చేవెళ్లలో ప్రజా గర్జన సభ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ కసరత్తు
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఏ విదంగా ఇబ్బంది పడ్డారు.. అమలు కానీ హామీలు, మోసాలు అన్ని ఛార్జ్ షీట్ రూపంలో జనంలోకి తీసుకెళతామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు గ్రామ గ్రామాన వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. అదే విదంగా కేంద్ర సర్కారుపై కూడా మరో ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అదానీ, అంబానీల ఆస్తులు పెంచడానికి మోడీ చేసిన పనులు ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయనే దానిపై ప్రశ్నిస్తామని తెలిపారు. ఇక, ఈనెల 26 న చేవెళ్ల సభపై కూడా చర్చించాం.. చేవెళ్లలో ప్రజా గర్జన పేరుతో బహిరంగ సభ ఉంటది.. ఆ సభకు ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే వస్తున్నారు.. ఈ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేస్తామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు. రాహుల్ గాంధీ పాద యాత్రకు వస్తే.. ఎంతో కష్టపడి పని చేశా.. కులాల వారీగా సమస్యలపై రాహుల్ గాంధీ కనెక్ట్ అయ్యారు అని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ పాదయాత్రతోనే నా పేరు కూడా నోటెడ్ అయ్యిందన్నాడు. అబద్దపు ప్రచారం చేయడంతో నాకు చాలా బాధ అనిపిస్తుందని జగ్గారెడ్డి అన్నారు. ఎన్నో కష్టాలు పడి లీడర్ అయ్యా.. అనేక ఒడి దుడుకులు పడి వచ్చా.. ప్రజల మధ్య గడుపుతున్నాం.. ఫీల్డ్ లీడర్స్ మేము.. నన్ను బీఆర్ఎస్ లోకి రావద్దని హరీష్ రావు దగ్గర చెప్పిన వాళ్లంతా నా దగ్గర పెరిగిన వాళ్లే అని ఆయన అన్నారు. నాది జాలి గుండె బతుకుతా అంటే.. పో అని చెప్పినా.. ఇది ఫైనల్.. మళ్ళీ మళ్ళీ నాకు రాజకీయ శిల పరీక్ష పెట్టొద్దు అని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చాడు. నా రాజకీయ ప్రయాణం.. రాహుల్ గాంధీ తోటేనని తెలిపాడు.
ఉల్లి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు.. భారీగా వడ్డన విధింపు
దేశ వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్లకు కన్నీళ్లు తెప్పించేందుకు ఉల్లిపాయ సిద్ధమైంది. ఉల్లి ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతిపెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరున్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లిపంట దెబ్బతిన్నది. దీంతో ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో చాలినంత ఉల్లి అందుబాటులో ఉండట్లేదు. అంతేకాకుండా ఉల్లి రేట్లు క్రమంగా పెరుగుతోన్నాయి. ప్రస్తుతం కేజీ ఉల్లి 50 నుంచి 60 రూపాయలు ఉండగా.. మున్ముందు ధర మరింత పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. దేశంలో ఉల్లి ధరలు పెరిగే సూచనలు కనిపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి ధరలను నియంత్రించడానికి తక్షణ చర్యలను చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై భారీగా వడ్డన విధించింది. ఉల్లి ఎగుమతులపై వసూలు చేస్తోన్న పన్ను మొత్తాన్ని భారీగా పెంచింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. ఈ నిబంధన డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఉల్లి ధరలు సెప్టెంబరులో పెరిగే అవకాశముందనే నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ అరెస్ట్
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వైస్ ఛైర్మన్ షా మహమూద్ ఖురేషీని శనివారం అరెస్టు చేశారు. ఖురేషీని ఇస్లామాబాద్‌లో అరెస్టు చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుండి తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నుంచి ముప్పు ఉందని పీటీఐ ఆరోపించిన ‘దౌత్యపరమైన కేబుల్ సాగా – సైఫర్’ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఖురేషీని ఇస్లామాబాద్ నివాసం నుండి కస్టడీలోకి తీసుకుంది. గతేడాది ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2022 మార్చి నెలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒక లేఖని చూపిస్తూ.. అమెరికా మద్దతుతో తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ పన్నుతున్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, ఇమ్రాన్‌పై తారాస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఆయన్ను తర్వాతి నెలలో, అంటే 2022 ఏప్రిల్‌లో కార్యాలయం నుంచి తొలగించారు. “పీటీఐ ఉపాధ్యక్షుడు షా మెహమూద్ ఖురేషీని మరోసారి అక్రమంగా అరెస్టు చేశారు’’ అని పార్టీ ఖాతాలో సోషల్ మీడియా పోస్ట్ చేసింది. భారీ పోలీసు బలగాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ పేర్కొంది. ఇస్లామాబాద్‌లోని ఇంటి నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. పీటీఐ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమర్ అయూబ్ ఖాన్ కూడా ఖురేషీ అరెస్ట్ వార్తను ట్విటర్‌లో పంచుకున్నారు. విలేకరుల సమావేశం అనంతరం ఇంటికి చేరుకున్న ఖురేషీని అదుపులోకి తీసుకున్నట్లు అయూబ్ తెలిపారు. “పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వైస్ ప్రెసిడెంట్ మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషీని ఇస్లామాబాద్‌లోని ఆయన ఇంటి నుండి 25 నిమిషాల క్రితం అరెస్టు చేశారు. ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ఇంటికి చేరుకున్నాడు” అని మర్ అయూబ్ ఖాన్ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. ఏడుగురు మృతి, 90 మందికి గాయాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. తాజా దాడిలో రష్యా ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఉక్రెయిన్‌లోని చారిత్రక నగరమైన చెర్నిహివ్‌లోని సెంట్రల్ స్క్వేర్‌ను రష్యా క్షిపణి ఢీకొనడంతో 6 ఏళ్ల చిన్నారితో సహా ఏడుగురు మరణించారని, 90 మంది గాయపడ్డారని అంతర్గత మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ క్షిపణి దాడి జరిగినప్పుడు మతపరమైన సెలవుదినాన్ని జరుపుకోవడానికి చర్చికి వెళ్తున్నారని, గాయపడిన వారిలో 12 మంది పిల్లలు, 10 మంది పోలీసు అధికారులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. చెర్నిహివ్ నగరం మధ్యలో ఓ ప్రాంతం ఈ రష్యన్ క్షిపణి దాడి జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రస్తుతం స్వీడన్ పర్యటనలో ఉన్నారు. అయితే టెలిగ్రామ్‌లో రష్యా దాడిని ఆయన ఖండించారు. క్షిపణి చెర్నిహివ్‌లో పడిపోయిందని అన్నారు. క్షిపణి దాడి చేసిన చోట పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయం, థియేటర్ కూడా ఉంది.జిట్‌లో ఉన్న ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసారు.
శ్రావణ మాసంలో నో నాన్‌వెజ్..! దాని వెనుక ఇంతక కథ ఉందా..?
శ్రావణ మాసాన్ని పవ్రితంగా భావిస్తారు.. ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. శ్రావణం రోజులలో శివుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం ద్వారా, అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఎపిసోడ్‌లో, చాలా మంది ప్రజలు వర్షాకాలం రాగానే పూర్తిగా సాత్విక రూపం తీసుకుంటారు. హిందూమతంలో, చాలా మంది ప్రజలు శ్రావణంలో ఆల్కహాల్ మరియు నాన్ వెజ్‌ని పూర్తిగా వదులుకుంటారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదు అని నమ్ముతారు. సరే, ఇది మతపరమైన దృక్కోణం, అయితే శ్రావణంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదని సైన్స్ కూడా సలహా ఇస్తుంది.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శ్రావణంలో సంతానోత్పత్తి నెలగా కూడా పరిగణించబడుతుంది. అంటే, చాలా జీవులు ఈ మాసంలో సంతానోత్పత్తి చేస్తాయి. అటువంటి పరిస్థితిలో.. గర్భాన్ని దాల్చిన జంతువులను మనం తెలియకుండా తీసుకుంటే, అది మన శరీరానికి చాలా తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది. సైన్స్ ప్రకారం, గర్భిణీ జంతువు యొక్క మాంసాన్ని తినడం వల్ల శరీరంలో హార్మోన్ల ఉత్పత్తికి భంగం కలుగుతంది.. ఇది చాలా చిన్న మరియు పెద్ద వ్యాధులకు దారితీస్తుంది. ఇక, ఈ సీజన్‌లో ఇన్‌ఫెక్షన్లు కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి, వర్షం మరియు తేమ కారణంగా, గాలిలో ఎక్కువ బ్యాక్టీరియా కనిపిస్తుంది. మరోవైపు, మీరు సైన్స్‌ను విశ్వసిస్తే, అంటు వ్యాధులు మొదట జీవులను తమ ఆహారంగా మార్చుకుంటాయి, అటువంటి పరిస్థితిలో, శ్రావణంలో నాన్-వెజ్ తినడం ద్వారా, అవి మిమ్మల్ని కూడా తమ గుప్పిట్లోకి తీసుకోవచ్చు. అందుకే ఈ సీజన్‌లో నాన్‌వెజ్ తినకూడదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
ఏం డ్యాన్స్.. ఏం స్టెప్పులవి.. పొరపాటున ఫొటోగ్రాఫర్ అయ్యాడేమో..?
ఒక వివాహ వేడుకలో అతిథుల డ్యాన్స్ రికార్డ్ చేస్తున్న ఫొటోగ్రాఫర్ వారితో పాటు కాలు కదిపాడు.. అలా ఇలా కాదు.. ఓ ఊపు ఊపేశాడు.. వీడియో చిత్రీకరిస్తూనే.. ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు.. ఒక చేతిలో తన కెమెరాను బ్యాలెన్స్ చేసుకుంటూ, మరో చేతిలో తన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శిస్తూ, పెళ్లికి హాజరైన వారితో కలిసి పంజాబీ బీట్‌లకు చక్కగా డ్యాన్స్ చేశాడు. తన డైనమిక్ డ్యాన్స్.. అతని సామర్థ్యంలో ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియా వీక్షకుల హృదయాలకు ఇట్టే కట్టిపడేశాడు.. అబీర్ అరోరా పాడిన ‘లాంగ్ మారే లష్కరే’ పాటకు కెమెరామెన్ మరియు అతిథి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. పాట యొక్క సాహిత్యం, “అదియాన్ ధోహ్ కే పైయాన్ ఝంఝరా. లాంగ్ మరే లష్కరే కంగనా తేరా నీ సాను కరే ఇషారే.” అంటూ సాగుతుండగా.. వీడియో గ్రాఫర్ డ్యాన్స్‌అందరినీ కట్టిపడేస్తోంది..
ఉద్యోగులకు మెటా వార్నింగ్.. వచ్చారా సరేసరి..!
సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ తన ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.. వారానికి 3 రోజులు కార్యాలయానికి రావడానికి నిరాకరించిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చింది.. వారానికి మూడు రోజులు కార్యాలయానికి వెళ్లేందుకు నిరాకరించే ఉద్యోగులపై మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కఠినంగా వ్యవహరించనుంది.. అమెజాన్ వంటి కంపెనీలు ఎదుర్కొంటున్న ఇలాంటి వివాదాలను అనుసరించి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు వ్యక్తిగతంగా సహకారాన్ని ప్రోత్సహించడానికి మెటా చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ చర్యగా చెబుతున్నారు. ప్రతి వారం కనీసం మూడు రోజులపాటు కార్యాలయంలో విధులకోసం రాని ఉద్యోగులపై మెటా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఉద్యోగాల రద్దుకు అవకాశం ఉంటుంది. మేనేజర్‌లు బ్యాడ్జ్ మరియు స్టేటస్ టూల్ సమాచారాన్ని ఉపయోగించి ఉద్యోగుల హాజరును పర్యవేక్షిస్తారు. స్థానిక చట్టాలు మరియు కౌన్సిల్ ఆవశ్యకాలను అనుసరించి ఈ చర్యలు తీసుకోనున్నారు. ఈ విధానం Meta యొక్క వ్యయ-కటింగ్ ప్లాన్‌లలో భాగం మరియు వ్యక్తిగతంగా చేసే పనితీరును మెరుగుపరుస్తుందని సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ నమ్మకంగా చెబుతున్నారు.. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తన ఉద్యోగులకు సీరియస్ నోటీసు జారీ చేసింది. ప్రతి వారం కనీసం మూడు రోజులు కార్యాలయంలో గడపాలనే కొత్త నిబంధనను పాటించనివారు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 5 నుండి, కార్యాలయానికి కేటాయించిన ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు భౌతికంగా హాజరు కావాలని భావిస్తున్నారు. మంచి సంబంధాలు మరియు బలమైన టీమ్ వర్క్‌ని ప్రోత్సహించడం లక్ష్యంగా చెబుతున్నారు.
ఉద్యోగులకు శుభవార్త.. మారిన రూల్స్.. పన్ను ఆదా..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలను సవరించింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను శాఖ ఒక సంస్థ తన ఉద్యోగులకు అందించే అద్దె రహిత వసతిని మదింపు చేసే నిబంధనలను మార్చింది. దీనితో, మంచి వేతనాలు పొంది, యజమాని సంస్థ అందించే అద్దె రహిత వసతిలో నివసించే కార్మికులు ఇప్పుడు మరింత పొదుపు చేసుకునే అవకాశం ఉంది. దీంతో, ఎక్కువ నగదును జీతంగా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.. నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు కేవలం వసతి నిమిత్తం అందించబడి. గతంలో.. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను రాయితీ వారి జీతంలో 10 శాతంగా ఉంది.. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉంటూ వచ్చింది. మరోవైపు.. 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది.. గతంలో 10 శాతంగా ఉండేదని సీబీడీటీ పేర్కొంది. AKM గ్లోబల్ టాక్స్ పార్టనర్ అమిత్ మహేశ్వరి మాట్లాడుతూ, యజమాని నుండి తగిన జీతం మరియు వసతి పొందుతున్న ఉద్యోగులు తమ పన్ను పరిధిలోకి వచ్చే బేస్ ఇప్పుడు సవరించిన రేట్లతో తగ్గించబోతున్నందున మరింత ఆదా చేసుకోగలుగుతారని తెలిపారు.
రీ రిలీజులపై సొహైల్ సంచలన కామెంట్స్.. చిన్న సినిమాలను బతికంచండని వేడుకోలు
సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. . ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించగా కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందించారు. ఈ సందర్భంగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో సోహైల్ మాట్లాడుతూ నేను పదహారేళ్లుగా ఇండస్ట్రీలో పడుతున్న కష్టానికి ఇవాళ ఫలితం దక్కిందని అనుకుంటున్నానని, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ కు వచ్చిన ప్రతి రివ్యూలో సోహైల్ బాగా నటించాడని రాశారని అన్నారు.. నేనొక నటుడిని అని గుర్తింపు దక్కినందుకు సంతోషంగా ఉందన్న ఆయన సిటీలో మల్టీఫ్లెక్స్ వెళ్లి చూశా, సినిమా చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు బాగా నటించావు అంటూ హగ్ చేసుకుంటున్నారని అన్నారు. ఒక మంచి సినిమా చేశామని చెబుతున్నారని, పబ్లిక్ టాక్ వినండి, ఏ ఒక్కరూ నెగిటివ్ గా చెప్పలేదని అన్నారు.. అక్కడే మేము సక్సెస్ అయ్యాం అయితే యూట్యూబ్ లో కొందరు స్పాయిలర్స్ సినిమాల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, దయచేసి సినిమా రిలీజైన వెంటనే ఆ సినిమాను దెబ్బతీసే వీడియోలు చేయకండి. మీ వల్ల సినిమా కోసం పనిచేసే ఎంతోమంది నష్టపోతారని గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ఇక ఈ సాయంత్రం పోస్ట్-రిలీజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సినిమాల రీ రిలీజులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సయ్యద్ సోహెల్ మాట్లాడుతూ నిర్మాతలు, పంపిణీదారులు అలాగే అభిమానులను పాత సినిమాలను రీ రిలీజ్ చేసేప్పుడు వీకెండ్స్ చేయవద్దని కోరారు. వారాంతాల్లో పెద్ద సినిమాలను తిరిగి విడుదల చేయవద్దని సోహెల్ టాప్ టాలీవుడ్ స్టార్ హీరోల పంపిణీదారులు, అభిమానులను కోరారు. “దయచేసి వారాంతాల్లో ఎలాంటి రీ-రిలీజ్‌ని ప్లాన్ చేయవద్దు, ఎందుకంటే పెద్ద హీరోలు నటించిన పెద్ద సినిమాల చుట్టూ ఉన్న హైప్ చాలా కష్టాల తర్వాత చిన్న సినిమాలు సృష్టించే చిన్న హైప్ ని నాశనం చేస్తుంది. వీక్ డేస్‌లో రీ-రిలీజ్‌లను ప్లాన్ చేసి, చిన్న సినిమాల కోసం వీకెండ్స్ వదిలివేయమని నేను ప్రతి ఒక్కరినీ వినమ్రంగా కోరుతున్నాను, ”అని సోహెల్ చెప్పుకొచ్చారు.
ఒకసారి పరువు తీశారు..మళ్ళీ మారక పోతే ఎలా?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమాకి మంచి హిట్ టాక్ రావడంతో థియేటర్లలో దుమ్మురేపుతోంది. మొదటి ఆట నుంచి మంచి హిట్ టాక్ రావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తమిళనాట ఇప్పటికీ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి అంటే అక్కడ ఎంతలా బ్రహ్మరథం పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు తగ్గట్టే జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంచి కలెక్షన్లలో దూసుకుపోతోన్న ఈ సినిమా ఇప్పటికే తమిళ నాడులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఆగస్టు 10న ఈ సినిమా విడుదల అయ్యి పెద్దెత్తున వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరగా కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేసి లెక్కలు చెబితే మా సినిమా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 325 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. అప్పుడే పరువు తీశారురా బాబు ఈ మాత్రం చూసుకోరా అని రజనీ అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటుతుందన ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వెబ్‌సైట్స్ ప్రకారం జైలర్ తొమ్మిదో రోజు రూ. 9 కోట్లు వసూళ్లు రాబట్టిందని, ఇప్పటి వరకు తమిళంలో రూ. 184.65 కోట్లు, తెలుగులో రూ. 47.05 కోట్లు, కన్నడలో రూ. 2.05 కోట్లు, హిందీలో రూ. 2.1 కోట్లు వసూలు అయ్యాయని అంటున్నారు. ఇక ఇప్పటిదాకా మొత్తం కలెక్షన్స్ రూ. 487.39 కోట్లు దాటగా నేడు 500 కోట్లు దాటే అవకాశం ఉంది” అని ట్వీట్ అంటున్నారు. ఇప్పుడైనా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ మారక పోతే పరువు తీసుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
పిల్లనిచ్చిన మామ కోసం సాగర్‌లో సందడి చేసిన అల్లు అర్జున్
నాగార్జున సాగర్ లో శనివారం నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు. తనకు పిల్లనిచ్చిన మామ, అదేనండీ అల్లు స్నేహ తండ్రి, బిఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ఒక ఫంక్షన్ హాల్ ను ఆయన ప్రారంభించారు. పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి బట్టు గూడెం వద్ద కంచర్ల కన్వెన్షన్ పేరుతో ఫంక్షన్ హాల్ ను నిర్మించగా దాన్ని శనివారం నాడు అల్లు అర్జున్ ప్రారంభించారు. ఆధునిక వసతులతో 1000 మందికి సరిపడేలా ఈ ఫంక్షన్ హాల్ ను నిర్మించారని తెలుస్తోంది. ఇక ఫంక్షన్ హాల్ ను ఓపెనింగ్ కు అల్లు అర్జున్ వస్తునట్లు తెలియడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ను చూడటానికి చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారని చెబుతున్నారు. అల్లు అర్జున్ రాకతో ఆయన అభిమానులు ఖుషి అయ్యారు. ఇదిలా ఉంటే బిఅర్ఎస్ నేత అయిన అల్లు అర్జున్ మామా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి బిఅరెస్ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టి జనంలోకి వెళ్తున్న క్రమంలో ఈ సారి తనకు టికెట్ ఇస్తే .. తన అల్లుడు స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా తన కోసం ఎన్నికల ప్రచారం చేస్తారని కూడా చెబుతున్నారు. ఇక ఈ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన ఆయన నల్గొండలోని కంచర్ల కన్వెన్షన్ సెంటర్ విషయంలో కంచర్ల శేఖర్ రెడ్డి గారికి అభినందనలు, నల్గొండ అభిమానులు & ప్రజలందరి అభిమానానికి ధన్యవాదాలు అని ఆయన చెప్పుకొచ్చారు.