*నెల్లూరు జిల్లాలో కోళ్లకు వైరస్.. ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తింపు
నెల్లూరు జిల్లాలో కోళ్లకు వచ్చిన వ్యాధికి సంబంధించి ఏపీ పశు సంవర్ధక శాఖ ఓ ప్రకటన చేసింది. అక్కడ కోళ్లకు వచ్చిన వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయాంజగా గుర్తించినట్లు తెలిపింది. భోపాల్లో ల్యాబ్ టెస్ట్ కి పంపించిన తర్వాత వ్యాధి నిర్ధారణ జరిగిందని పేర్కొ్న్నారు. కోళ్లు ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కడప, అనంతపురం జిల్లాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా.. చెరువులు, వలస పక్షులు వచ్చే ఉభయగోదావరి జిల్లాలు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రకాశం జిల్లాలో కూడా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా.. ఈ వ్యాధి నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాల్లో తప్పా ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యాధి పూర్తిగా అదుపులో ఉంది.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా.. మూడు నెలల పాటు చాటగొట్ల పరిసర ప్రాంతాల్లో చికెన్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. చాటగొట్లకు 10 కిలో మీటర్ల పరిధిలో మూడు రోజుల పాటు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాటగొట్లలో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడిన సంగతి తెలిసిందే.
*కేసీఆర్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైంది..
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో రామ్ జీ గోండు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని.. దేశవ్యాప్తంగా పది ట్రైబల్ మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మ్యూజియంకు పనులు జరుగుతున్నాయన్నారు. ఆనాటి కేసీఅర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదన్నారు. ఇవాళ ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయంకు భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిందన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 900కోట్లు మొదటి ఫేజ్‌లో గిరిజన యూనివర్శిటీకీ కేటాయించామన్నారు. రూ.420కోట్లతో 17ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించామని తెలిపారు. మేడారం జాతరకు 3 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గిరిజనులకు భూముల హక్కులను కూడా కల్పిస్తున్నామన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు.
*తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా సిరిసిల్ల రాజయ్య
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఎం.రమేశ్, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్ (ఎస్‌సీ) పార్లమెంట్ స్థానం నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
*బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా
దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు. ఈడీ అధికారులు జారీ చేసిన నోటీసులపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన సంగతి తెలిసిందే. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేకంగా విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం పేర్కొంది.
*రఘువీరారెడ్డిపై మంత్రి తీవ్ర ఆగ్రహం..
కాంగ్రెస్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరా రెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్ లో చాలా ఉన్నాయని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి, అయన చనిపోయాక జగన్ పై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. తమ ఇంచార్జీ మంత్రిగా ఉండి, కనీసం తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు, ఆయనకి తన గురించి ఏమీ తెలుస్తుందని రఘువీరా రెడ్డిపై మండిపడ్డారు. తాను ఖూనీలు చేశాను అని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పకుంటానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే.. ఆయన పార్థివ దేహాన్ని తీయకుండా డబ్బులు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరా అని దుయ్యబట్టారు. రఘువీరా రెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని తాము బ్రతికించానని చెప్పుకుంటున్నారు.. కానీ కాంగ్రెస్ ను చంపింది కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరాలేనని చెప్పారు. మరోవైపు.. లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు ఒక్క చెప్పుకోదగ్గ పథకం ఏమైనా పెట్టారా అని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నేను ఇది చేశాను అని చెప్పుకునే దిక్కు చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. ఇకపోతే.. ఈసీకి తన పై ఫిర్యాదు చేయడం వల్ల తనకేం నష్టం లేదన్నారు. ముందు చంద్రబాబును కుప్పంలో గెలవమని చెప్పండని సెటైర్లు వేశారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా అనంతపురంలో సభ నిర్వహిస్తామన్నారు. ఇతర పార్టీలు కూడా సీఎం వైఎస్ జగన్ సభ పై దృష్టి పెట్టారని తెలిపారు. ఎన్నికల పోరాటానికి సంసిద్ధం అనెందుకే సిద్దం సభ అని మంత్రి పేర్కొ్న్నారు.
*ప్రియాంకాగాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ప్రియాంకాగాంధీ ‘ఎక్స్’ ట్విట్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఈరోజు రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొనేందుకు ప్రియాంక సిద్ధమయ్యారు. కానీ అనారోగ్యం కారణంగా సోదరుడి యాత్రలో పాల్గొనలేకపోతున్నానని.. ఆస్పత్రి నుంచి కోలుకోగానే యాత్రలో పాల్గొంటానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర ఈరోజు వారణాసి మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. భాదోహి, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్ మీదుగా ఫిబ్రవరి 19న అమేథి చేరుకుంటుంది. ఆరోజు అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలోని గౌరీగంజ్‌లో రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం మరుసటి రోజు రాయ్‌బరేలీకి యాత్ర చేరుకుంటుంది. ఆ రాత్రి అక్కడే బస చేసే అవకాశం ఉంది. అక్కడ నుంచి లక్నోకు వెళ్లనుంది. వాస్తవానికి ఈనెల 26 వరకు యూపీలో యాత్ర జరగాల్సి ఉన్న కూడా అక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈనెల 21కే యాత్రను ముగించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో అమేథీ స్థానంలో ఓడిపోయారు. ఇక సోనియాగాంధీ రాయబరేలీ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోనియా నిర్ణయం తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రియాంక ఆస్పత్రిలో చేరికపై పార్టీ నేతలు వాకబు చేస్తున్నారు. ఆమె ఆరోగ్యం గురించి ముఖ్యనేతలను అడిగి తెలుసుకుంటున్నారు.
*కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం.. ఫ్లోర్‌టెస్ట్‌కు తీర్మానం
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన తీర్మానంపై శనివారం సభా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో పార్టీలను విచ్ఛిన్నం చేయడం.. ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు సాకుతో ఆప్ నాయకులను అరెస్టు చేయాలని కేంద్రం భావిస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో తాము ఎప్పటికీ గెలవలేమని బీజేపీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టే.. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ విడిపోలేదని.. వారందరూ చెక్కుచెదరలేదని ప్రజలకు చూపించేందుకు తాను అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమైనట్లు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. ఆప్‌కు 62, బీజేపీకి 8 స్థానాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు కేజ్రీవాల్ బలపరీక్షకు దిగడం ఆశ్చర్యంగానే ఉంది. ఇటీవలే జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగానే.. అనంతరం సీఎంగా చంపయ్ సోరెన్ బలపరీక్షలో నెగ్గారు. తాజాగా కేజ్రీవాల్ స్వతహగా బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆప్‌కు సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగానే విశ్వాస పరీక్షను గెలవొచ్చు. కానీ ఈ మధ్యలో ఎలాంటి రాజకీయాలు జరుగుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉంటే తమ ఎమ్మెల్యేలను రూ.25కోట్లకు కొనుగోలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆప్ ఆరోపించింది. మరోవైపు ఈనెల 19న తమ ఎదుట హాజరుకావాలని కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఆయన ఐదుసార్లు విచారణకు డుమ్మాకొట్టారు. ఈసారైనా విచారణకు హాజరవుతారో లేదో చూడాలి.
*పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. వాతావరణ శాఖ అలర్ట్
దేశంలోనే పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ (IMD) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షపాతం (Heavy Rainfall) నమోదు అవుతుందని.. ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని వార్నింగ్ (Warnings) ఇచ్చింది. ఈ మేరకు పలు రాష్ట్రాల (Several states) పేర్ల లిస్టును వాతావరణ శాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు దేశంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే కొద్ది రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్. జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వడగళ్ల వాన కురిసే ఛాన్సు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాను భారీ వరదలు ముంచెత్తాయి. అతి భారీ వర్షాల కారణంగా ఇళ్లన్నీ నీటిలో మునిగిపోయాయి. ఈ వరదల్లో ఒక భారతీయురాలు ప్రాణాలు కోల్పోయింది.
*2024లో నిజమవుతున్న బాబా వంగ జోస్యం..
Baba Vanga: బాబా వంగా గురించి తెలియని వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ బల్గేరియన్ ఆధ్యాత్మిక వేత్త అంచనా వేసిన భవిష్యత్ సంఘటనలు నిజమవుతున్నాయి. 2024లో ఆమె అంచనా వేసిన సంఘటనలు నిజమవుతున్నాయి. నోస్ట్రాడామస్ ఆఫ్ బాల్కన్స్ అని పిలిచే బాబా వంగా, 9/11 తీవ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ విపత్తు మరియు బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే అంచనా వేశారు. తాజాగా ఆమె అంచనా వేసినట్లు 2024లో జపాన్, యూకే వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ని కనుగొనడాన్ని కూడా ఆమె అంచనా వేసింది. రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్ రూపొందించడానికి దగ్గరగా ఉన్నట్లు ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇది త్వరలోనే రోగులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ‘‘మేము కొత్త తరానికి చెందిన క్యాన్సర్ వ్యాక్సిన్లు మరియు ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ అని పిలవబడే వ్యాక్సిన్‌కి చాలా దగ్గరగా వచ్చాము’’ అని ఆయన అన్నారు. అయితే, ఈ ప్రతిపాదిత వ్యాక్సిన్ ఏమే క్యాన్సర్లను లక్ష్యంగా చేసుకుంటుందో చెప్పలేదు. 2024లో పలు దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం చాలా ఉంది. అప్పులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరడం వంటి వాటి కారణంగా జపార్, యూకే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. జపాన్ ఆర్థిక వ్యవస్థ గత రెండు త్రైమాసికాల్లో కుచించుకుపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023 చివరి మూడు నెలల్లో దేశ జీడీపీ 0.4 శాతం తగ్గింది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్, జర్మనీ తర్వాత 4వ స్థానానికి పడిపోయింది. ఇక యూకే గత ఏడాది చివర్లో మాంద్యంలో కూరుకుపోయింది.
బాబా వంగ జోస్యాలు:
*యూరప్ ఉగ్రదాడుల గురించి హెచ్చరించింది.
*వచ్చే ఏడాది ‘‘పెద్ద దేశం’’ జీవ ఆయుధ పరీక్షలు లేదా దాడులు నిర్వహిస్తుందని సూచించింది.
* ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భయంకరంగా మారుతాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.
* సైబర్ దాడులు గురించి అంచనా వేశారు. పవర్‌గ్రిడ్స్, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటారు. జాతీయ భద్రతకు ముప్పు
* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సొంత దేశస్థుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆమె అంచనా వేసింది.
* క్వాంటం కంప్యూటింగ్‌లో అతిపెద్ద పురోగతిని అంచనా వేసింది.
*రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవెల్నీ జైలులో మృతి..
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ జైలులో మరణించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించే వ్యక్తిగా నవల్నీకి గుర్తింపు ఉంది. రష్యాలోని ఆర్కిటిక్ జైలు కాలనీలో 19 ఏళ్లపాటు శిక్షను అనుభవిస్తున్న నవల్నీ శుక్రవారం మరణించినట్లు రష్యా ఫెడరల్ పెనిటెన్షియల్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. నడక తర్వాత నవల్నీ అసౌకర్యానికి గురయ్యాడని, వెంటనే స్పృహ కోల్పోయాడని, సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేదని, తర్వాత అతను చనిపోయారని తెలిపింది. 47 ఏళ్ల అలెక్సీ నవల్నీ రష్యాలో ప్రముఖ ప్రతిపక్ష నేత. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి ఎదురుతిరగడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా ఒక్కసారిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. నవల్నీ మరణం గురించి క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్, అధ్యక్షుడు పుతిన్‌కి తెలియజేశారు. ఆగస్ట్ 2020లో సైబీరియాలో విష ప్రయోగం జరిగినట్లు గతంలో నవల్నీ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు తనను చంపేందుకు ప్రయత్నించాడని చెప్పాడు.