జగన్ ఎన్నికల శంఖారావం.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదిక నుంచి.. యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.. వారి నుంచి సిద్ధం అంటూ సమాధానాన్ని రాబట్టారు.. ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?, ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాని ఓడించడానికి నేడు సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించి వారి స్పందన తీసుకున్నారు. ఇక, వచ్చే రెండు నెలలు మనకు యుద్ధమే.. ఈ రెండు నెలలు మీరు సైన్యంగా పని చేయాలి.. దుష్టచతుష్టయం సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేశారు.
మరో 70 రోజుల్లోనే ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగబోతోఉన్నాయి.. త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోన్న తరుణంలో.. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు వస్తాయని క్లారిటీ ఇచ్చారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. భీమిలి సంగివలసలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం జగన్.. ‘సిద్ధం’పేరుతో వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది.. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవసైన్యం కనిపిస్తోందన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చాం.. ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చాం.. 175 స్థానాలకు 175 సీట్లు గెలుపే మన టార్గెట్.. చంద్రబాబుతో సహా అందర్ని ఓడించాల్సిందే అని పిలుపునిచ్చారు.. మనం చేసే మంచి పనులే మనల్ని గెలిపిస్తాయి.. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు అని దుయ్యబట్టారు.
పేదవాడి భవిష్యత్తు మారాలంటే జగనే రావాలి
పేదవాడి భవిష్యత్తు మారాలంటే మళ్లీ జగనే రావాలి అని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది.. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివచ్చాయి వైసీపీ శ్రేణులు.. సిద్ధం పేరుతో నిర్వహించిన ఈ సభా వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం వైఎస్ జగన్.. మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే అని స్పష్టం చేసిన ఆయన.. ప్రతి పక్షాలకు ఓటేయడం అంటే దాని అర్ధం.. మాకు ఈ స్కీములు వద్దని, ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేనని గ్రహించాలి.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతీ వ్యక్తి మనకు స్టార్ క్యాంపెయినరే.. వాళ్లను మరికొంతమందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్.. మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి.. పేదల భవిష్యత్ మారాలంటే.. జగనే గెలవాలని చెప్పండి.. ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి.. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే.. జగన్ గెలవాలని చెప్పండి.. పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే.. జగన్ సీఎం అవ్వాలని చెప్పండి.. మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని, మిమ్మల్ని మాత్రమే.. ప్రజలే.. నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం పేర్కొన్నారు.
శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల విశేష పర్వదినాలు ఇవే..
కొలిచినవారి కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ రోజూ విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.. ఇక, కొన్ని ప్రత్యేక రోజుల్లో.. విశేష పర్వదినాల్లో శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తుంటారు.. జనవరి నెల ముగింపునకు వచ్చేసింది.. త్వరలోనే ఫిబ్రవరి నెల ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి. ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవం. 10న తిరుకచ్చినంబి ఉత్సవారంభం. 14న వసంతపంచమి. 16న రథసప్తమి. 19న తిరుకచ్చినంబి శాత్తుమొర. 20న భీష్మ ఏకాదశి. 21న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం. 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.
నేను చేసిన అభివృద్ధి చూపిస్తా.. మరి మీరు..? గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్
అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. భావితరాలను దృష్టిలో ఉంచుకుని రాయచోటి ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని వెల్లడించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ వాళ్లకు నాపై అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.. వాళ్లు అభివృద్ధి చేయరు, అభివృద్ధి చేసే నాపై నిందలు వేస్తారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రాయచోటిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? అని నిలదీశారు. రాయచోటికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి నేటి వరకు నేను చేసిన అభివృద్ధిని చూపిస్తా.. తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చేసిన అభివృద్ధిని చూపిస్తారా..? అంటూ రమేష్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. నిజాయితీగల ఐఏఎస్ అధికారి గిరీషాపై ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు.. తిరుపతిలో జరిగిన ఘటనకు ఐఏఎస్ అధికారికి ఎలాంటి సంబంధం లేదు, ఎవరో ఓ వ్యక్తి కలెక్టర్ లాగిన్ తీసుకొని తప్పు చేశాడు.. అందుకు కలెక్టర్ బాధ్యుడు కాదు.. అది కూడా నిరూపణ అయ్యిందని వెల్లడించారు.. అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదట జిల్లా కలెక్టర్ గా వచ్చిన ఐఏఎస్ అధికారి గిరీషా సహకారంతో రాయచోటి ఎంతో అభివృద్ధి చెందింది. నీతి నిజాయితీ గల కలెక్టర్ పై ఆరోపణలు చేయడం తగదు అని వార్నింగ్ ఇచ్చారు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.
పులి పేరు ఎత్తితేనే హడలిపోతున్నారు.. రైతులు, స్థానికుల్లో ఆందోళన
పులి పేరు ఎత్తితే చాలు పరుగులు పెడుతున్నారు ఏలూరు జిల్లాలోని పలు మండలాల ప్రజలు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాల్లో పులి అడుగు జాడలు కనిపించడంతో హడలెత్తిపోతున్నారు అక్కడి రైతులు, కూలీలు. ప్రశాంతమైన ప్రాంతంలో పులి పాదముద్రల జాడ బయటపడటంతో భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు అక్కడి ప్రజలు.. ఎప్పుడు ఎం జరుగుతుందుందో అనే ఆందోళణ అక్కడి జనంలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగాని ఏలూరు జిల్లా వాసులను పెద్దపులి ఇప్పుడు హడలెత్తిస్తోంది. పంటపొలాల్లో పనులు చేసుకునే కూలీలు పాదముద్రలు చూసి మొదట అనుమాన పడ్డారు. విషయం ఆనోట ఈనోట పాకడంతో మరింత అప్రమత్తమయ్యారు రైతులు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేధినరావు పాలెంలో తాజాగా వెలుగు చూసిన పులిపాద ముద్రలు అక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. రెండురోజుల క్రితం ద్వారకాతిరుమల మండలంలో అలజడి సృష్టించిన పులి పాదముద్రలు ఇప్పుడు దెందులూరు మండలం చేరుకున్నాయి. మూడు నాలుగు రోజుల క్రితం బుట్టాయగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లో పులి సంచరించినట్టు అక్కడి ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఆవును సైతం పులి తినేసింది. తాజాగా శనివారం ఉదయం దెందులూరు మండలంలోని పెరుగుగూడెం, మేదినరావుపాలెం గ్రామంలోని మొక్కజొన్న తోటలో పులిపాదముద్రలు తీవ్ర కలకలం రేపాయి. అదే రోజు ఉదయం పొలానికి నీరు పెట్టి తర్వాతి రోజు వచ్చి చూసిన రైతులకు పులి అడుగులు కనిపించడంతో అక్కడ పులి ఉందని ఫిక్సయ్యారు రైతులు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులి సంచరించిన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించడంతోపాటు పాదముద్రలను సేకరించారు.
నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రివ్యూ..
సచివాలయంలో నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని అధికారులకు తెలిపారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ క్రమంలో.. పెండింగ్ ప్రాజెక్టుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని సీఎం అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చన్నారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం.. 5 సెకన్లు కంపించిన భూమి
సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం వచ్చింది. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు ఇళ్లనుంచి భయంతో పరుగులు తీశారు. కాగా.. ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి జనాలు చెబుతున్నారు.
లోక్‌సభ సీట్లు ప్రకటించేసిన అఖిలేష్.. కాంగ్రెస్ గరం గరం!
ఓ వైపు బీహార్ సంక్షోభం కాకరేపుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటన ఇండియా కూటమిలో మరో గందరగోళం సృష్టించేటట్లుగానే కనిపిస్తోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అఖిలేష్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. సమాజ్‌వాదీ పార్టీతో ఎలాంటి డీల్ కుదరలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. అఖిలేష్ యాదవ్, అశోక్ గెహ్లాట్ మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇరు పార్టీల మధ్య చర్చలు ముగిసిన తర్వాతే ఫార్ములా ఏమిటనేది చెప్పగలమని జైరాం రమేష్ తేల్చిచెప్పారు. ఇక సీట్ల షేరింగ్‌పై తనకు ఎలాంటి సమాచారం లేదని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ వెల్లడించారు. సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
జ్ఞానవాపిని హిందువులకు అప్పగించండి.. ఏఎస్ఐ నివేదిక తర్వాత వీహెచ్‌పీ..
జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది. ఈ నివేదిక అందిన రెండు రోజుల తర్వాత విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ జ్ఞాన్వాపి మసీదును మరో ప్రాంతానికి మార్చాలని, జ్ఞాన్‌వాపీ కాంప్లెక్స్ భూమిని కాశీ విశ్వనాథ్ కమిటీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోపల లభించిన శాసనాల్లో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లు కనుగొనడం దేవాలయం ఉందనే దానికి సాక్ష్యమని అలోక్ కుమార్ అన్నారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావం ఆగస్టు 15, 1947న ఉనికిలో ఉందని, ప్రస్తుతం హిందూ దేవాలయమని రుజువైందని, అందువల్ల ప్రార్థనా స్థలాల చట్టం 1991లోని సెక్షన్ 4 ప్రకారం నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని అన్నారు.
ఇన్సాట్-3DS శాటిలైట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. వాతావరణ ఉపగ్రహం INSAT-3DS ప్రయోగం కోసం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌కి తరలించారు. ఈ శాటిలైట్‌ని జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(GSLV-F14) ద్వారా ప్రయోగించనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (MoES) కోసం బెంగళూరులోని UR రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. వాతావరణ అంచనాలను, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలనకు భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం ఈ ఉపగ్రహాన్ని రూపొందించినట్లు ఇస్రో ఒక ప్రకటన తెలిపింది. ఈ శాటిలైట్ లాంచ్ పిరియడ్ ఫిబ్రవరి 17- మార్చి 17 మధ్య ఉంది. అయితే, ఫిబ్రవరి మధ్యలో ప్రయోగం ఉండొచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. ఇప్పటికే కక్ష్యలో INSAT-3D మరియు INSAT-3DR శాటిలైట్స్ ఉండగా.. వాతావరణ పరిశీలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు INSAT-3DS శాటిలైట్‌ని ప్రయోగించారు.
చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6, 7-5తో ఇటాలియన్ జోడీ సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నారు. అతను 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ ట్రోఫీని గెలుచుకున్న జీన్-జూలియన్ రోజర్ రికార్డును బద్దలు కొట్టాడు. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. తాజాగా పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు కూడా ఎంపికయ్యారు. రోహన్ బోపన్న 43 ఏళ్ల 329 రోజుల వయసులో ఛాంపియన్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్‌లో ఎబ్డెన్‌కిది రెండో టైటిల్. అతను ఇంతకుముందు 2022లో ఆస్ట్రేలియన్ మాక్స్ పర్సెల్‌తో కలిసి వింబుల్డన్ గెలిచాడు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన మూడో భారత ఆటగాడిగా రోహన్ బోపన్న నిలిచాడు. ఇంతకు ముందు పురుషుల టెన్నిస్‌లో లియాండర్ పేస్, మహేశ్ భూపతి మాత్రమే భారత్ తరఫున మేజర్ టైటిళ్లు సాధించగా, మహిళల టెన్నిస్‌లో సానియా మీర్జా ఈ ఘనత సాధించింది.
ఆదిపురుష్ నాకు నచ్చలేదు.. నేనే కనుక ఆ సినిమా తీసి ఉంటే..
హనుమాన్.. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటింది. అయినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. కలక్షన్స్ రాబడుతూనే ఉంది. రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి .. భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఈ రోజుకి 250 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించి ఒక గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ గ్రాటిట్యూడ్ మీట్లో ముఖ్యఅతిథిగా చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడడం ఆసక్తి కలిగిస్తుంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్.. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమాను బాలీవుడ్ మేకర్స్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ గుర్తుచేశాడు. ” ఆదిపురుష్ సినిమా చూసాను.. అందులో నాకు కొన్ని సీన్స్ నచ్చాయి.. ఇంకొన్ని సీన్స్ తెరకెక్కించిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే కనుక ఆదిపురుష్ తీసి ఉంటే.. అంతకన్నా బాగా తీసేవాడిని.. నాకు అదే అనిపించింది. ఆదిపురుష్ చూసాకా నాకే కాదు ఏ ఫిల్మ్ మేకర్ కు అయినా అలాంటి భావనే కలుగుతుంది. ఇక ఆదిపురుష్ సినిమా రిజల్ట్.. నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారివలనే హనుమాన్ నేను అనుకున్నట్లు తీర్చిదిద్దగలిగాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
రికార్డు ధరకు దేవర రైట్స్.. భారీ టార్గెట్ తో బరిలోకి
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘దేవర’ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయని తెలిసిందే. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను పూర్తి చేసి 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేశారు. క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ బిజినెస్ కూడా మొదలు పెట్టేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరలకు క్లోజ్ చేయగా థియేట్రికల్ రైట్స్ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. సక్సెస్‌ఫుల్ ‘దేవర’ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ డీల్ తాజాగా క్లోజ్ అయినట్లు తెలిసింది. తాజాగా ఓవర్సీస్ రైట్స్‌ను బడా సంస్థ హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుందని యూనిట్‌కు సందరు సంస్థ ఏకంగా రూ. 27 కోట్ల రూపాయలు అంటే యూఎస్ కరెన్సీలో 3.3 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్ కోసం హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇచ్చిన మొత్తం ఎన్టీఆర్ సోలో కెరీర్‌లోనే టాప్ రికార్డు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే 6.5 మిలియన్ డాలర్లు అంటే రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ‘దేవర’ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.
ఎట్టకేలకు గుంటూరు కారం హడావుడి తరువాత దర్శనమిచ్చిన గురూజీ
గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ ఎందుకు కనిపించలేదు? గురూజీపై ట్రోలింగ్… అందుకే బైటకు రాలేకపోయాడా? అనే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఎట్టకేలకు బయట కనిపించారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో ఆయన నివాసానికి నిర్మాత చినబాబుతో వెళ్లి త్రివిక్రమ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. నిజానికి గుంటూరు కారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎందుకో అంతా సాఫీగా సాగలేదు. ముందుగా కథలో మార్పులు చేయాల్సి వచ్చింది, ఆ తరువాత ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ లోపు పవన్ సినిమా కెరీర్‌పై త్రివిక్రమ్ కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నాడని, ఉస్తాద్ భగత్‌సింగ్..హరిహర వీరమల్లు వాయిదాకు త్రివిక్రమే కారణం? అని కూడా ప్రచారం జరిగింది. ఆయా సినిమాలు చేయాల్సిన సమయంలోనే వీటి ప్లేస్‌లో ‘భీమ్లానాయక్’, ‘బ్రో’ త్రివిక్రమ్ తీసుకొచ్చినట్టు సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. త్రివిక్రమ్ పర్యవేక్షణలో భీమ్లా నాయక్.. బ్రో సినిమాలు తెరకెక్కాయి. భీమ్లా నాయక్, బ్రోకు త్రివిక్రమ్ మాటలు కూడా అందించగా తన సొంత బేనర్‌లో వరుసపెట్టి సినిమాలు చేస్తూ గుంటూరుకారంపై దృష్టి పెట్ట లేదని విమర్శలు వచ్చాయి. అయితే నిజానికి ఎందుకో గుంటూరు కారం సినిమాకి ముందే డిజాస్టర్ టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటిక్ టాక్ వచ్చింది. అలా చివరిగా కొద్దిరోజుల క్రితం యూనిట్ చెప్పిన దాని ప్రకారం 110 కోట్ల షేర్.. 230 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సినిమా ఓకే అనిపించుకున్నా గురూజీ మాత్రం బైటకు రాలేదు. మహేష్ సక్సెస్ పార్టీ ఇచ్చినా కనపడలేదు, ఆయన లేడని సక్సెస్ పార్టీ కూడా క్యాన్సిల్ అయింది. ఇక ఈ సినిమాకి రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రమోషన్స్ లేవు, రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ లేవు. దీంతో సినిమాలో రమణగాడు అమ్మ ప్రేమకు నోచుకోలేదో సినిమాకి ప్రమోషన్‌స్ కూడా ఆ స్థాయిలో నోచుకోలేదని మహేష్ అభిమానులు భావించారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు గురూజీ బయట కనిపించారు.