*నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని పోలీసు ఉన్నతాధికారులను వెల్లడించారు. తన కోసం ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తన కాన్వాయ్‌ను తీసుకెళ్లాలని ఆయన సూచించారు. సాధారణ ట్రాఫిక్ లోకి తన కాన్వాయ్‌ను అనుమతించాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రేపటి నుంచి జనరల్ ట్రాఫిక్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ తీసుకెళ్లేలా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
*వెంటనే పోలీస్ నియామకాలు చేపట్టండి- సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలపై నేడు డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తాతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నానరు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు, పాట్లను అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్, క్రింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలని సీఎం చెప్పారు. ఉత్తర, దక్షణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకై తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. పోలీస్ శాఖలో గత ఏడెనిమిదేళ్ళుగా హోమ్ గార్డుల నియామకాలు లేవని, పోలీస్ శాఖలో మరింత సమర్థవంతంగా సేవలు ఉపయోగించుకునేందుకై వెంటనే హోమ్ గార్డుల నియామకాలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి తెలిపారు. హోమ్ గార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కు హోమ్ గార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
*మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. కేబినెట్ కీలక నిర్ణయాలు
మరింత మెరుగైన ఫీచర్స్‌తో ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపడుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన ఆరోగ్య శ్రీ కొత్త కార్డుల పంపిణీ చేపడతామన్నారు. ఆరోగ్య శ్రీ విషయంలో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో జబ్బున్న వాళ్లను జల్లెడ వేసి పట్టామని.. ఆరోగ్యశ్రీ అవగాహన, ప్రచార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందే వారికి రవాణా ఖర్చుల కింద రూ. 300 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన వారికి మందులను డోర్ డెలివరి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైద్యారోగ్య రంగంలో వివిధ స్ఖాయిల్లో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఏడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ ఉంటుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ కూడా పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. జనవరి 10 నుంచి 23 వరకు మహిళలకు ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు. జనవరి చివరి నుంచి చేయూత కార్యక్రమం ఉంటుందన్నారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రూ. 3 వేల మేర వృద్ధాప్య ఫించన్ ఇస్తామని మంత్రి వెల్లడించారు. వచ్చే నెల 8వ తేదీ వరకు పెన్షన్ పంపిణీ చేపడతామన్నారు. ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు. “ఇకపై ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం మెరిటైం బోర్డు పరిధిలోకి తెస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. కుల, ఆదాయ ధృవపత్రాల జారీలో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం. సెల్ఫ్ డిక్లరేషన్ మీద కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీకి కేబినెట్ ఆమోదం.” తెలిపిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు.
కేబినెట్‌లో కీలక నిర్ణయాలు..
*సామాజిక పెన్షన్‌లను రూ. 2,750 నుంచి రూ. 3,000 వేలకు పెంపు
*ఆరోగ్యశ్రీలో పేదలకు రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యం
*90 శాతం కుటుంబాలకు ఆరోగ్య శ్రీ సేవలు
*ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ
*విశాఖలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం
*ఆరోగ్యశ్రీపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశం
*జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు మంత్రివర్గం ఆమోదం
*కుల, ఆదాయ ధ్రువీకరణాల పత్రాల మంజూరులో సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
*కోర్టుల్లో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపు
*యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పనిచేసే టీమ్స్‌కు 15శాతం అలవెన్స్ పెంపు
*51 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రాలో 31 లక్షల మంది రిజిస్ట్రేషన్
*కేబినెట్ సబ్‌కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ఆమోదం
*ఆడుదాం ఆంధ్రా బ్రాండ్ అంబాసిడర్‌గా అంబటి రాయుడు
*చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై పేర్ని నాని ఫైర్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు. 175 సీట్లకు 175 సీట్లు గెలవడానికి జగన్ అన్ని ఏర్పాట్లు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారన్నారు. మేము వద్దనుకున్న నలుగురు రెడ్లను చేర్చుకున్నావు, ఒక రాజు గారిని కౌగిలించుకున్నావంటూ చంద్రబాబును ఉద్దేశంచి వ్యాఖ్యానించారు. జగన్ వేసే రాజకీయ ఎత్తుగడలకు చంద్రబాబుకి షాకులు తగులుతున్నాయన్నారు. చంద్రబాబు శవాల మీద పేలాలు ఏరుకునే రకమని.. కొత్తగా వైసీపీ ఎమ్మెల్యేల మీద చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. గోతికాడ నక్కలా వైసీపీ ఎమ్మెల్యేల కోసం ఎదురు చూస్తున్నాడన్నారు. చంద్రబాబుకి రాజకీయాల్లో కుక్క చావు తప్పదన్నారు. మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.పవన్‌కి వైసీపీ, జగన్‌ను ఓడించడం మాత్రమే ధ్యేయమని, ఏపీ ప్రజల అభివృద్ధి, బాగోగులు పవన్‌కు అక్కర్లేదన్నారు. జగన్‌ను ఓడించి చంద్రబాబుకి అధికారం కట్టబెట్టడం పవన్ ధ్యేయమని, చంద్రబాబు రాజకీయ మనుగడే పవన్ లక్ష్యమని విమర్శించారు. పవన్ జనసేన అనే టెంట్ హౌజ్ పార్టీ పెట్టాడని 4 ఏళ్ల క్రితం చెప్పానన్న ఆయన.. చంద్రబాబుకు పవన్ తన టెంట్ హౌజ్ పార్టీనీ లాంగ్ లీజ్‌కి ఇచ్చాడని విమర్శలు గుప్పించారు. పవన జీవనం అంతా పరాయి రాష్ట్రంలో ఓటు అక్కడే , గాలి పీల్చడం అక్కడే, ఆస్తులు అక్కడే.. రాజకీయాలు మాత్రం పవన్ ఏపీలో చేస్తాడన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ.. “నేను, జగన్ చచ్చినా మా శవాలు ఏపీలోనే పాతిపెడతారు. పవన్ కళ్యాణ్ కానీ చంద్ర బాబు కానీ ఎందుకు వారు అధికారంలో ఉన్నపుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్ట్ కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ,ఎందుకు నిర్మించలేదు. మా కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు, అప్పులు తెచ్చారు అవన్నీ ఏమయ్యాయి… పవన్ కి వున్న ఒకే ఒక ఆరాటం చంద్రబాబుకు అధికారం కట్టబెట్టాలి.” అని పేర్ని నాని పేర్కొన్నారు.
*కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ.. మిచౌంగ్ తుఫాన్ నష్టం అంచనాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తుఫాన్ , కరువులపై పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందాలు భేటీ అయ్యాయి. సీఎంతో తుఫాన్, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు అధికారుల బృందాలు సమావేశమై.. క్షేత్ర స్థాయిలో తాము గుర్తించిన అంశాలపై చర్చించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించామంటూ తాము చూసిన పరిస్థితులను కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించ గలిగారని కేంద్ర బృందం తెలిపింది. సచివాలయాల రూపంలో గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ఆ బృందాలు పేర్కొన్నాయి. .విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని వెల్లడించింది. ఇ-క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపింది. ఇవి ఇతర రాష్ట్రాలూ అనుసరించ దగ్గవని, ఆయా ప్రభుత్వాలకు తెలియజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. తుఫాను వల్ల జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ సమావేశంలో కేంద్ర కమిటీ చర్చించింది. తాము పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం అధికారులు వివరించారు. మొత్తంగా ఏడు జిల్లాల్లో తిరిగామని.. మూడు బృందాలుగా జిల్లాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితులపై పరిశీలన చేశామని కేంద్ర బృందం తెలిపింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించామని సభ్యులు తెలిపారు. వర్షాభావం కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించామనీ, స్థానిక రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నామని వారు వివరించారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశువులు, తాగునీరు తదితర అంశాలపై చర్చించారు. జలవనరులు పరిస్థితి, రిజర్వాయర్లలో నీటిమట్టాల పరిస్థితిని చూశామని వెల్లడించారు. ఉపాధిహామీ పథకంపైనా పరిశీలన చేశామని ఆ బృందం తెలిపింది. ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, డీబీటీ పథకాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, కంటిజెన్సీ కింద విత్తనాలు పంపిణీ, మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు, గ్రామ సచివాలయాల వ్యవస్థలను పరిశీలించారు. ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయని వారు వెల్లడించారు. కౌలు రైతులకు ఎక్కడా లేని విధంగా రైతు భరోసా అందించడం అభినందనీయమని కేంద్ర బృందం పేర్కొంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రైతుల్లో అవగాహన కల్పించాలని.. పెసలు, మినుములు, మిల్లెట్స్ లాంటి ఇతర పంటల వైపు మళ్లేలా చూడాలని కేంద్ర బృందం సూచించింది. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అధికారులు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పని దినాల పైనా కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరాలు తెలిపారు. పెండింగులో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులు వెంటనే వచ్చేలా చూడాలని రాష్ట్ర అధికారులు కోరారు. తుఫాను కారణంగా రంగు మారిన, తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు.
కేంద్ర బృందంతో సీఎం వైయస్.జగన్..
తుపాను బాధిత ప్రాంతాల్లో తీసుకున్న చర్యలను వివరించిన సీఎం జగన్ కేంద్ర బృందానికి వివరించారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించమే కాకుండా వారికి తక్షణ సహాయాలను కూడా అందించామని సీఎం తెలిపారు. తుఫాన్ ఏదో ఒక ఒక ప్రాంతంలో సహజంగా తీరం దాటుతుందని, కానీ ఈ తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైందని సీఎం వివరించారు. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయని సీఎం వెల్లడించారు. .ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుఫాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోందని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలో ఇ- క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ఉందని, నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామని సీఎం వివరించారు. ఎవరైనా నష్టపోయిన రైతు పేరు లేకుంటే వెంటనే దాన్ని సరిదిద్దేలా అత్యంత పారదర్శకత వ్యవస్థను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. రైతులను తుదివరకూ ఆదుకునేలా వ్యవస్థలు రాష్ట్రంలో ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. దీనివల్ల రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా రైతులకు చేరుతుందని సీఎం జగన్ వివరించారు. . క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆమేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలని సీఎం కేంద్ర బృందాన్ని కోరారు.
*మైనర్‌పై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకి 25 ఏళ్ల జైలు శిక్ష
మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన అభియోగాలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎమ్యెల్యేకి శిక్ష ఖరారైంది. తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2014లో ఈ నేరం జరిగింది. బాధితురాలి సోదరుడు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. అయితే కుటుంబంపై ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డాడు. సోన్‌భద్ర జిల్లాలోని దుద్ధి నియోజకవర్గానికి చెందిన గిరిజన ఎమ్మెల్యే రామ్‌దులారే గోండ్‌కి శుక్రవారం ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. 2014లో దుద్ధి నియోజకవర్గంలోని ఓ గ్రామపంచాయతీకి గోండ్ భార్య పెద్దగా ఉండేది. గోండ్ తన భార్య పదవిని ఆసరాగా చేసుకుని రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించాడు. నవంబర్ 4, 2014న బాలికపై గోండ్ అత్యాచారానికి పాల్పడగా.. మైయోర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. గోండ్ గతేడాది బీజేపీ టికెట్టుపై దుద్ది నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. దీంతో అతని కేసు సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. కోర్టు మంగళవారం ఇతడిని దోషిగా ప్రకటించగా.. ఈ రోజు శిక్ష విధించింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం(పోక్సో) పాటు, అత్యాచారం, ఐపీసీ సెక్షన్ల కింద రాందులారే గోండ్‌ని దోషిగా కోర్టు నిర్దారించింది. తమకు న్యాయం జరగడానికి చాలా సమయం పట్టిందని, అయితే తీర్పుతో సంతోషిస్తున్నామని చెప్పారు. కేసు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే భయపెట్టినట్లు బాధితు కుటుంబం ఆరోపించింది. 25 ఏళ్లు జైలు శిక్ష పడటంతో ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం గోండ్ తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యాడు. 403 మంది సభ్యులు ఉన్న యూపీ అసెంబ్లీలో బీజేపీకి 254 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇతని అనర్హత పెద్దగా అధికారంపై ప్రభావం చూపకున్నా.. ప్రతిపక్షాల నుంచి బీజేపీ ఎదురుదాడి ఎదుర్కోనుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు లేదా అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడిన చట్టసభ సభ్యుడు అనర్హుడిగా ప్రకటించబడుతాడు.
*పార్లమెంట్ దాడి.. ప్రధాన సూత్రధారికి 7 రోజుల పోలీస్ కస్టడీ..
పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించి, దాడికి యత్నించిన కేసులో మాస్టర్ మైండ్‌గా చెప్పబడుతున్న లలిత్ ఝాకి ఢిల్లీ పాటియాల హౌజ్ కోర్టు 7 ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఢిల్లీ పోలీసులు పోలీసులు 15 రోజలు కస్టడీ కోరగా.. కోర్టు 7 రోజులకు పరిమితం చేసింది. ఈ దాడి ఘటనలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే పరారీలో ఉన్న లలిత్ ఝా గురువారం పోలీసులకు లొంగిపోయాడు. ఈ కేసులో పార్లమెంట్ లోపల ఘటనకు పాల్పడిన సాగర్ శర్మ, మనోరంజన్‌తో పాటు వెలుపల నీలందేశీ, అమోల్ షిండేను అరెస్ట్ చేశారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన నలుగురు నిందితులను గురువారం కోర్టు 7 రోజుల కస్టడీ విధించింది. వీరిపై ఉగ్రవాద వ్యతిరేక చట్టం USPA కింద అభియోగాలు నమోదు చేసింది. మరో నిందితుడు విశాల్ శర్మ అలియాస్ విక్కీని గురుగ్రామ్‌లోని అతని ఇంటిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. విప్లవ భావజాలం కలిగిన వీరంతా దేశం దృష్టిని ఆకర్షించేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. దీంతో పాటు ఒకవేళ ప్లాన్-ఏ విఫలమైతే, ప్లాన్-బీకి పాల్పడేందుకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. రైతులు నిరసన, మణిపూర్ అంశం, నిరుద్యోగం వంటి సమస్యలతో కలత చెందడంతో ఈ దాడికి పాల్పడినట్లు నిందితులు పేర్కొన్నారు.
*ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మకి చెక్..
ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కి కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మను పక్కన పెట్టింది. వారసత్వ నిర్మాణంలో భాగంగా, భవిష్యత్తు తరాన్ని సిద్ధం చేసేందుకే ఎంఐ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న టీంగా ముంబై ఇండియన్స్‌కి పేరుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ టీంలో ఉండగా.. ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఇప్పుడు అతడికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించబోతోంది. అయితే రోహిత్ శర్మ భవితవ్యం ఎంటనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ని హార్దిక్ పాండ్యా లీడ్ చేయనున్నారు. ముంబైకి పదేళ్ల పాటు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించారు. ఆయన సారధ్యంలో ముంబై జట్టు ఏకంగా 5 ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. మరోవైపు కొత్త జట్టుగా వచ్చిన గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా, ఆడిన తొలి సీజన్ లోనే 2022 ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఏడాది రన్నరప్‌గా నిలిచింది.