మొదటి ఫలితం ఈ నియోజకవర్గందే..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ గత నెల ముగియగా.. పలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు డీలా పడిపోయారు.. ఇక, ఈ నెల 4వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు… ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అంటూ నేతలతో పాటు సామాన్య ఓటరు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.. నన్నయ్య యూనివర్సిటీలో రాజమండ్రి పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను లెక్కించబోతున్నారు. అయితే, కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌటింగ్ జరుగుతుందన్నారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత.. 4వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. అంతేకాదు.. మొదట కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఫలితాలు వెల్లడిస్తామని.. చివరగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఫలితాలు వస్తాయన్నారు కలెక్టర్ మాధవీలత
ఏపీ ఎగ్జిట్ పోల్స్.. అధికారం ఎవరిదంటే..?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి.. గెలుపుపై ధీమాతో కొందరు నేతలు ఉంటే.. ఊగిసలాటలో మరికొందరు ఉన్నారని స్పష్టం అవుతుంది.. అయితే, మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.. కానీ, సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఇవాళ్టితో ముగియనుండడంతో.. ఆ తర్వాత వివిధ సర్వే సంస్థలు.. తమ తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.. కొన్ని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనా వేస్తే.. ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయం అంటూ మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి.. ఇక, ఆరా మస్తాన్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మంత్రులు పెద్ద సంఖ్యలో ఓటమికి మూటగట్టుకుంటారని అంచనా వేశారు.. మరోవైపు, వైఎస్ జగన్, నారా చంద్రాబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సుజనాచౌదరి లాంటి కీలక నేతలు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అంచనా వేశారు ఆరా మస్తాన్… పార్థాదాస్ ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 110-120 స్థానాల్లో.. టీడీపీ-జనసేన-బీజేపీ 55-65 స్థానాల్లో విజయం సాధించనుంది.
వైసీపీకి కలిసివచ్చే అంశాలు ఇవే..!
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని తేల్చేశారు ఆరా మస్తాన్.. పనిలో పనిగా గెలిచే ప్రముఖులతో పాటు.. ఓటమి చెందే ప్రముఖ లీడర్ల జాబితాను కూడా వెల్లడించారు.. మొత్తంగా అధికారంలోకి వచ్చేది మాత్రం వైసీపీయే అని.. మరోసారి జగన్ సీఎం అవుతారనే సంకేతాలు ఇచ్చారు.. ఇక, వైసీపీకి కలిసివచ్చే అంశాలపై కూడా కాస్తా క్లారిటీ ఇచ్చారు.. టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పొత్తుతో పని చేసారు… పొత్తుల కోసం సమయాన్ని వృధా చేశారని పేర్కొన్నారు. అయితే, వైసీపీ సంక్రాంతికే అభ్యర్ధులను ప్రకటించేసింది.. రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాలతో వైసీపీ లాభ పడిందన్నారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు మేలు జరిగింది.. పెన్షన్ విధానం, గ్రామ సచివాలయం వ్యవస్థ ద్వారా గ్రామాల్లో వైసీపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందని వివరించారు. మన రాష్ట్రంలో 71 శాతం గ్రామీణ ఓటర్లు ఉన్నారని పేర్కొన్న ఆరా మస్తాన్.. 56 శాతం మహిళలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని వెల్లడించారు.. అయితే, 42 శాతం మహిళల ఓట్లు టీడీపీకి పడ్డాయని చెప్పుకొచ్చారు.. ఇక, పురుషుల్లో కేవలం 45.3 శాతం వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తే.. టీడీపీ కూటమికి 51.56 శాతం ఓట్లు పడ్డాయని అంచనా వేశారు. అయితే, మొత్తంగా వైసీపీ 49.41 శాతం ఓట్లతో 94 నుండి 104 సీట్లలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 47.55 శాతం ఓట్లతో ఎనబై సీట్ల వరకూ దక్కించుకునే అవకాశం ఉందన్నారు. ఇక, వైసీపీ 13 లేదా 15 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందన్నారు ఆరా మస్తాన్ రావు.
ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి.. యువత తమ భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు..
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, యువత తమ బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని సూచించారు ఐజీ, ఎలూరు రేంజ్ కౌంటింగ్ ప్రత్యేక అధికారి ఎం.రవిప్రకాష్.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి అమలాపురం వచ్చిన రవి ప్రకాష్.. ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పక్షాలు, ప్రజలు సంయమనం పాటించాలని ఐజీ కోరారు. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని ఎటువంటి విజయోత్సవాలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక, ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి విలువ నివ్వాల్సిందేనని ఫలితాలు జీర్ణించుకోలేక రాజకీయ పార్టీల కార్యకర్తలు అభిమానులు అల్లర్లకు పాల్పడితే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు ఐజీ రవి ప్రకాష్.. అమలాపురం ఎస్పీ కార్యాలయం నుండి కౌంటింగ్ పై ఏలూరు రేంజ్ పరిధిలోని అందరి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేశామని రవి ప్రకాష్ తెలిపారు. కోనసీమ ప్రాంతం అల్లర్లలో మొదటి స్థానంలో ఉండటంతో మరింత పటిష్ట చర్యలు తీసుకున్నామని, అనపర్తి, పిఠాపురం, దెందులూరు, పెనమలూరు, మచిలీపట్నం తదితర నియోజకవర్గాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏదయినా సంఘటన జరిగితే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు తీసుకుంటారని రవి ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.
మరోమారు మందుబాబులకు డ్రైడే.. 4న మద్యం దుకాణాలు బంద్..
ఒకవైపు ఎండల వేడి కారణంగా చల్లబడడానికి మందుబాబులు భారీగా వైన్ షాపుల ముందు వేచి చూస్తుండగా.. వరుస బంద్ లతో వాటిని మూసేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వారికి గట్టి షాక్ తగిలింది. గత నెల రోజుల నుండి పలు కారణాలతో మద్యం దుకాణాలు మూసివేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా జూన్ 4 వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కారణంగా మరోసారి మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని లోక్సభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెల నుండి ఇలా మద్యం దుకాణాలు తరచుగా మూసేస్తున్న సంఘటనలు చాలానే జరిగాయి. ఏప్రిల్ నెలలో రెండు రోజులపాటు మద్యం దుఖాణాలు మూసివేయబడ్డాయి. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17 న హైదరాబాద్ జంట నగరాల్లో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అలాగే ఏప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా కూడా మరోసారి మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అలాగే ఎలక్షన్ టైం లో కూడా మే నెలలో మద్యం దుకాణాలు బంద్ అయిన సంగతి తెలిసిందే.
మళ్లీ బీజేపీదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో సంచలన ఫలితాలు..
2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో చూసిన లోక్‌సభ ఎన్నికలు-2024 ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 300 కన్నా అధిక స్థానాలను సాధిస్తున్నట్లు మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సగటున ఏన్డీయేకి 365 సీట్లు, మరోవైపు ఇండియా కూటమి 142 వరకు వస్తాయని అంచనా వేశాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ జూన్ 1తో ముగిసింది. మొత్తం 7 దశల్లో దేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి వస్తుందని, మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ సారి సొంతంగా బీజేపీకి 370 సీట్లతో పాటు ఎన్డీయే కూటమి 400+ స్థానాల్లో గెలుస్తుందని ‘‘ఔర్ ఏక్ బార్ 400 పార్’’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచింది.మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. రాజ్యాంగాన్ని రక్షించేందుకు, విద్వేష రాజకీయాలకు ప్రజలంతా వ్యతిరేకంగా ఓటేశారని ధీమా వ్యక్తం చేసింది.
ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొంటాం
సార్వత్రిక ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. శనివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడు విడతల పోలింగ్, కౌంటింగ్, ఎగ్జిట్ పోల్స్‌పై చర్చించారు. అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఇక సార్వత్రిక ఎన్నికలపై వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొనాలని ఇండియా కూటమికి చెందిన పార్టీలు నిర్ణయించినట్లు కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్‌పర్సన్ పవన్ ఖేడా ప్రకటించారు. టీవీ చర్చల్లో పాల్గొనబోమని ఖేడా శుక్రవారం ప్రకటించారు. ఒకరోజు తర్వాత స్వరం మారింది. శనివారం మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం తర్వాత సీనియర్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
క్విక్ కామర్స్‌లోకి జియోమార్ట్.. మొదట ఆ నగరాల్లో మాత్రమే..?!
రిలయన్స్ సంస్థల్లో భాగమైన జియో మార్ట్ అతి త్వరలో క్విక్ కామర్స్ సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని మొత్తం ఎనిమిది నగరాలలో ఈ సేవలను అందించబోతున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు ఆన్లైన్లో పెట్టిన ఆర్డర్లను వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు ఉపయోగించే క్విక్ కామర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. కస్టమర్ ఆర్డర్ చేసిన అరగంటలోపే పండ్లు, కూరగాయలతో పాటు నిత్యవసర వస్తువులను కూడా పంపిణీ చేయాలని ఆలోచనలో ఉంది. ఇప్పటికే అన్ని ప్రధాన నగరాలతో కలిపి దేశం మొత్తం రిలయన్స్ సంస్థకు సంబంధించిన రిటైల్ షాపులు దాదాపు 19 వేల కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో దేశంలో 1000 నగరాల వరకు జియో క్విక్ కామర్స్ సేవలను అందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే గాని జరిగినట్లయితే దేశంలో అతిపెద్ద క్విక్ కామర్స్ సంస్థల్లో మొదటి స్థానంలో నిలబడుతుంది జియో మార్ట్. ఈ సేవలను మొదలుపెట్టిన తర్వాత అవుట్ లెట్ కేంద్రాల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ఆర్డర్లను తీసుకొని ప్రతి ప్రాంతానికి సేవలు అందించబోతున్నట్లు జియో మార్ట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అనేక రంగాలలో జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో కూడా జియో మార్ట్ తనదైన మార్కు వేయాలని ప్రస్తుతం ఆలోచనలో ఉంది. చూడాలి మరెంత త్వరగా కస్టమర్లకు సేవ అందించగలదో జియో మార్ట్.
కమల్ హాసన్, శంకర్‌ల ‘ఇండియన్ 2 ‘ జ్యూక్‌బాక్స్ వచ్చేసిందోచ్..
చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో కమల్‌హాసన్, శంకర్‌ల ఇండియన్ 2 ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ జ్యూక్ బాక్స్ ను ఆన్‌లైన్‌లో విడుదల చేసారు. దింతో అన్ని ఆడియో ప్లాట్‌ఫారమ్ లలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. ఆల్బమ్ లో మొత్తం 6 ట్రాక్ లు ఉన్నాయి. కధరాల్జ్, కమ్‌బ్యాక్ ఇండియన్, క్యాలెండర్ సాంగ్, పారా, జగా జగా, నీలోర్పమ్ లు వరుసగా ఇందలో ఉన్నాయి. సినిమా మొదటి నుండి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ను అందించినట్లు కనిపిస్తోంది. పారా, కమ్‌బ్యాక్ ఇండియన్ ఆల్బమ్ నుండి అత్యుత్తమ పాటలుగా చెప్పవచ్చు. ఇక పాటలను ఎంతో గ్రాండ్ గా చిత్రీకరిస్తాడనే పేరున్న శంకర్., మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన భారతీయుడు 2 లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందంలు కీలక పాత్రలు పోషించారు. జూలై 12న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. చూడాలి మరి మరోసారి భారతీయుడు ఆ రేంజ్ లో మెప్పించనున్నాడో.