అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!
అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలోని సాహితి ఫార్మాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం.. తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుల కళ్లలో కన్నీళ్లను మిగిల్చింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం చుట్టేశాయి. పొగలు పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలుముకున్నాయి. ఘాటు వాయువులు గాల్లోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిన్న ఉదయం 11.10 నిముషాలకు సాహితీ ఫార్మా యూనిట్-1లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్ డంప్ చేస్తుండగా ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. యార్డులోని రసాయనాలకు అంటుకున్న నిప్పు రియక్టర్ల వరకు వ్యాపించింది. దీంతో భారీ శబ్దంతో పేలడంతో.. మంటలు మరింత ఉధృతంగా ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో 35మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా.. ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు వైద్యులు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటాన స్థలానికి చేరుకున్న 11 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రావడంతో ఫోమ్ ఫైర్ ఫైటర్లను రప్పించారు. వారి రంగ ప్రవేశం తరువాత మంటలు తగ్గుముఖం పట్టాయి. NDRF, SDRF బృందాలు ఐదు గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇటీవల జరిగిన అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదం ఇదే. భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతులకు 25 లక్షలు, గాయపడ్డ వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు దగ్గుబాటి.. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది.. ఇక, వెంటనే ఆయనను సన్నిహితులు ఆలయం వద్ద కొద్దిసేపు సేద తీర్పించారు.. పూజా కార్యక్రమాలు పూర్తి కాకముందే ఆయన అస్వస్థకు గురయ్యారు.. అయితే, కుటుంబసభ్యులు, సన్నిహితులు పూజా కార్యక్రమాలు పూర్తి చేసే వరకు ఆయన అక్కడే కూర్చిండిపోయారు.. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలోనూ అస్వస్థతకు గురయ్యారు.. గుండె నొప్పి రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న విషయం విదితమే.
రన్నింగ్ బస్సులో మంటలు.. 25 మంది సజీవదహనం
మహారాష్ట్రలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. సమృద్ధి మహామార్గ్ దగ్గర బస్సుకు నిప్పంటుకోవడంతో.. 25 మంది సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి బస్సు పుణె వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు అంటుకున్నాయి.. బస్సు రన్నింగ్‌లో ఉండడంతో క్షణాల్లో బస్సుకు మొత్తం మంటలు వ్యాపించాయి.. దీంతో.. ఆ మంటల్లో చిక్కుకుని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో.. బస్సులో మంటలు చెలరేగాయి.. ప్రమాద సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉండడంతో ప్రాణనష్టం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు..
నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర..
సుప్రసిద్ధ అమర్‌నాథ్ యాత్రకు.. జమ్మూకశ్మీర్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇవాళ్టి నుంచి యాత్రికులు.. మంచు శివలింగం దర్శనానికి వెళ్లనున్నారు. ఇవాళ్టి నుంచి ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం.. వార్షిక యాత్ర రెండు నెలలు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. రెండు మార్గాల ద్వారా అమర్‌నాథ్ గుహకు చేరుకోనున్నారు భక్తులు. మొదటి మార్గంలో వెళ్లేవారు పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి.. అక్కడి నుంచి గుహకు చేరుకుంటారు. రెండోమార్గం శ్రీనగర్ నుంచి బాల్తాల్‌కు వెళ్లి.. అక్కడి నుంచి 14 కిలోమీటర్ల ప్రయాణించి.. మంచులింగాన్ని దర్శించుకుంటారు. అమర్‌నాథ్ యాత్ర కాన్వాయ్, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని.. దాడులు జరగవచ్చని నిఘా విభాగం హెచ్చరించింది. ఇందు కోసం ఇద్దరు కశ్మీరీ యువకులకు బాధ్యతలు అప్పగించినట్లు ఇంటెలిజెన్సీ హెచ్చరించింది. రాజౌరీ-పూంఛ్, పిర్ పంజాల్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాల్లో ఉగ్రదాడుల జరిగే ఛాన్స్ ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దాడులకు పాల్పడుతారని అనుమానిస్తున్న ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వారి కుటుంబసభ్యులపైన నిఘా పెట్టారు. ఇక, పాకిస్తాన్ కేంద్రంగా విధ్యంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయ్. అడుగడుగునా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్‌తో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు నిఘాను పర్యవేక్షిస్తున్నారు. గత ఏడాది యాత్ర మధ్యలో భీకర గాలులు వ్యాపించడం.. వరదలు రావడంతో.. ఐటీబీపీ సిబ్బంది అద్భుతంగా పని చేసింది.
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది మృతి!
కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి పశ్చిమ కెన్యాలో రద్దీగా ఉండే లొండియాని జంక్షన్‌లో ఓ ట్రక్ అదుపుతప్పి.. ఇతర వాహనాలను ఢీ కొట్టింది. అంతేకాదు స్థానిక విక్రయదారులు, పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందినట్లు గుర్తించామని రిఫ్ట్ వ్యాలీకి చెందిన ప్రాంతీయ పోలీసు కమాండర్ టామ్ మ్బోయా ఒడెరో తెలిపారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.
లాటరీలో రూ.కోటి గెలిచాడు.. కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు..
లాటరీలకు పెట్టింది పేరు కేరళ. రకరకాల అకేషన్ ల పేరుతో లాటరీలు వేస్తుంటారు. ఆ లాటరీలతో సామాన్యులు కోటీశ్వరులు అవుతుంటారు. ప్రభుత్వ ఆధీనంలోనే లాటరీలు నడుస్తుంటాయి. లాటరీ అనేది కేరళ రాష్ట్రంలో తప్పుకాదు. కేరళలో నిర్వహించిన ఒక లాటరీలో ఓ వలస కార్మికుడు కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ తరువాత వెంటనే అతడిని భయం వేటాడింది. నన్ను కాపాడాలంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. విషయం తెలియని పోలీసులు ఎవరైనా అతనిని వెంటాడుతున్నారేమో అని భావించారు. కానీ అతను చెప్పిన విషయం విని అవాక్కయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిర్షు రాంబా అనే కార్మికుడు కేరళకు వలస వెళ్లాడు. ప్రస్తుతం కేరళలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ లాటరీ అధికారికమే కాబట్టి సరదాగా ఓ లాటరీ కొన్నాడు. దాని పేరు 50-50. అతడిని అదృష్టం వరించింది. అతడు కొన్న లాటరీ నెంబర్ కు కోటి రూపాయల బహుమతి దక్కింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఒక క్షణం సంతోషంతో తేలిపోయాడు. వెంటనే అతడిని భయం పట్టుకుంది. ఎందుకంటే.. ఆ డబ్బుల కోసం తనను ఎవరైనా చంపేస్తారేమో అని ఆందోళన చెందాడు. వెంటనే రాంబా సమీపంలో ఉన్న తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. పోలీసులకు తను లాటరీ కొనడం, దానికి బహుమతి రావడం అన్ని చెప్పాడు. తనని ఎవరైనా డబ్బుల కోసం చంపేస్తారేమోనని తనకు రక్షణ కల్పించాలంటూ కోరాడు. అంతేకాదు.. లాటరీలో గెలుచుకున్న డబ్బులను ఎలా తీసుకోవాలో కూడా తనకు తెలువదని.. నిర్వాహకుల నుంచి ఆ డబ్బులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదంతా విన్న పోలీసులు అవాక్కై ఆ తర్వాత.. ఏం కాదు అని జాగ్రత్తగా ఉండమంటూ చెబుతూ.. అతనికి డబ్బులు ఇప్పిచ్చేలా చర్యలు చేపట్టారు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని రాంబాకు పోలీసులు సూచించారు.
పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!
వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,850లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. నేడు బంగారం ధరలు పెరగ్గా.. వెండి ధరలు కాస్త తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 71,400లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. ముంబైలో కిలో వెండి ధర రూ.71,400లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,800లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,250గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 74,800లుగా నమోదైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 74,800ల వద్ద కొనసాగుతోంది.