11వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఈ రోజు షెడ్యూల్ ఇదే..
ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని మొత్తం చుట్టేసే పనిలో పడిపోయిన వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించి బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్ బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది.. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఆదివారం రాత్రి.. వెంకటాచలంపల్లి ప్రాంతంలో బస చేసిన విషయం విదితమే కాగా.. ఈ విడిది కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఈ రోజు ఉదయం 9.30 గంటలకు వెంకటాచలంపల్లి వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆ తర్వాత బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డు వరకు బస్సు యాత్ర చేరుకున్న తర్వాత భోజన విరామం ఉంటుంది.. అనంతరం.. చీకటిగల పాలెం మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు వినుకొండ చేరుకోనున్నారు.. ఇక, వినుకొండలో రోడ్ షోలో పాల్గొంటారు వైసీపీ అధినేత.. అనంతరం.. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకోనుండగా.. రాత్రి అక్కడే బస చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. కాగా, మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల్లో విపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు సీఎం జగన్.. తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూనే.. గత ప్రభుత్వ వైఫల్యాలు.. ఎన్నికల పొత్తులపై హాట్ కామెంట్లు చేస్తోన్న విషయం విదితమే.
ఉగాది ఎఫెక్ట్.. పువ్వులకు ఫుల్ డిమాండ్.. ధర ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాలు తెలుగు సంవత్సరాది ఉదగాది వేడుకలకు సిద్ధం అవుతున్నాయి.. అయితే.. ఓ వైపు ఎండలు మండిపోతుండడంతో.. పువ్వుల దిగుమతి తగ్గిపోయింది.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఈ రోజు నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి. అలాగే బంతి పువ్వులు కిలో రూ.80, లిల్లీ రూ.60, మల్లి రూ.700 నుంచి రూ.800, గులాబీ రూ.250 నుంచి 300, కనకాంబరాలు బారు రూ.100 నుంచి రూ.150 కు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పువ్వులు ఇతర జిల్లాలకు ఎగుమతులు జరిగాయి. ఇక, ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతులు ఉండటం వల్ల ఈ పూల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. చామంతిలో కొత్త రకాలు రావడం వల్ల అవి మండే ఎండలను కూడా ఎదురొడ్డి దిగుబడులు ఇస్తున్నాయి. ఇది పూల రైతులకు మంచి పరిణామం. ఈ రకం చామంతిని ఈ ఏడాది కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక, పువ్వులు హోల్‌సెల్ మార్కెట్‌లో ధరలు పోల్చుకుంటే.. బహిరంగ మార్కెట్‌లో మరింత అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.. రైతుల నుంచి వినియోగదారునికి పువ్వులు చేరే సరికి వాటి ధరలు భారీ మార్పులు కనిపిస్తున్నాయి.
నంద్యాలలో దారుణ హత్య.. నిద్రలో ఉండగానే గొంతుకోసి చంపేశారు..!
నంద్యాలలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. దేవనగర్ లో షేక్ షమీర్ అనే యువకుడి గొంతుకోసి ప్రాణాలు తీశారు.. నంద్యాలలోని దర్గా సెంటర్ లో చికెన్ పకోడా వ్యాపారం నిర్వహిస్తున్నాడు మృతుడు షేక్ షమీర్.. అయితే, వేసవి కావడంతో ఉక్కపోత భరించలేక రాత్రి ఇంటి పైకప్పు పై నిద్రించాడు షమీర్.. కానీ, అర్ధరాత్రి దాటాక ఆగంతకులు ఇంటి పై కప్పుపైకి వెళ్లి.. షమీర్ గొంతు కోసి దారుణంగా హత్య చేశారు.. ఇక, తెల్లవారుజామున షేక్ సమీర్ మృతదేహాన్ని చూసి షాక్ తిన్న కుటుంబ సభ్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు.. మరోవైపు.. ఈ హత్యపై కేసు నమోదు చేసిన నంద్యాల 3 టౌన్ పోలీసులు.. విచారణ చేపట్టారు.. అయితే, వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు నంద్యాల పోలీసులు.
కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు కోర్టు తీర్పు..
నేడు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రూస్ ఏవ్ న్యూలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఇరుపక్షాల వాదనలు ముగిశాయని స్పష్టం చేశారు. అనంతరం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, కవిత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారం (రేపటి)తో ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత బెయిల్‌ను కోర్టు తిరస్కరిస్తే.. మంగళవారం మరోసారి కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
మేడ్చల్ కే.ఎఫ్.సి లో కుళ్ళిన చికెన్ లెగ్ పీసులు.. షాక్‌లో వినియోగదారుడు..
హైదరాబాద్ లో కుళ్ళిన ఆహార పదార్థాల అమ్మకం ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అంగట్లో సరుకులు అమ్ముడు పోవడం.. సరా మామూలుగా ఉంటుంది. అయితే కేఎఫ్ సీ రెస్టారెంట్ పేరు చెబితే చాలు నోరు ఊరాల్సిందే. అలాంటి రెస్టారెంట్ లో ఒక్కసారైనా చికెన్ తానాల్సిందే. ఎందుకంటే ఆరెస్టారెంట్ లోని చికెన్ పీస్ లో వున్నరుచి అలాంటిది మరి. అంతేకాదు తినాలంటే.. మనం అక్కడకు వెళ్లి ఆర్డర్ పెట్టి గంటలు వేయిట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా స్విగ్గీ, జుమాటో, ఇలా రకరకాల అప్ లు మనకు అందుబాటులో వున్నాయి. దీంతో ఆ వ్యక్తి ఓ రెస్టారెంట్ ఇచ్చిన ఫుడ్ చూసి దింమ్మతిరిగేంత పని అయ్యింది. ఎందుకంటే అందులో ఆర్డర్ పెట్టిన ఫుడ్ కుళ్లిపోయాయి. షాక్ తిన్న వినియోగదారుడు.. ఫుడ్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు వాసి శివ మేడ్చల్ పట్టణంలోనీ కే.ఎఫ్.సి లో చికెన్ లెగ్ పీసులు ఆర్డర్ చేశాడు. ఆర్డర్ ఒకే చేసిన సిబ్బంది కొన్ని నిమిషాలపాటు చూపించాడు. కేఎఫ్.సీ నుంచి ఆర్డర్ తీసుకుని డిలవరీ చేయాల్సిన ప్రదేశానికి బయలు దేరాడు. ఆర్డర్ చేసిన ప్లేస్ లో డివరీ చేసి అక్కడి నుంచి స్వీగ్గీ బాయ్ వెళ్లిపోయాడు. స్వీగ్గీ ఆర్డర్ తీసుకున్న వినియోగదారుడు శివ పార్సల్ ను ఓపెన్ చేసి చూశాడు. ఆ పార్సల్ లో నుంచి కుళ్లిపోయిన వాసన వచ్చింది. చికెన్ లెగ్ పీసులను పరిశీలించగా కుళ్లిపోయినట్లు గమనించాడు శివ. అంతే కుళ్లిపోయి చికెన్ లెగ్ పీస్‌ల పార్శల్ ను తీసుకుని మేడ్చల్ పట్టణంలో ఉన్న కెఎఫ్ సీ రెస్టారెంట్ కు బయలు దేరాడు.
అబార్షన్ మాత్రలకు నో చెప్పిందని, మహిళకి యాసిడ్ తాగించి హత్య..
ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ జిల్లాలో అబార్షన్ మాత్రలు వేసుకునేందు నిరాకరించినందుకు ఓ యువకుడు గర్భిణిగా ఉన్న మహిళకు యాసిడ్ తాగించాడు. దాదాపుగా నెలన్నర పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సదరు మహిళ చివరకు మరణించింది. బాధితురాలకి అర్మాన్ అనే నిందితుడితో సంబంధం ఉన్నట్లు తేలింది. ఫిబ్రవరి 18న అతను బాధితురాలికి బలవంతంగా యాసిడ్ తాగించాడు. నిందితుడు కొంతకాలంగా బాధితురాలితో స్నేహంగా మెలిగారు. పెళ్లి చేసుకుంటాననే సాకుతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాధితురాలు గర్భం దాల్చింది. అయితే, అర్మాన్ మాత్రం బాధితురాలి గర్భాన్ని తీయించేందుకు అబార్షన్ మాత్రలు వేసుకోవాలని బలవంతం చేశారు. అయితే, అందుకు ఆమె నిరాకారించింది. ఫిబ్రవరి 18న ఓ సీసాలో యాసిడ్ తీసుకువచ్చి, ఆమెకు బలవంతంగా తాగించాడు. బాధితురాలు పోలీసులకు చెప్పిన వాంగ్మూలం ప్రకారం.. అర్మాన్ తనతో స్నేహంగా నటించి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది. పెళ్లి చేసుకుంటాని మోసం చేశాడని చెప్పింది. అబార్షన్ మాత్రలు వేసుకోవడానికి నిరాకరించినందుకు యాసిడ్ తాగించాడని చెప్పింది. నెలన్నర కాలంగా ప్రాణాల కోసం పోరాడిన బాధితురాలు, చివరకు ఏప్రిల్ 7న మరణించింది. సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు.
కరువు సహాయ నిధుల జాప్యాన్ని అంగీకరించిన కేంద్ర మంత్రి.. నిర్మలకు డీకే ధన్యవాదాలు
రాష్ట్రానికి అన్యాయం చేసిందని కేంద్రాన్ని నిందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. రాష్ట్రానికి రావాల్సిన కరువు సహాయ నిధుల విడుదలలో జాప్యాన్ని అంగీకరించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజరాజేశ్వరి నగర్‌లో అపార్ట్‌మెంట్ యజమానులతో సమావేశమైన అనంతరం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల ప్రకటనతో కర్ణాటకకు కరువు సహాయ నిధులు ఆలస్యమయ్యాయని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇలా చెప్పడం ద్వారా కరువు సాయం ఆలస్యమైందని, కేంద్రం అన్యాయం చేసిందని ఒప్పుకున్నారు. కర్నాటకకు, కరువు సహాయం కోసం రాష్ట్రం తగినంతగా చేయడం లేదని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు కరువు సహాయానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకకు కరువు సాయం అందించడంలో జాప్యం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున ఉద్దేశపూర్వకంగా జరగలేదని సీతారామన్ శనివారం చెప్పారు. ఈ క్రమంలోనే కర్ణాటకకు కేంద్రం చేసిన అన్యాయం ప్రజలకు తెలుసునని శివకుమార్ అన్నారు. “నాలుగు నెలల క్రితమే కరువు నివారణకు విజ్ఞప్తి చేశాం.. మా అప్పీల్ తర్వాత నాలుగు నెలలుగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు.. ఇప్పుడు ఆమె ప్రవర్తనా నియమావళిని సాకుగా చూపుతున్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన ఉంది. ఇది డీకేను సమర్థిస్తోంది. సురేశ్ చేస్తున్న ‘మన పన్ను మా హక్కు’ ప్రచారానికి ఆమెకు కృతజ్ఞతలు’’ అని శివకుమార్ అన్నారు.
రష్యాలో అలెక్సీ నవల్నీని విష ప్రయోగంతో చంపలేదా..? గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అఖిలేష్ మద్దతు..
ఇటీవల జైలులో మరణించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ కుటుంబాన్ని ఆదివారం అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్‌లోని అన్సారీ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. బండా జైలులో గుండెపోటుతో మరణించిన అన్సారీ మృతిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్సారీ మరణానికి దారి తీసిన పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగించేవిగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అన్సారీ మరణానికి మద్దతుగా ముస్లింలు ఈద్ జరుపుకోవద్దని సమాజ్ వాదీ పార్టీ సూచించింది. ప్రభుత్వం నిజాన్ని వెల్లడిస్తుందని తాను నమ్మడం లేదని, పారదర్శక విచారణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. జైలు వ్యవస్థలో నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. ఖైదీలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. సాధారణ ప్రలు దీనిని సహజ మరణంగా చూడటం లేదని, అమెరికా, కెనడాల్లో జరిగిన పలు ఘటనల్లో భారత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయని, ముఖ్తాన్ అన్సారీ ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలను పాలుపంచుకునే వాడని ఆయన పేర్కొన్నాడు.
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. సూర్య గ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, నైరుతి ఐరోపాలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని విభాగాలతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు ఈ ఈ సూర్య గ్రహణం చూసే అవకాశం ఉంది. సూర్యగ్రహణాన్ని కంటితో చూడటం కంటికి హానికరం, కాబట్టి మీ కళ్ళు సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్!
ముంబై ఇండియన్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 150వ విజయంను నమోదు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందిన ముంబై.. ఈ అరుదైన ఫీట్ అందుకుంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్(148) రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా (144) మూడో స్థానములో ఉంది. లంకషైర్ (143), నాటింగ్‌హమ్‌షైర్ (143) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ పలు రికార్డులను తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌లో ఒకే వేదికగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో ముంబై 50 విజయాలు నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ 48 విజయాలు, చెపాక్ మైదానంలో సీఎస్‌కే 47 విజయాలు, చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీ 41 విజయాలు, సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ 36 విజయాలు నమోదు చేశాయి. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 14 సార్లు 200లకు పైగా రన్స్ చేసింది. 200 ప్లస్ రన్స్ చేసిన ఏ మ్యాచ్‌లోనూ ముంబై ఓడిపోలేదు. 200 ప్లస్ రన్స్ చేసి ఓడిన జట్లు ఐపీఎల్‌లో చాలానే ఉన్నాయి. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకుండా.. 234 పరుగుల భారీ స్కోర్ చేసిన తొలి జట్టుగా ముంబై నిలిచింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ టీ20 టీమ్ సోమర్‌సెట్ రికార్డును అధిగమించింది. 2018లో సోమర్‌సెట్ ఒక్క బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకుండా 226 పరుగులు చేసింది.
ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?.. అస్సలు ఊహించిఉండరు..
టాలీవుడ్ యంగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ప్రభాస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు.. బాహుబలి సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ప్రభాస్ సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గత ఏడాది వచ్చిన సలార్ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రభాస్ కల్కి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏపీలో ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిందని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా తర్వాత రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2 సినిమాలను కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు.. అందులో రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇదిలా ఉండగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ప్రభాస్ కు అత్యంత ఇష్టమైన ఫుడ్ గురించి పెద్ద చర్చలు జరుగుతున్నాయి.. ఆయన భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే.. ప్రతి ఒక్కరి కడుపు నింపే ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆశ్చర్యాన్ని నెలకొల్పింది.. ఆ ఫుడ్ గురించి అసలు ఊహించిఉండరు.. డార్లింగ్ కు హలీం, గోంగూర పచ్చడి, ఒట్టు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని చాలా మందికి తెలియదు.. ఆయన బయట రెస్టారెంట్ లలో వీటిని తినడు.. ఇంటినుంచి వస్తేనే తింటారట.. ఈ ఫుడ్ గురించి విన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు.. ఎంతైనా ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉండాలిగా..
విడాకులు తీసుకున్న బుల్లితెర హీరో.. ఎందుకో తెలుసా?
ఈ మధ్య వెండి తెర నటీనటులు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఎక్కువగా విడిపోతున్నారు.. మనస్పర్థలు కారణంగా విడిపోయి మరో పెళ్లి చేసుకుంటున్నారు.. అదే విధంగా బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు.. తాజాగా మరో బుల్లితెర నటుడు భార్యతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన ఎవరో, ఎందుకు విడిపోయారో తెలుసుకుందాం.. బుల్లితెర హీరో పవన్ సాయి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. చాలా సీరియల్స్ లో హీరోగా చేసిన పవన్ సాయి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఈయన ముద్దమందారం, మొగలిరేకులు, నాగ భైరవి, మల్లీ,శ్రావణ సమీరాలు వంటి సీరియల్స్ లలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు.. ముద్ద మందారం నాటిక మాత్రం అందరికి గుర్తిండిపోయింది.. అంతేకాదు సినిమాల్లో కూడా నటించాడు.. అయితే ఈ మధ్య నటనకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈయన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. అందులో ఓ అభిమాని వదిన బాగున్నారా అంటూ అడిగాడు.. దానికి స్పందించిన ఆయన నాతో ఎవరూ లేరు నేను ఒంటరివాడిని అని సమాధానం ఇచ్చి షాక్ ఇచ్చాడు.. ఆ మాటలతో తన భార్యతో విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది.. ఇక ప్రస్తుతం పవన్ సాయి పెద్దగా సీరియల్స్ లలో కనిపించినట్లు లేరు..
డైలాగ్ బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు.. ఎలా నటించాలో నాకు తెలుసు: రష్మిక
‘యానిమల్’ సినిమాతో కన్నడ సోయగం రష్మిక మందన్న భారీ హిట్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. గీతాంజలి పాత్రలో రష్మిక తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే కర్వాచౌత్ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమెపై విమర్శలు వచ్చాయి. చాలా మంది రష్మిక డైలాగ్ డెలివరీని విమర్శించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ట్రోలింగ్‌పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించారు. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్ బాగాలేదని తనను ట్రోల్స్ చేశారని, ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో తనకు తెలుసని గట్టి కౌంటర్ వేశారు. ‘నో ఫిల్టర్ నేహా’ ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ… ‘యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్ డెలివరీ బాగాలేదని విమర్శిస్తున్నారు. కర్వాచౌత్ సన్నివేశం గురించి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ సన్నివేశం సినిమాకే ప్రత్యేకం. ఒక్క సీన్‌లోనే ఎన్నో హావభావాల్ని పలికించాల్సి వచ్చింది. అందుకోసం నేనెంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. జనాలకు ఇదేమీ తెలియదు. ఆ సన్నివేశంలో నా నటన చూసి సెట్లో మంచి ప్రశంసలు వచ్చాయి. 9 నిమిషాల సీన్‌లో 10 సెకన్ల డైలాగ్ బాగాలేదని నన్ను ట్రోల్స్ చేశారు. ఎలాంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో నాకు తెలుసు. అందరికీ అన్నీ నచ్చాలని లేదుగా’ అని అన్నారు.