మేమంతా సిద్ధం యాత్రకు మళ్లీ బ్రేక్.. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం..
ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది.. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు.. మొన్నటికిమొన్న ఉగాది సందర్భంగా విరామం ఇవ్వగా.. ఈ రోజు ముస్లింలు రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి బ్రేక్ ఇచ్చారు.. ఇక, నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్ పడడంతో.. నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైసీపీ అధినేత.. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. మరోవైపు.. రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులు, సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.. రంజాన్ సందర్భంగా దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలని ఆకాక్షించారు.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు.. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక… ఆ అల్లాహ్ దీవెనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
ఏం కష్టం వచ్చిందో..? విశాఖలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖపట్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు ఆత్మహత్య కలకలం రేపుతోంది.. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శంకర్రావు గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు.. ఈ రోజు ఉదయం 5 గంటలకు డ్యూటీకి వెళ్లిన శంకర్రావు తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని విశాఖ పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఐవోబీ బ్యాంకులో గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్నారు శంకర్రావు.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.. అయితే, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అసలు శంకర్రావు ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటి అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కుటుంబ సమస్యలా? లేదా విధుల్లో ఒత్తిడి ఏమైనా ఉందా? ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం.. నేడు అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇద్దరి పర్యటన కొనసాగనుంది.. అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు.. పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరగబోయే ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. మధ్యాహ్నం అంబాజీపేట, సాయంత్రం అమలాపురం బహిరంగ సభలో పాల్గొననున్నారు ఇద్దరు నేతలు.. అయితే, ఇరు పార్టీల అధినేతలు వచ్చేందుకు వీలుగా అంబాజీపేట హైస్కూలులో హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.. వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. విముక్తాంధ్రప్రదేశ్ సాధించడమే ధ్యేయంగా జరగబోయే సభకు ప్రతి ఒక్కరు రావాలన్న టీడీపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు నేడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఉమ్మడి బహిరంగ సభ దృష్ట్యా అమలాపురంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. అమలాపురం మీదుగా వెళ్లే వాహనాలకు అమలాపురం పట్టణంలోకి అనుమతిలేదని స్పష్టం చేశారు.. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లు ఉంటాయని పేర్కొన్నారు.. కాకినాడ, రాజమండ్రి, రాజోలు, పి.గన్నవరం వైపు వెళ్లే వాహనాలను వివిధ మార్గాల్లో మళ్లించామని.. ట్రాఫిక్ ఆంక్షలు, సూచనలు గమనిస్తూ.. ఇబ్బంది లేకుండా.. ప్రయాణికులు తమ ప్రయాణాలు కొనసాగించాలని సూచించారు పోలీసులు.
తెలంగాణ ప్రజలకు చల్లటికబురు.. నేడు, రేపు తేలికపాటి వర్షాలు!
రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నిర్మల్, ములుగు, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశ ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
దేశ ప్రజలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు. బుధవారం కేరళ, లడఖ్‌లలో ఈద్‌ను ఘనంగా జరుపుకున్నారు. కాగా, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ పండుగను గురువారం జరుపుకోనున్నారు. ప్రెసిడెంట్ ముర్ము తన శుభాకాంక్షలను తెలియజేస్తూ.. ఈ పండుగ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం, ప్రార్థనల ముగింపును సూచిస్తుంది. ప్రేమ, సోదరత్వ సందేశాన్ని ఇస్తుంది. ఈ పండుగ ఐక్యత, క్షమాపణ, దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది. పేదలు, అణగారిన ప్రజలకు సహాయం చేయడానికి, వారితో మన ఆనందాన్ని పంచుకోవడానికి ఈద్ ఒక అవకాశమని అన్నారు. ఈ పండుగ మనల్ని ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి, సమాజ పురోభివృద్ధికి పాటుపడేలా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ముయిజ్జుకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య చిరకాల సాంస్కృతిక సంబంధాలను కూడా ఆయన ప్రస్తావించారు. సాంప్రదాయ ఉత్సాహంతో జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్, కరుణ, సోదరభావం, సంఘీభావం యొక్క విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు గుర్తుచేస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
ఎన్నికల వేళ షాక్.. డీకేకు లోకాయుక్త నోటీసులు
సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్తుల కేసులో డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌కు కర్ణాటక లోకయుక్త నోటీసులు జారీ చేసింది. ఆస్తుల కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. ఈ కేసులో విచారణకు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాలని తాజాగా డీకే శివకుమార్‌ను లోకాయుక్త కోరింది. గతంలో ఈ కేసును సీబీఐ విచారించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం కర్ణాటకలో ప్రభుత్వం మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఏర్పడ్డాక.. దానిని ఉపసహరించింది. దీంతో ఈ కేసు ఈ ఏడాది ప్రారంభంలో లోకాయుక్తకు బదిలీ చేయబడింది. గతంలో సీబీఐకి సమర్పించిన ప్రతాలను తమకు కూడా అందజేయాలని తాజాగా డీకే.శివకుమార్‌కు పంపిన నోటీసులో వెల్లడించింది. ఆదాయానికి మించి రూ.74.93 కోట్లు అక్రమాస్తులు కూడబెట్టారని డీకే శివకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.
చైనాతో సంబంధాలపై మోడీ కీలక వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల వేళ చైనాతో సంబంధాలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు భారత్‌కే కాదు.. ప్రపంచానికీ కీలకమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ‘న్యూస్ వీక్’ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక చర్చల్లో భారత్-చైనా సరిహద్దు పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. రెండు దేశాల మధ్య బంధం ఉందని మోడీ చెప్పుకొచ్చారు. చైనాతో మాకే కాదు.. ప్రపంచానికి సంబంధాలు ముఖ్యమేనని పేర్కొన్నారు. సానుకూల చర్చల ద్వారా శాంతిని పునరుద్ధరిస్తామని ప్రధాని వెల్లడించారు. భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళుతోందని, దౌత్యపరంగా, శాస్త్రీయంగా, సైనికపరంగా ఎదుగుతున్న తీరు.. భారత్‌ను ఓ వర్ధమాన సూపర్ పవర్‌గా నిలబెడుతోందని ప్రధాని వివరించారు. సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలన్నారు. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందని పేర్కొన్నారు.
బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి వచ్చేసిన కొత్త పల్సర్ బైక్.. ఫీచర్స్ అదుర్స్..
యూత్ కు బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కొత్త బైకులు వస్తే వెంటనే వాటిని కోనేస్తారు.. అందులోనూ పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు ఫీచర్స్ మాములుగా లేవని వార్తలు వినిపిస్తున్నాయి.. బజాజ్ పల్సర్ తయారీ సంస్థ అప్ డేటెడ్ పల్సర్ N250ని లాంచ్ చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ.. పల్సర్ N250 ఫీచర్స్..గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది.. కానీ ఈ ఏడాదికి గానూ ఎన్ 250ని లాంచ్ చేసింది. ఇక త్వరలోనే పల్సర్ F250ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.. ఈ బైకు టర్న్- బై – టర్న్ నావిగేషన్తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో వచ్చింది. అలాగే 50లో USD ఫోర్ట్స్ ఉన్నాయి.. ఈ కొత్త బైకుకు 140 – సెక్షన్ వెనుక టైర్ ఉంది. ఇది రైడ్ ఎబిలిటీని పెంచుతుంది.. ఇంకా అనేక ఫీచర్స్ ఉన్నాయి..
సన్‌రైజర్స్ జట్టులోకి నన్నెందుకు తీసుకోలేదు.. మూడీని ప్రశ్నించిన రాయుడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తెలుగు తేజం, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున ఆడాడు. ముంబై, చెన్నై జట్లు టైటిల్స్ గెలిచిన జట్టులో రాయుడు భాగం అయ్యాడు. 38 ఏళ్ల రాయుడు ఇంకా 2-3 ఏళ్లు ఆడే అవకాశం ఉన్నా.. రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఐపీఎల్ 2023 అనంతరం అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ అనంతరం రాజకీయాల్లోకి వెళుదామనుకున్నా అది కుదరక.. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ, రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఐపీఎల్ 2024లో భాగంగా టామ్ మూడీ, అంబటి రాయుడులు ఓ మ్యాచ్‌కు కామెంట్రీ చెప్పారు. ఈ సందర్భంగా మూడీని రాయుడు ఓ ప్రశ్న అడిగాడు. ‘లోకల్ ఆటగాడిగా నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూడడాన్ని ఇష్టపడుతా. సన్‌రైజర్స్ ప్రత్యర్థిగా ఆడటాన్ని కూడా ఆస్వాదించా. ఓ తెలుగు ప్లేయర్‌గా హైదరాబాద్ జట్టుకు కూడా ఆడాలనుకున్నా. మీరు కోచ్‌గా ఉండి కూడా నన్ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదు’ టామ్ మూడీని రాయుడు ప్రశ్నించాడు. అంబటి రాయుడు ప్రశ్నకు టామ్ మూడీ స్పందిస్తూ… ‘నిన్ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకోవడానికి మేం చాలా ప్రయత్నించాం. ఎందుకంటే నువ్ కూడా బ్యాక్‌వార్డ్ పాయింట్ దిశగా కట్ షాట్స్ అద్భుతంగా ఆడుతావు. కానీ హోమ్ స్టేట్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు నీకు కాలం కలిసి రాలేదు. హైదరాబాద్‌లో నీకున్న ఫాలోయింగ్‌కు ఒక్కసారైనా ఆరెంజ్ జెర్సీలో ఆడుంటే బాగుండేది’ అని తెలిపాడు. రాయుడు 204 ఐపీఎల్ మ్యాచ్‌లలో 4348 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తా: నవదీప్
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ మౌళి’. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పంఖురి గిద్వానీ హీరోయిన్‌గా నటించగా.. భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న లవ్ మౌళి సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురంలోని శ్రీపాద వల్లభుడిని చిత్ర యూనిట్ దర్శించుకుంది. లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేసిన సందర్భంగా శ్రీపాద వల్లభుడి ఆలయంలో చిత్ర బృందం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నవదీప్ విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం చేస్తానని తెలిపారు. నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. నిజాయతీగా ఎవరు పోటి చేసినా ప్రజలు ఆదరిస్తారన్నారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయిన వంగా గీత.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.
గీతాంజలి మళ్లీ వచ్చింది హిట్ కొట్టిందా? ఎలా ఉందంటే?
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదవలేదు..ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ గా మరో సినిమా వస్తుంది.. కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడుతున్నాయి.. అయినా సీక్వెల్ సినిమాలు తగ్గట్లేదు.. హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది..కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి అనే కామెడీ హారర్ మూవీ బాగానే క్లిక్ అయింది. హారర్ కథకు కామెడీ జోడించిన కోన వెంకట్ ఫార్మూలా బాగానే నచ్చింది.. ఇప్పుడు మళ్లీ గీతాంజలి సినిమా వచ్చేసింది.. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాను రంజాన్ సందర్బంగా విడుదల చేశారు.. యూఎస్‌లో షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి అయితే ఇంకా అంతగా రెస్పాన్స్ రాలేదు. సోషల్ మీడియాలోనూ అంతగా హడావిడి కనిపించడం లేదు.. అయితే ఈ మూవీకి ట్విట్టర్ లో జనాలు ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూద్దాం.. ఈ సినిమా డీసెంట్ కామెడీ హారర్ మూవీ.. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్స్ తప్పా.. చాలా వరకు ఎంటర్టైన్ చేశారని చెబుతున్నారు. కమెడియన్ కాస్టింగ్ అదిరిపోయిందట. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు.. కామెడీ సినిమాకు బాగుందని చెబుతున్నారు..కామెడీ సినిమాకు ప్లస్ అయ్యిందని చాలా మంది ట్విట్టర్ యూజర్స్ చెబుతున్నారు.. కొందరికి ఫస్ట్ ఆఫ్ నచ్చితే, రెండో ఆఫ్ కూడా హిలేరియస్ కామెడితో నవ్విస్తుంది.. బోర్ కొట్టకుండా నవ్విస్తుందని ఓ యూజర్ రాసుకొచ్చాడు.. ట్విట్టర్ లో మూవీకి రెస్పాన్స్ అయితే బాగానే వస్తుంది.. అంజలి 50 వ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కోన వెంకట్ సైతం ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకోవడంతో ఈ సినిమా కాస్తైనా జనాల్లోకి వెళ్లింది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి..