నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు – 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ బిల్లు- 2024 ను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు క్వచ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం, వీధికుక్కల బెడద.. గ్రామ,వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, విశాఖలో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేషన్ కాలువల ఆధునీకరణ, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, డీఎస్సీ-1998 అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 -25 ఆర్థిక బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. ఫ్రీ హోల్డ్ భూములు క్రమబద్దీకరణ, కైకలూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులు, 2019 – 24 వరకు మద్యం అమ్మకాలలో జరిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాలపై అధిక వడ్డీ, విజయనగరంలో ఆతిసారం, పీడీఎస్ బియ్యం అక్రమాలు, ఉచితపంటల భీమా పథకం, పంచాయితీ భవనాలకు రంగులు, పాఠశాల బస్సులకు పన్ను అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం 2024 – 25 ఆర్ధిక బడ్జెట్‌పై చర్చించనున్నారు.
నేడు ఢిల్లీ టు మహారాష్ట్ర.. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే.. మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరారు. మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు, కుల గణన వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం సీఎం రేవంత్ రాత్రి ఢిల్లీలోనే బస చేశారు. అనంరతం ఇవాళ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి తరఫున ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో తన ప్రచారంలో ముందుకు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డికి ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు మహాకూటమి నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ తరహాలో సక్సెస్ మంత్రం సిద్ధం చేయాలని మహా అఘాది నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార వ్యూహాలు, అనుసరించాల్సిన విధివిధానాలను కూటమి నేతలకు వివరించనున్నారు. మహారాష్ట్రలో ర్యాలీలు, రోడ్లు, షోలు, కార్నర్ మీటింగ్‌లకు సంబంధించిన కార్యక్రమాలను నేతలకు సీఎం వివరించనున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మహాకూటమి తరపున భారీ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు ప్లాన్ చేస్తున్న తరుణంలో వచ్చే వారం సీఎం మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
పొరపాటున డబ్బు జమ చేశామని చెప్పి రూ.46 లక్షలు కొట్టేశారు..
పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయిపోతాయి సుమీ. రోజుకో పంథాలో కేటుగాళ్లు అమాయకుల నుంచి దోచుకుంటున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని అశోక్‌నగర్‌కు చెందిన శేషగిరి ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తులు రూ.20 వేలు పంపారు. పొరపాటున డబ్బులు జమ చేశామని.. తిరిగి తమ ఖాతాకు పంపాలని ప్రాధేయపడి అడిగారు. ఆ మాటలు నమ్మిన శేషగిరి తిరిగి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపించారు. ఈ క్రమంలోనే శేషగిరి ఈ నెల 10న తన అకౌంట్ పరిశీలించగా.. రూ.46 లక్షలు విత్‌డ్రా అయినట్లు చూపించింది. వెంటనే శేషగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.20 వేలు పంపగానే రూ.46 లక్షలు దోచేశారని తెలిసింది. ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఐదవ రోజు కోటి దీపోత్సవం.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
‘రచన టెలివిజన్ లిమిటెడ్’ ప్రతీ ఏడాది హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనుంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అయితే చాలు దీపాలు, భక్తులతో ఎన్టీఆర్ స్టేడియం కన్నుల పండుగగా ఉంటోంది. నేడు కోటి దీపోత్సవంలో ఐదవ రోజు. ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం.
ఐదవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ అద్వైతానంద భారతి స్వామీజీ (శృంగేరి జగద్గురు, అవని) అనుగ్రహ భాషణం చేయనున్నారు
# డా. ఎన్. అనంతలక్ష్మి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు
# వేదికపై మల్దకల్ శ్రీ వేంకటేశ్వరస్వామికి కోటి తులసి అర్చన, మహానందికి మహాభిషేకం నిర్వహించనున్నారు
# వేదికపై తులసీ దామోదర కల్యాణం జరగనుంది
# పల్లకీ వాహన సేవ ఉంటుంది
లగచర్ల ఘటన.. కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్‌ఎస్ నేత సురేష్ తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నరేందర్ రెడ్డి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్న పోలీసులు నరేందర్ రెడ్డికి లగచర్ల సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడారా ? మాట్లాడిన వారు ఎవరు ? అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు.. అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ఆరా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వం, పోలీస్ శాఖ ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారని, ప్రధాన నిందితుడు సురేష్ కావాలని కలెక్టర్ ను మాయమాటలు చెప్పి గ్రామంలోకి తీసుకొని వెళ్లారన్నారని ఐజీ సత్యనారాయణ తెలిపిన విషయం తెసిందే. సురేష్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరున్న వదిలిపెట్టేది లేదని తెలిపారు. సురేష్ కాల్ డేటా అంతా తీస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. ప్రస్తుతం సురేష్ పరారీ లో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఐజీ తెలిపారు. సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..
పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని రాఘవపూర్, కన్నాల మధ్యలో రాగానే ఒక్కసారిగా 11 భోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి. స్థానికులు గుర్తించి రైల్వేశాఖకు సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. పట్టాలపైనే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ క్రేన్ లతో పట్టాల పై పడ్డ బోగీలను అందులో ఉన్న మెటీరియల్ సిబ్బంది తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సుమారు 20 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. 18 రైళ్లు దారిమల్లించామని పాక్షికంగా 4 రైళ్ల రద్దు చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.
నేడు జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్.. బరిలో మాజీ సీఎం చంపై సోరెన్
జార్ఖండ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు అంటే బుధవారం ఓటింగ్ జరగనుంది. తొలి దశలో రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందులో 20 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు, 6 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు, 17 జనరల్ సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో పలువురు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని ఒక పెద్ద నాయకుడి కోడలు, మరొకరి కొడుకు, భార్య తమ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అర్జున్ ముండా భార్య మీరా ముండా పొత్కా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఒరిస్సా గవర్నర్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ కోడలు పూర్ణిమా దాస్ సాహు జంషెడ్‌పూర్ తూర్పు నుండి అతని రాజకీయ వారసత్వాన్ని నిర్వహించే బాధ్యతను కలిగి ఉన్నారు. రఘువర్ దాస్ కోడలు పూర్ణిమ దాస్ సాహు జంషెడ్‌పూర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి సెరైకెలా స్థానం నుండి పోటీ చేశారు. దీంతో పాటు ఆయన కుమారుడు బాబూలాల్ సోరెన్ ఘట్శిల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన తండ్రి చంపాయ్ సోరెన్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా బాబూలాల్ సోరెన్‌పై ఉంది. దీంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ జోబా మాంఝీ కుమారుడు జగత్ మాంఝీ మనోహర్‌పూర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అదే సమయంలో, హేమంత్ సోరెన్ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రుల రాజకీయ విశ్వసనీయత కూడా మొదటి దశలోనే ప్రమాదంలో పడింది. ఇందులో ఘట్‌శిల అభ్యర్థి రాందాస్ సోరెన్, మంత్రి కమ్ అభ్యర్థి డాక్టర్ రామేశ్వర్ ఓరాన్, మంత్రి దీపక్ బీరువా, మంత్రి బానా గుప్తా, మంత్రి మిథిలేష్ ఠాకూర్ ఉన్నారు. మొదటి విడతలో 43 స్థానాలకు గాను 15344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 2628 కాగా, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 12716గా ఉంది. ఈ దశలో మొత్తం ఓటర్ల సంఖ్య 1 కోటి 36 లక్షల 85 వేల 509. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 68 లక్షల 65 వేల 208. అదే సమయంలో మహిళా ఓటర్ల సంఖ్య 68 లక్షల 20 వేలు. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 301 కాగా, వికలాంగ ఓటర్ల సంఖ్య 191553.
నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ20
భారత టీ20 జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు మూడో టీ20లో తలపడనుంది. దక్షిణాఫ్రికా పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత్.. రెండో మ్యాచ్‌లో తడబడింది. దాంతో మూడో టీ20 కీలకంగా మారింది. ఈ టీ20లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని సూర్య సేన చూస్తోంది. బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సంజూ శాంసన్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. మూడో టీ20లో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలు జట్టుకు ప్రతికూలంగా మారింది. రెండు మ్యాచులలో సింగిల్ డిజిట్‌లకే (7, 4) పరిమితమయ్యాడు. సెంచూరియన్‌లో అయినా బ్యాట్ ఝళిపిస్తాడేమో చూడాలి. నేడు కూడా ఆదుకుంటే.. అభిషేక్ పనయిపోయినట్లే. సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ నుంచి అలరించే ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. తిలక్, హార్దిక్ పర్వాలేదనిపించారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రవి బిష్ణోయ్ సత్తా చాటుతున్నాడు. మరో స్పిన్నర్ అక్షర్ పటేల్ తేలిపోయాడు. అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ పేలవంగా బౌలింగ్ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. దాంతో కొత్త ఆటగాళ్లు రమణ్‌దీప్ సింగ్, యశ్ దయాళ్, వైశాఖ్ విజయ్‌కుమార్‌లలో ఒకరిద్దరికి మూడో టీ20 ఛాన్స్ ఇచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అక్షర్ స్థానంలో రమణ్, అవేష్ బదులు యశ్, వైశాఖ్‌ల్లో ఒకరిని ఆడించొచ్చు. మరో విజయం సాధించాలని దక్షిణాఫ్రికా చూస్తోంది. మార్‌క్రమ్, క్లాసెన్ లాంటి స్టార్ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించలేకపోతున్నారు. టాప్‌ఆర్డర్ తేలిపోతోంది. గత మ్యాచ్‌లో స్టబ్స్ పుణ్యమా అని గెలిచింది. అయితే సఫారీ బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. యాన్సెన్, కొయెట్జీ, పీటర్ జోరుమీదున్నారు. ఇక సెంచూరియన్ పిచ్ పేసర్లకు సహకరిస్తుంది. ఈ వికెట్‌పై బంతి బాగా బౌన్స్ అవుతుంది. అయితే పిచ్ బ్యాటింగ్‌కూ అనుకూలంగానే ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
భారత్: శాంసన్, అభిషేక్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, హార్దిక్, రింకూ, అక్షర్/రమణ్‌దీప్, అర్ష్‌దీప్, వరుణ్, బిష్ణోయ్, అవేశ్/యశ్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), రికెల్టన్, స్టబ్స్, క్లాసెన్, మిల్లర్, క్రుగర్, జాన్సెన్, సిమెలానె, కొయెట్జి, కేశవ్, పీటర్.