరిగిందని విమర్శించారు. విధ్వంసమే జగన్ విధానంగా ఉందని విమర్శించారు. ఏపీ పోలీస్ శాఖను జేబు సంస్థగా మార్చుకున్నారని ఆరోపించారు. ఇద్దరు చెల్లెళ్లను కూడా జగన్ మోసం చేశారని ఆరోపణలు చేశారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని.. జగనుకు ఓటేయొద్దని జగన్ చెల్లెళ్లే చెప్పారన్నారు. బ్యాడ్ గవర్నెన్స్ వల్ల ఏపీ నష్టపోయిందన్నారు. లిక్కర్ ఆదాయాన్ని తాకట్టు పెట్టారని, ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీఏకు 400+ స్థానాలు రావడం ఖాయమన్నారు. ఏపీలో 25 ఎంపీ స్థానాలను గెలవాలని.. గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
*ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక.. 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించింది: పవన్ కల్యాణ్
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.. 2024లో మరోసారి కనకదుర్గమ్మ సాక్షిగా పొత్తు పురుడు పోసుకుందన్నారు. 2014లో వెంకన్న ఆశీస్సులతో ఎన్డీఏ విజయం సాధించింది.. ఇప్పుడు దుర్గమ్మ ఆశీస్సులతో అంతకు మించిన విజయం దక్కించుకుంటామని పవన్ కల్యాణ్ తెలిపారు. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే.. జగన్ దాన్ని పక్కన పెట్టి అవినీతి చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం, ఇసుకలో అక్రమాలు అని మండిపడ్డారు. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోయాయి.. వైఎస్ వివేకాను హత్య చేశారు.. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని పవన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారన్నారు. అయోధ్యకు రాముడిని తెచ్చిన మోడీ ఇక్కడున్నారు.. చిటికెన వేలంత రావణుడు లాంటి జగన్ ఎంత అని విమర్శించారు. ధర్మానిదే విజయం.. కూటమిదే గెలుపు అని పవన్ కల్యాణ్ తెలిపారు.
*ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి..
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. మరోవైపు.. తొలిరోజు కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆప్ కు ఇచ్చిన వంద కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరెవరు డబ్బు సమకూర్చారని ఆధారాలు చూపించి ఈడీ ప్రశ్నించింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చి మరికొన్నింటిపై మౌనం వహించింది కవిత. ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన 192 కోట్ల మాటేంటని ప్రశ్నించింది ఈడీ. కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ప్రశ్నించింది. ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేశారని ఈడీ కవితను ప్రశ్నించింది. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం సాయంత్రం ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ ఎదుట కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించారు. మరోవైపు.. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతీరోజూ సాయంత్రం 6గంటల నుంచి 7గంటల వరకు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును కవితకు న్యాయస్థానం కల్పించింది.
*సభ జరుపుకోవడం చేతకానటువంటివాళ్లు జగన్‌పై యుద్ధం చేస్తారా?
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని.. మహిళా సాధికారితను సీఎం జగన్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. సభ జరుపుకోవడం చేతగాని మీరు సీఎం జగన్ మీద యుద్ధం చేస్తారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పోలవరం చంద్రబాబుకు పేటీఎమ్ అని గతంలో ప్రధాని విమర్శించారని.. ఏ గంగా జలంతో చంద్రబాబు పాపాలను కడిగారని ఆయన ప్రశ్నించారు. చంద్ర బాబు అవినీతి పరుడు అని గతంలో మోడీ అన్నారని.. చంద్రబాబుకి పోలవరం ఏటీఎం అన్నారని.. మరి ఇప్పుడు పోలవరంపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఎన్టీఆర్ చెప్పారని.. చంద్రబాబుకు ఓటు వేయొద్దని ఆయన బంధువులందరూ చెప్పారన్నారు. పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నలు గుప్పించారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో సభలో ప్రధానిని ఎందుకు అడగలేదన్నారు. నాలుగు సిద్ధం సభలు ప్రజలు మళ్ళీ జగన్‌కు ఎందుకు ఓటు వేయాలో తేటతెల్లం చేశాయన్నారు. తమకు ఓటు వేస్తే ఏం చేస్తారో చిలకలూరిపేట సభలో నేతలు చెప్పలేదన్నారు. కాకినాడలో పాచిపోయిన లడ్డూలు, చిలకలూరిపేటలో ఎలా తాజాగా మారాయని పవన్ చెప్పలేదని ఎద్దేవా చేశారు.. ఐదేళ్ల కింద చంద్రబాబు ఎందుకు తిట్టారు, ఇప్పుడు మోడీ ఎందుకు కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబులో ఈ మార్పుకు కారణం ఏంటన్నారు. మూడు పార్టీల సభ వెలవెలబోయిందన్న ఆయన.. ఈ పొత్తులు, ఒప్పందాలు రాష్ట్రానికి అవసరం లేదన్నారు. మోడీని ఉగ్రవాది అన్న చంద్రబాబుకు ఇప్పుడు విశ్వగురులా కనిపిస్తురా.. అంటూ తీవ్రంగా విమర్శించారు. మోడీ మిమ్మలిని గతంలో తిట్టాను …ఇప్పుడు మోడీ నన్ను క్షమించు అన్నట్టు చంద్ర బాబు మాట్లాడారన్నారు. సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని ఎద్దేవా చేశారు పేర్ని నాని. మూడు పార్టీలు ఎందుకు కలిశాయి అన్న విషయం ఒక్కరూ చెప్పలేదన్నారు. లోపాయికారీ ఒప్పందం ఎవరి కోసం అంటూ ఆయన విమర్శించారు. సభలో మైక్ మోగదు… ప్రధాని మైక్ ముందు 15 నిమిషాలు మౌనంగా నిలబడ్డారని.. ఈ సభలో ప్రధానిని అవమానించారని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉంచుతారా ? అమ్ముతారా ? చెప్పలేదే అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జగన్‌ను తిట్టడం తప్పితే.. మోడీకి ఒక్క డిమాండ్ చెప్పలేదన్నారు. మోడీ మాయమాటలు చెబుతారని, పోర్టుల అభివృద్ధికి ఒక్క రూపాయి సాయం చేయలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ రెండూ ఒకటే అంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ… అందులో అంతా చంద్ర బాబు మనుషులే అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే భారతరత్న ఇవ్వాలి కదా అంటూ పేర్ని నాని అన్నారు. ఎన్డీఏ సర్కార్ విభజన చట్టంలో ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. కేంద్ర విద్య సంస్థలను ఎన్డీయే సర్కార్ కేవలం ఆంధ్ర ప్రదేశ్ కోసమే పెట్టిందా అంటూ ప్రశ్నించారు.
*కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి విమర్శనాస్త్రాలు..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారు.. అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మొదటి పది సంవత్సారాలు కేసీఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు.. ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె కట్టిన వారే కేసీఆర్ ను వ్యతిరేఖించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు వచ్చి గ్యారెంటీలు ప్రకటించారు.. కానీ ఆ గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళలకు 2500 రూపాయిలు ఇస్తామని ప్రకటించారు..రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర రికార్డ్ ఉందని తెలిపారు. కానీ అది అమలు చేయడానికి మీన మేశాలు లెక్కబెడుతుందని విమర్శించారు. రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పేద వారికి ఇళ్లు ఇస్తా అన్నారు.. మరి ఎలా ఇస్తారో విధి విధానాలు చెప్పడం లేదని తెలిపారు. నిరుద్యోగ యువత రాష్ట్ర సాధనకు పని చేశారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి కూడా నిరుద్యోగుల పాత్ర పెద్దది.. ఆ నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ఈ వంద రోజుల పాలనలో వెన్ను పోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు.. వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ అన్నారు.. 2 వేల పెన్షన్ 4 నాలుగు వేలు చేస్తా అన్నారు.. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే రేషన్ కార్డులు ఇస్తా అన్నారని తెలిపారు. రేషన్ పై బియ్యం ఉచితంగా ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇలా గ్యారెంటీలు చెప్పారు కానీ అమలు చేయలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీ తెలంగాణను ప్రశ్నిస్తుందని చెప్పారు. ఎవరైతే ప్రజలు ఈ గ్యారెంటీల్లో మోసపోయారో.. వారందరినీ కలుస్తామని తెలిపారు. తెలంగాణా ప్రజల తరుపున బీజేపీ నిలబడి ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు.
*ఆయనకి టిక్కెట్ ఇచ్చినందుకు.. అర గుండు, అర మీసం గీయించుకున్న వ్యక్తి..!
క్రికెట్ బెట్టింగ్, పేకాట, సరదాగా ఫ్రెండ్స్ తో వేసే బెట్టింగులను మనం ఇప్పటివరకు చూసే ఉంటాం. మరికొందరు పొలిటికల్ పరంగా కూడా పందాలు కాయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే., ఓ వ్యక్తి వేసిన బెట్టింగ్ మాత్రం చాలా డిఫరెంట్. ఆ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకి ట్రెండ్ సెట్ చేసాడు అని చెప్పవచ్చు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం సంబంధించి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. ఒకవేళ వైసిపి అధిష్టానం శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాను అరుగుండు, అర మీసం కొట్టించుకుంటానని బెట్టింగ్ వేశాడు. తాజాగా విడుదల చేసిన లిస్టులో శ్రీధర్ రెడ్డికి టికెట్ రావడంతో.. అతను అన్నమాట ప్రకారం అర గుండు కొట్టించుకుని సగం మీసం తీయించుకున్నాడు. పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి ఇవ్వడంతో మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తన నిరసనను విన్నుత్నంగా తెలిపాడు. ఇందులో భాగంగానే పుట్టపర్తి నగరంలోని సత్యమ్మ దేవాలయం ఎదురుగా మహేశ్వర్ రెడ్డి అర మీసం, అరగుండు తీయించుకున్నాడు. తాను అన్నమాట ప్రకారం ఇలా చేశానని.. కాకపోతే., ప్రజలు మాత్రం శ్రీధర్ రెడ్డికి ఓట్లు వేయవద్దని ఆయన కోరాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇదివరకు మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దగ్గర కార్ డ్రైవర్ గా పని చేశాడు. ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి చేసిన పనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజెన్స్ మనుషులు పంద్యాలు ఇలా కూడా వేసుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
*ఎలక్టోరల్ బాండ్స్‌తో బీజేపీ రూ. 6,986 కోట్లు.. తర్వాత స్థానంలో ఉన్న పార్టీలు ఇవే..
ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి తాజాగా ఈసీ ఈ రోజు కొత్త సమాచారాన్ని విడుదల చేసింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అగ్రకొనుగోలుదారుగా ఉన్న ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ ద్వారా తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి రూ. 509 కోట్ల విరాళం అందినట్లు ఎన్నికల సంఘం డేటా ఆదివారం వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో అగ్రస్థానంలో ఈ కంపెనీ ఉంది. ఒకే కంపెనీ నుంచి ఒకే పార్టీకి ఇంత మొత్తంలో నిధులు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఒడిశాలో అధికార పార్టీ బీజేడీకి రూ. 944.5 కోట్లు, డీఎంకేకి రూ. 656.5 కోట్లు, వైస్సార్సీపీకి రూ. 442.8 కోట్ల నిధులు అందాయి. జేడీఎస్‌కి రూ. 89.5 కోట్ల విలువైన బాండ్లను అందుకుంది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్కి చెందిన ఫ్యూచర్ గేమింగ్ రూ. 1368 కోట్లతో ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసింది. ఇందులో 37 శాతం డీఎంకే పార్టీకి నిధులు వెళ్లాయి. దాతల గుర్తింపు వెల్లడించిన కొద్ది పార్టీల్లో డీఎంకే ఉంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఎన్నికల కమిషన్‌కి వివరాలను వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీటిని బహిరంగపరచాల్సి ఉంది. ఈ బాండ్ల ద్వారా టీడీపీకి రూ. 181.35 కోట్లు, శివసేనకు రూ. 60.4 కోట్లు, ఆర్జేడీకి రూ. 56 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ. 14.05 కోట్లు, అకాలీదళ్‌కి రూ. 7.26 కోట్లు, ఏఐడీఎంకేకీ రూ. 6.05 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కి రూ. 50 లక్షలు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు స్వీకరించబోమని సీపీఎం ప్రకటించింది.
*సీఏఏపై అమెరికా అత్యుత్సాహం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జైశంకర్..
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు అంతర్జాతీయ సంస్థలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమేస్టి ఇంటర్నేషనల్, యూఎన్ హక్కుల సంస్థలు దీనిని సీఏఏని తప్పుగా భావిస్తున్నారు. వీరికి అగ్రరాజ్యం అమెరికా జతకలిసింది. సీఏఏపై ఆందోళన చెందుతున్నామని, ఇది ఎలా అమలువుతుందో నిశితంగా గమనిస్తున్నామంటూ కామెంట్స్ చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన సీఏఏపై అమెరికా వ్యాఖ్యానించడాన్ని భారత్ తప్పుబడుతోంది. ఇదిలా ఉంటే భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారతదేశ చరిత్రపై అతనికి ఉన్న అవగాహనను జైశంకర్ ప్రశ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లో హింసించబడుతున్న ముస్లిమేతర మైనారిటీల కోసం భారత పౌరసత్వం కోసం తీసుకువచ్చిన సీఏఏ గురించి మాట్లాడుతూ.. వారి పట్ల భారత్‌కి బాధ్యత ఉందని జైశంకర్ అన్నారు. విభజన సమయంలో వారంతా అణిచివేతకు గురయ్యారని అన్నారు. సీఏఏ అమలు ఒక రోజు తర్వాత గార్సెట్టి మాట్లాడుతూ.. ‘‘ మీరు స్నేహితులుగా ఎంత సన్నిహితంగా ఉన్నా మన సూత్రాలను వదులుకోము’’ అని అన్నారు. వీటికి ప్రతిగా మంత్రి జైశంకర్ భారత విభజనను వారంతా మరిచిపోయారా.? అని అన్నారు. ‘‘ నేను వారి ప్రజాస్వామ్యంలోని అసంపూర్ణతలను లేదా వారి ప్రజాస్వామ్యాన్ని, వారి సూత్రాలను, వారి లోపాలను ప్రశ్నించడం లేదు. మన చరిత్రపై వారి అవగాహనను నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రపంచంలోనే అనేక ప్రాంతా నుంచి వ్యాఖ్యలను వింటుంటే, ఇది భారతదేశ విభజన జరినట్లు అనిపిస్తుంది. సీఏఏ అమలులో ఎలాంటి సమస్యలు లేవు’’ అని జైశంకర్ అన్నారు. తమ ప్రభుత్వానికి కూడా సూత్రాలు ఉన్నాయని గార్సెట్టికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ మీరు ఓ సమస్యను తసీుకుని, దాని నుంచి చారిత్రక సందర్భాలను తీసేసి, దానిని శానిటైజ్ చేసి, రాజకీయ వాదనలుగా చేసి, నాకు సూత్రాలు ఉన్నాయి, మీకు లేవు అని చెబితే, నాకు సూత్రాలు ఉన్నాయని, విభజన సమయంలో నిరాశకు గురైన ప్రజల పట్టల బాధ్యత ఉందని చెబుతాను’’ అని అన్నారు. అమెరికా సోవియట్ యూనియన్‌లో అణిచివేతకు గురైన యూదులు, క్రైస్తవుల కోసం జాక్సన్-వానిక్ సవరణ చట్టాలను ఆ దేశానికి జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. అమెరికా సీఏఏ తరహా చట్టాలైన లాటెన్ బర్గ్ సవరణ, స్పెక్టర్ సవరణను గురించి గుర్తు చేశారు. కాబట్టి నన్ను అడిగితే ఇతర దేశాలు, ఇతర ప్రజాస్వామ్యాలు, జాతి, విశ్వాసం, సామాజిక లక్షణాల ఆధారంగా చేసిన చట్టాల గురించి చాలా ఉదాహరణలు ఇవ్వగలనని అమెరికాకు జైశంకర్ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు.
*స్ట్రాబెర్రీ తిని 8 ఏళ్ల బాలుడి మృతి..
స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్విల్లే నార్త్ హాప్కిన్స్ హైస్కూల్లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. దీని తర్వాత బాలుడి శరీరంపై దద్దుర్లుతో సహా పలు అలెర్జీ లక్షణాలు చూశామని తెలిపారు. అంతకంతకు లక్షణాలు తీవ్రమవుతూనే ఉన్నాయని, ఇంటికి తీసుకెళ్లే ముందు బాలుడిని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు నిద్ర లేపే సరికి స్పందించకపోవడంతో అధికారులకు ఫోన్ చేశామని కుటుంబీకులు తెలిపారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వారు తేల్చారు. హాప్కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రాథమిక శవపరీక్ష నివేదిక ‘‘ ఐసోలేటెడ్ అలెర్జీ రియాక్షన్’’గా నిర్ధారించింది. మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ క్రిస్టోఫర్ కీఫెర్ మాట్లాడుతూ.. ఇది అలెర్జీ రియాక్షన్‌లా కనిపిస్తోందని చెప్పారు. హాప్కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డెసిస్ బీచ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్ట్రాబెర్రీలను తినవద్దని కోరారు. బాలుడికి స్ట్రాబెర్రీ అలెర్జీ ముందుగా ఉందో లేదో అధికారులు చెప్పలేదు. ప్రస్తుతం స్ట్రాబెర్రీల నమూనాలను పరీక్షల కోసం పంపారు.