రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోని పెద్ద రెడ్లు ఆ పార్టీకి అమ్ముడు పోయారు..
మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు. తను PCC chief అయ్యానని, తెలంగాణలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని అన్నారు. 32 నుంచి 34 ఓటింగ్ శాతంలో ఉన్నామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మరో 5 శాతం ఓట్ల కోసం మా పోరాటం అన్నారు రేవంత్. అయితే.. కాంగ్రెస్ పార్టీలోని పెద్ద రెడ్లు సీఎం కేసీఆర్ కు అమ్ముడు పోయారని రేవంత్ చేసిన వాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఆ పెద్దరెడ్లు ఎవరు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అంటూ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర నిజామాబాద్ చేరుకుని ఇవాళ్టితో మూడురోజుల నేపథ్యంలో.. రేవంత్ పాదయాత్ర క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర కరీంనగర్ జిల్లాలో ముగించుకుని 11వ తేదీ నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఇవాళ (14న) ఉదయం 10 గంటలకు మంచిప్ప రిజర్వాయర్‌ను సందర్శిస్తారు రేవంత్. సాయంత్రం 4 గంటలకు మోపాల్ నుంచి కంజర్ – కులాస్‌పూర్ – ముల్లంగి – గణపూర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. రాత్రి 7 గంటలకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం రాత్రి 9 గంటలకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. వారు అక్కడే ఉంటారు. ఇక రేపు (15)న తేదీ ఉదయం 9 గంటలకు కంఠేశ్వర శివాలయం, 10 గంటలకు దుబ్బాక భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. 12 గంటలకు మల్లారంలోని ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయకుండా విక్రయించిన స్థలాన్ని పరిశీలిస్తారు.
మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వైఎస్ వివేకా కేసులో ఉత్కంఠ..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని వరుసగా ప్రశ్నిస్తోంది.. ఇప్పటికే వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మూడు సార్లు ప్రశ్నించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. నాల్గోసారి ప్రశ్నించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే అవినాష్‌రెడ్డికి నోటీసులు పంపగా.. వాటికి అనుగుణంగా ఈ రోజు విచారణకు హాజరుకానున్నారు.. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు హాజరుకాబోతున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై నాలుగోసారి ప్రశ్నించబోతోంది సీబీఐ.. ఇప్పటికే జనవరి 28వ తేదీన, ఫిబ్రవరి 24వ తేదీన, మార్చి 10న అవినాష్‌రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు.. మరోవైపు.. తన విచారణపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు అవినాష్ రెడ్డి.. దీంతో, సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచింది.. అయితే, తుది తీర్పు వెలువడే వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.. మొత్తంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆయన విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయనున్నారు సీబీఐ అధికారులు.. మరోవైపు.. నిజానిజాలు లక్ష్యంగా కాకుండా.. ఓ వ్యక్తి లక్ష్యంగా విచారణ సాగుతోందని.. నాపై కుట్ర జరుగుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపిస్తోన్న విషయం విదితమే. ఇక, ఇవాళ్టి సీబీఐ విచారణలో ఏం జరుగుతోంది? అనేది ఉత్కంఠగా మారింది.
పోడు భూముల పట్టాల పంపిణీపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ఏళ్ల తరబడి సమస్యగా ఉన్న పోడు భూములకు పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే.. పోడు భూములకు పట్టాల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా..పోడు భూముల క్రమబద్ధీకరణ చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. కాగా.. పోడు భూములకు పట్టాల పంపిణీపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే.. పోడు భూముల క్రమబద్దీకరణ జరగాలంటే ఆదివాసీల అటవీ హక్కుల చట్టం, నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో.. పోడు భూములను క్రమబద్ధీకరించడం చట్ట విరుద్ధమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభిప్రాయపడుతోంది. ఈ విషయాన్ని వారి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇకపై ఈ భూముల క్రమబద్దీకరణ చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పునకు సైతం ప్రభుత్వ మెమో విరుద్ధంగా ఉందని లాయర్ వాదించారు. ఇక.. మరోవైపు సాగు చేసుకుంటున్న వారికే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ములుగు జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త కె. శ్రవణ్ కుమార్ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకోకూడదని.. సాగు చేసుకుంటున్న వారికి పోడు భూమి పట్టాలు ఇచ్చేలా సమర్థించాలని కోర్టును శ్రవణ్ కుమార్ కోరారు.
తెలంగాణలో మూడు రోజుల్లో వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో వానలు, ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. ఈ నెల 15న ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు జల్లులు కురుస్తాయని చెప్పింది. ఈ నెల 16, 17 తేదిల్లో నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో వడగళ్లు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ వైపు తూర్పు, ఆగ్నేయదిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు కూడా అధికంగా నమోదు అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలపైన నమోదయ్యాయి. గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 39.8 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. భద్రాచలంలో సాధారణం కన్నా రెండు డిగ్రీలు పెరుగుదల నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లాలో 39.1, ఆదిలాబాద్ జిల్లాలో 39.1, జగిత్యాల జిల్లాలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, మెదక్‌లలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని అధికారులు వివరించారు.
పోలీసులు అయితే ఏంటి? టీటీతో పెట్టుకుంటే అంతే..!
రైల్వే ఉద్యోగులకు మరికొందరి తప్ప ఎవ్వరైనా సరే టికెట్ ఉంటేనే రైలులో ప్రయాణం చేయాలి.. టికెట్ లేకుండా రైలు ఎక్కడమే కాదు.. తాము పోలీసులం అంటూ బెదిరింపులకు గురిచేసి.. టికెట్ ఉన్నవాళ్లను లేపి.. వారి సీట్లు కూర్చోవడంతో.. సదరు టికెట్ కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడిన ఆ పోలీసు బృందానికి తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చేశాడు టీటీ.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కవడంతో వైరల్‌గా మారిపోయింది.. యూపీలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోలీసు బృందం టిక్కెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికుల సీట్లను ఆక్రమించింది.. ఆ సమయంలో టిక్కెట్ కలెక్టర్ తనిఖీ చేశారు.. వారిని టిక్కెట్ అడగగా.. రివర్స్‌లో బెదిరింపులకు దిగారు. దాదాగిరి చేసే ప్రయత్నం చేశారు. అయితే, డ్యూటీలో ఉన్న టీటీ కూడా ఏమాత్రం తగ్గలేదు.. వారిని ఆయా సీట్ల నుంచి ఖాళీ చేయించాడు. దాదాగిరి చేసేందుకు రైలు ఏమి ఎవరి అబ్బ సొత్తు కాదంటూ వార్నింగ్ ఇచ్చారు.. దీంతో, పోలీసులు సైలెంట్ అయిపోయారు.. మొత్తంగా తన డ్యూటీని సక్రమంగా చేసి.. ప్రయాణికులకు న్యాయం చేసిన టికెట్ కలెక్టర్ (టీటీ) అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.. అయితే.. ఈ వ్యవహారం మొత్తం ఓ ప్రయాణికుడు తన ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాకు ఎక్కించడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.. ఓవైపు పోలీసులను తిడుతూనే.. మరోవైపు.. టీటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక, ఆ వీడియోపై స్పందించిన రైల్వే పోలీస్ ఫోర్స్: ఈ విషయం ఇప్పటికే అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపించినట్టు చెబుతోంది..
మైనర్ వీపును తాకడం లైంగిక వేధింపులా?
ఎలాంటి లైంగిక ఉద్దేశం లేకుండా మైనర్ బాలిక వీపు, తలపై చేయి కదిలించడం ఆమె నిరాడంబరతను అతిక్రమించినట్లు కాదని, 28 ఏళ్ల యువకుడి శిక్షను రద్దు చేస్తూ బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసు 2012 నాటిది, అప్పుడు 18 ఏళ్ల వయస్సు ఉన్న దోషి, 12 ఏళ్ల బాలిక అణకువను అతిక్రమించాడనే ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన వీపుపై, తలపై చేయి వేసి నిమిరాడని పేర్కొంది. న్యాయమూర్తి భారతి డాంగ్రేతో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం.. అతడికి ఎలాంటి లైంగిక ఉద్దేశం లేదని, అతను బాధితురాలిని చిన్న పిల్లలా చూశాడని పేర్కొంది. ఆ బాలిక కూడా అతడి వైపు నుంచి ఎటువంటి చెడు ఉద్దేశం గురించి మాట్లాడలేదని.. కానీ ఆమె చెడుగా భావించిందని న్యాయమూర్తి ఫిబ్రవరి 10న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాలికపై ఆ వ్యక్తి లైంగికంగా వేధించినట్లు ప్రాసిక్యూషన్ మెటీరియల్‌ను సమర్పించడంలో విఫలమైందని హైకోర్టు పేర్కొంది.
ఇమ్రాన్ ఖాన్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై సోమవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది. ఖాతూన్ జడ్జి జెబా చౌదరిని బెదిరించిన కేసుకు సంబంధించి సివిల్ జడ్జి జిల్లా సెషన్స్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సోమవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ శాంతి భద్రతల దృష్ట్యా కోర్టుకు హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మార్చి 29న ఇమ్రాన్‌ఖాన్‌ను కోర్టులో హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. గత ఏడాది ఆగస్టులో తన స్పెషల్ అసిస్టెంట్ షాబాజ్ గిల్‌కు సంఘీభావంగా ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల కస్టడీలో గిల్‌ను హింసిస్తున్నారని ఆయన అప్పట్లో ఆరోపించారు. ఆ సందర్భంగా చేసిన ప్రసంగంలో.. జడ్జ్ జేబా చౌదరిని బెదిరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ఆమెపై తాను చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఆ నాడే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అనంతరం తాను బహుశా తన పరిధిని అతిక్రమించి ఉండవచ్చునని, ఆ జడ్జికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నానంటూ ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన సోమవారం కోర్టుకు హాజరు కావలసి ఉంది. కానీ ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు.. ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ఆఫ్‌లైన్‌లో విశాఖ వన్డే టికెట్లు
భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19వ తేదీన విశాఖ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగబోతోంది.. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయించింది ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ).. ఆన్‌లైన్‌లో పెట్టిన ఆరగంటకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి టికెట్లు.. పేటీఎం యాప్, పేటీఎం ఇన్ సైడర్ యాప్, ఇన్ సైడర్. ఇన్ వెబ్‌ల నుంచి టికెట్స్ కొనుగోలు చేశారు క్రికెట్ ఫ్యాన్స్.. వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఆన్ లైన్ టికెట్ల విక్రయం ముగియడంతో.. ఇక ఆఫ్‌లైన్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.. అయితే, వారు అప్రమత్తం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఈ రోజు ఆఫ్‌లైన్‌లో రెండో వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు విక్రయించనున్నారు.. ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయం కోసం విశాఖలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.. పీఎంపాలెం క్రికెట్ స్టేడియం-బి, టౌన్ కొత్తరోడ్డులోని ఇందిరా ప్రియదర్శిని మునిసి పల్ స్టేడియం, గాజువాకలో గల రాజీవ్ గాంధీ క్రీడా ప్రాంగణం వద్ద టికెట్ల విక్రయాలు చేపట్టనున్నారు.. టికెట్ ధరలు రూ.600, రూ.1,500, రూ. 2000, రూ. 3000, రూ.3,500, రూ. 6000గా నిర్ణయించారు.. ఆన్‌లైన్‌లో టికెట్లకు వచ్చిన డిమాండ్ చూస్తే.. ఆఫ్‌లైన్ కోసం కూడా భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉంది.. దీంతో.. కౌంటర్ల వద్ద తోపులాట, తొక్కిసలాటలకు తా వివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. కాగా, ఇప్పటికే ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది భారత్.. నాల్గో టెస్ట్ డ్రాగా ముగిసిన విషయం విదితమే.. ఇక. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ నెల 17న జరగనుండగా.. రెండో వన్డే 19వ తేదీన విశాఖపట్నంలో నిర్వహిస్తారు.. మూడో వన్డే చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. విశాఖపట్నంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ 2019లో జరిగింది. గత ఏడాది మాత్రం ఇక్కడ ఒక టీ20 మ్యాచ్ మాత్రమే జరిగింది. నాలుగేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ విశాఖలో జరుగుతుండడంతో.. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.