ఏడో జాబితాపై వైసీపీ కసరత్తు.. సీఎంవోకు నేతల క్యూ..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే ఆరు జాబితాలను విడుదల చేసిన వైసీపీ 80కి పైగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది.. ఇక, ఇప్పుడు ఏడో జాబితాపై కసర్తు మొదటు పెట్టింది.. దీంతో.. ఆ నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, టికెట్ ఆశిస్తున్నవారు.. ఇలా అంతా సీఎంవోకు క్యూ కడుతున్నారు.. ఈ రోజు సీఎంవోకు వచ్చారు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధు సూధన్.. ఇక, మంత్రులు వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహసన్, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్, అనంత వెంకట్రామిరెడ్డి.. ఇలా పలువురు నేతలు సీఎంవోకు వచ్చి చర్చలు జరిపారు. ఇక, రెండోసారి కూడా తాడేపల్లిలోని సీఎంవోకు వచ్చారు పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్.. చీరాల అసెంబ్లీ టికెట్ కోసం సీఎంవోలో ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కూడా వైసీపీ అధిష్టానం వద్దకు వచ్చారు.. కోడుమూరు అసెంబ్లీ ఇంఛార్జ్‌గా ఆదిమూలపు సతీష్ ను నియమించారు సీఎం జగన్.. దీంతో, కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్.. అందుకోసమే ఆయకు సీఎంవో నుంచి కాల్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
ఏపీలో మళ్లీ నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్లు.. రిజిస్ట్రేషన్ల కోసం ప్రవేశపెట్టిన 2.0 సాఫ్ట్‌వేర్ ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. సర్వర్ సమస్యతో ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లు నిలిచిపోయాయి. సోమవారం, దశమి కావడంతో రిజిస్ట్రేషన్ ల కొరకు భారీగా తరలివచ్చారు ప్రజలు.. ఉదయం నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. కార్డ్ ప్రైమ్ లో తరచూ సమస్యలు తలెత్తుతున్న పట్టించుకోవడం లేదని.. రోజూ మాకు ఆఫీసులు చుట్టూ తిరగడమే పనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. దానికి తోడు సచివాలయాల్లోను రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించిన నేపథ్యంలో సర్వర్ సమస్య ఎక్కువగా వస్తుందంటున్నారు.. వెంటనే సాంకేతిక సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా సర్వర్లు మొరాయించడంతో ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే కాగా, కార్డ్ ప్రైమ్ లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని.. మళ్లీ మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలు.
నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు.. 175 స్థానాల్లో వైసీపీదే విజయం
మైలవరం పంచాయితీకి ముగింపు పలికారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించారు. మంత్రి జోగి రమేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య ఆధిపత్య పోరుతో.. ప్రత్యామ్నాయాన్ని వెతికారు.. ఇక, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్టు.. సంకేతాలు ఇచ్చారు.. టీడీపీ, జనసేన నేతలను తనను ఆహ్వానిస్తున్నట్టు చెప్పుకొచ్చిన విషయం విదితమే.. మైలవరం వైసీపీ ఇంఛార్జ్‌గా నియమితులైన సర్నాల తిరుపతి రావు యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్, మంత్రి జోగి రమేష్ లకు ధన్యవాదాలు అన్నారు. మేం వైఎస్ జగన్ ను చూసే వచ్చి వైసీపీకి తిరిగాం.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేం వైసీపీకి పని చేశాం అన్నారు. ఇక, రానున్న ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ గెలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు సర్నాల తిరుపతిరావు యాదవ్.
వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!
మైలవరం రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పక్కనబెట్టిన వైసీపీ అధిష్టానం.. అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా జడ్పీటీసీ సభ్యుడు సర్నాల తిరుపతిరావు యాదవ్‌ను నియమించింది. దీంతో, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వసంత.. వైసీపీని వీడడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.. ఇదే సమయంలో, వైసీపీ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.. ఇక, వసంత కృష్ణప్రసాద్‌కు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.. డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి వసంత.. దమ్ముతో రాజకీయం చేసే వ్యక్తి జోగి రమేష్.. వసంత చీడ పురుగు, పిరికి పంద అంటూ ధ్వజమెత్తారు. వసంత గెలుపు కోసం 2019లో నేను పని చేశాను.. వైఎస్ జగన్ ఏం చెబితే నేను అది చేశాను.. అసలు వసంత ఎవడ్రా నువ్వు ? అంటూ విరుచుకుపడ్డారు. నేను ఎంత బలవంతుడు అనేది వసంత కృష్ణప్రసాద్ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు.. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వసంత ఇప్పుడు అదే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు.. వసంత ఒక నమ్మక ద్రోహి అంటూ దుయ్యబట్టారు జోగి రమేష్.. సీఎం వైఎస్ జగన్ దగ్గరకు వచ్చి వసంత ఏం అడిగి ప్రాధేయ పడ్డాడో వసంత పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ చేశారు. వసంత ఎలాంటి వాడు అనేది ఆయన చేరబోతున్న టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పాడన్నారు. వచ్చే ఎన్నికల్లో మైలవరంలో తిరుపతి రావు యాదవ్ ను గెలిపిస్తాను.. నేను వైఎస్ జగన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను.. సీఎం వైఎస్ జగన్ మాటే నాకు ఫైనల్ అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్.
ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడి అరెస్ట్.. సీపీ కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిగా ఉన్న మురారి సుబ్రమణ్యం గంగారాంని అరెస్ట్ చేశారు పోలీసులు.. హత్య జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామున వరుకు నిందితుడు విశాఖలోనే ఉన్నట్టు పోలీసులు గుప్పించారు.. ఆ తర్వాత విశాఖ నుంచి విమానంలో బెంగళూరు పరారయ్యాడు.. అయితే, ఈ రోజు ఎగ్మురు రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హత్య కేసులో నిందితుడు పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ కేసు నమోదు అయినట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్లాడు నిందితుడు. విశాఖలోని పనోరమా హిల్స్ లో నివాసం ఉంటూ.. రియల్‌ఎస్టేట్ లావాదేవీలు చేస్తునట్టు గుర్తించారు. ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం విషయంలో 22/A లోకి వెళ్లి విషయంలో రమణయ్యకి నిందితుడుకి పరిచయం ఏర్పడింది.. కొందరి యాజమానుల వద్ద నుంచి 57 లక్షల రూపాయల వరకు నిందితుడు వసూలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. ఆ 57 లక్షలు తీసుకొని కూడా పని చేయకపోవడంతో రమణయ్య ని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ రావడం ఖాయం..
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రావడం ఖాయం.. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో JNTU కాలేజ్‌లో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లను ఇంఛార్జ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కలిసిన ప్రారంభించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. JNTU కాలేజ్ లో 39 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేశాం అన్నారు.. 2013వ సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగిందని గుర్తుచేసుకున్నారు.. అయితే, ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఫండ్స్ ఉన్నప్పటికీ నరసరావుపేటలో తాత్కాలిక బిల్డింగ్ తో నిర్వహించారు అన్నారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ నిర్మాణం చేపట్టి.. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది.. ఇంకా ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది అన్నారు. ఒక విద్యార్థి రెస్పెక్టబుల్ ఉద్యోగంలో ఉండడం వల్ల వారి గ్రామాల రూపు రేఖలు మారిపోతాయి.. అది దృష్టిలో పెట్టుకిని విద్యార్థులు ఓ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మరోవైపు 1వ తరగత నుంచే ఇంగ్లీష్ మీడియం క్లాసులు కల్పిస్తున్న ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది అని కొనియాడారు.. విద్యార్థులు ఎలాంటి సలహాలు, సందేహాలు, ఏంటో నేరుగా స్పందిస్తే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాలల్లో పర్యటించారు. కాటారం మండలం కొత్తపల్లి శివారు పాలిటెక్నిక్ కళాశాలలో రూ. 3 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ నీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కాటారం ప్రభుత్వ హస్పిటల్ లోని డాక్టర్ల క్వార్టర్స్ రూములను ప్రారంభించారు. అనంతరం మహాదేవపూర్ మండల కేంద్రంలో రూ.1.20 కోటి నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ప్రారంభించారు. రూ.63 లక్షల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తామని , 12 నెలల వ్యవధిలో చిన్న కాళేశ్వరం పనులు పూర్తి చేస్తామని, మారుమూల మండలాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపోదింస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.ఈ రోజు రాత్రి మావోయిస్ట్ ప్రభావిత పలిమెల మండల కేంద్రంలోని ఎంపీటిసీ గందరా కళ్యాణి,రాజేందర్ ఇంట్లో రాత్రి బస చేయనున్నారు.మంత్రి అటవీప్రాంతంలో బస నేపద్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆరుగ్యారెంటీల అమలులో ఎలాంటి సందేహం లేదని.. ఖజానా ఖాళీ అయినా.. గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేబినెట్‌లో నిర్ణయించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అన్ని శాఖల వారిగా వివరాలు పరిశీలిస్తున్నామన్నారు.
ప్రజలు గుణపాఠం చెప్పినా… బుద్ధిరావడం లేదు..
బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉందని, కాని ఇంత దిగజారే విధంగా మాట్లాడొద్దని ఆయన అన్నారు.
హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు… ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల తర్వాత విపక్ష నేతలు ప్రేక్షకుల సీట్లకు పరిమితమవుతారని మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి కోసమే ప్రతి పక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి నష్టమని ప్రధాని తెలిపారు. ఒకే ప్రొడక్టును కాంగ్రెస్ పదే పదే రీలాంచ్ చేస్తోంది.. కాంగ్రెస్ దుకాణం ఒక్క నాయకుడి కోసమేనని విమర్శించారు. వాళ్ల దుకాణాలు త్వరలోనే మూతపడతాయని.. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నత్తనడకతో ఎవరూ పోటీ పడలేరంటూ సెటైర్లు వేశారు.
దర్యాప్తు సంస్థలపై విపక్షాల విమర్శలకు మోడీ కౌంటర్
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోడీ (PM Modi) తిప్పి్కొట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మోడీ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని మోడీ విమర్శించారు. అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో (Congress) ఈడీ కేవలం రూ.5 వేల కోట్లే సీజ్ చేసిందని.. అదే మా హయాంలో రూ.లక్ష కోట్ల అక్రమ నగదు సీజ్ చేసినట్లు గుర్తుచేశారు. విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని.. వాటిపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తు్న్నాయంటూ మండిపడ్డారు. తమ హయాంలో దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా పనిచేస్తున్నాయని కితాబు ఇచ్చారు. స్వతంత్రంగా పని చేస్తున్న సంస్థలపై ఆరోపణలు సరికాదని.. అవినీతిని అంతం చేసేంత వరకూ విశ్రమించేది లేదని ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో ఎన్డీయే ఎంపీలంతా (NDA MPs) నిలబడి చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
ట్రాన్స్‌జెండర్స్‌కి కేజ్రీవాల్ శుభవార్త.. ఇకపై బస్సుల్లో ఉచితం
ట్రాన్స్‌జెండర్లకు (Transgenders) ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) శుభవార్త చెప్పారు. దేశ రాజధానిలో ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని (Free Bus ) కల్పిస్తూ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ప్రభుత్వం. తాజాగా ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మహిళలకు బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అదే విధంగా ట్రాన్స్‌జెండర్లు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చని సీఎం తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ఏ ప్రభుత్వాలు ఏమీ చేయలేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అన్ని ప్రభుత్వాలు వాళ్లను విస్మరించాయని తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తున్నాయి. ఇంకోవైపు ఉచిత బస్సు ప్రయాణాల వల్ల గిరాకీ తగ్గిపోయాయని.. కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆటోడ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేపు గోవాలో ప్రధాని పర్యటన.. ‘ఇండియా ఎనర్జీ వీక్’ను ప్రారంభించనున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. రూ. 1,350 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్‌డ్ ఇండియా, డెవలప్‌డ్ గోవా 2047 కార్యక్రమంలో మోడీ ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన వివరాల ప్రకారం.. దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు ONGC సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రధాని ప్రారంభించి, ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభిస్తారని పేర్కొంది. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతిపెద్ద ఏకైక ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుండి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఇది కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్, అమెరికా అనే ఆరు దేశాల నుండి పెవిలియన్లను కలిగి ఉంటుంది.
ఒప్పో నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. మొన్న వచ్చిన రెనో 11 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.. ఒప్పో K11 5జీ.. ఈ ఫోన్ గురించి ఇప్పుడు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో Oppo K11 5G వచ్చింది. ఇందులో MediaTek డైమెన్సిటీ 810 SoCతో విడుదల అయ్యింది. ఇందులో 33W వైర్డ్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో కలదు.. ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. మీ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది NFC కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మరియు X-యాక్సిస్ హాప్టిక్ మోటార్, ఒక IR బ్లాస్టర్ మరియు డ్యూయల్ స్పీకర్లతో అమర్చబడి ఉంటుంది.ఈ హ్యాండ్‌సెట్ 8.23mm స్లిమ్‌గా మరియు 184 గ్రాముల బరువు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున బహుమతి అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద విష్ణు మంచు, భట్టి విక్రమార్క చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు మంచు విష్ణు ట్వీట్ చేస్తూ ‘తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామ’ని విష్ణు మంచు తెలిపారు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలతో ‘కన్నప్ప’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి దిగ్గజాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.
తాత పుట్టినరోజు.. ది అపోలో స్టోరీ లాంచ్ చేసిన ఉపాసన
భారతదేశంలో అపోలో హాస్పిటల్స్ స్థాపించి అనేక లక్షల మందికి నాణ్యమైన వైద్యం అందిస్తున్న డాక్టర్ ప్రతాపరెడ్డి 91వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో అక్కడి స్టాఫ్ అందరూ తమ వ్యవస్థాపకుని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో జరిగిన వేడుకల్లో ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మనవరాలు, మెగా కోడలు ఉపాసన కామినేని కొణిదెల తన తాత గారికి మర్చిపోలేని బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ది అపోలో స్టోరీ అనే బుక్ ని లాంచ్ చేశారు. అపోలో హాస్పిటల్స్ అమరచిత్ర కథ అసోసియేషన్ తో ఈ పుస్తకాన్ని ముద్రించారు. అపోలో హాస్పిటల్స్ మొదలు పెట్టాలని ఆలోచన ఎలా కలిగింది? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలతో అపోలో ఎదుగుతూ వచ్చింది వంటి విషయాలను పుస్తకంలో వివరించారు. ఈ అపోలో హాస్పిటల్స్ స్థాపించి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ప్రతాపరెడ్డి ఎంత కష్టపడ్డారు? ఎలాంటి చాలెంజెస్ ఫేస్ చేశారు వంటి విషయాలను కూడా పుస్తకంలో రాసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా ఉపాసన కామినేని మాట్లాడుతూ ఈ పుస్తకం ఇక్కడున్న చిన్న పాపలందరికి పెద్దగా ఎలా కలలు కనాలి అనే విషయం తెలియజేస్తుందని అన్నారు. తమ తాత పడిన కష్టం తెలిసిన తర్వాత నలుగురు మనవరాళ్లు ఎంత కష్టపడి ఇదే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటే ఎందుకు ప్రయత్నిస్తున్నారు అందరికీ తెలుసన్నారు. అలాగే తమ ఆడపిల్లలు అందర్నీ ఎలా ఎంకరేజ్ చేయాలో ఈ పుస్తకం చూసి చదివి తండ్రులందరూ ప్రోత్సహించాలని ఆమె అన్నారు.