ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను జరుపుకుంటున్నారు ప్రజలు.. ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ.. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు వచ్చింది.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
మళ్లీ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర.. ఇచ్చాపురం వరకు సాగనుండగా.. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర ఉంది.. అయితే, నేడు ఉగాది పండుగ సందర్భంగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.. శావల్యాపురం మండలం గంటావారిపాలెంలో ప్రత్యేక టెంట్ హౌస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి బసచేసిన విషయం విదితమే కాగా.. నేడు శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఉగాది పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భద్రతా కారణాలు, పరిమిత స్థల కారణాల రీత్యా, ముఖ్య నాయకులకు మాత్రమే పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు..
నేటి నుంచి భద్రాద్రిలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
నేటి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానము నందు శ్రీరామనవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉదయం అంతరాలయంలోని ధ్రువమూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారోహణం చేయనున్నారు. వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యాహవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరుమంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17వ తేదీన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం, 18వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఈవో వెల్లడించారు. ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొనుగోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశామని ఈవో రమాదేవి పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా స్వామివారి తలంబ్రాలను భక్తులకు అందజేస్తామని, ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా కూడా భక్తులకు తలంబ్రాలను ఇంటి వద్దకే అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి ఈ నెల 17 ఉదయం 6 గంటల వరకు ఒరిజినల్ టికెట్లను అందజేస్తామన్నారు.
బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థులపై ఇంకా ఎడతెగని ఉత్కంఠ
దేశంలో మొదటి, రెండో దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే దేశంలోని రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల అభ్యర్థిత్వంపై కొన్ని ముఖ్యమైన స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ ఇప్పటి వరకు 418 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇప్పటి వరకు 92 మంది సిట్టింగ్ ఎంపీల టిక్కెట్లను పార్టీ రద్దు చేసింది. ఇది కాకుండా ఇప్పటికే కొందరు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా మారారు. ఈ విధంగా బీజేపీ ఇప్పటి వరకు 104 మంది ఎంపీలను మార్చింది. ఇంకా 35-40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 436 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి బీజేపీ దాదాపు 450 స్థానాల్లో పోటీ చేయనుంది. గందరగోళంగా ఉన్న చాలా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. మహారాష్ట్రలోని ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. గత రెండుసార్లు ఈ సీటును వరుసగా గెలుస్తూ వస్తున్నారు. బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2004, 2009లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ స్థానం నుంచి బీజేపీ కొత్త అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే యూపీలోని కైసర్‌గంజ్ సీటులోనూ సమస్య ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, వివాదాస్పద బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయనపై మహిళా రెజ్లర్లు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్రిజ్ భూషణ్‌కు మళ్లీ టికెట్ ఇచ్చే ఆలోచనలో పార్టీ లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో తన భార్య లేదా కుమారుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సమాచారం. అయితే, బ్రిజ్ భూషణ్ దీనికి సిద్ధంగా లేకపోవడంతో ఇక్కడ ఇంకా ఏమీ ప్రకటించలేదు. వీఐపీ సీటుగా భావించే రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.
ఇజ్రాయెల్ కొత్త ప్రతిజ్ఞ.. కలకలం రేపుతున్న నెతన్యాహు వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆయన మాటలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణ గాజా నగరమైన రఫాను ఆక్రమిస్తామని నెతన్యాహు ప్రతిజ్ఞ బూనారు. దీనిపై దండెత్తేందుకు ఒక తేదీ ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. హమాస్‌కు బలమైన స్థావరంగా ఉన్న రఫాకు బలగాలను పంపిస్తామని గతంలోనే నెతన్యాహు అనేక మార్లు చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి పునరుద్ఘాటించారు. అయితే నెతన్యాహు వ్యాఖ్యలను అమెరికా సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రఫాకు బలగాలను పంపిస్తే.. అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 14 లక్షల మంది పౌరుల జీవితాలు ప్రమాదంలో పడతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2023, అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన మెరుపుదాడులతో ప్రారంభమైన గాజా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తమపై ఉగ్రదాడులకి పాల్పడినందుకు గాను.. హమాస్‌ని అంతమొందించేదాకా వెనకడుగు వేసేది లేదని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచిన తరుణంలో గాజా యుద్ధంలో తాము ఒక్క అడుగు దూరంలోనే ఉన్నామని, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా ఎలాంటి సంధి ఉండబోదని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇక ఏప్రిల్ 1న గాజాలో జరిపిన వైమానిక దాడిలో యూఎస్ ఆధారిత ఫుడ్ ఛారిటీ వరల్డ్ సెంట్రల్ కిచెన్‌కు చెందిన ఏడుగురు సహాయక సిబ్బంది చనిపోవడంతో ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఆగ్రహాన్ని ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నెతన్యాహుకి బైడెన్ ఫోన్ చేసి.. తక్షణమే కాల్పుల విరమణకు డిమాండ్ చేశారు. అయితే ఇజ్రాయెల్‌పై జరిగిన దాడుల వెనుక ఇరాన్ ఉందని నెతన్యాహు ఆరోపణలు చేశారు. తమను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో.. వాళ్లను దెబ్బతీస్తామని పేర్కొన్నారు. ఈ సూత్రాన్ని తాము అన్ని సమయాల్లో ఆచరణలో పెట్టామని నెతన్యాహు వెల్లడించారు.
ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను: చెన్నై కెప్టెన్
తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ ఉందని రుతురాజ్ చెప్పుకొచ్చాడు. వరుసగా రెండు ఓటుములు చవిచూసిన చెన్నై తిరిగి పుంజుకుంది. సోమవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ… ‘విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో నా తొలి అర్ధ సెంచరీ సాధించడం ఇంకా గుర్తుంది. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. అప్పుడు ధోనీ భాయ్ నాతో ఉన్నాడు. ఇద్దరం కలిసి మ్యాచ్‌ను మగించాము. ఈ రోజు కూడా అలానే జరిగింది. అజింక్య రహానే గాయపడటంతో చివరి వరకు క్రీజులో ఉండటమే నా బాధ్యతగా భావించాను. పిచ్ చాలా స్లోగా ఉంది. సిక్సులు కొట్టే పిచ్ ఇది కాదు. స్ట్రైక్ రొటేట్ చేసి బౌండరీలు కొడితే.. 150-160 పరుగులు చేయొచ్చు. మా బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు’ అని అన్నాడు.
జాన్వీ కపూర్ వేసుకున్న ఈ డ్రెస్స్ ధర అన్ని లక్షలా?
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా తన టాలెంట్ తో వరుస అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతుంది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఎన్టీఆర్ మాత్రమే కాకుండా రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న ఆర్సి16 మూవీలో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ అమ్మడు వాడే ప్రతి వస్తువు చాలా స్పెషల్ గా ఉండేలా చూసుకుంటుంది.. అందరిలో స్పెషల్ గా కనిపించేందుకు ఎంత ఖరీదైన పెడుతుంది.. తాజాగా జాన్వీ వేసుకున్న డ్రెస్స్ ఖరీదు అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఆ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే జాన్వీ కపూర్ ఒక సింపుల్ గా ఉండే గౌన్లో కెమెరాకి ఫోజులిచ్చింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. చాలా సింపుల్ గా ఉండే గౌను ధర స్పెషల్ గా అనిపిస్తుంది.. ఆ గౌను ధర అక్షరాల రూ. 4 లక్షల కు పైనే ఉంటుంది. ఈ గౌన్ ని నయీమ్ ఖాన్ అనే డిజైనర్ తయారు చేశారట. అయితే చూడ్డానికి సింపుల్గా ఉన్నప్పటికీ ఇది వేసుకుంటే చాలాగ్రాండ్ లుక్ కనిపిస్తోంది.. అయితే అంత ధర ఎందుకు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ డ్రెస్సులో జాన్వీ ఎంజిల్ లాగా ఉంది..