స్పీడ్ పెంచిన సీఎం జగన్.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు సీఎం జగన్. ఈ రోజు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్డులో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం వైఎస్ జగన్.
వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
మరో రెండు రోజుల్లో కొత్త నెల ప్రారంభం కానుంది. ఇంకోవైపు ఎలక్షన్ కోడ్ ఉంది. దీంతో.. పింఛన్ల పరిస్థితి ఏంటి.. ఎవరిస్తారు.. ఎప్పుడిస్తారు అని డైలమాలో ఉన్న అవ్వాతాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతీ నెల ఇచ్చినట్లే ఈసారి కూడా మే నెల ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తామని స్పష్టం చేసింది. పింఛన్ల కోసం సచివాలయాలకు వచ్చే పనిలేకుండా బ్యాంకు ఖాతాల్లో మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించింది. అకౌంట్లు లేనివారికి ఇంటివద్దనే పంపిణీ చేస్తామని తెలిపింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీపై జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలోనే పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో మొత్తం 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా… 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. బ్యాంకు అకౌంట్లు లేనివారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
పిఠాపురం బరిలోకి ఊహించని వ్యక్తి..! ఇంతకీ ఆయన ఎవరు..?
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు హీట్ పెంచుతున్నారు.. ఇక, పిఠాపురం.. ఏపీలో హాట్ సీట్. కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుంటే.. వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. ఇప్పుడు ఊహించని వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. పోటీకి తాను సై అంటూ బరిలోకి దిగాడు.. అయితే, నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మే 13 పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. అయితే, పవన్ కల్యాణ్ పోటీలో ఉండటంతో.. అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంపై పడింది. అయితే.. పవన్ కల్యాణ్‌ను మించి అటెన్షన్ గ్రాబ్ చేశాడో సామాన్యుడు. నామినేషన్లు వేసిన వారిలో ఏడిద భాస్కర్‌రావు ఉన్నాడని వినిపించగానే.. ఎవరాయన అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. ఇంతకీ పిఠాపురంలోకి అనూహ్యంగా తెరపైకి వచ్చిన భాస్కర్‌రావు ఎవరు..? అంటే.. చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి. పిఠాపురానికి చెందిన ఏడిద భాస్కరరావు డిగ్రీలో పొలిటికల్ సైన్స్ చదివారు. ఉద్యోగాలు కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుటుంబాన్ని పోషించుకునేందుకు పాదరక్షలు కుట్టే పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తనలా చదువుకుని ఉద్యోగాలు లభించక.. నిరుద్యోగులుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతీ యువకుల కష్టాలను అందరికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారాయన. స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు చెప్పులు కూడుతూనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు తన చదువు కొనసాగించారు. చెప్పులు కుట్టుకుంటూనే అమెరికా ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన అబ్రహాం లింకన్‌ను ఆదర్శంగా తీసుకున్న భాస్కర్‌రావు.. స్థానికుడిగా తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలేంటి.. వాటి పరిష్కార మార్గాలేంటి సూచిస్తూ.. రాసినవాటినే మేనిఫెస్టోగా చూపిస్తున్నారు భాస్కర్‌రావు. తాను కరెక్ట్ అనిపిస్తే.. తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.
బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి
బర్త్ డే పార్టీకి వెళ్లారు.. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.. కానీ, తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి.. ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు నలుగురు యువకులు.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు యువకులు మృతి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా, మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారికి చికిత్స నిమొత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ ప్రమాదంలో 1.సాపే నవీన్ (22) నగరం, 2. కొల్లాబత్తుల జతిన్ (26), 3. నల్లి నవీన్ కుమార్ (27) , 4. వల్లూరి అజయ్ (18) మృతిచెందినట్టుగా గుర్తించారు.. ఒక బర్త్‌డే వేడుక.. నాలుగు కుటుంబాల్లో విషాధాన్ని నింపినట్టు అయ్యింది.
41.8 డిగ్రీలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలు..
భానుడి భగభగతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే చనిపోతున్నారు. మరో ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లోనూ ఎండ ప్రభావం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ రోజువారీ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు పెరిగాయి. ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందిగా మారింది. గ్రేటర్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పనులు కూడా సాయంత్రం లేదా రాత్రికి వాయిదా పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ పగటిపూట నిర్మానుష్యంగా మారి సాయంత్రం వేళ రద్దీగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
వరంగల్ లో కేసీఆర్ రెండోరోజు పర్యటన.. ముఖ్య నేతలతో సమావేశం..
నేడు వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల పైనా నాయకులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్. నిన్న వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం వరంగల్ ముఖ్యనేతలతో పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్ధేశం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిన్న (ఆదివారం) వరంగల్ జిల్లాలో బస్సుయాత్ర చేపట్టి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్ నేలతో, చరిత్రతో తనకు విడదీయరాని బంధం ఉందన్నారు. 42 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అన్నదమ్ములకు నమస్కారాలు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఈసీ..
దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25వ తేదీన పోలింగ్ జరగబోతుంది. బీహార్ లో 8, హర్యానాలో 10, ఝార్ఖండ్‌లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇవాళ్టి ( సోమవారం ) నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక, దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక, ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు కొనసాగనున్నాయి. జూన్ 1వ తేదీన ఈ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరిగింది.
పాలస్తీనా అనుకూల నిరసనలపై ఉక్కుపాదం.. 200 మంది అరెస్ట్
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడికాయి. విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడే నిరసనకారులకు సంకెళ్లు బిగించారు. అయితే నిరసనల్లో పాల్గొన్న 200 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారు. గత కొద్ది రోజులుగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గాజా పట్టణాన్ని ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. ఇప్పటికీ యుద్ధం సాగుతోంది. ఈ దాడుల్లో అనేకమంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నిరసిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులు ఉక్కుపాదం మోపారు. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల్ని ఇప్పటికే యూనివర్సిటీల్లోంచి తొలగించాయి. అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారు.
ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడమే మా ఓటమికి కారణం కాదు: ప్యాట్ కమిన్స్
టాస్ గెలిచి ముందుగా ఫీల్టింగ్ ఎంచుకోవడం తమ ఓటమికి కారణం కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్ బాగుందని, ఛేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయం తీసుకున్నామన్నాడు. మేము త్వరగా పుంజుకుంటాము అని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 78 పరుగుల తేడాతో ఓడిపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ… ‘ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటేనే గెలుస్తామన్నది నిజం కాదు. గెలవడానికి ఛేదన అత్యుత్తమ అవకాశం అనుకున్నాం. అందుకే టాస్ గెలిచాక బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 210 పరుగులు చేయడానికి వారు బాగా కష్టపడ్డారు. మా బ్యాటింగ్ లైనప్ బాగుంది కాబట్టి.. గెలిచే అవకాశం ఉందని భావించాం. కానీ అలా జరగలేదు. ఈ టోర్నమెంట్‌లో మా ప్లేయర్స్ అందరూ ఎన్నో మ్యాచ్‌లలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి గెలిపించారు’ అన్నాడు. ‘పిచ్ బాగుంది. మొదటి ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంది. మాకు అదే పరిస్థితి ఎదురైంది. మా బ్యాటింగ్ లైనప్ గురించి సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాత్రమే మేం గెలవలేకపోయాం. మేము త్వరగా పుంజుకుంటాము. వచ్చే మ్యాచులలో మంచి ప్రణాళికలతో బరిలోకి దిగుతాం’ అని ప్యాట్ కమిన్స్ చెప్పాడు. ఐపీఎల్ 2024లో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడి.. ఐదింటిలో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన ఆరు మ్యాచులలో మూడు గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.
ఆల్‌టైమ్ రికార్డ్.. 10 బంతుల్లోనే 50 రన్స్!
ఐపీఎల్ 2024లో విదేశీ యువ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆది అందరిని ఆకర్షించాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న ఫ్రేజర్.. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేశాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్ అన్నట్లు అతడి ఇన్నింగ్స్ సాగింది. తాజాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ రెచ్చిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న జాక్స్.. గుజరాత్ టైటాన్స్‌పై విధ్వంసక శతకంతో ఆకట్టుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ తొలుత 16 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. కాస్త స్పీడ్ పెంచిన అతడు అర్ధ శతకాన్ని 31 బంతుల్లో పూర్తి చేశాడు. ఆపై జాక్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో 41 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంటే 10 బంతుల్లో 50 నుంచి 100 స్కోరుకు చేరుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా జాక్స్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి 13 బంతులు తీసుకున్నాడు.
కల్కి టీం లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి బంపర్ ఆఫర్..
పాన్ ఇండియా స్టార్,రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అమితాబ్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజాగా కల్కి టీమ్ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది.. ఈ సినిమాను డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నారు..సైన్స్, పురాణాలు కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి వివరిస్తూ ఊరిస్తున్నాడు.. దాంతో సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.. సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్ హంగామా మొదలైంది.. ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.. ఇలాంటి సమయంలో మేకర్స్ అదిరిపోయే ప్రకటనను అనౌన్స్ చేశారు.. గ్రాఫిక్ డిజైనర్లు, వీడియో ఎడిటర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు, మార్కెటింగ్ ఔత్సాహికులు, ఆసక్తి కలిగిన వారు కల్కి టీం లో చేరవచ్చు అంటూ ఓ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ప్రభాస్ సినిమా అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువే.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ప్రేమంటే ఇదేరా.. మహేష్ తో మంజుల క్యాండిడ్ వీడియో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం మహేష్ తరువాత సినిమా గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ తన తరువాత మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఆ సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపించనున్నాడు.పూర్తిగా ఫిట్ నెస్ పై ఫోకస్ చేస్తూ సరికొత్తగా కనిపించేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇటీవల మహేష్ లుక్ లీక్ అయి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. తాజాగా మహేష్ తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ లో ఓ పెళ్ళికి హాజరయ్యారు.ఈ పెళ్ళికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. ఈ పెళ్ళికి మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని కూడా వచ్చారు. మంజుల మహేష్ బాబుని చూడగానే ఆ జుట్టు ఏంటి ఇంత పెంచేసావు అని కామెంట్ చేసారు .దీనితో వీళ్లిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది. మంజుల, మహేష్ నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.దీంతో మహేష్ అభిమానులు ఈ క్యూట్ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.చాన్నాళ్లకు అక్కాతమ్ముళ్ల సరదా సంభాషణ చూసి మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇది కదరా బ్యూటిఫుల్ మూమెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్,రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం..సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రాజమౌళి ఈ చిత్రం గురించి స్పెషల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం .