రాజధాని నిర్మాణంలో కీలక అడుగులు..! నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు..
రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కీలక అడుగులు పడబోతున్నాయి. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన చర్యలకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టగా.. ఇవాళ ఆ దిశగా కొన్ని కీలక అడుగులు పడుతున్నాయి. రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. 2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా.. మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటీ ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటీ ఇంజినీర్లు పరిశీలించనున్నారు. సెక్రటేరియట్, హెచ్‌వోడీ కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్లతో పునాదులు కూడా వేసింది. అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్ధ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది ప్రభుత్వం. ఇక, ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం. ఐఐటీ మద్రాస్,ఐఐటీ హైదరాబాద్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు అమరావతికి రానున్నాయి. రెండు బృందాలు రెండు రోజులపాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకుంటారా?
ఈ రోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబ.. ఈ భేటీలో కొన్ని పాలసీ డెసిషన్స్ తీసుకునే ఛావ్స్ కన్పిస్తోంది. గతంలో రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాట్ల కోసం స్థలాలు ఇచ్చారు. సుమారు 130కు పైగా సంస్థలకు భూములిచ్చారు. వీటిల్లో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉన్నాయి. అయితే, ఆయా సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు కాల పరిమితి ఉంది. గత ఐదేళ్లు ప్రభుత్వం రాజధాని విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉండడంతో సదురు సంస్థలు రాజధానిలో కార్యాలయాల ఏర్పాట్లు పనులే ప్రారంభించ లేదు. ఇలాంటి కంపెనీలు.. సంస్థలతో సీఆర్డీఏ అధికారులు సంప్రదింపులు జరిపారు. కొందరు తమ ఆఫీసులను ప్రారంభించేందుకు సంసిద్ధతను కూడా తెలిపాయి. ఈ క్రమంలో ఆయా సంస్ధలకు కాలపరిమితి పొడిగించాల్సి ఉంటుంది. అథార్టీ సమావేశంలో కాలపరిమితి పెంచే అంశంపై కాలక నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అలాగే రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులకు కౌలు చెల్లింపు విషయంలో కూడా చర్చ జరగనుంది. పదేళ్ల కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందనే అంచనాతో నాడు టీడీపీ ప్రభుత్వం పదేళ్ల పాటు కౌలు ఇచ్చేలా రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, గత ఐదేళ్లల్లో రాజధాని నిర్మాణం ఎక్కడిది అక్కడే ఆగిపోయింది. దీంతో మరో ఐదేళ్ల పాటు కౌలు చెల్లింపులు జరపాలనే డిమాండ్ ఉంది. దీనిపై అథార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతోన్న తొలి సమావేశం కావడంతో రాజధాని నిర్మాణ పనులు.. మౌళిక వసతులు, రిటర్నబుల్ ప్లాట్లు.. మాస్టర్ ప్లాన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, రైల్వే లైన్, నిధుల సమీకరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
నంద్యాలలో విషాదం.. కూలిన మట్టి మిద్దె.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
నంద్యాల జిల్లాలో విషాదం నెలకొంది. చాగలమర్రి మండలం చిన్నవంగలిలో ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఆ కుటుంబం గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. గురు శేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ, కుమార్తెలు పవిత్ర(15), గురులక్ష్మి(7) నిద్రలోనే ప్రాణాలు వదిలారు. రెండవ కుమార్తె చాగలమర్రిలో హాస్టల్లో వుంటూ చదువుతోంది. దీంతో ప్రసన్న ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెల్లు చనిపోయారని తెలియగానే హాస్టల్ నుంచి వచ్చింది. తల్లిదండ్రులు, చెల్లెళ్ళ మృతదేహాలు చూసి స్పృహ కోల్పోయి పడిపోయింది ప్రసన్న. మట్టి మిద్దె కావడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. ఇల్లు పాతది కావడం, వర్షాలకు బాగా తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాలు శిథిలాల నుండి తొలగిస్తుండగా ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న స్థితిలోనే మృతి చెందారని కంటతడి పెట్టుకున్నారు స్థానికులు. గురు శేఖర్ రెడ్డి నిరుపేద కుటుంబం. పొలాలు కౌలుకు తీసుకోవడం, లేదంటే కూలి పనులకు వెళ్లి జీవనం గడపడం. ఈ విషాదం గ్రామంలో విషాదం నింపింది. ఇక, ఆ కుటుంబంలోని నలుగురు మృతిచెందగా.. హాస్టల్‌లో ఉండడం వల్లే.. మరో కూతురు ప్రాణాలు బయటపడినట్టు అయ్యింది.. అయితే, కుటుంబంలోని నలుగురు ఒకేసారి ప్రాణాలు వదలడం.. ఆ గ్రామంలో విషాదంగా మారింది.. వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో.. పాత ఇళ్లలో నివాసం ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని.. శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఖాళీ చేయడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు..
నేడు దద్దరిల్లనున్న ఎల్బీ స్టేడియం.. 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం సభ..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి పదోన్నతులు లేని వివిధ కేటగిరీల ఉపాధ్యాయులకు తాజాగా పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతి పొందిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే.. ఉపాధ్యాయులు, సీఎం రేవంత్ రెడ్డి సభతో నేడు ఎల్బీనగర్ స్టేడియం దద్దరిల్లనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పదోన్నతులు పొందిన 2,888 మంది ఉపాధ్యాయులు ఈ సభకు తరలి వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, మండల నోడల్ అధికారులు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల జాబితాలను రూపొందించి సమావేశానికి రావాలని సూచించారు. ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎల్బీనగర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు సహరించాలని సూచించారు. కాగా.. గురుకులాల ఉపాధ్యాయులు కూడా సమావేశానికి రానున్నారు. ఇందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు, ఇతర అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం ఉపాధ్యాయులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో హామీ ఇస్తారా? అన్న చర్చ ఉపాధ్యాయుల్లో సాగుతోంది. అజెండాపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ బాధ్యులు మాట్లాడే అవకాశం కల్పిస్తే పదోన్నతిపై సీఎంకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ప్రధాన సమస్యలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఉపాధ్యాయులను పిలిపించి సభ నిర్వహించడం ప్రభుత్వానికి మేలు చేసే అంశమని చెబుతున్నారు.
రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం.. కారులో ఇరుక్కుని విద్యార్థి మృతి..
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్ (19)గా పోలీసులు గుర్తించారు. అతివేగంతో కంట్రోల్ తప్పి డివైడర్ కు షిఫ్ట్ డిజైర్ కారు గుద్దుకుంది. దీంతో అక్కడ పెద్ద శబ్దం రావడంతో స్థానికులు పరుగున వచ్చి చూడగా అప్పటికే చరణ్ కారులో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. చరణ్ వయస్సు 19 సంవత్సరాలు కావడం కారు ఓవర్ స్పీడ్ తో నడిపినందుకు ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బీఎన్ఆర్ హిల్స్ నుంచి మెహిదీపట్నంలోని తన ఇంటికి చరణ్ వెళ్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో కారు ఫ్లైఓవర్ ఫిల్లర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. కారు నుజ్జునుజ్జు కావడంతో పాటు ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతికష్టమ్మీద బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో కారులో చరణ్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
నాపై దాడులకు ఈడీ యత్నిస్తోంది.. రాహుల్ సంచలన ఆరోపణలు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ‘చక్రవ్యూహం’ ప్రసంగం తర్వాత తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేయాలని యోచిస్తోందని తెలిపారు. ఈడీ ఇన్‌సైడర్లు దీనిపై సమాచారం ఇచ్చారని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎక్స్ లో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. అందులో.. “నా చక్రవ్యూహం ప్రసంగం కొందరికి నచ్చలేదు. దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ ‘ఇన్‌సైడర్‌లు’ నాకు చెప్పారు. ఈడీ కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నాను. చాయ్, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్న.” అని పోస్ట్ లో రాశారు. వాస్తవానికి, జూలై 29న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024పై రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘చక్రవ్యూహంలో భాగంగా కోట్లాది ఉద్యోగాలు ఇచ్చే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను టార్గెట్ చేశారు. నోట్లరద్దు , జీఎస్టీ , ట్యాక్స్ టెర్రరిజంతో బెదిరించారు. చిన్న వ్యాపారులకు అర్ధరాత్రి ఫోన్‌కాల్స్ వస్తాయి.. ఐటీ , జీఎస్టీ అధికారులతో వాళ్లను బెదిరించి ట్యాక్స్ టెర్రరిజానికి పాల్పడుతున్నారు. ట్యాక్స్ టెర్రరిజానికి ఆపడానికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ట్యాక్స్ టెర్రరిజంతో బడా వ్యాపారులకు లాభం చేశారు. చిన్నవ్యాపారులను బెదరించారు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత, కుల గణనలతో ఇండియా కూటమి దానిని విచ్ఛిన్నం చేస్తుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2024-25పై లోక్‌సభలో జరుగుతున్న చర్చలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీ ప్రసంగించారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులపై విమర్శలు సంధించారు. ఈ ప్రసంగం తర్వాత తనపై దాడులు చేసే అవకాశం ఉందని తెలిపారు.
హిమాచల్‌లో క్లౌడ్ బరస్ట్.. నలుగురు మృతి, 49 మంది గల్లంతు
హిమాచల్‌లోని శ్రీఖండ్‌లోని రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ గ్రామంలో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. ఈ విపత్తులో దాదాపు 25 ఇళ్లు కొట్టుకుపోగా, నలుగురు మృతి చెందగా, 49 మంది గల్లంతయ్యారు. బుధవారం రాత్రి శ్రీఖండ్ మహాదేవ్ సమీపంలో మేఘాలు పేలడంతో సర్పరా, గాన్వి, కుర్బన్ డ్రెయిన్లలో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీని ఫలితంగా సమేజ్ ఖుద్ (డ్రెయిన్)లో నీటి మట్టం పెరగడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సిమ్లా పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. సిమ్లాలోని రాంపూర్ సబ్ డివిజన్‌కు చెందిన వారు గల్లంతయ్యారు. ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ శిథిలాలు రాకముందే తమ కళ్లు తెరిచాయని చెప్పారు. విషయం తెలియగానే బయటకు పరుగులు తీశామని చెప్పాడు. నలుగురితో చెప్పామని, సమయం లేకపోవడంతో ఎక్కువ మందికి చెప్పలేకపోయామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా, కులు, మండిలో మేఘాలు కమ్ముకున్నాయి. మృతదేహాల ఆచూకీ కోసం కృషి చేస్తామని డీసీ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, ఐటీబీపీ, పోలీసులు, హోంగార్డులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. సామెజ్ గ్రామానికి దూరంగా జనం వెళ్లే అవకాశం ఉందని డీసీ తెలిపారు. హిమాచల్‌లో ఉదయం వరకు అలర్ట్ ఉందని అనుపమ్ కశ్యప్ తెలిపారు. రాత్రి సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించబడవు. అందుకే ఉదయం నుంచి ఆపరేషన్ ప్రారంభిస్తారు.
ఇన్ఫోసిస్‌కు ఊరట.. నోటీసు ఉపసంహరించుకున్న ప్రభుత్వం
పన్ను ఎగవేతకు పాల్పడిన అంశంలో దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌కు ఊరట లభించింది. కర్ణాటక ప్రభుత్వం కంపెనీకి పంపిన రూ.32,403 కోట్ల నోటీసును ఉపసంహరించుకుంది. ఈ సమాచారాన్ని టెక్ దిగ్గజం గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పంచుకుంది. బుధవారం నోటీసు జారీ చేసిన తర్వాత గురువారం స్వయంగా కంపెనీ ఓ వివరణ జారీ చేసింది. కంపెనీ గురువారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, కర్ణాటక రాష్ట్ర అధికారుల నుంచి కంపెనీకి సందేశం అందిందని తెలిపింది. అందులో తమకు పంపిన షో నోటీసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది. కంపెనీకి జీఎస్టీ డిమాండ్ నోటీసు జారీ అనంతరం దీనిపై సమాధానం ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) కోరింది. వివరణ అనంతరం కంపెనీకి ఊరట లభించింది. కాగా.. డీజీజీఐ పంపిణ నోటీలో జులై 2017 నుంచి 2021-2022 వరకు పన్ను ఎగవేసినట్లు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ తన విదేశీ శాఖల నుంచి సేవలను పొందిందని, అయితే వాటిపై రూ.32,403 కోట్ల పన్ను చెల్లించలేదని డీజీజీఐ ఆరోపణలు చేసింది. ఇన్ఫోసిస్ సేవల దిగుమతిపై IGSTని చెల్లించనందుకు విచారణలో ఉందని పన్ను పత్రం పేర్కొంది. దీనిపై కంపెనీ సమాధానం చెప్పింది.
నేడే శ్రీలంక, టీమిండియా మొదటి వన్డే.. ఎవరి బలాబలాలేంటి?
నేడు శుక్రవారం కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. టి20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత మొదటిసారిగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్లు క్రికెట్ మైదానంలో కనిపించనున్నారు. వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ గా తిరిగి రానున్నాడు. మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా వన్డే సిరీస్‌కు తిరిగి వచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ లకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక అంత సులభం కాదు. శ్రీలంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్ లో ఎవరు ఉండబోతున్నారు.? ఎవరి బలాబలాలేంటో ఓసారి చూస్తే.. శ్రీలంకతో వన్డే సిరీ స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడంతో.. ఓపెనింగ్ పెయిర్ విషయంలో పెద్దగా టెన్షన్ అవసరం లేదు. అంటే ఓపెనింగ్ జోడీ దాదాపు ఖాయమైనట్లే. దీని తర్వాత విరాట్ కోహ్లి మూడో ర్యాంక్‌లోకి రావడం ఖాయం. ఈ సిరీస్లో కొన్ని రికార్డులు కూడా విరాట్ కోహ్లి తను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాయి. దీని తరువాత నాలుగువ స్థానానికి ఖచ్చితంగా కొంత సస్పెన్స్ నెలకొనిఉంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరికీ జట్టులో చోటు దక్కింది. రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. రిషబ్ పంత్ కీపర్ గా వ్యవహరిస్తాడనే నమ్మకం ఉంది. అయితే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కే అవకాశం ఉంది. అంటే ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు కోచ్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అనేదే సందేహం.
ఆశలు అడియాసలే.. ఒలింపిక్స్ నుంచి పీవీ సింధు ఔట్..
పారిస్ ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు పతకాల వేట ముగిసింది. 2016లో రజతం, 2020లో కాంస్యం గెలిచిన పీవీ సింధు.. ఈసారి ఒలింపిక్స్ 2024లో మాత్రం ప్రీక్వార్టర్స్ వరకే పరిమితమై ఖాళీ చేతులతో ఇంటి ముఖం పట్టింది. గురువారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్ లో పివి సింధు 19-21, 14-21 తేడాతో చైనా షట్లర్ ప్రపంచ 9వ ర్యాంకర్ హే బింగ్ జావ్ చేతిలో వరుస సెట్స్ లో ఓటమి పాలైంది. దింతో సింధు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ లో మొదటి గేమ్ లో ఇద్దరూ షట్లర్ల మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. క్రాస్ కోర్ట్ షాట్స్ తో సింధు తనడైన శైలి లో రెచ్చిపోగా.. స్మాష్ లతో చైనా ప్లేయర్ పైచేయి సంపాదించింది. దాంతో తొలి గేమ్‌ను దక్కించుకుంది. నిజానికి పీవీ సింధు అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పవచ్చు. ఇక ఆట రెండో గేమ్ మొదలు నుంచే దూకుడు చూపించిన బింగ్ జావ్ వరుస పాయింట్స్ తో సింధు పై ఒత్తిడిని పెంచడంతో ఆ గేమ్ ను కోల్పోవడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఇకపోతే భారత బ్యాడ్మింటన్ విభాగంలో ప్రస్తుతం లక్ష్యసేన్ మినహా అంతా ఇంటిదారి పట్టారు. ఇక అలాగే భారీ అంచనాలతో ఒలింపిక్స్ 2024 బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టిలు కూడా క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగారు. గురువారం నాడు జరిగిన ఆ మ్యాచ్ లో రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి 21-13, 14-21, 16-21 తేడాతో ఆరోన్ – సో వూయి (మలేషియా) చేతిలో ఓటమిని తప్పించుకోలేకపోయారు.
నేడు మరోసారి బరిలో మను భాకర్.. మూడో పతకం సాధించేనా?
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. భారత్ ఇప్పటి వరకు 3 కాంస్య పతకాలను గెలుచుకుంది. ఆరో రోజు స్వప్నిన్ కుసానే మూడో కాంస్యం సాధించాడు. కాగా మను భాకర్ తొలి పతకాన్ని సాధించి భారత్ కు శుభారంభం చేసింది. తర్వత సరబ్‌జోత్ సింగ్ తో కలిసి మరోసారి మను బరిలో నిలిచి మరో కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. అయితే నేడు భారత్ మరోసారి మను భాకర్ ను రంగంలోకి దించనుంది. ఆమె 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ ప్రెసిషన్ మ్యాచ్‌లో పోటీపడనుంది. దీంతో పాటు ఈ రోజు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌కు మ్యాచ్ ఉంటుంది. ఏడో తేదీన భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం…
షూటింగ్…
మహిళల 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ : ఇషా సింగ్, మను భాకర్ – 12.30
పురుషుల స్కీట్ క్వాలిఫికేషన్ డే 1: అనంత్‌జిత్ సింగ్ నరుకా – మధ్యాహ్నం 1.00
ఆర్చరీ…
మిక్స్‌డ్ టీమ్ (1/8 ఎలిమినేషన్): భారత్ (ధీరజ్ బొమ్మదేవర, అంకిత భకత్) vs ఇండోనేషియా – 1.19 PM
రోయింగ్…
పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్ (ఫైనల్ D): బల్‌రాజ్ పన్వార్ – మధ్యాహ్నం 1.48
జూడో…
ఉమెన్స్ ప్లస్ 78 కేజీ (ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32): తులికా మన్ vs ఇడాలిస్ ఓర్టిజ్ (క్యూబా) – మధ్యాహ్నం 2.12
సెయిలింగ్….
మహిళల డింగీ (రేస్ త్రీ): నేత్ర కుమనన్ – మధ్యాహ్నం 3.45 గంటలకు
మహిళల డింగీ (రేసు నాలుగు): నేత్ర కుమనన్ – సాయంత్రం 4.53
పురుషుల డింగీ (రేస్ త్రీ): విష్ణు శరవణన్ – రాత్రి 7.05
పురుషుల డింగీ (రేసు నాలుగు): విష్ణు శరవణన్ – రాత్రి 8.15
హాకీ….
పురుషుల టోర్నమెంట్ (గ్రూప్ స్టేజ్): భారత్ vs ఆస్ట్రేలియా – సాయంత్రం 4.45
బ్యాడ్మింటన్….
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్: లక్ష్య సేన్ vs చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ) – 6:30 PM
అథ్లెటిక్స్….
మహిళల 5,000 మీటర్లు (హీట్ వన్): అంకిత ధ్యాని – రాత్రి 9.40 గంటలకు
మహిళల 5,000 మీటర్లు (హీట్ టూ): పరుల్ చౌదరి – రాత్రి 10.06 గంటలకు
పురుషుల షాట్‌పుట్ (అర్హత): తేజిందర్‌పాల్ సింగ్ టూర్ – రాత్రి 11.40
హైడ్రామాలో కొత్త ట్విస్ట్… లావణ్యపై రాజ్ తరుణ్ తల్లితండ్రులు కంప్లైంట్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు జరుగుతున్న గాని.. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య మధ్య జరుగుతున్న విషయమే అందరూ గమనిస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారం సంబంధించి ప్రతిరోజు ఓ కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. అచ్చం సినిమాలు స్టోరీ వలె నిజజీవితంలో కూడా అంతకుమించి రోజు రోజుకి కొత్త ట్విస్టులతో వీరి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు రాజ్ తరుణ్ ప్రియురాలినని చెబుతున్న లావణ్య పై హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సర్వర్త చర్చనీయాంశం అవుతుంది. హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులైన బసవరాజు, రాజ్యలక్ష్మి గురువారం నాడు లావణ్య పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వీరు మాదాపూర్ లోని కాకతీయ హిల్స్ లో నివాసం ఉంటుండగా వారింటికి వెళ్లిన లావణ్య అక్కడ గొడవ చేసిందని సమాచారం. తమ ఇంటి వద్ద ఆవిడ తలుపులను పెద్దగా బాధి.. అక్కడ న్యూసెన్స్ సృష్టించిందని., అలాగే తమపై దాడికి ప్రయత్నం చేయడానికి వచ్చిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆమెపై పోలీస్ లకు ఫిర్యాదు అందించారు. ముందే తమకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నామని.. ఇప్పుడు లావణ్య వల్ల మాకు ప్రాణహాని ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
విడాకులు తీసుకున్న కమెడియన్ హర్ష.. అసలు నిజం ఇదే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్షకు సంబంధించిన విషయం తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వైవహర్ష తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. విడాకులు తీసుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వైవా హర్ష ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో జీవితం అనేది ఓ రోలర్ కోస్టర్ లా ఉంటుందని.. ఆప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎక్సైట్మెంట్, యాంగ్సైటి, థ్రిల్లింగ్, భయం ఇలా అనేక విషయాలు ఉంటాయని వాటిలో ఏది మన కంట్రోల్లో ఉండదు కాబట్టి మనల్ని ఆపేందుకు మధ్యలో ఎన్నో వస్తాయంటూ.. అవి కూడా టైం వస్తే తమంతట అవే వెళ్లిపోతాయని., అలాంటి జీవితం రైడను ఎంజాయ్ చేస్తూ ఉండాలని.. అసలు ఎలాంటిది కూడా ఆశించకూడదు.. ఆ తర్వాత నిరాశ.. అసలే పడకూడదు మొత్తంగా జీవితం ఎటువైపు వెళ్తే అటు వెళ్లడమే.. అంటూ ఓ పోస్ట్ చేశాడు. గత కొన్ని రోజుల నుంచి అసలు వైవా హర్షకు ఏమైందని.? భార్యతో వచ్చిన గొడవల కారణంగా అతడు విడాకులు తీసుకుంటున్నాడు..? అన్న విషయాలపై తాజాగా ఆయన ఓ క్లారిటీ ఇచ్చాడు.. ఈ విషయం సంబంధించి మరో పోస్టులో తన పర్సనల్ లైఫ్ సాఫీగానే సాగుతోందని.. తాను చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అంతేకాకుండా పనిలో ఉన్నప్పుడు కొన్ని తెలివి తక్కువ, మెదడులేని రాజకీయాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అంతే కానీ. ఇంకా మరో విషయం లేదంటూ అతను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇలాంటి రూమర్స్ చాలానే వస్తుంటాయని.. ప్రస్తుతం తాను సంతోషంగానే ఉన్నానని, ఇంకా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను మరింత స్ట్రాంగ్ గా మళ్ళీ తిరిగి వస్తానంటూ తెలుపుతూనే మనకు ఎదురు దెబ్బలు తగిలిన వాటిని తట్టుకొని మళ్లీ పోరాడడం గొప్పదని హర్ష చెప్పుకొచ్చాడు. దీంతో తన విడాకుల విషయంపై చెక్ పడినట్లు అయింది.