*వాలంటీర్లే నా సైన్యం.. వారే కాబోయే లీడర్లు..
ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు. టీడీపీని అధికారంలో నుంచి దింపడానికి జన్మభూమి కమిటీలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారంటూ ఆయన మండిపడ్డారు. జన్మభూమి కమిటీ, సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందని.. పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆసుపత్రులు మారాయని సీఎం పేర్కొన్నారు. మీరు వాలంటీర్లు కాదు.. సేవా హృదయాలు అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశంసలు గుప్పింటారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సిందేనని.. గతంలో ప్రతీ పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రైతులు, అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు తోడుగా వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఆర్‌బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉందని.. వాలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారని సీఎం చెప్పారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని.. గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ.. “గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. మన పథకాలకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు. వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వాలంటీర్లకు సత్కారం. సేవావజ్రాలకు రూ. 30 వేల నుంచి రూ. 45 వేలకు పెంపు. సేవారత్నలకు రూ. 20వేల నుంచి రూ.30 వేలకు పెంపు. సేవా మిత్రలకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంపు. 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న.. 2,50, 439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం చేస్తున్నాం. లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు. మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం.” అని సీఎం జగన్ తెలిపారు.
*విద్యావ్యవస్థకు కొత్త రూపురేఖలు తీసుకొస్తాం
త్వరలోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగ నియామకాల విషయంలో పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీలో కూడా నియామకాలు చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంటే.. మామా అల్లుళ్లు (కేసీఆర్, హరీశ్‌రావు) మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని చెప్పుకొచ్చారు. నువ్వు రాజీనామా చెయ్ తాను చేసి చూపిస్తానంటూ హరీశ్‌రావు అంటున్నారన్నారు. హరీష్ రావును చూస్తుంటే మరో ఔరంగజేబులా కనిపిస్తున్నారని.. అధికారం కోసం సొంత వాళ్లపైనే కర్కశంగా ప్రవర్తించిన చరిత్ర ఔరంగజేబుదని గుర్తుచేశారు. పదేళ్లు మంత్రిగా ఉండి హరీశ్‌రావు ఏం చేశారు? అని సీఎం నిలదీశారు. మేడిగడ్డపై చర్చకు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం ద్రోహం చేశారో ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలని సూచించారు. 3,650 రోజులు అధికారంలో ఉండి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లో 25 వేల ఉద్యోగాల నియామకాలు చేపట్టామని.. ఇది మీ కళ్లకు కనిపించడం లేదా? అని రేవంత్‌రెడ్డి అడిగారు.
బీఆర్‌ఎస్ పాలనలో తండాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న 6,450 సింగిల్ టీచర్ పాఠశాలలు మూసేశారని తెలిపారు. పేదలకు విద్యను దూరం చేయాలనే కుట్రతోనే గత ప్రభుత్వం పాఠశాలలు మూసేసిందని ఆరోపించారు. త్వరలో మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టి పేదలకు విద్య అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గురుకుల పాఠశాలలన్నీ ఒకే గొడుకు కిందకు తీసుకొస్తామని ప్రకటించారు. 20 ఎకరాల్లో ఒకే క్యాంపస్‌లో అన్ని రకాల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కొడంగల్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామని.. ఈ మోడల్‌ను అన్ని నియోజకవర్గాల్లో ఆచరణలోకి తీసుకొస్తామని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో దీనికి కావాల్సిన స్థలాలను సేకరించాలని అధికారులకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
*రేపటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం రేపటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయనున్నారు.
*మోడీ చొరవతోనే కొమురవెల్లి రైల్వేస్టేషన్ నిర్మాణం
కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం మల్లన్న పాదాల చెంత రైల్వే స్టేషన్ నిర్మించాలని ప్రధాని మోడీ (PM Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. రైల్వే స్టేషన్ నిర్మాణానికి సహకరించిన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కొమురవెల్లి కొండ ప్రాంతం కాబట్టి చుట్టు ప్రక్కల ఏటవాలుగా ఉండటం వల్ల స్టేషన్ నిర్మాణానికి అనుకూలంగా లేదని గతంలో నివేదిక ఇచ్చారు. ప్రధానమంత్రిని చాలాసార్లు కలిసి కొమురవెల్లి మల్లన్న స్వామి విశిష్టత వివరించాను. వెంటనే మోడీ.. రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కి రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం మోడీ కృషితో ఈరోజు రైల్వేస్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసుకున్నాం.’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘‘గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వేల విషయంలో చాలా వివక్ష చూపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేల అభివృద్ధి కోసం అనేక లైన్ల నిర్మాణాలు చేపట్టారు. సుమారు 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాం. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్, రూ.450 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్, కొత్తగా చర్లపల్లి రైల్వే టర్మినల్ నిర్మాణం చేసుకుంటున్నాం. గత యూపీఏ పాలనలో తెలంగాణ రైల్వే బడ్టెట్ రూ.251 కోట్లు… నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు రూ.6వేల కోట్లకు పెంచారు. గత తొమ్మిదేళ్లలో రూ. 30 వేల కోట్ల రూపాయలు తెలంగాణ రైల్వే కోసం ఖర్చు పెట్టారు.’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మొట్టమెదటిసారిగా మెదక్ రైల్వే స్టేషన్‌ను నేనే ప్రారంభించాను. సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రైల్వే లైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రూ.26 వేల కోట్లతో నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్‌ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ల్యాండ్ కోసం రూపాయి ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే తొందరలోనే రీజినల్ రింగ్ రోడ్ పూర్తవుతుంది. రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత 8, 9 జిల్లాలను కలిపే రింగ్ రైల్వే లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తాం.’’ అని వెల్లడించారు. ‘‘సిద్దిపేట-మనోహరబాద్ రైల్వే లైన్ ద్వారా రైతుల ఉత్పత్తులను సరఫరా చేస్తాం. కొమురవెల్లి రైల్వే స్టేషన్ నుంచి దేవాలయం వరకు పక్కా రోడ్డు నిర్మాణం చేయబోతున్నాం. టికెట్ బుకింగ్ కౌంటర్, వెయిటింగ్ హాల్ నిర్మిస్తాం. ఫ్రీ వైఫై కూడా అందిస్తాం. మల్లిఖార్జున స్వామి పాదాల చెంత అత్యంత ఆధునికంగా రైల్వే స్టేషన్ నిర్మించుకుంటున్నాం.’’ అని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పూజలు చేశారు.
*తప్పతాగి సింహంతో గేమ్స్ ఆడబోయాడు.. చివరికి..!
తిరుపతి జూపార్క్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతుడు ప్రహ్లాద్ గుర్జార్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు తేలింది. సింహం తలను ముట్టుకుంటానని, అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగినట్లు తెలిసింది. వారు ఎంతకు అనుమతించకుండా ప్రహ్లాద్ గుర్జార్‌ను బయటకు పంపించివేశారు. అతడు బయటకు వెళ్లినట్లే వెళ్లి సెక్యూరిటీ సిబ్బంది సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సింహం అతడిపై దూకి చంపేసింది. అయితే రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి టిక్కెట్ కొని బస్సులో తిరుపతి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్‌లోకి అతను దూకినట్లు భావిస్తున్నారు జూ పార్క్ అధికారులు. మగసింహం అతడిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. లయన్ సఫారీకి వచ్చిన సందర్శకులు సింహం దాడిని గుర్తించి పెద్దగా కేకలు వేయడంతో అధికారులు స్పందించిన సింహాన్ని బోన్‌లోకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డెడ్ బాడి పోస్టు మార్టమ్ నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
*ప్రజలపై పన్నుల భారం మోపం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల అమలుకు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ గురించి కావాల్సిన నిధులను సమకూరుస్తున్నామన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్లం.. ఒక ప్రాంతం, ఏరియా అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్లం కాదని భట్టి స్పష్టం చేశారు.గత ప్రభుత్వం దళిత బంధుకు రూ.17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం కోసం విధి విధానాల రూపకల్పన చేస్తున్నామని.. మార్గదర్శకాలు పూర్తి కాగానే నిధుల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధన్యత ఇస్తుందన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని భట్టి పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రక్రియకు కావాల్సిన నిధులు విడుదల చేస్తామన్నారు. కొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని… ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ను పాటిస్తామని హామీ ఇచ్చారు. మనుషులపై కుక్కల దాడులు పెరిగిపోతున్నాయని.. దీనిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెటర్నరీ అధికారులతో యాక్షన్ ప్లాన్ తయారు చేయిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్రూమ్ అలాట్‌మెంట్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి వెల్లడించారు. పేరుకుపోయిన గత బకాయిలను ఆర్థిక శాఖ క్లియరెన్స్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పాత బస్తీలో మూడు ఫ్లై ఓవర్ల నిర్మాణం కూడా త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రానికి ధరణి గుది బండగా మారిందని.. దీనిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రెవెన్యూ వ్యవస్థను కూడా నాశనం చేశారని… ప్రక్షాళన చేసి సరి చేయడానికి కమిటీ వేశామని చెప్పారు. కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ధనిక రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకున్నారు.. మరీ 2018 నుంచి విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఎందుకు క్లియర్ చేయలేదని భట్టి నిలదీశారు.
*ముగిసిన రెండు విదేశీ పర్యటనలు.. భారత్‌కు పయనం
ప్రధాని మోడీ (PM Modi) విదేశీ పర్యటనలు ముగించుకుని భారత్‌కు బయల్దేరారు. ఖతార్ నుంచి ఆయన ఇండియాకు పయనం అయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోనున్నారు. రెండు దేశాల పర్యటన కోసం ఈనెల 13న యూఏఈలోని అబిదాబికి వెళ్లారు. అక్కడ మంగళ, బుధవారాల్లో ఆయా కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు. 13న యూఏఈతో భారత్ పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అనంతరం ఓ స్టేడియంలో జరిగిన సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక ఈనెల 14న అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని మోడీ ప్రారంభించారు. ఇలా యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించి అనంతరం ఖతార్‌కు చేరుకున్నారు. గురువారం ఖతార్‌లో మోడీ పర్యటించారు. ఆ దేశాధినేతలతో మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఆర్థిక సహకారం, పెట్టుబడులు, ఇంధన భాగస్వామ్యం, అంతరిక్ష సహకారం, పట్టణ మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక బంధాలు మరియు ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఖతార్‌లో 8 లక్షలకు పైగా బలమైన భారతీయ సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు అమీర్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్‌తో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ప్రధాని తెలియజేశారు. త్వరగా భారత్‌కు రావాల్సిందిగా అమీర్‌ను మోడీ ఆహ్వానించారు. గల్ఫ్ ప్రాంతంలో విలువైన భాగస్వామిగా భారతదేశం యొక్క పాత్రకు అమీర్ ప్రశంసలు తెలిపారు. ఖతార్ అభివృద్ధిలో శక్తివంతమైన భారతీయ కమ్యూనిటీ యొక్క సహకారాన్ని మరియు ఖతార్‌లో జరిగిన వివిధ అంతర్జాతీయ కార్యక్రమాలలో వారు ఉత్సాహంగా పాల్గొనడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
*జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలపై తీర్పు రిజర్వ్
జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు. కేసు విచారణ పూర్తైందని, కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని నఖ్వీ వెల్లడించారు. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ ఫిబ్రవరి 2న హైకోర్టును ఆశ్రయించింది. అంతకుముందు జనవరి 31న మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌లో పూజలు నిర్వహించుకోవచ్చని వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి ముందు, జ్ఞానవాపి మసీదు పూర్తిగా సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని వారణాసి కోర్టు కోరింది. ఏఎస్ఐ పరిశోధనలో మసీదుకు పూర్వం అక్కడ పెద్ద ఆలయం ఉండేదని తేలింది. మసీదు లోపలి భాగాల్లో హిందూ దేవీదేవతలకు సంబంధించిన గుర్తులు, తెలుగు, కన్నడ భాషలకు చెందిన పలు శాసనాలు లభించినట్లు ఏఎస్ఐ తన నివేదికలో పేర్కొంది. ముందుగా ఉన్న ఆలయ నిర్మాణాలను మసీదు నిర్మాణానికి వాడారని, మొత్తం 34 శాసనాలు దొరికాయని, వాటిలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర పేర్లు కనిపించాయని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికను ఉటంకిస్తూ వెల్లడించారు.
*బ్రేకింగ్.. ప్రముఖ డీవోపీ సెంథిల్ భార్య మృతి
ప్రముఖ డీవోపీ సెంథిల్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కొద్దిసేపటి క్రితమే మృతిచెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ మరియు రూహీ 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. ఆమె చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి పనిచేసింది. COVID-19 నుండి రూహీకి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అప్పటినుంచి ఆమె చికిత్స తీసుకుంటూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నేడు, రూహీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమె ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలుపుతున్నారు. రూహీ మరణం పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. సెంథిల్ కుమార్ భార్యకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇక సెంథిల్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర నుంచి బాహుబలి వరకు ఆయనే డీవోపీగా పనిచేశారు. ఇక ఆయన వర్క్ కు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే ప్రేమించే భార్యను పోగొట్టుకోవడం ఎంతో పెద్ద విషాదమని చెప్పాలి. ఈ జంటకు ఇద్దరు కుమారులు. ఇక పలువురు ప్రముఖులు.. ఆయనకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పుకొస్తున్నారు.