నేడు నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ..
ఈ రోజు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సమావేశంకానున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ నీతి ఆయోగ్ సీఈవోతో సీఎం చంద్రబాబు సమావేశం కొనసాగనుంది.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలుపై నీతి ఆయోగ్ సీఈవో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు.. ఇక, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి సంబంధించిన చెక్కును ఆయిల్ కంపెనీలకు అందజేయనున్నారు సీఎం చంద్రబాబు.. కాగా, ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. దీపావాళి సందర్భంగా మరో పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది.. రేపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఇప్పటికే నిన్నటి నుంచి సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైన విషయం విదితమే..
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. జోరుగా బుకింగ్స్..
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు రెడీ అయింది. మహిళలకు దీపం పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నవంబర్ 1న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇక ప్రీ గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రోజు వారీ కంటే మూడు రెట్లు ఎక్కువ మంది ఆన్ లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. కొందరు గ్యాస్ కనెక్షన్ బుక్ తో పాటు తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని గ్యాస్ కంపెనీల దగ్గర బుకింగ్ చేసుకునేందుకు క్యూ కట్టారు. మొదట 833 రూపాయలు డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు కస్టమర్ల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రేపు దీపావళి పండుగ రోజు నుంచి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ చేయనున్నారు. ప్రతి 4 నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఏపీ సర్కార్ ఇవ్వనుంది. దీంతో.. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి గ్యాస్ కనెక్షన్‌తో పాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డును ప్రాతిపదికగా నిర్ణయించారు. పథకంలో భాగంగా వినియోగదారులు తొలుత సిలిండర్ కోసం నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజులలోపే వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ మొత్తం జమచేస్తారు. డీబీటీ ద్వారా ప్రభుత్వం నిధులు జమ చేయనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
తిరుపతిలో మళ్లీ కలకలం.. 8 హోటళ్లకు బాంబు బెదిరింపులు
టెంపుల్ సిటీ తిరుపతిని వరుసగా బాంబు బెదిరంపులు టెన్షన్ పెడుతున్నాయి.. స్థానికులతో పాటు.. తిరుమలకు వచ్చే భక్తులు ఈ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే పలుమార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడం.. అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. వెంటనే తనిఖీలు నిర్వహించి.. అలాంటివి ఏమీ లేవని తేల్చడం జరిగిపోగా.. తాజాగా, తిరుపతిలో ఎనిమిది హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న (మంగళవారం) రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా ఈ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ పంపారు. ఇప్పటి వరకు బెదిరింపులే రాగా.. ఈసారి మాత్రం గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపులలో పేలుడు పదార్థాలు ఉంచామని మెయిల్స్ వచ్చాయి. ఇలా తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్లు హోటళ్లను తనిఖీ చేయగా.. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు..
నేడు నాంపల్లి కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా కేసు విచారణ
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేయనుంది. నిరాధారమైన కొండా సురేఖ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. గత విచారణలో కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు. హీరో నాగార్జున వేసిన పిటిషన్‌పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు ఈ రోజు కోర్టులో మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది.
మూడు విమానాలకు బెదిరింపు కాల్.. సీఐఎస్‌ఎఫ్ అప్రమత్తం
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. మూడు విమానాల్లో సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. వారం పదిరోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ బాంబుల బెదిరింపుల బెడద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని కేంద్రమంత్రి వెల్లడించిన విషయం విదితమే.
పాకిస్తాన్ ఏం చేయలేదు.. ఉగ్రవాద దాడులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉగ్రవాదుల దాడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులపై స్పందించిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా పాకిస్థాన్‌ను తీవ్రంగా టార్గెట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ తన ప్రణాళికలను ఎప్పటికీ విజయవంతం చేయలేదని అబ్దుల్లా అన్నారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్‌లో విలీనం చేయాలని కోరుకునే వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. భారతదేశం బలం దాని భిన్నత్వం, ఏకత్వంలో ఉంది. పరస్పర సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేసి, ద్వేషాన్ని తొలగించాలని ఫరూక్ అన్నారు. తద్వారా దేశంలో శాంతి, పురోగతి, అభివృద్ధి వాతావరణం ఉంటుంది. జర్నలిస్టులతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం నుండి ప్రజలు పెద్ద మార్పులను ఆశిస్తున్నారని, రాబోయే సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను తాకుతుందని ఆశిస్తున్నట్లు ఫరూక్ అన్నారు. వేర్పాటువాదులను లక్ష్యంగా చేసుకుని, పాకిస్థాన్‌లో చేరాలని ఆలోచిస్తున్న వారు ఎప్పటికీ విజయం సాధించలేరని, జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి కిరీటమని, ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నారు. ఇక్కడ పాకిస్థాన్ ఎప్పటికీ విజయం సాధించదు.
288 అసెంబ్లీ స్థానాలకు 7995 మంది అభ్యర్థులు.. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నరంటే?
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం (అక్టోబర్ 29) నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కాగా.. సుమారు 8 వేల మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నవంబర్ 20న జరగనున్న ఎన్నికల కోసం 7,995 మంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు 10,905 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అక్టోబరు 22న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీతో ముగిసింది. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుందని, అభ్యర్థులు నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అందిన సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో 148 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అలాగే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కాగా, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 53 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. మహాయుతి ఇతర మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇవ్వగా, రెండు సీట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపక్షం మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) 89 స్థానాల్లో, ఎన్‌సిపి (ఎస్‌పి) 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇతర ఎంవీఏ మిత్రపక్షాలకు ఆరు సీట్లు ఇవ్వగా, మూడు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత లేదు. దీనితో పాటు, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 14 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది.
72 గంటల రష్ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు!
పండుగ సీజన్ వేళ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.
మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉంది!
తాను చాలా ప్రాక్టికల్ అని, జరిగిన ప్రతి సంఘటన గురించి బాధపడితే ఉపయోగం లేదని టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అన్నాడు. తాను హార్దిక్ పాండ్యాతో చాలా సమయం గడిపానని, కష్టకాలంలో తనకు అండగా నిలిచాడన్నాడు. మ్యాచులో త్వరగా ఔటైతే దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదన్నాడు. తనకు మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని ఇషాన్ చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాలో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికైన ఇషాన్.. సత్తా చాటి తిరిగి సీనియర్ జట్టులో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఇషాన్ కిషన్ విరామం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్ 2024కి సన్నద్ధం అయ్యాడు. దాంతో బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఇషాన్.. సెంట్రల్ కాంట్రాక్టును కూడా కోల్పోయాడు. చివరకు దిగొచ్చిన ఇషాన్.. దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు. గత కొన్ని నెలల్లో మళ్లీ గాడినపడ్డాడు. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో సెంచరీలు చేసి ఫామ్ సాధించాడు. చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్.. ఇప్పుడు తనకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉందని తెలిపాడు. నవంబర్ 2023లో ఆస్ట్రేలియాపై భారత్ తరఫున ఇషాన్ చివరి మ్యాచ్ ఆడాడు.
సాయి పల్లవిపై సెల్ ఫోన్ విసిరిన అభిమాని..
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని మరోసారి పెంచింది. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది అమరన్. అందులో భాగంగా ఈ అమరన్ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలుగులో ఈ అమరన్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. కాగా తాజగా అమరన్ యూనిట్ కేరళలో ప్రమోషన్స్ లో భాగంగా ఓ మాల్ లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సాయిపల్లవి, శివ కార్తీకార్తికేయన్. ప్రెస్ మీట్ అనంతరం సాయి పల్లవిని ఓ అభిమాని సెల్ఫీ ఇవ్వమని కోరగా అభిమాని కోరిక మేరకు సాయి పల్లవి స్టేజి దిగుతుండగా సదరు అత్యుత్సహంతో తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను సాయి పల్లవి పై విసిరాడు. అయితే ఆ ఫోన్ సాయి పల్లవికి కాస్త దూరంగా కాళ్ళ దగ్గర పడింది. దింతో సాయి పల్లవి ఆ మొబైల్ తీసి అభిమానితో సెల్ఫీ దిగి ఇంకోసారి అలా చేయకు అని గట్టిగానే చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ట్రోలర్స్ కు ఇచ్చి పడేసిన కిరణ్ అబ్బవరం..
రాజావారు రాణిగారు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం `ఎస్‌ఆర్ కళ్యాణమండపం`తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించిన కిరణ్ కు ప్లాప్స్ ఎదురయ్యాయి.దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని ‘క’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మంగళవారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. క స్టేజ్ పై తనపై విమర్శలు చేస్తున్న వారికీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ” అసలు మీకు కిరణ్ అబ్బవరం తో ప్రాబ్లమ్ ఏంటి, ఎస్‌ఆర్‌కళ్యాణ మండపం` సమయంలో ఎంతో మంది తనని అభిమానించారు. కానీ గత సినిమాలు ఫ్లాప్ అవడంతో కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు, గత ఏడాదిగా ట్రోల్ల్స్ ఎక్కువయ్యాయి, తన లుక్‌పై, సినిమాలపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరంతో సమస్య ఏంటి? అసలు నేను సినిమాలు చేయకూడదా? అంతేకాదు మీకు ఓ విషయం చెప్పాలి.. చెక్ పోస్ట్ దగ్గర ఒక కంపెనీ ఉంటుంది. వాళ్ళు తీసిన సినిమాలో నాపై ట్రోల్ చేసారు. అసలు నా మీదా ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి, నాతో మీకు అసలు ఏంటి ప్రాబ్లెమ్. ఆ ట్రోలింగ్ వల్ల ఫ్యాన్స్ నాకు కాల్ చేసి, ఏంటీ బ్రో మీ మీద మరీ ఇలా చేస్తున్నారని చెప్పారని, అది ఎంతో బాధ కలిగించింది. నేను ఇప్పటివరకు ఎనిమిది సినిమాల్లో నాలుగు డీసెంట్ హిట్లు పడ్డాయి, అంటే నేను ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదు. హిట్స్ ప్లాప్స్ అందరి లైఫ్‌లో కామన్, అసలు నాలాంటోడు సినిమాలు తీసి థియేటర్ వరకు రావడమే సక్సెస్” అని అన్నారు.