నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
టెన్త్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. అయితే, టెన్త్ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. ఈ రోజు పదవ తరగతి ఫలితాల విడుదల చేస్తారు.. ఈ రోజు ఉదయం 11 గంటలకు టెన్త్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో టెన్త్ ఫలితాలను ప్రకటించనున్నారు.. కాగా, గత నెల 18న పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి.. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. స్పాట్ వ్యాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశారు అధికారులు. ఇప్పుడు ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక, టెన్త్ ఫలితాల కోసం.. https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి.. హోమ్ పేజీలో అందుబాటులో ఏపీ టెన్త్ రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి… హాల్ టికెట్ వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే.. రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. ఫలితాలను ప్రింట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మరోవైపు. manabadi.co.in లాంటి వెబ్‌సైట్లలో కూడా ఏపీ పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంచనున్నారు.
మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు
మహిళా సంఘాలకు వడ్డిలేని భారీ మొత్తంలో రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 50 రోజుల్లో 620 కిలోమీటర్లు పూర్తి చేసామని తెలిపారు. 9 సంవత్సరాలలో దాదాపు 20 లక్షల కొట్లకు పైగా రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టుకున్నామన్నారు. కానీ ఏ ఒక్క తెలంగాణ వ్యక్తి ఆకాంక్ష నేరవేరలేదన్నారు. దళితులకు 3 ఎకరాల భూమిని పంచకపోగా.. కాంగ్రెస్ హాయాంలో ఇచ్చిన భూమిని ధరణి పేరుతో లాక్కుంటున్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ అడవి బిడ్డల పరిస్థితి బీఆర్ఎస్ పాలనలో అత్యంత దయనీయంగా తయారైందన్నారు. కాపాడలని దీనంగా కాంగ్రెస్ ను వేడుకుంటున్నారని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అంటూ నిప్పులు చెరిగారు. ఫలితంగా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కొల్పోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“స్వలింగ సంపర్కం ఓ రోగం”.. చట్టబద్ధం అయితే సమాజంలో పెరుగుతుంది..
సుప్రీంకోర్టులో ప్రస్తుతం స్వలింగ వివాహాల చట్టబద్ధతపై విచారణ కొనసాగుతోంది. దీన్ని కేంద్రంతో పాటు సమాజంలో మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం కూడా ఇదే చెప్పింది. ఇది కేవలం అర్బన్ కమ్యూనిటీలో కొంతమందికి మాత్రమే పరిమితం అయిందని, దేశంలో మెజారిటీ ప్రజల మనోభావం కాదని, చట్టబద్ధత కల్పించే హక్కు పార్లమెంట్ ది అని దీంటో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కేంద్రం తెలిపింది. అయితే వీరి హక్కులపై ఓ కమిటీని నియమిస్తామని ఇటీవల కేంద్ర అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మహిళా విభాగం సంవర్ధిని న్యాస్ ఈ అంశంపై సర్వే చేసింది. స్వలింగ సంపర్కం అనేది ఒక రుగ్మత అని, దీనికి చట్టబద్ధత లభిస్తే సమాజంలో మరింతగా పెరుగుతుందని పలువురు వైద్యులు విశ్వసిస్తున్నారని ఆ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆధునిక వైద్యం నుంచి ఆయుర్వేద వరకు 8 విభిన్నమైన చికిత్స విధానాలకు చెందిన 318 మంది వైద్య ప్రముఖుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగినట్లు తెలిపారు.
14 వ శతాబ్ధపు సింహాసనం.. 360 ఏళ్ల నాటి కిరీటం.. నేడు కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం..
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధం అయింది. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ పట్టాభిషేకానికి భారీగా ఏర్పాట్లు చేసింది. వివిధ దేశాల ప్రముఖులు లండన్ చేరుకున్నారు. భారతదేశం తరుపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌ఖడ్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. వీరికి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. సుమారుగా 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్-3 రాజుగా సింహసనాన్ని అధిష్టించనున్నారు. 14 వ శతాబ్ధపు సింహాసనంలో కూర్చోని, 360 ఏళ్ల పురాతనమైన సెయింట్ ఎడ్వర్డ్స్ కిరీటాన్ని ధరించి రాజుగా పట్టాభిషిక్తుడు కానున్నారు. కింగ్ ఛార్లెస్ తో పాటు ఆయన భార్య క్వీన్ కెమిల్లా కూడా సంప్రదాయబద్ధంగా కిరీటాన్ని ధరిస్తారు. హిందూ సంప్రదాయాన్ని పాటించి యూకే ప్రధాని రిషి సునాక్ ఈ కార్యక్రమంలో బైబిల్ లోని వ్యాక్యాలు పఠించనున్నారు.
అంబానీ భార్య వాడే ఫోన్ ఖరీదుతో చార్టెర్డ్ ఫ్లైట్స్ కొనేయొచ్చట
భారతదేశ కుబేరు జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ చేయని వ్యాపారం అంటూ లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ప్రపంచంలోని ముకేష్ అంబానీకి ఉన్న సౌకర్యాలు ఎవరికీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్‌లు, ఖరీదైన భవనాలు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా ఉంటుంది. ముఖేష్ అంబానీలాగే తన భార్య నీతా అంబానీ కూడా విలాసవంతమైన వస్తువులను కలిగి ఉన్నారు. ఆమె ఏ కార్యక్రమానికి హాజరైన తను ధరించిన దుస్తులు, హ్యాండ్ బ్యాగులు ఆ ప్రోగ్రామ్ కే సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతాయి. భర్త లాగే ఆమె ఉపయోగించే లగ్జరీ సేకరణలో కార్లు, ఇళ్ళు, జెట్ విమానాలు వంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఆమె వాడుతున్న స్మార్ట్ ఫోన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆమె వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైనది. నీతా అంబానీ స్మార్ట్‌ఫోన్ ధర ఊహకు కూడా అందనిది. నీతా అంబానీ వాడే స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు. ఫాల్కన్ సూపర్నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఫోన్. దీనికి ఎందుకు అంత ధర ఉంటుందంటే దానిలో పొందుపరిచిన విలువైన పింక్ డైమండ్ కారణం. ఇక ఈ ఫోన్ ధర 48.5 మిలియన్లు డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 395 కోట్లు) చెల్లించాలి. నీతా అంబానీ ఫోన్ ఖరీదుతో కొన్ని చార్టర్డ్ విమానాలను కొనుగోలు చేయొచ్చట. ఈ ఫోన్ నిజానికి iPhone 6 కోసం ఫాల్కన్ సూపర్‌నోవా అనుకూలీకరించిన వెర్షన్. ఇదే ఐఫోన్ 6, 2004లో విడుదలై బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని తయారు చేస్తున్నప్పుడు, ఐఫోన్ 6లో 24 క్యారెట్ బంగారాన్ని ఉపయోగించారు. దానితో పాటు పెద్ద పింక్ డైమండ్ ఫోన్ వెనుక ప్యానెల్‌కు పొందుపరిచారు.
పసిడికి తగ్గిన గిరాకీ.. అసలు కారణం ఇదే..
భారతీయ సంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానం ఉంది.. పెళ్లి లాంటి పెద్ద కార్యక్రమం నుంచి ఏ చిన్న కార్యక్రమం, శుభకార్యం జరిగినా.. పసిడి ఉండాల్సిందే అనే తరహాకు అలవాటుపడ్డారు.. స్థాయిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి బంగారం ఎక్కువ.. తక్కువ ఉండొచ్చు.. కానీ, బంగారం ఉండాల్సిందేననే నమ్మకం.. ఇక, శుభకార్యాల్లో వధువరులకు గానీ.. ఇతరులకు గానీ.. బంధువులు కూడా పసిడి బహూకరిస్తుంటారు.. అయితే, పసిడి ధరలు క్రమంగా పెరుగుతూ.. సామాన్యులకు అందకుండా పైపైకి కదులుతున్నాయి. దీంతో.. పసిడికి డిమాండ్ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. ఇక, డబ్ల్యూజీసీ నివేదికలో పేర్కొన్న అంశాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్‌లో పసిడి డిమండ్ 112.5 టన్నులు ఉండగా.. 2022లో అది 135.5 టన్నులకు చేరింది.. అయితే, ఇదే సమయంలో పసిడి ఆభరణాల డిమాండ్ 94.2 టన్నుల నుంచి 78 టన్నులకు పడిపోయింది. మరోవైపు.. విలువల రూపంలో చూస్తే, పసిడి కొనుగోళ్లు 9 శాతం క్షీణించాయి.. అంటే రూ.61,540 కోట్ల నుంచి రూ.56,220 కోట్లకు పడిపోయింది. నగల డిమాండ్ విలువల్లో 9 శాతం క్షీణించి రూ.42,800 కోట్ల నుంచి రూ.39,000 కోట్లకు పరిమితం కాగా.. బంగారంపై పెట్టుబడుల పరంగా అయితే 17 శాతం తగ్గిపోయింది.. అంటే.. బంగారం డిమాండ్ 41.3 టన్నుల నుంచి 34.4 టన్నులకు పడిపోయింది. ఇది కేవలం భారత దేశానికే పరిమితం కాలేదు.. ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమాండ్ తొలి త్రైమాసికంలో బలహీనంగానే ఉంది.. 13 శాతం క్షీణించి 1,080.8 టన్నులకు పరిమితం అయ్యింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వృద్ధిమాన్ సాహాకు పిలుపు..?
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్ సమస్యతో ఇబ్బంది పడుతున్న భారత జట్టులో సాహా చేరితే.. మంచి అనుభవం ఉన్న బ్యాటర్ దొరికినట్లే. భారత్ లో టాప్ వికెట్ కీపర్లలో సాహా ఒకరు. దానికితోడు విదేశాల్లో ప్లేయర్లు రాణించాలంటే.. అక్కడ ఆడిన అనుభవం వారికి చాలా ముఖ్యం. అది లేకుండా కొత్త వాళ్లు వెళ్లినా ఆ పరిస్థితుల్లో రాణిస్తారనే నమ్మకం మాత్రం ఉండదు. కానీ సాహా లాంటి సీనియర్లకు ఈ సమస్య ఉండదు. ఎందుకంటే అతను దాదాపుగా అన్ని దేశల్లో ఆడిన అనుభవం ఉంటుంది. రిషభ్ పంత్ లేకపోవడంతో టీమిండియా మిడిలార్డర్‌లో కౌంటర్ ఎటాకింగ్ బ్యాటింగ్ చేసే ఆటగాడు లేకుండా పోయాడు. ఈ స్థానంలో సూర్యకుమార్‌ను తీసుకున్నా.. అతను టెస్టుల్లో రాణించడం అంత ఈజీ కాదు. అదే సమయంలో సాహా అయితే అవసరమైతే విధ్వంసకర బ్యాటింగ్ చేయగలడు.
రష్మిక, పూజలకు శ్రీలీలను శత్రువును చేసిన నెటిజన్లు.. కారణం ఏంటంటే ?
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఆ డైలాగ్ సింగ్ చేయడమే కాదు.. ఈ అందమైన భామలకు శత్రువు ఎక్కడో లేదు.. ఈ బ్యూటీల స్టేట్ లోనే.. వీరికి తీసిపోని అందంతోనే.. ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. పూజీ, రష్మిలకు ఇప్పుడు శత్రువు శ్రీలీలే అంటూ సోసల్ మీడియా వేదికగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్ మెంట్స్ తో పాటు మీమ్స్ తో కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇంతకీ శ్రీలీల కథేంటీ.. పూజా హెగ్డే, రష్మీక మందనల గోలేంటీ అని మీరు అనుకుంటున్నారు కదా.. అయితే మీరు ఈ వీడియోను స్కిప్ చేయ్యొద్దు. శ్రీలీల డాక్టర్ కాబోయి మరీ యాక్టర్ అయ్యా అంటూ.. చెప్పే యాక్టర్లందరి మధ్యలో.. డాక్టర్ కోర్స్ చేసి మరీ యాక్టర్ అయ్యారు ఈ బ్యూటీపుల్ లేడీ.. క్రేజీ బ్యూటీగా నమ్ కమాయించారు. ఇక అదే క్రేజ్ ను మేకర్స్ క్యాచ్ చేయడంతో.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. బంపర్ ఆఫర్లు పట్టేస్తున్నారు. హీరోలకు మోస్ట్ ఛాయిస్ట్ హీరోయిన్ గా శ్రీలీల మారిపోయారు. ఇక ఇది మింగుడు పడని పూజీ, రష్మీక ఫ్యాన్స్ శ్రీలీలను వారికి శత్రువుగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ మీమ్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.