మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను..
మోడీ ప్రభుత్వంలో పుడితే పన్ను, చస్తే పన్ను అంటూ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్, బేల మండలాల్లో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా మట్లాడుతూ.. బీజేపి దేవుళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుందన్నారు. పదేళ్ళలో ఎం అభివృద్ది చేయలేదు కాబట్టే దేవుడి పేరు చెప్పుతున్నారని అన్నారు. అడిగితే అయోధ్య కట్టాము అనే బిజేపి నేతల్ని ఊరు లో చేసిన అభివృద్ధి,గుడి కి ఇచ్చిన నిధులేంటో అడగండని తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు ఇచ్చిన మాట నిబెట్టుకొనే మనిషి అన్నారు. రుణ మాఫీ చేసి తీరుతాం.. రైతు బంధు రాని వారు అదైర్య పడొద్దు.. ఇస్తామన్నారు. గతంలో బీజేపి ఎంపిని గెలిపిస్తే ఇక్కడ ఏం చేసారు అది అడగాలని తెలిపారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేసి పోయాడన్నారు.
రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా?
రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించిందన్నారు. రబ్బర్ చెప్పులు ముడుతల చొక్కాతో ఉన్న కేటీఆర్ కి ఇన్ని ఆస్తులు ఎక్కడివి? అని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్చాలి అన్నది కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పై చర్చకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. రిజర్వేషన్లను తగ్గించము… హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయమన్నారని తెలిపారు. కాంగ్రేస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ఉమ్మడి ఆరోపణలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కి డిపాజిట్లు రావని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజం.. కడియం కీలక వ్యాఖ్యలు
నమ్మించి మోసాగించడం కేసీఆర్ నైజమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిన కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని వరంగల్ కి వచ్చారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంభం పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. భూ కబ్జాలు ఆరోపణలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల తరువాత బీఆర్ఎస్ మూత పడబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఒక్క సిటు కూడా బీఆర్ఎస్ గెలవడం లేదన్నారు. బీఆర్ఎస్ ఓటింగ్ శాతం 20 శాతానికి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయిందన్నారు. బీజేపీ కంటే బీఆర్ఎస్ వెనకపడిందన్నారు. కవిత పైనా బీజేపీ వాళ్ళు కుట్రతో కేసులు పెట్టారు అని కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దేశంలో ఒక్క కవితనే ఉందా? తప్పు లేనిదే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. నీ బిడ్డా లిక్కర్ కేసులో ఉన్నందుకు కేసీఆర్ సిగ్గు పడాలన్నారు. కవిత వల్ల కేజ్రీవాల్ నష్టపోయారని తెలిపారు. నీ బిడ్డ వళ్ళ కేసుల్లో కేజ్రీవాల్ ఇరుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ధర్మాన..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అయితే, దేశవ్యాప్తంగా టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అప్పుడు ఆలోచిస్తాం అన్నారు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై ఘాటుగా స్పందించారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పాం.. మళ్లీ ఇప్పుడు స్పష్టంచేస్తున్నాం అన్నారు. అయితే, భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం.. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉంది.. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టుకట్టింది.. ఆ తర్వాత కూడా టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కానీ, దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం అన్నారు. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పులు తర్వాత మాత్రమే ఆలోచన చేస్తామన్న ఆయన.. అంతవరకూ యాక్ట్ అమలు చేయమని గతంలోనే స్పష్టంచేశామని గుర్తుచేశారు.
చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమే జీవన్ రెడ్డి.. అరవింత్ సంచలన వ్యాఖ్యలు
చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమే జీవన్ రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సారంగపూర్ మండలం తుంగురు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ఇది లాస్ట్ ఎలక్షన్ అని చెప్తుండని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ గోసాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగిత్యాల PFI కి అడ్డ, జీవన్ రెడ్డి గెలిస్తే లవ్ జీహాదికి అడ్డ అవుతుందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు.
బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే..
బీజేపీ కి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమే.. అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీ భవన్ లో కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య హాజరయ్యారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గొల్ల కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఐతే కురుమ కార్పొరేషన్ వేరుగా ఏర్పాటు చేయాలనీ బీర్ల ఐలయ్య కోరారని తెలిపారు.
దళితులను ఈ ప్రభుత్వం అవమానిస్తుంది
ఎలక్షన్ వచ్చినప్పుడల్ల బీజేపీ రిజర్వేషన్ లు ఎత్తేస్తుందని కాంగ్రెస్ కు ప్రచారం చేయడం అలవాటు అని బీజేపీ నేత కొప్పు భాష మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ భారతరత్న ఇవ్వకుండా , నెహ్రూ, రాజీవ్ గాంధీకి లకు ఇచ్చారు.. ఆయన్ను అవమానించారన్నారు. దళితులను ఈ ప్రభుత్వం అవమానిస్తుందని, అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ లకు ఉన్న 84 సీట్ల 46 సీట్లు బీజేపీ గెలిచిందని, కేటీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని కెసిఆర్ అన్నప్పుడు ఎక్కడ పోయావని ఆయన అన్నారు. అంబేద్కర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ అని, రిజర్వేషన్ లను మారుస్తారు అంటే బట్టలు విప్పి కొడతామన్నారు కొప్పు భాష.
మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది..
కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారని, 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారని, మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వమని, తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని, నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారన్నారు రేవంత్ రెడ్డి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్రం.. కౌరవ సైన్యాన్ని ప్రజలు నమ్మొద్దు..
మండుటెండలో సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్‌లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగనుందని.. ప్రతిపక్షం వైపు ఉన్న కౌరవ సైన్యాన్ని , దుష్ట చతుష్టయాన్ని ప్రజలు నమ్మొద్దన్నారు. మూకుమ్మడిగా కలిసి వచ్చి, మీ బిడ్డపై యుద్ధం చేస్తున్నారని.. మీకు మంచి చేసిన మీ బిడ్డపై పొత్తుల పార్టీలు యుద్ధం చేస్తున్నాయన్నారు. తాను నమ్ముకుంది పేద ప్రజల్ని, పైనున్న దేవుడ్ని అని సీఎం జగన్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదని.. రాబోయే ఐదు సంవత్సరాలు మీ ఇంటింటి అభివృద్ధి, పేద ప్రజల భవిష్యత్తుని, పేద ప్రజల తలరాతని నిర్ణయించబోయే ఎన్నికలు ఇవి అని పేర్కొన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇస్తున్న పథకాలన్నీ ముగిసిపోతాయని సీఎం అన్నారు.
తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో.. సాయంత్రం వరకు పూర్తి నామినేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం వరకు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 625 మంది పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. 268 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. మల్కాజిగిరి ఆర్వో పై మల్కాజ్‌గిరి పార్లమెంట్ లో నామినేషన్ వేసి తిరస్కరించబడ్డ 77 మంది స్వతంత్ర అభ్యర్థులు సీఈవోకు ఫిర్యాదు చేశారు. అత్యధికంగా మెదక్ స్థానానికి 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 13 మంది పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 625 నామినేషన్లు నమోదు అయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 4,120, 25 ఎంపీ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.