ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు!
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్ళిపోయాడన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి.. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
విశాఖలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ… ‘ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. అదే సాధ్యం అయితే అర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధాని అయ్యేవాడు. పవన్ తన తప్పులు కేడర్ మీద రుద్దడం సిగ్గు చేటు. చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే అతడు అధహ పాతాళానికి వెళ్ళిపోయాడు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వా.. సీఎం జగన్ గురించి మాట్లాడేది?. బూత్ కమిటీలు, మండల కమిటీలు వేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిది. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి?. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించలేదు’ అని అన్నారు.
మధ్యాహ్నం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో నీళ్లు బంద్..
నగరవాసులకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇవాళ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మంజీర నీటి సరఫరా పంప్‌హౌస్‌ల మరమ్మతులు, సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కారణంగా వాటర్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. మంజీరా నీటి సరఫరా పంప్‌హౌస్‌ల మరమ్మతులు, సబ్ స్టేషన్లలో విద్యుత్ పునరుద్ధరణ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తులు..!
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ఉదయం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. గత సెప్టెంబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన ప్రభుత్వం.. 11 వేల పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్లు SA, సెకండరీ గ్రేడ్ టీచర్లు SGT, భాషా పండితులు LP & ఫిజికల్ ఎడ్యుకేషన్ PET టీచర్లు , ప్రాథమిక స్థాయి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్మెంట్ కోసం DSC-2024 ద్వారా నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నారు.
ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబుని కలుస్తా.. ఆవేదనను బాబు ముందు ఉంచుతా: బొల్లినేని రామారావు
‘చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా నాకు ప్రాణం. ఇతర పార్టీల నేతలు కూడా నాతో మాట్లాడారు కానీ స్పందించలేదు. 14 నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. పక్కన నియోజక వర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. దళారీలను పక్కనపెట్టి చంద్రబాబు నేరుగా నివేదిక తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు. వచ్చే నెల 2న నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో కలుస్తాను. ఆయన ఏమి చెబుతారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఆయన చెప్పిన విషయాన్ని మీ ముందు ఉంచుతాను. మీరు ఏమి చెబితే అది చేస్తా. మనకు అంతా మంచి జరగాలనే ఆశిస్తా. ఎవరు బాధపడాల్సిన పని లేదు’ అని టీడీపీ సీనియర్ నేత బొల్లినేని రామారావు అన్నారు.
చంద్రబాబును పాతాళానికి తొక్కేది పవన్ కల్యాణ్ మాత్రమే..
పవన్‌కల్యాణ్ తాడేపల్లిగూడెం సభలో మాట్లాడిన మాటలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్లాక్‌మెయిలింగ్‌లా పవన్.. జగన్ దగ్గర అవ్వన్నీ నడవవన్నారు. యుద్ధం అంటున్నావ్ పవన్ …2014, 2019లో ఏమి చేసావు.. జగన్ నీకు పెద్ద సినిమా చూపించాడన్నారు. 2019లో అమరావతి కొందరి రాజధాని అని పవన్ కల్యాణ్ అన్నారని.. కుల రాజధాని అన్నారని.. చంద్రబాబుకు, నీకు మధ్య ఏమిటి లాలూచీ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 24 సీట్లు కాకపోతే, సున్న తీసుకో పవన్ కల్యాణ్.. వైసీపీకి ఏంటి అని ఆయన ప్రశ్నలు గుప్పించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పీకే సున్న సీట్లు కదా అంటూ వ్యాఖ్యానించారు. ముద్రగడ ఇంటికి వెళతా అన్నారు…ఆయనకు ఉంటుంది బాధా …మాకు ఎందుకు బాధ అని అన్నారు. చంద్రబాబును పాతాళంకు తొక్కేది పవన్ కల్యాణ్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడలేదన్నారు. ఎంత కర్మ పవన్ కల్యాణ్‌కు అంటూ ఎద్దేవా చేశారు.
నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారు
కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని, నీళ్ళు, నిధులు, నియామకాల పేరిట ఇంట్లో వాళ్ళందరూ ఉద్యోగాలు పొందిం కేసీఆర్ కుటుంబమని సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చంద్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లను ఆంధ్రోళ్లు దోచుకువెళ్తుంటే… చేతకాక చూస్తూ ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. కమిషన్ లు తీసుకొని కాళేశ్వరం కట్టి, కాంట్రాక్టులు ఆంధ్రోళ్లు కట్టబెట్టారని, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసిఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు వంశీ చంద్ రెడ్డి. పాలమూరు, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసిఆర్.. పాలమూరు ప్రజలకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేని కేసీఆర్ కి పాపం తగులుతుందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌కి పాలమూరు ప్రజల తరుపున బహిరంగ లేఖ రాస్తున్నానని, గత పదేళ్ళ ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వకుండా.. పదేళ్ల నిర్లక్ష్యం తుడిచి పెట్టీ రేవంత్ రెడ్డి పాలన చేస్తుంటే… బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బనగానపల్లెలో మార్చి 4న సీఎం జగన్ పర్యటన
నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో ఈనెల 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ గ్రౌండ్, సభా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరిశీలించారు. సీఎం పర్యటనకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
సమస్యల పరిష్కారానికి కృషి
బస్తీవాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్, కుమ్మరివాడి, మెహదీపట్నం జిభాబాగ్ లో పవర్ బోర్ లను ప్రారంభించారు. హోటల్ నీలోఫర్ టీ తాగిన కేంద్రమంత్రి ,.. కుండల తయారీనీ పరిశీలించిన కిషన్ రెడ్డి.. లకిడీకపూల్, ఆసిఫ్ నగర్ నీలోఫర్ హోటల్ ముందు పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం స్థానిక నరసింహ స్వామి టెంపుల్ లో స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత స్థానిక నాయకులతో కలిసి “హోటల్ నీలోఫర్ లో టీ” తాగారు. అనంతరం కుమ్మరివాడిలో పవర్ బోర్ ను ప్రారంభించారు.
ఎంపీగా ఇవే నా చివరి ఎన్నికలు!.. ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావచ్చని.. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో అని ఎంపీ మిథున్ రెడ్డి తన మనస్సులోని మాటను తెలిపారు. ఈ సారి రాజంపేట ఎంపీగా గెలుస్తాను, నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎంపీగా నిలబడతానో లేదోనని ఆయన తన మనస్సులోని సందేహాన్ని బయటపెట్టారు. రాజంపేట పార్లమెంట్లో అభివృద్ధికి కృషి చేస్తానని వాల్మీకిపురం ప్రజలకు హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సిల్లీ రాజకీయాలు చేస్తున్నారు.. రేవంత్ కు సవాల్..
మేము మేడిగడ్డ వెళ్తుంటే వాళ్ళు పాలమూరు పోతాము అంటున్నారని, సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ రిపైర్లు చేయమంటే చేయట్లేదని, మార్చి 31 లోపు రిపేర్ చేసి నీళ్లు ఇవ్వకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. మీరు చేయలేక పోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు. మీకు చేత కాకపోతే దిగిపోండి.. హరీష్ రావు చెప్పినట్లు నీళ్లు ఎత్తిపోసి చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న హరీష్ రావు చెప్పారు…దానికి మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ నిర్మాణంలో ఎంత సిమెంట్, కాంక్రీట్ వాడాలో కేసీఆర్ చెప్పారు అని ఉత్తమ్ కుమార్ అంటున్నారని, కేసీఆర్ ను రాజకీయంగా బదనాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.