ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్..
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నల్గొండ- ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 5న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605.. 807 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పురుష ఓటర్లు… 2 లక్షల 88 వేల 189, మహిళలు 1 లక్షా 75 వేల 645, ఇతరులు ఐదుగురు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మూడు జిల్లాల్లో 1 లక్షా 66 వేల 448 మంది ఓటర్లు, 205 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 80,871 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 51,560 మంది, మహిళా ఓటర్లు 29,311 మంది ఉన్నారు. వీరి కోసం 97 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 144 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో 51,497 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 34,176 మంది, మహిళా ఓటర్లు 17,321 మంది ఉన్నారు.
తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం.. 14 మంది మృతి..
తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన కురిసింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వర్షాలు, ఈదురుగాలులకు రాష్ట్రంలో 14 మంది మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లాలో 8 మంది మృతి చెందగా.. శామీర్ పేటలో చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మియాపూర్ లో గొడ కూలి మూడేళ్ల బాలుడు, సిద్ధిపేట జిల్లా క్షీరసాగరలో ఇద్దరు మృతి చెందారు.
నేడు ఏపీ నుంచి హజ్ యాత్ర స్టార్ట్.. తొలి రోజు 322 మంది
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్–2024 యాత్ర నేడు (సోమవారం) ప్రారంభంకాబోతుంది. రాష్ట్రం నుంచి ఈ ఏడాది 2, 580 మంది హాజీల పవిత్ర యాత్రకు ఏర్పాట్లు పూర్తైయ్యాయి. ఇవాళ ఉదయం 8 : 45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి విమానం స్టార్ట్ కానుంది. మొదటి విమానంలో ప్రయాణించే 322 మంది హజ్ క్యాంపు నుంచి ఉదయం 3. 30 గంటలకే గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునున్నారు. కాగా, హజ్ యాత్రకు వెళ్లే వారి సౌకర్యం కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఈద్గా జామా మసీదు దగ్గర మదర్సాలోని హజ్ వసతి క్యాంపులో ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి హజ్ క్యాంపు వద్దకు చేరుకున్న తొలి బృందానికి వైద్య పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. 24 గంటలు పనిచేసేలా మదర్సా దగ్గర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్, వైద్య సహాయం అందించేలా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. మదర్సా వద్ద పరిశుభ్రమైన వాతావరణంలో టెంట్లు, ఎయిర్ కూలర్లు సిద్ధం చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నాట్లు ప్రకటించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో నలుమూలల నుంచి 713 మంది ముస్లిం సోదరులు ప్రపంచవ్యాప్తంగా హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా, మొదటి విడతలో భాగంగా ఈరోజు 322 మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లానున్నారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం.. !
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లోని కొండపై కొలవైన ఉన్న శ్రీ మాల మల్లేశ్వర స్వామి క్షేత్రానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దసరా తరువాత రోజు స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆ సందర్భంగా ఉరేగింపు ఘట్టంలో కర్రల సమరం ఆనవాయితీగా వస్తుంది. గత కొన్ని ఏళ్లుగా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి గొడవల వల్ల కర్రల సమరంగా ఆ పేరు వచ్చింది. ఇది సమరం కాదు.. సంప్రదాయం అని అక్కడి భక్తులు అంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ దేవరగట్టు బన్నీ ఉత్సవానికి అరుదైన గౌరవం దక్కింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు సబ్జెక్ట్ లో పాఠ్యంశంగా దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎంపిక చేశారు. 2024-25 విద్యా సంవత్సరంలో టెన్త్ కొత్త పుస్తకాల్లో బన్నీ ఉత్సవానికి చోటు దక్కింది. ప్రతియేటా దసరా రోజు హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రల సమరం గురించి ఈ పాఠ్యాంశంలో పొందుపర్చబోతున్నారు. ఈ బన్నీ ఉత్సవం యొక్క ప్రత్యేకత, సంప్రదాయాలను అందులో పొందుపర్చే అవకాశం ఉంది. ఈ ఉత్సవం గురించి ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసేలా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు. అయితే, వీళ్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అయితే, మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇంకా మృతుల వివరాలను మాత్రం వెల్లడించలేదు. కారు కల్వర్ట్‌లో ఇరుక్కున్న దాన్ని బట్టి అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణాలుగా పోలీసులు అంచనా వేశారు. ఇక, గడ్డపార సహాయంతో కల్వర్టుపై ఇరుక్కున్న కారు డోర్లను బద్ధలు కొట్టి మృతదేహాలను పోలీసులు బయటకు తీసేశారు. ప్రమాదానికి గురైన కారు నెంబర్ AP 26 BH 3435 కాగా.. మృతుల వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
జూన్ 4న ఫలితాల తర్వాత భారీగా పెరగనున్న ఎల్‌పీజీ సిలిండర్ ధరలు ?
లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ జూన్ 1, 2024న జరుగనుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రతి నెలా మొదటి తేదీన అప్ డేట్ అవుతాయి. జూన్ 1న ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.. కానీ ఎన్నికల తర్వాత ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరుగుతాయన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. మోడీ ప్రభుత్వ హయాంలో.. ఎన్నికలకు ముందు, తరువాత గృహ ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో మార్పులను పరిశీలిద్దాం. జూన్ 1, 2014న, ఢిల్లీలో నాన్ సబ్సిడీ డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర సిలిండర్‌కు రూ.905. ఈరోజు అంటే 27 మే 2024న ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.803.. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1745.50. ఆ సమయంలో సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.414.. ప్రధానమంత్రి మొదటి పదవీకాలం మే 2014 నుండి 2019 వరకు.. రెండవది 2019 నుండి ఇప్పటి వరకు. జూన్ 1, 2023న ఢిల్లీలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.1103. ఇండియన్ ఆయిల్ డేటా ప్రకారం, మే 1, 2014న ఢిల్లీలో సబ్సిడీ లేని అదే సిలిండర్ ధర రూ.928.50. అంటే గత 10 ఏళ్లలో దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.125 తగ్గింది. మోడీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ లేని డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.216 తగ్గింది.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 16 కిలోల బరువున్న 89 బంగారు బిస్కెట్లతో స్మగ్లర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లో మే 25న ఆరో దశ పోలింగ్ ముగిసింది. ఈ సమయంలో బీఎస్ఎఫ్ జవాన్లు గొప్ప విజయాన్ని సాధించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వరుసగా మూడో రోజు.. మరో స్మగ్లర్‌ను బీఎస్‌ఎఫ్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో 16 కిలోల బంగారంతో కూడిన 89 బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి బరువు దాదాపు 16 కిలోలు. ఈ బంగారు బిస్కెట్ల ధర రూ.12 కోట్లు అని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్‌లో ఆరో దశ ఓటింగ్ సందర్భంగా, BSF ఇంటెలిజెన్స్ విభాగానికి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు గ్రామంలోని హల్దర్‌పద గ్రామంలో స్మగ్లింగ్ సమాచారం అందింది. ఆ తర్వాత సరిహద్దులో బీఎస్ఎఫ్ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భారీగా బంగారం పట్టుబడింది. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ పరిధిలోని 05 బెటాలియన్, సరిహద్దు పోస్ట్ గునర్‌మఠ్ సైనికులు సరిహద్దు పోస్ట్‌కు సమీపంలో ఉన్న హల్దర్‌పద గ్రామంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ స్మగ్లర్‌ను అరెస్టు చేశారు. స్మగ్లర్ ఇంట్లో సోదాలు చేయగా 89 బంగారు బిస్కెట్లు లభించాయి. బంగ్లాదేశ్ నుంచి స్మగ్లర్ ఈ బంగారాన్ని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. దీని తర్వాత అది మరింత డెలివరీ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో అతడు తన ఇంట్లో బంగారాన్ని దాచి ఉంచాడు. పట్టుబడిన బంగారం మొత్తం బరువు 16.067 కిలోలు కాగా, మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా.
ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డ్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యంత తక్కువ స్కోర్ చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 113 పరుగులకే ఆలౌట్ అయి ఈ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డ్ చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2013 ఫైనల్‌లో చెన్నై 125/9 స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ 2017 ఫైనల్‌లో ముంబై 129/8 చేసింది. 2017 ఫైనల్‌లోనే రైజింగ్ పూణే సూపర్ జెయింట్ 128/6 రన్స్ చేసి.. ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్‌లో ఇవే అత్యల్ప స్కోర్లు. ఇప్పుడు ఈ జాబితాలో ఎస్‌ఆర్‌హెచ్ చేరింది. ఈ సీజన్‌లో 287/3, 277/3 స్కోర్లతో టీ20 చరిత్రలోనే భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్.. ఫైనల్లో మాత్రం దారుణంగా విఫలమైంది. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ (2/14), హర్షిత్ రాణా (2/24), ఆండ్రి రసెల్ (3/19)ల దెబ్బకు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. 24 పరుగులు చేసిన కెప్టెన్ ప్యాట్ కమిన్సే టాప్ స్కోరర్. లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్; 26 బంతుల్లో 4×4, 3×6), రహ్మనుల్లా గుర్బాజ్ (39; 32 బంతుల్లో 5×4, 2×6) చెలరేగారు.
కెమెరా కంట పడకుండా.. వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్న కావ్య మారన్!
ఐపీఎల్ 2024 ఆసాంతం అలరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఎస్‌ఆర్‌హెచ్ నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో కోల్‌కతా మూడోసారి ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచింది. 17వ సీజన్‌లో అనూహ్య ప్రదర్శనలతో ఫైనల్ చేరిన ఎస్‌ఆర్‌హెచ్.. చివరి మెట్టుపై బోల్తా పడడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఫైనల్ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కీలక పోరులో ఎస్‌ఆర్‌హెచ్ కనీస పోటీ ఇవ్వకపోవడంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా చప్పట్లు కొడుతూనే.. కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి కన్నీతిని తుడుచుకున్నారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ కూడా పోటీలో నిలవలేకపోయింది. వరుసగా వికెట్స్ కోల్పోవడంతో మ్యాచ్ మధ్యలోనే కావ్య మారన్ ముఖం చాటేశారు. కేకేఆర్ విజయానంతరం మళ్లీ స్టాండ్స్‌లోకి వచ్చారు. అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన తమ జట్టును చప్పట్లతో అభినందించారు. ఈ క్రమంలోనే ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ వీడియోను చూసి ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ‘అయ్యో.. కావ్య పాప’, ‘పాపం కావ్య పాప’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.