వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ..
నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెబుతూ.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తిరువూరులో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేయనున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం విదితమే.
నేడు తిరువూరులో సీఎం పర్యటన..
ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు తిరువూరులోని వాహిని ఇంజినీరింగ్ కాలేజీకి చేరుకుంటారు.. అక్కడ 15 నిమిషాల విరామం అనంతరం 10.35 నుండి 10.45 వరకు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. 10.45 కు అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.00 కు సభ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు జగనన్న విద్యా దీవెన నగదు బదిలీకు సంబంధించి బటన్ నొక్కటం, తదుపరి విద్యార్థులు, ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో 12.40 కు వాహిని ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకొని 15 నిమిషాలు పాటు పార్టీకి చెందిన స్థానిక నాయకులతో ముచ్చటిస్తారు.. తదుపరి మధ్యాహ్నం 12.55 కు తిరిగి హెలికాప్టర్ లో తాడేపల్లికి బయల్దేరనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..
కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.. డివైడర్ ఢీకొన్న ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది.. అయితే, ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రయాణికులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విజయవాడ నుంచి పార్వతిపురం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్.. అతివేగంతో.. డివైడర్‌ను ఢీకొట్టడంతో.. ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి.. బోల్తాకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు కూడా అంతా నిద్ర మత్తులో ఉన్నారని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగానే ఉన్నారని.. ఎవరికీ ఎటువంటి ప్రాణప్రాయంలేదని డాక్టర్లు చెబుతున్నారు.. ప్రమాదం జరిగినా.. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో.. అధికారులు, ప్రయాణికుల బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష
కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండల కేంద్రంలో నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు చేపట్టనున్న ఈ దీక్షకు అందరూ తరలిరండని ఆయన పిలుపునిచ్చారు. గాంధారి శివాజీ చౌక్ వద్ద నిరుద్యోగ నిరసన ఈ దీక్షను చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి. ఉదయం 9గంటలకు జువ్వాడి గేట్ నుంచి గాంధారి శివాజీ చౌక్ వరకు పాదయాత్రగా రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివాజీ చౌక్ వద్ద దీక్ష చేపట్టనున్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించాలని డిమాండ్‌తో ఈ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రధాన డిమాండ్ల తో దీక్ష చేయనున్నారు. ఇదిలా ఉంటే.. నిన్న రేవంత్ రెడ్డి కామారెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో చప్రాసి ఉద్యోగానికి కూడా పనికిరాడని, పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పీఏకు సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయన్నారు.
సచిన్ పైలట్‌తో ఎలాంటి విభేదాల్లేవు, కలిసి పోరాడుతాం..
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున సచిన్ పైలట్‌తో విభేదాల చర్చలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శనివారం తోసిపుచ్చారు. అయితే అన్నీ పార్టీల మాదిరాగానే కాంగ్రెస్‌లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయని ఆయన అన్నారు. పార్టీలో ఐక్యతను చాటే ప్రయత్నంలో గెహ్లాట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లోని నేతలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని, రానున్న ఎన్నికల్లోనూ అదే పని చేస్తామని గెహ్లాట్ అన్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి విభేదాలు లేవు.. మా పార్టీలో చిన్న చిన్న విభేదాలు జరుగుతూనే ఉంటాయి, ప్రతి రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఇది జరుగుతుంది. అయితే ఎన్నికల్లో కలిసి పోటీ చేసి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని గెహ్లాట్ అన్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాలను అంగీకరించే సంప్రదాయాన్ని పార్టీ కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం, కలిసి గెలుస్తాం, ఆపై హైకమాండ్ నిర్ణయాలను అంగీకరిస్తాం, ఇదే సంప్రదాయమని, ఇదే ఆనవాయితీగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. గత ఏడాది నవంబర్‌లో, రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఐక్యతను ప్రదర్శిస్తూ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లను పార్టీకి ఆస్తులుగా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేసీ వేణుగోపాల్ పునరుద్ఘాటించారు, అదే సమయంలో పార్టీ అని సందేశం పంపడానికి ప్రయత్నించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సుప్రీం, రాష్ట్ర నాయకులు ఏకమయ్యారన్నారు.
భర్తను సిగరెట్ తాగొద్దంటే వినలేదు.. భార్య మాస్టర్ ప్లాన్..
మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం ప్రతి ఒక్కరికి ఆఖరికి చిన్నపిల్లలకు కూడా తెలుసు.. అదే విషయాన్ని సిగరెట్ తాగే ప్యాక్‌లపై, మందు తాగే బాటిల్లపై కూడా ఉంటుంది. అది రాసినందుకో ఏమో దానికి విపరీతంగా బానిసలవుతుంటారు. దానికి ఒక్కసారి బానిసయ్యామంటే ఇక దాన్ని వదిలించేందుకు ప్రాణం పోయేంత పని అవుతుంది. మనం తాగాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో తాగి మత్తులో ఊగుతూ ఉండటమేకాదు దానికి తోడు ధూమపానం చేసి ఆనందంగా అన్ని మరిచిపోయాము అనుకుంటారు కానీ దాని కారణంగా ఎంతోమంది ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కుటుంసభ్యలు వారిని నానా తంటాలు పడి వారు అలవాటు చేసుకున్న మద్యం, సిగరెట్లను మాన్పించేందుకు అయితే ఇక ఇలా మద్యపానం ధూమపానానికి అలవాటైన వారిని మానుకోవాలని ఎంత చెప్పినా పెడచెవిన పెడుతూ ఉంటారు. దీనికి బానిసైన వారిని కాస్త సరికొత్తగా ఆలోచించి తమ కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో మద్యపానం ధూమపానం లాంటి చెడు అలవాట్లను మాన్పించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎవరైనా కాస్త విచిత్రంగా ప్రవర్తించారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఒక భార్య ఏకంగా భర్తను మద్యం మానిపించడానికి వేసిన ప్లాన్ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది. దాన్ని కాస్త సామాజిక మాధ్యామాల్లో పోస్ట్ చేయడంతో.. ఈ వీడియో నెటిజెన్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తూ తెగ వైరల్ మారింది.
పెరూ, ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి
పెరూ, ఈక్వెడార్‌లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది.ఈక్వెడార్‌లోని మచలా, క్యూన్కా వంటి నగరాల్లో భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరాల్లో శిథిలాల దిబ్బలు కనిపించాయి. భూమి కంపించగానే భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. రెస్క్యూ అధికారులు సహాయం అందించడానికి అక్కడికి చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అదే ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండేది.
దీని కేంద్రం పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్ మునిసిపాలిటీ బాలావోలో ఉందని అధికారులు తెలిపారు.
పుత్తడి సరికొత్త రికార్డు.. 1947 నుంచి పసిడి ప్రస్థానం ఇలా..
భారత్‌లో ధరలతో సంబంధం లేకుండా పసిడి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధరలు పెరిగినప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్టు కనిపించినా.. కొనడం తగ్గించుకుంటారేమో కానీ.. కొనడం మాత్రం ఆపరు.. అంటే బంగారంతో భారతీయులకు ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. అయితే, ఇక్కడ వారివారి ఆర్థిక పరిస్థితులను బట్టి.. బంగారం కొనేస్తుంటారు.. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శనివారం రూ.1,630 పెరిగి రూ.60,320కి చేరింది.. అంటే.. రూ.60 వేల మార్క్‌ను పసిడి దాటేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 మేర పెరిగి రూ.55,300కి పరుగులు పెట్టింది. మరోవైపు కిలో వెండి సైతం రూ.1,300 మేర ఎగబాకి రూ.74,400ని తాకింది.. ఇక, గత 10 రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ.5 వేల ఎగబాకింది.. మార్చి 9వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 55,530గా ఉండగా.. అదే 18వ తేదీ వరకు వచ్చేసరికి రూ.60,320కి పెరిగింది.. అయితే.. ఇదే సమయంలో.. భారత్‌లో ఎప్పుడెప్పుడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి.. అనేది ఇప్పుడు చర్చగా మారింది.. భారత్‌కు స్వాతంత్ర్యం రాక ముందు.. పసిడి ధరలు ఎలా ఉన్నాయి.. స్వతంత్ర భారతంలో ధరల గమనం ఎలా సాగింది అనేది ఓసారి పరిశీలిస్తే.. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.44గా ఉంది.. ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపై దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అంటే. 1947లో తులం బంగారం రూ.88గా ఉంది.. 1950లో రూ.100గా, 1960లో రూ.112గా, 1970లో రూ. 184గా, 1980లో రూ.1,330గా.. 1990లో రూ.3,200గా.. 2000లో రూ.4,400గా.. 2010లో రూ.18,500గా.. 2020లో రూ.42,700గా.. 2021లో రూ.48,700గా.. 2022లో రూ.52,700గా.. ఇలా పసిడి ధర ఏమాత్రం తగ్గకుండా ఎగబాకిపోయింది. అంటే, ఈ 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో బంగారం ధర దాదాపు 682 రెట్లు పెరిగిపోయింది.. ఇప్పుడు రూ.60 వేల మార్క్‌ను కూడా దాటేసింది.. ఇప్పటికైనా పసిడి పరుగులకు బ్రేక్‌లు పడతాయా? అంటే చెప్పడం మాత్రం కష్టమే..