గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం..
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించి.. ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. దాదాపు మూడేళ్ల కిందట.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు గంటా.. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు రాజీనామాను ఆమోదించడం హాట్ టాపిక్‌గా మారింది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న తన ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.. అయితే, ఈనెల 22న ఆ రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ జనరల్ డాక్టర్ పీపీకే రామాచార్యులు ఈ రోజు ప్రకటించారు. కాగా, గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పుడు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానిపై విమర్శలు గుప్పించింది.. స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని ఆరోపించారు.. దీంతో.. 2021, ఫిబ్రవరి 12వ తేదీన విశాఖలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్షకు మద్దతు ప్రకటించిన గంటా శ్రీనివాసరావు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విన్నవించారు. అయితే, ఆ రాజీనామాపై నిర్ణయాన్ని ఇంత కాలం పెండింగ్‌లో ఉంచిన స్పీకర్.. ఇప్పుడు విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదించింది.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాపై ఆమోద ముద్ర వేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు.. టీడీపీ నుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. మొత్తంగా రాజ్యసభ ఎన్నికలకు ముందు.. టీడీపీకి షాక్ ఇచ్చింది వైసీపీ.
గంటా రాజీనామా ఆమోదం వెనుక వైసీపీ వ్యూహం..
దాదాపు మూడేళ్ల క్రితం రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం వెనుక అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది అంటున్నారు విశ్లేషకులు.. వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగుల్లో భాగంగానే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర పడినట్టు చెబుతున్నారు.. టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామా విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకోవడమే దీనికి ఉదహరణగా చెబుతున్నారు.. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించిన అసెంబ్లీ స్పీకర్.. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మూడేళ్ల కిందట రాజీనామా చేశారు గంటా శ్రీనివాసరావు.. ఏళ్లపాటు రాజీనామా ఆమోదంపై వేచిచూస్తూ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పుడు గంటా రాజీనామా ఆమోదం తెలపడం వెనుక రాజ్యసభ ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు.. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. దానికి అనుగుణంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేసిందనే చర్చ సాగుతోంది. మరోవైపు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు.. టీడీపీ నుంచి వైసీపీ దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల డిస్‌క్వాలిఫికేషన్ పై కూడా చర్చ సాగుతోంది.. గంటా రాజీనామా ఆమోదంతో.. డిస్‌క్వాలిఫికేషన్ వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చింది..
ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ అలర్ట్..
దాదాపు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇంత కాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్రవేయడం చర్చగా మారింది. అయితే, దీనికి వెనుక అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, ఘంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయ్యింది.. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ వ్యూహం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇదే సమయంలో.. పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అయితే. ఆ నలుగురిపైనా వేటు పడుతుందని టీడీపీ భావిస్తోంది.. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేస్తోంది టీడీపీ.. తమ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలపై తామిచ్చిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్‌ను ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ.. ఒకవేళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అనర్హత వేటు పడితే.. టీడీపీ రెబల్‌లు అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా వేటు వేయాల్సిందేననే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది.
రాజ్యసభ కోసం వైసీపీ వ్యూహాత్మక అడుగులు.. ఆ ఆరుగురిపై కూడా వేటు..!
రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లు అనూహ్యంగా చేదు అనుభవం ఎదుర్కొంది వైసీపీ.. అయితే, ఈసారి ముందుగా అలర్ట్ అయ్యింది అధికార పార్టీ.. తమ పార్టీ రెబల్స్ పై అనర్హతకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి.. మరోవైపు.. ఇద్దరు ఎమ్మెల్సీలు సి. రామచంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ పై కూడా ఫిర్యాదులు వెళ్లాయి.. అయితే, ఒకే సారి నలుగురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. ఇద్దరు ఎమ్మెల్సీలపై కూడా వేటు పడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అనూహ్యంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా రాజీనామాకు ఆమోద ముద్ర వేయడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారింది.. మరోవైపు.. నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పులతో టికెట్ గల్లంతు అయిన సిట్టింగుల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.. ఇప్పటి వరకు 29 మంది సిట్టింగ్ లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొండిచేయి ఇచ్చింది.. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు. సీటు దక్కని మరికొందరు సిట్టింగ్‌ల్లో కొందరు టీడీపీ, మరికొందరు జనసేన పార్టీలతో టచ్‌లోకి వెళ్లారు.. దీంతో, రాజ్యసభ ఎన్నికల్లో విజయమే టార్గెట్‌గా వైసీపీ పావులు కదుపుతోంది. మరోవైపు.. ఇప్పటికే స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేశారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. ఆ రాజీనామాపై స్పీకర్ తమ్మినేని త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు స్పందన.. జగన్‌లో భయం, అనుమానం..!
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం హాట్‌టాపిక్‌గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు.. అయితే, తన రాజీనామా ఆమోదంపై తొలిసారి స్పందించారు ఘంటా శ్రీనివాసరావు.. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే.. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ఆమోదిస్తారా..? అని ప్రశ్నించారు. ఈ ఘటనతో సీఎం వైఎస్ జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోంది. జగన్‌ది రాజకీయ దివాళాకోరు తనమే. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు నన్ను సంప్రదించకుండానే ఆమోదించారు. గతంలో నేను స్పీకర్‌ను కలిసినప్పుడు ఆమోదించకుండా.. ఇప్పుడు ఆమోదించడమేంటీ..? అని నిలదీశారు. సీఎం జగన్‌లో రాజ్యసభ సీట్ల భయం కన్పిస్తోంది.. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారవి ఆయనకు అనుమానంగా ఉన్నట్టుందన్నారు గంటా శ్రీనివాసరావు.. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తా అన్నారు. అరాచకం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో నేను ఓటేయాలనుకున్నా.. కానీ, రాజీనామాతో నన్ను ఓటింగ్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. అయినా, రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా నాకున్న మార్గాలేంటి? అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటాను అన్నారు. తాను ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే అని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.
వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.. నా భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది..!
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.. వసంత త్వరలో టీడీపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.. నా భవిష్యత్తు ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని కామెంట్ చేశారు ఎమ్మెల్యే వసంత.. ఇప్పుడున్న సమకాలీన పరిస్ధితుల్లో ప్రజా ప్రతినిధులుగా కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నాం అన్నారు.. ఈ కాలంలో పని చేస్తున్న శాసనసభ్యులం ఒక రకంగా అదృష్టవంతులం, ఒక రకంగా దురదృష్టవంతులం.. అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకురావాలంటే చాలా సమస్యగా ఉంది.. ప్రజలు అనుకున్న రీతిలో నిధులు కేటాయించలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్. ఇక, 20 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ స్థలాలకు అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగ్ చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి డబ్బు రాలేదు అన్నారు ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్.. కాంట్రాక్టర్లంతా రోజూ నా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినాయన.. ఇప్పుడు నిధులు తెచ్చినా చేసే వాళ్లే లేరని వాపోయారు. సంక్షేమంలో అందరినీ సంతృప్తి పరచగలిగాం.. కానీ, అభివృద్ధిలో చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. 10 సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేసిన వైసీపీ కార్యకర్తకి 7 కోట్ల విలువైన డ్రైన్లు, రోడ్లు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తే.. అప్పులపాలై వాళ్ల తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకున్నాడు అని చెప్పుకొచ్చారు. నిధులు లేకుండా నేను ఎన్ని రోజులు పని చేసేది? మానసికంగా ఇదంతా కష్టంగా ఉంది అని నిలదీశారు. ఎప్పుడు తెల్దారుతుందా, ఎప్పుడు చీకటి పడుతుందా అని రోజూ ఎదురు చూడడమే శాసనసభ్యుల పనిగా మారిందంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి.
చరిత్ర సృష్టించిన ఏపీ సర్కార్.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి..!
ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ కల సాకారం చేస్తూ.. రెండో టన్నెల్ పూర్తి చేసింది.. రెండో సొరంగం తవ్వకం పనులు ఇవాళ్టితో ముగిసాయి.. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు ఈ రోజు పూర్తి చేసినట్టు ఇంజీనీర్లు ప్రకటించారు.. ఇక, మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసింది ప్రభుత్వం.. రెండో టన్నెల్ పనులు ఈ రోజు పూర్తి కావడంతో.. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ఘనత సొంతం చేసుకుంది.. ఇక, దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది ఏపీ ప్రభుత్వం .. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తి చేశారు.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే పూర్తి చేశారు.. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు.. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు.. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం అయినట్టు అవుతుది.. మూడు జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది..
అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ కొమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రగతిపై ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్ పి.ఎస్. బదావత్ సంతోష్, హేమంత్ బొర్కడే, ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్, ఇంచార్జి ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్త, అదనపు కలెక్టర్లు బి.రాహుల్, దీపక్ తివారి, ఫైజన్ అహ్మద్, ఉమ్మడి జిల్లా అటవీ అధికారులు ప్రశాంత్ బాజీరావు పాటిల్, శివ్ ఆశిష్ సింగ్, నీరజ్ టిబ్రెవాల్, కే.రాంకిష్, ఆదిలాబాద్, బోథ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్, ఖానాపూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, గడ్డం వినోద్, కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, వెడ్మ బొజ్జు లతో కలిసి ఆమె శాఖలవారిగా సమీక్షించారు. ఇదిలా ఉంటే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ, గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ జంగుబాయి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో రివ్యూ సమావేశానికి హాజరయ్యారు. మంత్రి తన పర్యటనలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని దేవస్థానానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశమయ్యారు. ఆలయ అభివృద్ధి పై చర్చించారు. ఈ కార్యక్రమంలో కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవ్ రావు, అదనపు కలెక్టర్, ఐటీడీఏ అధికారులు, ఆదివాసి పటేళ్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పెన్షన్లు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి
జగిత్యాల బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ లు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు వెయ్యి కండ్ల తో ఎదురు చూస్తున్నారని, తొమ్మిదిన్నర సంత్సరాలు ఎవరికి ఇబ్బందులు కలిగించలేదన్నారు కొప్పుల ఈశ్వర్. ప్రభుత్వం మారి నెల రోజులు కాగానే కాలువల్లో నీళ్లు లేవు. పింఛన్లు లేవు, తులం బంగారం లేదని, ఇప్పటి వరకు రైతు బందు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి ఎవరు సంబధం లేకుండా మాట్లాడుతున్నారని, పెన్షన్లు ఇస్తారా లేదా క్లారిటీ ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలు చేస్తున్నారని, ఎందు కోసం చేస్తున్నారో తెలియదన్నారు. అవగాహన లేని సీఎం లా కనిపిస్తుందని, జీవన్ రెడ్డి ఊ అంటే కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అల్లాటప్పా ప్రాజెక్ట్ కాదు.. ప్రపంచ ఖ్యాతి గాంచిన ప్రాజెక్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఖర్చు పెట్టింది 93 వేల కోట్లే…లక్ష కోట్లు అని తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, కాళేశ్వరం అంటే మేడి గడ్డ నే కాదు వందల కొద్దీ పంప్ హౌస్, కెనాల్స్ అని ఆయన అన్నారు.
ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన ఈసీ
లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్‌లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా.. తాజాగా ఎన్నికల సంఘం ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్ 16 అనేది లోక్ సభ ఎన్నికల తేదీ కాదని ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలను ప్లాన్ చేసి వాటిని సకాలంలో పూర్తి చేయాల్సిన గడువు తేదీ అని స్పష్టం చేసింది. ఆ తేదీ లోపు ఎన్నికల ప్రణాళికల ప్రకారం పనులన్నీ పూర్తి చేయాలన్నది తమ లక్ష్యమని సీఈవో కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు సంబంధిత వర్గాలకు ఈ నెల 19న అధికారిక లేఖను జారీ చేశామని వెల్లడించింది. అంతేకాకుండా.. లోక్‌సభ ఎన్నికలను ఏ తేదీ నుంచి వాయిదా వేయవచ్చనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది.
దివంగత బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రజా నాయకుడిగా ఎదిగిన కర్పూరీ ఠాకూర్ 1924లో జన్మించారు. ఆయన బీహార్‌కు కాంగ్రెసేతర మొదటి ముఖ్యమంత్రి. కర్పూరి ఠాకూర్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు, రెండోసారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు సేవలందించారు. కర్పూరి ఠాకూర్ 1952లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1967లో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక, బీహార్‌లోని మహామాయ ప్రసాద్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కర్పూరీ ఠాకూర్ పార్లమెంటరీ జీవితం అధికారంతో నిండిపోయింది. ఎక్కువ కాలం ప్రతిపక్ష రాజకీయాలు చేశాడు. బీహారీలు ఆయనను గౌరవంగా ‘జన్ నాయక్’గా పిలుచుకుంటారు. ఈయన గోకుల్ ఠాకూర్, రామ్దులారి దేవి దంపతులకు జన్మించారు. పితౌంఝియా అనే చిన్న గ్రామంలో జన్మించిన నాయీ సామాజిక వర్గానికి చెందిన కర్పూరీ ఠాకూర్ ముఖ్యమంత్రిస్థాయికి ఎదిగారు.
రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిచారు.. నేతాజీ జయంతికి ఎందుకు సెలవు ఇవ్వలేదు..?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. “రాజకీయ ప్రచారం” కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు. రాజకీయ కార్యక్రమాలకు సెలవులు ఇచ్చినందుకు తాను సిగ్గుపడుతున్నాను, కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తులకు ఏమీ చేయడం లేదని మమతా తెలిపారు. నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా ప్రభుత్వం ప్రకటించేలా 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని.. కానీ నన్ను క్షమించండి, నేను విఫలమయ్యాను అని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమై ఎన్నో ఏళ్లు గడుస్తున్నప్పటికీ, ఆయన ఏమయ్యారు.. ఆయన చనిపోయిన తేదీ ఇప్పటివరకు దేశ ప్రజలకు తెలియకపోవడం అవమానకరమని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నేతాజీ అదృశ్యంపై దర్యాప్తు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వం.. ఇంతవరకు ఏమీ చేయలేకపోయిందని తెలిపారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అనుకున్నదే అయింది?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు నుంచి భయపడుతున్న విషయమే జరిగింది. దేవర సినిమా అనుకున్న రిలీజ్ డేట్ నుంచి వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ దేవర అనే సినిమా తెరకెక్కుతోంది. ప్రపంచం మరిచిపోయిన తీరాలకు సంబంధించిన కథగా ముందు నుంచి ఈ సినిమాని ప్రచారం చేస్తూ వస్తున్నారు మేకర్స్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. వాస్తవానికి సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ అనే విషయం తెలియగానే సినిమా వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ 2024 ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టింది. దాని ప్రకారం త్వరలో ఎన్నికల ప్రకటన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఏప్రిల్ 16వ తేదీన ఈ ఎన్నికలు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో అటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు ఏప్రిల్ 5వ తేదీన బాలీవుడ్ సినిమాలతో పోటీ ఉంది, ఈద్ కావడంతో అక్కడి థియేటర్లను సంపాదించడం అంత సామాన్యమైన విషయమే కాదు. వార్ 2 కోసం బాలీవుడ్లో పిచ్ రెడీ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎన్టీఆర్ థియేటర్లు దొరకకపోతే వెనక్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం అని ముందే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో కొంచెం వెనక్కి వెళితే ఏమీ కాదని సినిమా యూనిట్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలక్షన్స్ తో పాటు నార్త్ లో థియేటర్ల అంశం కారణంగా సినిమాని వాయిదా వేశా అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతానికి సినిమా యూనిట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సప్త సాగరాలు దాటి టాలీవుడ్’కి వచ్చేస్తోంది.. మొదటి సినిమా ఫిక్స్!
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలామంది చూసి భలే లవ్ స్టోరీ రా అనుకున్నారు. ముఖ్యంగా సినిమా మొత్తం మీద తెలుగు వారందరినీ ఆకర్షించే విషయాలలో రుక్మిణి వసంత నటన కూడా ఒకటి. అలాంటి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఉంటే బాగుంటుందని కొందరు భావించారు. ఇప్పుడు ఆ భావాన్ని ఏదో నిజం చేస్తూ ఆమె తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆమె ఏకంగా మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ రవితేజ, జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ఒక సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన జనవరి 26వ తేదీన ఉండబోతోంది అని తెలుస్తోంది.
హాలీవుడ్ వాళ్ళు ఇండియా నుండి ఏ సినిమా వస్తుందని డిస్కషన్ పెట్టే రేంజ్ కి తీసుకువెళ్తా!
తెలుగు సినీ పరిశ్రమలో ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత కల్కి అనే సినిమా చేశాడు. ప్రయోగాత్మక సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ సినిమా చాలా మందికి నచ్చింది కానీ కల్కి సినిమా రొటీన్ అనిపించి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా చేసిన జాంబీ రెడ్డి మాత్రం ఓ మాదిరి హిట్ అందుకుంది. మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఇప్పుడు ఆయన చేసిన హనుమాన్ సినిమా మాత్రం ఒక రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తోంది. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి మిగతా అన్ని సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టడమే గాక నార్త్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తాను అనుకున్న ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలు ఒక్కొక్కటిగా బయటకు వదులుతానని ప్రశాంత్ వర్మ ప్రకటించారు. అందులో భాగంగానే నిన్న అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జై హనుమాన్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే మనం ఇక్కడ ఎలా అయితే రిలీజ్ డేట్స్ గురించి వేరే ప్రొడ్యూసర్స్ తో డిస్కషన్ పెడుతున్నామో హాలీవుడ్ వాళ్లు కూడా ఇండియా నుంచి ఏం సినిమా వస్తుందని మనతో డిస్కషన్ పెట్టే రేంజ్కి తీసుకువెళ్లడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఈ హనుమాన్ సినిమా కూడా కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనే కాక కొన్ని ఫారెన్ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ సక్సెస్ ని బట్టి అక్కడ ఎప్పుడు, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అని ఆలోచించారు. ఇక్కడ సూపర్ హిట్ కావడంతో ఇక ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.