కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.. ఈసారి కూడా మాదే విజయం
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీలో హీట్ పుట్టిస్తోంది.. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు అందాయి.. మొదట కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేస్తే.. ఆ వెంటనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.. అంశం ఒకటే అయినా.. ఎవ్వరి వైఖరి వారికి ఉంది.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ రాస్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లను తయారు చేయడంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్న ఆయన. వెన్నుపోటు పొడుస్తారు, ఎన్టీఆర్ ఫొటోకు దండ వేస్తారని చంద్రబాబుపై మండిపడ్డారు. 2015, 2016, 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయో, మా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఏ రకంగా తొలగించారో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరంగా తెలియజేశామని తెలిపారు సాయిరెడ్డి.. 60 నియోజకవర్గాల్లో ఎంత మేరకు దొంగ ఓట్లు ఉన్నాయో తెలియజేశాం. చంద్రబాబ హయాంలో నమోదైన దొంగ ఓట్లు తొలగిస్తారేమోననే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చారని విమర్శించారు. సాక్ష్యాలతో సహా వివరాలను అందజేశాం. అన్ని నియమ. నిబంధనలను ఏ రకంగా చంద్రబాబు దుర్వినియేగం చేశారో తెలియజేశామన్న ఆయన.. సర్వే సంస్థల ద్వారా చంద్రబాబు అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తున్న విషయం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశామని వెల్లడించారు. చంద్రబాబు ఏ మేరకు కులవాదో కూడా తెలియచేశాం. ఓటరది ఏ కులమో నమోదు చేసే పని చేస్తున్నారు. ఓటరు ఏ రాజకీయ పక్షమో కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇవన్నీ అభ్యంతరకర మైన అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
ఆమరణ నిరాహారదీక్ష దిగిన కేఏ పాల్..
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కాకుండా.. తన ప్రాణాలను సైతం విడిచేందుకు సిద్ధం అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమని కేంద్రం అధికార ప్రకటన చేయాలంటూ ముందుగానే డెడ్‌లైన్ విధించారు పాల్.. స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గకపోతే సోమవారం నుంచి ఆమరణనిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా ఈరోజు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు కేఏ పాల్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనే డిమాండ్‌తో పాల్ కన్వెన్షన్ సెంటర్‌లో దీక్షను మొదలుపెట్టారు.. ఇక, రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ విశాఖ నుంచి పోటీ చేస్తుందని ప్రకటించిన ఆయన.. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు పేర్కొన్నారు.. ప్రజాశాంతి పార్టీతో మిగిలిన రాజకీయ పార్టీలు కలిసి వస్తే.. ఉక్కు పరిశ్రమను కాపాడటం పెద్ద కష్టం కాదంటున్నారు కేఏ పాల్. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో.. ‘ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ ఆమరణ నిరాహారదీక్ష” అంటూ రాసుకొచ్చారు.
హైకోర్టుకు చేరిన టీటీడీ కొత్త పాలక మండలి వ్యవహారం..
టీటీడీ పాలకమండలి వ్యవహారం హైకోర్టుకు చే రింది.. టీటీడీ బోర్డ్ మెంబర్స్ నియామకాలు సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.. చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆ పిల్‌ను వేశారు.. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని టీటీడీ బోర్డులో నియమించడం మంచి పద్ధతి కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు.. బోర్డ్ మెంబర్లుగా క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్‌గా అత్యంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొని న్యాయాస్థానాల ద్వారా తొలగించబడిన కేతన్ దేశాయ్, లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి నియామకాలు సవాల్ చేస్తూ ఆ పిల్ దాఖలు చేశారు. ఇక, వెంటనే ఈ ముగ్గురిని టీటీడీ బోర్డ్ మెంబర్లుగా తొలగించాలని పిల్‌లో పేర్కొన్నారు పిటిషనర్.. టీటీడీ కోట్ల మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉందన్న పిటిషనర్.. ఇటువంటి నేరచరిత్ర, నీతిబాహ్యమైన కేసులు ఉన్నవారిని నియమించడం భావ్యం కాదన్నారు.. టీటీడీ ట్రస్టీలుగా నియమించబడినవారు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.. అయితే, ఈ పిల్‌పై బుధవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.. పిటిషనర్ తరుపున న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించనున్నారు. ఈ మధ్యే తిరుమల తిరుపది దేవస్థానం (టీటీడీ) పాలకమండలిని నియమించగా.. ఇప్పుడు ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో ఆసక్తికరంగా మారింది.
ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ కమ్యూనిటీ మంత్రిగా లేనిది ఈ విడతలోనే..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు.. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ.. ఎవరు దేనికి అర్హులో అదే వారికి వస్తుందన్నారు. అయితే, కమ్మవారు మంత్రిగా లేనిది ఈ విడతలోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 1952 నుంచి కమ్మ, రెడ్డి ఆధిపత్య పోరు ఉందన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీలో కులాల సమతౌల్యం ఉండేది.. ఇక, టీడీపీలో కమ్మవారికి అవకాశాలు ఎక్కువగా ఉండేవని గుర్తుచేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్. ఈ పుస్తకం చదివిన వారు నియోజకవర్గాల వారీగా కుల ప్రయోజనాలు తెలుస్తాయి తెలిపారు ఉండవల్లి.. మానసిక సెంటిమెంట్ వలనే బ్రాహ్మణ వ్యతిరేకత వచ్చిందని.. ఏపీలో యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ తెచ్చింది త్రిపురనేని రామస్వామి చౌదరి అన్నారు. ఓటును వెయ్యికి, రెండు వేలకి అమ్మేసుకుంటున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారం కోసమే రాజకీయమా..? అని ప్రశ్నించారు. చిరంజీవికి 16 శాతం ఓట్లు వచ్చాయి.. దేశంలోనే అత్యధిక ఓట్లు.. అయినా కాంగ్రెస్ పార్టీలో కలిపేశారని పేర్కొన్నారు. ఇక, ప్రపంచంలో భారతదేశ యువత లేని దేశం లేదన్న ఆయన.. ఏమైనా చేయగలిగిన ఆళ్లుండి చేయలేకపోతున్నాం అన్నారు. మరోవైపు.. ఎన్నికల్లో కులం ఆలోచిస్తే దెబ్బతినేదే ఎక్కువ ఉంటుందన్నారు ఉండవల్లి.. రెండే పార్టీలు ఉండాలి అనేది పోవాలంటే అందరికీ కనువిప్పు కలగాలన్నారు. ఇక, ఏపీలో టీడీపీ, బీజేపీ ఒకవేళ కలుస్తాయేమో.. అందుకే కలిసారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.. ఎన్టీఆర్‌పై వంద రూపాయల కాయిన్ ప్రారంభించడం మంచిదే.. కానీ, లక్ష్మీపార్వతిని పిలవకపోవడం కరెక్ట్ కాదన్నారు.. లక్ష్మీపార్వతి వల్లే బ్రతికానని చివరి రోజుల్లో రామారావు అన్నారని గుర్తుచేశారు. అయితే, పొలిటికల్ గా పొత్తులు సహజం.. వాటిపై మరోసారి మాట్లాడుతానన్నారు ఉండవల్లి అరుణుకుమార్.
డ్రగ్స్ కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైలుకు తరలింపు
పంజాబీ గాయకుడు-రాజకీయవేత్త సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు. రూ.195 కోట్ల డ్రగ్స్ కేసులో హై సెక్యూరిటీ వార్డుకు తరలించారు. ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్)కి అప్పగించబడటానికి ముందు, అతను ఢిల్లీలోని తీహార్ జైలులో ఉండేవాడు. గత ఏడాది సెప్టెంబర్ 14న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా.. గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ బాంద్రా సమీపంలో సముద్రం మధ్యలో పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ అద్వాలీని, సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ‘అల్ తయ్యాసా’ అనే బోటులో ఆరుగురు పాక్ జాతీయులను కూడా అరెస్టు చేశారు. ఇద్దరు ఢిల్లీకి చెందిన వ్యక్తులతో హెరాయిన్‌ను రోడ్డు మార్గంలో ఢిల్లీ, పంజాబ్‌లకు తరలించాలని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పంజాబ్ జైళ్లలో ఉన్న నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు స్మగ్లర్లు నడుపుతున్న రాకెట్‌లో భాగంగా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.
స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఎప్పుడు..?
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగ జరుపుకోవడంపై సందిగ్ధత కొనసాగుతుంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చే అంశంపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా డైలామాలో పడ్డాయి. సెప్టెంబర్ 19నే వినాయక చవితి నిర్వహిస్తామని హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ సమితీ ఇప్పటికే ప్రకటనను జారీ చేసింది. పండుగకు మరి కొన్ని రోజుల సమయం ఉన్నందున పలువురు పండితుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత సెలవులు ఇచ్చే విషయంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే, సెప్టెంబర్ 19వ తేదీనే సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగ, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని భాగ్యనగర్ వినాయక ఉత్సవ సమితి సభ్యులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇక, సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండగ రోజుగా గుర్తిస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది. కాబట్టి 19వ తేదీన వినాయక చవితి జరుపుతున్నామని వారు చెప్పారు. ఇక, గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం, అధికారులు చెప్పారని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గణేష్ పూజా విధానం తెలిపే బుక్ తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలని ఉత్సవ కమిటీ పేర్కొన్నారు. వినాయక మండపాలకు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి కాదని, స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పితే సరిపోతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పారు.. అయితే, గణేష్ పండగకు స్కూళ్లు, కాలేజీలకు ఏ రోజు సెలవులు ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
భారత్‌లో జీ20 సమ్మిట్ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోడీకి ఫోన్ చేసినట్లు తెలిసింది. న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్‌కు రాలేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ పాల్గొంటారని పుతిన్ తెలిపారు. రష్యా నిర్ణయంపై, భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందురు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్‌లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో విదేశాలకు వెళ్లినప్పుడు పుతిన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లే దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశాలకు పుతిన్ హాజరు కాలేదు. ఎందుకంటే ఐసీసీలో దక్షిణాఫ్రికా సభ్యదేశంగా ఉంది. దక్షిణాఫ్రికాకు వెళ్తే పుతిన్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆయన వీడియో లింక్ ద్వారా బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నారు.
నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు
ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. అయితే ఆమె ఎంత మంచి నటి అయినా కూడా ఇండస్ట్రీలో ఆమెను తాగుబోతుగానే చూస్తారు. మద్యానికి బానిసగా మారిన ఊర్వశి .. దానివల్లనే తన కెరీర్ ను నాశనం చేసుకుందని చెప్పుకొస్తారు. మద్యానికి బానిసలుగా మారి .. జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్స్ లో మొదట సావిత్రి ఉండగా .. ఆ తరువాత ఊర్వశి అని చెప్పుకొస్తారు. అంతలా ఆమె తాగుడుకు బానిసలా మారింది. ఆమె జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడి వల్లనే ఆమె ఇలా తాగుబోతుగా మిగిలిపోయింది. ఇప్పటివరకు ఈ విషయం చాలా తక్కువమందికి తెలుసు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్నీ వెల్లడించింది. “హీరోయిన్ గా స్టార్ హీరోలందరి సరసన నటించాను. ఆ సమయంలోనే నటుడు మనోజ్ కె. జయన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం.. ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. 2000 సంవత్సరంలో మాకు పెళ్లి అయ్యింది. వాళ్ళింట్లో అందరికి తాగుడు అలవాటు ఉంది. కుటుంబం మొత్తం కూర్చొని తాగేవారు. నేను వెళ్ళాక.. నన్ను కూడా తాగమని బలవంతం చేశారు. అలా నేను మొదటిసారి తాగాను. ఇక ఆ అలవాటు వ్యసనంలా మారింది. కొన్నేళ్ళకు ఆ వ్యసనం పేరు చెప్పి.. అతను నాకు విడాకులు ఇచ్చాడు. నా బిడ్డను నాకు కాకుండా చేశాడు. నేను ముందుకు బానిసగా మారాను అని, బిడ్డను సరిగ్గా పెంచలేవు అని.. నా కూతురు బాధ్యతను కూడా వారే తీసుకున్నారు. అదంతా చూశాకా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను .. ఒంటరిదాన్నిగా ఉండిపోయాను. ఆ సమయంలోనే నా ఫ్యామిలీ ఫ్రెండ్ శివ ప్రసాద్ నాకు అండగా నిలిచాడు. 40 ఏళ్ళ వయస్సులో నేను ఆయనను పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వయస్సులో పెళ్లి ఏంటి అని.. వాటిని నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నేను నా భర్త, కొడుకుతో సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం విజయ్ దేవరకొండ, సమంత కాంబో ఒకటైతే.. విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ చేయడం.. మరొకటి లైగర్ సినిమా తరువాత విజయ్ లవ్ స్టోరీ చేయడం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ, ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కవర్ చేసి వచ్చాడు. ఇక ఈ మధ్యనే వెకేషన్ నుంచి ఇండియాకి వచ్చిన సమంత కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రియల్ కపుల్ వర్సెస్ ఖుషీ టీమ్ ఒక ఇంటర్వ్యూ చేసింది. సుమ కనకాల, రాజీవ్ కనకాల హోస్టులుగా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో సమంత గురించి విజయ్ దేవరకొండ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. సమంత చాలా చీట్ చేస్తుందని తనెప్పుడూ అలా చీట్ చేస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. ” నాకు సామ్ మీద ఎంత గౌరవం అంటే.. ఒక ఇన్సిడెంట్ లో సామ్ ఇంటిలిజెన్స్ తెలిసింది. నేనే ఇంటెలిజెంట్ అని నా ఫీలింగ్.. అస్సలు బోర్డు గేమ్స్ లో సామ్ ఎంత చీట్ చేస్తుంది అంటే.. అన్ని ఒప్పుకొనేలా ఉంటాయి.. ఛీఛీఛీ.. ఎంత చీటింగ్ అంటే.. అని అంటున్న విజయ్ ను ఆపి వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. విజయ్.. ముందు ప్రాక్టీస్ చేసి.. బిగినర్స్ తో ఆడతాడు అని చెప్పుకొచ్చాడు ఇక దీనికి విజయ్.. ప్రెస్ కూడా నన్ను ఇంత మిస్ రిప్రజెంట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
విజయ్ కొడుకు మామూలోడేమీ కాదు.. సైలెంటుగా ఆ పని కానిచ్చేశాడు!
అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ నమ్ముతుంటుందని ఇక మా బ్యానర్ లో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉందని అన్నారు. తను చెప్పిన యూనిట్ పాయింట్ నచ్చిందని అన్నారు. తను మా టీమ్ కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించిందని, తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్ లో స్పెషలైజేషన్ కోర్సులను చేయడం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణం పై పూర్తి అవగాహన ఉందని, ప్రతి ఫిల్మ్ మేకర్ కి ఇది ఉండాల్సిన లక్షణమని అన్నారు. ఇక డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ ”లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉందని, ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని కలిగించే విషయం అని అన్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్స్, సాంకేతిక నిపుణులు మా సినిమాకి పని చేయబోతున్నారని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుభాస్కరన్ కి థాంక్స్ చెప్పాడు. ఇది నాకెంతో ఎగ్జయిట్ మెంట్ తో పాటు పెద్ద బాధ్యత అని, ఇదే సందర్భంలో నాకెంతో సపోర్ట్ అందించిన తమిళ్ కుమరన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇక జాసన్ సంజయ్ విజయ్ టొరంటో ఫిల్మ్ స్కూల్ నుంచి ప్రొడక్షన్ డిప్లొమా (2018 -2020)ను కంప్లీట్ చేశారు, అలాగే లండన్ లో స్క్రీన్ రైటింగ్ లో (రెండేళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్) బి.ఎ. హానర్స్ (2020-2022)ను కంప్లీట్ చేశారని తెలుస్తోంది. ఇది తెలిసిన విజయ్ అభిమానులు సైలెంటుగా కోర్సులు చేసేసి భలే షాకిచ్చాడు గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.