12వ రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇలా..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ప్రచారంలో దూకుడు పెంచారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొదట సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన ఆయన.. ఇప్పుడు మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న విషయం విదితమే.. అయితే, ఉగాది సందర్భంగా మంగళవారం రోజు ఒక్కరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. ఈ రోజు 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించనున్నారు.. ఈ రోజు ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం రాత్రి బస నుంచి బయలుదేరనున్నారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ దగ్గరకు చేరుకుని సీఎం జగన్ మధ్యా్హ్న భోజన విరామం తీసుకోనున్నారు. ఆ తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా ఈ రోజు మధ్యాహ్నం 3. 30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ తర్వాత కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ళ దగ్గర రాత్రి బస చేసే శిబిరానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. కాగా, ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఇచ్చాపురం వరకు కొనసాగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన విషయం విదితమే.
శ్రీశైలంలో నేటితో ముగియనున్న ఉగాది మహోత్సవాలు
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో నేటితో ఉగాది మహోత్సవాలు ముగియనున్నాయి.. ఉదయం శ్రీస్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి నిర్వహించనున్నారు.. ఇక, ఈ రోజు సాయంత్రం నిజాలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీభ్రమరాంబికాదేవి.. అశ్వవాహనంపై ఆది దంపుతులు పూజలందుకోనున్నారు.. వాహనసేవల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ జరిపిస్తారు.. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవంతో ఉగాది ఉత్సవాలు ముగిసిపోనున్నాయి.. కాగా, శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 6వ తేదీ ఉగాది మహోత్సవాలు ప్రారంభమైన విషయం విదితమే.. ఈ మహోత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. ముఖ్యంగా కాలిబాట మార్గంలో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠం బావి, భీముని కొలను, కైలాసద్వారం ప్రాంతాల్లో సదుపాయాలు కల్పించారు అధికారులు.. ప్రతీ ఏడాది ఉగాది సమయంలో జరిగే ఈ మహోత్సవాలకు కర్ణాటక భక్తులు పెద్ద సంఖ్యలు తరలివచ్చే విషయం విదితమే..
జనసేనకు మరో షాక్.. వైసీపీ గూటికి పాముల రాజేశ్వరి..!
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. టికెట్లు ఆశించిన నేతలు.. అవి సాధ్యం కాకపోవడంతో.. పక్క పార్టీలవైపు చూస్తూనే ఉన్నారు.. కండువాలు మార్చేస్తున్నారు.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలు మినహాయింపు కాదనే చెప్పాలి.. ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి వంతు వచ్చింది.. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పాముల రాజేశ్వరి.. ఓటమి పాలయ్యారు.. అయితే, మరోసారి ఆమె జనసేన నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గంటావారిపాలెం దగ్గర బస చేసిన విషయం విదితమే కాగా.. అక్కడి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆమె వైసీపీ కండువా కప్పుకోనున్నారు.. కాగా, 2004, 2009 ఎన్నికల్లో పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.. కొద్దికాలంగా జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారు.. అయితే, పాములు రాజేశ్వరిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారు అమలాపురం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్.. పాముల రాజేశ్వరి వైసీపీ గూటికి చేరడం వెనుక రాపాక కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది.
నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు..
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్‌టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. టెట్‌కు ఇప్పటి వరకు 1,95,135 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే ఈ సారి దరఖాస్తులు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే గడువు ఉండడంతో దరఖాస్తులు 2 లక్షలకు మించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షకు 2.91 లక్షల మంది దరఖాస్తు చేశారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బర్త్‌డే పార్టీలో మత్తులో జోగిన యువకులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సీజ్ చేసింది. 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్‌ను ఎస్వోటీ స్వాధీనం చేసుకుంది. పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తుండగా ఎస్వోటీ అధికారులు 5 మంది యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్‌డే పార్టీలో ఆ యువకులు మత్తులో జోగినట్లు తెలిసింది. ఆ యువకులు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వద్ద నుండి ఎండీఎంఏ డ్రగ్స్, గంజాయి, ఓసీబీ ప్లేవర్స్ డ్రగ్స్ తో పాటు 5 మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.
498ఏ దుర్వినియోగం అవుతోంది.. వరకట్న వేధింపుల కేసులో హైకోర్టు కీలక తీర్పు
వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసుల్లో తమ భర్త బంధువులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా చాలాసార్లు మహిళలు ఇరికిస్తున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498ఏ అనేక సందర్భాల్లో దుర్వినియోగం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. చిన్నచిన్న కారణాలతో తలెత్తిన విభేదాలు కోర్టుకు కూడా చేరుతున్నట్లు కనిపిస్తోంది. అతని నుండి వేరుగా నివసిస్తున్న భర్త బంధువులు ఈ కేసులో చిక్కుకున్నారు, అయితే వాస్తవానికి దంపతుల మధ్య వివాదంలో వారి పాత్ర ఉన్నట్లు భర్త బంధువులకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు, కానీ అలాంటి కారణాలే కాకుండా, జరగని విషయాలను తెరపైకి తీసుకురావడం ద్వారా సెక్షన్ 498ఏ కింద కేసు పెట్టవచ్చు. ఈ కేసులో భర్తకు చెందిన ఎనిమిది మంది బంధువులపై నమోదైన 498ఏ కేసును కోర్టు కొట్టివేసింది.
ఐర్లాండ్ నూతన ప్రధానిగా సైమన్ హారిస్
మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల వయసులోనే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు. ఐర్లాండ్ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి అధిపతిగా లియో వరద్కర్ స్థానంలో హారిస్ నియమితులయ్యారు. గత నెలలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వరద్కర్ ప్రకటించారు. వరాద్కర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన హారిస్, అతని స్థానంలో సెంటర్-రైట్ ఫైన్ గేల్ పార్టీ అధినేతగా ఉన్న ఏకైక అభ్యర్థి. ఐరిష్ పార్లమెంట్ దిగువ సభ అయిన డైల్‌లోని ఎంపీలు 88కి 69 మంది ఆయనకు ఓటేశారు. దీనితో హారిస్ ప్రధానమంత్రి కావడానికి మార్గం సుగమం చేశారు. డబ్లిన్‌లోని ప్రెసిడెంట్ అధికారిక నివాసంలో ప్రెసిడెంట్ మైఖేల్ డి. హిగ్గిన్స్ ఆయనను అధికారికంగా ఈ పదవికి నియమించారు. హారిస్ మొదటిసారిగా 24 సంవత్సరాల వయస్సులో ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఫైన్ గేల్ సంకీర్ణ భాగస్వాముల మద్దతు కారణంగా హారిస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అతి పిన్న వయస్కుడైన సైమన్ హారిస్ ప్రధానిగా ఎంపికయ్యారు.
పాక్ ఆర్థిక రాజధానిని ఆక్రమించిన బిచ్చగాళ్లు!
పాకిస్థాన్ అధికారం ఇస్లామాబాద్, రావల్పిండి నుంచి నడుస్తున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం కరాచీ నుంచే నడుస్తోంది. అందుకే ఈ నగరాన్ని పాకిస్థాన్ ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. కానీ పాకిస్తాన్ ఆర్థిక రాజధానిని నెల రోజులుగా బిచ్చగాళ్ళు ఆక్రమించారు. ఇది మేం చెప్పడం లేదు, కరాచీ నగరంలోని సీనియర్ పోలీసు అధికారుల ప్రకటనలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ (AIG) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మంగళవారం ఈద్ సందర్భంగా రంజాన్ నెలలో 3 నుండి 4 లక్షల మంది యాచకులు నగరానికి చేరుకున్నారని పేర్కొన్నారు. కరాచీ యాచకులు, నేరస్థులకు అత్యంత ప్రాధాన్య నగరంగా మారుతోందని ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. ఇంటీరియర్ సింధ్, బలూచిస్తాన్, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నేరస్థులు ఈద్ సీజన్‌లో కరాచీకి వచ్చినట్లు అదనపు ఐజీ తెలిపారు. సంప్రదాయ చర్యల ద్వారా నేరాలను గుర్తించలేమని ఆయన అన్నారు. కరాచీలో నేరగాళ్లపై నిఘా ఉంచేందుకు మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఒక్క రంజాన్ మాసంలోనే రోడ్డు నేరాల ఘటనల్లో కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారని జియో న్యూస్ నివేదించింది. అదే సమయంలో, జనవరి 2024 నుండి 55 మందికి పైగా డకాయిట్ల చేతిలో మరణించారు.
విమాన చార్జీలకు రెక్కలు.. కారణమిదే!
ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. ఇంకోవైపు ప్రయాణికులు పెరిగారు. దీంతో అదును చూసి ధరలు పెంచేశాయి విమాన సంస్థలు. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలొచ్చాయి. ఎండలు మండిపోతున్నట్లుగానే ఫ్లైట్ చార్జీలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. విస్తారా ఎయిర్‌లైన్స్ సర్వీసుల రద్దుతో పాటు వేసవి కావడంతో చార్జీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాదాపుగా ఆయా మార్గాల్లో 20 నుంచి 25 శాతం వరకు ధరలు పెరిగిపోయాయి. విమానయాన సేవలకు డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగిపోయాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైలట్ల సంక్షోభం కారణంగా విస్తారా రోజుకు 25-30 విమాన సర్వీసులు లేదా రోజువారీ షెడ్యూలులో 10 శాతం సర్వీసులను తగ్గించుకుంది. దివాలా తీసిన గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ గతంలోనే సేవలను నిలిపివేయడంతో పాటు ఇంజన్ సమస్యల కార ణంగా ఇండిగోకు చెందిన 70 విమానాలు మూలనపడటంతో పరిశ్రమ సేవల సామర్థ్యం ఇప్పటికే తగ్గింది. దీనికి విస్తారా పైలట్ల సంక్షోభం తోడై ఈ సమస్య మరింత ముదిరింది.
పంజాబ్‌పై విధ్వంసం సృష్టించిన తెలుగు ఆటగాడు.. ఎవరీ నితీష్ రెడ్డి?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఛాన్నళ్ల తర్వాత ఓ తెలుగు ఆటగాడు సత్తాచాటాడు. తెలుగు తేజం అంబటి రాయుడు తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 9) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64 పరుగులు చేశాడు. ఓ దశలో సన్‌రైజర్స్ 120-130 పరుగులు అయినా చేస్తుందా? అనుకున్నా.. 182 పరుగుల భారీ స్కోర్ సాధించిందంటే అందుకు కారణం నితీష్. హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్‌క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన నితీష్ రెడ్డి సత్తాచాటాడు. 28 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్.. పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మొదట ఆచితూచి ఆడిన నితీష్.. కాస్త కుదురుకున్నాక విధ్వంసం సృష్టించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రబాడ, కరన్ లాంటి అంతర్జాతీయ పేసర్లను దీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ చేశాడు. అతడి మెరుపులతోనే సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. ప్రస్తుతం నితీష్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎవరీ నితీష్ రెడ్డి అని క్రికెట్ ఫాన్స్ వెతుకుతున్నారు.