సెలవుపై విదేశాలకు ఏపీ సీఐడీ చీఫ్..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు విడుదలైన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఏపీ సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ సెలవులపై విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లనున్నారట సంజయ్.. ఇక, సెలవుపై వెళ్లేందుకు సంజయ్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అయితే, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. మరోవైపు.. సంజయ్ విదేశాల నుంచి తిరిగి వచ్చేంత వరకు వేరే అధికారులకు సీఐడీ బాధ్యతలు అప్పగించాలని డీజీపీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి సంజయ్ తిరిగొచ్చాక సీఐడీ చీఫ్ గా రీ-పోస్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్ జవహర్‌రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ప్రజలు గెలిచారు.. నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి తిరుగులేని విజయాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ.. 11 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను మొత్తం కైవసం చేసుకుంది కూటమి.. ఇక, ఈ అద్భుత విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ‘ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చారు చంద్రబాబు. ‘ఆంధ్రప్రదేశ్ గెలిచింది.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిచారు.. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు.. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచాం. కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతాం. ఏపీ భవిష్యత్తు కోసం మేమున్నామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి.. జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు.. ఈ మహత్తర విజయం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి, అంకితభావం వల్ల సాధ్యమైంది. చివరి ఓటేసే వరకు ధైర్యంగా పోరాడారు. కూటమి కాక్యకర్తలు, నేతల అచంచలమైన నిబద్ధతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు.’ అంటూ ట్వీట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు… విషయం ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాగా, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బంపర్ విక్టరీ కొట్టింది.. అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ మెజార్టీ సాధించింది. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ.. ఈ సారి మాత్రం ఆ మార్క్‌ను చేరుకోలేకపోయింది.. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది.. దాంతో, ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ.. ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సహా కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇక, ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి సొంతంగా 241 సీట్లు వచ్చాయి.. 16 సీట్లతో టీడీపీ రెండో స్థానంలో ఉంది.. 12 సీట్లతో జేడీయూ మూడో స్థానంలో ఉంది.. చంద్రబాబు, నితీష్ కుమార్.. ఇప్పుడు ఎన్డీఏలో కింగ్ మేకర్లు.. ఎన్డీఏ కూటమిలో వారి పాత్ర కీలకంగా మారింది.. దాంతో.. ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సమావేశంలోనే ఎన్డీఏ కన్వీనర్‌ని ఎన్నుకునే అవకాశం ఉంది. మరో వైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టడంతో మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు చంద్రబాబు.. ఆయన ప్రమాణస్వీకారానికి ఢిల్లీ పెద్దలను కూడా ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు.
గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయడం కుదరదు..
గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి తెలంగాణ హైకోర్ట్ మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనందున ఈ దశలో వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొచ్చింది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీంక్ష ఉండటంతో గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను మరో తేదీకి మార్చాలని ఎం.గణేశ్, భూక్యా భరత్‌లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ పై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేయగా.. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.. రాష్ట్రంలో రెండు ఇంటెలిజెన్స్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.. కానీ, గ్రూప్-1 పరీక్షకు 4 లక్షల మందికి పైగా ఆశావహులు పోటీ పడుతున్నారని వెల్లడించారు. కొంత మంది కోసం లక్షల మంది భవిష్యత్తును పణంగా పెట్టడం సరి కాదని టీజీపీఎస్సీ లాయర్ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి కార్తీక్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేసేందుకు నిరాకరించారు. ఈ నెల 1వ తేదీన పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి టీజీపీఎస్సీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను క్లోజ్ చేసింది.
నేటి నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్‌లోకి సందర్శకులకు నో పర్మిషన్
లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇక, వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చకచక కొనసాగుతున్నాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సైతం చేయనుండటంతో నేటి ( జూన్ 5) నుంచి ఈ నెల 9వ తేదీ వరకు సాధారణ ప్రజానీకాన్ని రాష్ట్రపతి భవన్‌లోకి అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం ఓ ప్రకటన విడుల చేసింది. కాగా, నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని మోడీ చర్చించనున్నారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలంటూ రాష్ట్రపతిని బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి కోరనుంది. అటుపై ప్రధాని మోడీ సారథ్యంలో కొత్త క్యాబినెట్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీంతో రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చేస్తుండటంతో సామాన్య ప్రజలకు అనుమతిని నిరాకరించారు.
చిన్న వయసులో ఎంపీలుగా రికార్డు.. ముగ్గురూ ఒకే రాష్ట్రం..ఒకే పార్టీ
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు. యూపీకి చెందిన కౌశాంబి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేబినెట్ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడు పుష్పేంద్ర సరోజ్‌కు అఖిలేష్ టికెట్ ఇచ్చారు. పుష్పేంద్ర సరోజ్ తన తండ్రి ఓటమికి బీజేపీకి చెందిన వినోద్ సోంకర్‌పై లక్షా 3 వేల 944 ఓట్ల తేడాతో ప్రతీకారం తీర్చుకున్నారు. పుష్పేంద్రకు 5 లక్షల 9 వేల 787 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సోంకర్‌కు 4 లక్షల 5 వేల 843 ఓట్లు వచ్చాయి. 2019లో బీజేపీ అభ్యర్థి వినోద్ సోంకర్ ఇంద్రజిత్ సరోజ్‌పై 38,742 ఓట్లతో విజయం సాధించారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా పుష్పేంద్ర సరోజ్ రికార్డు సృష్టించారు. ఈ ఏడాది మార్చి 1న పుష్పేంద్ర సరోజ్ తన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. యూపీలోని మచ్లిషహర్ స్థానం నుంచి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే తూఫానీ సరోజ్ కుమార్తె ప్రియా సరోజ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రియా సరోజ్ 35 వేల 850 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి భోలానాథ్ (బీపీ సరోజ్)పై విజయం సాధించారు. ప్రియా సరోజ్‌కు 4,51,292 ఓట్లు రాగా, బీపీ సరోజకు 4,15,442 ఓట్లు వచ్చాయి. గతేడాది నవంబర్‌లో ప్రియా సరోజ్‌కి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రియా ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. ఎన్నికలకు ముందు ఆమె సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. కైరానా స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ 29 ఏళ్ల ఇక్రా చౌదరికి టికెట్ ఇచ్చింది. ఇక్రా చౌదరి 69 వేల ఓట్లతో గెలుపొందారు. ఆమెకు మొత్తం ఐదు లక్షల 80 వేల 13 ఓట్లు వచ్చాయి. కాగా.. బీజేపీ అభ్యర్థి ప్రదీప్ చౌదరికి నాలుగు లక్షల 58 వేల 897 ఓట్లు వచ్చాయి. ఇక్రా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుంచి పట్టభద్రురాలయ్యారు. లండన్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఆమె వరుసగా మూడోసారి కైరానా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చౌదరి నహిద్ హసన్‌కి చెల్లెలు.
ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ.. ఇంగ్లండ్‌కు నిరాశ!
టీ20 ప్రపంచకప్ 2024లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. గ్రూప్-డిలో భాగంగా మంగళవారం డల్లాస్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో డచ్ టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35; 37 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు టిమ్ ప్రింగిల్ (3/20), వాన్‌బీక్ (3/18), మేకరన్ (2/19), డిలీడ్ (2/22) ఆకట్టుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒడౌడ్ (54 నాటౌట్; 48 బంతుల్లో 4×4, 1×6) హాఫ్ సెంచరీ చేయగా.. విక్రమ్‌జీత్ సింగ్ (22; 28 బంతుల్లో 4×4) రాణించాడు. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-బిలో భాగంగా స్కాట్లాండ్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ నిర్ణీత 10 ఓవర్లలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జ్ మున్సీ (41 నాటౌట్; 31 బంతుల్లో 4×4, 2×6), మైకెల్ జోన్స్ (45 నాటౌట్; 30 బంతుల్లో 4×4, 2×6) చెలరేగారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ రద్దయింది. స్కాట్లాండ్ జట్టు 6.2 ఓవర్లలో 51/0తో ఉన్నప్పుడు తొలిసారి వర్షం పడింది. చాలా సమయం వృథా కావడంతో.. ఇన్నింగ్స్‌ను పది ఓవర్లకు కుదించారు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్ పూర్తికాగానే మరోసారి వర్షం పడింది. భారీ వర్షం కారణంగా తిరిగి ఆట సాధ్యం కాలేదు. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఒకవేళ ఆట ప్రారంభమై ఉంటే డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లండ్ 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది. పసికూనపై విజయం సాధించాలని బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నిరాశే ఎదురైంది.
మధ్య వయసు గల వ్యక్తితో రొమాన్స్.. రకుల్ పోస్ట్ వైరల్!
ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్, రకుల్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే ప్యార్ దే 2’. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో రకుల్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ‘నా ఫేవరెట్ సినిమా దే దే ప్యార్ దే 2 సెట్స్‌లో జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది’ అని రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో విడుదలైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. సీక్వెల్‌కు అకివ్ అలీకి బదులుగా అన్షుల్ శర్మ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మధ్య వయసు గల ఆశిష్ అనే వ్యక్తి 20 ఏళ్ల ఆయేషా ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. వయసుతో సంబంధం లేకుండా మొదలైన వీరిద్దరి ప్రేమ.. గెలిచిందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.