కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు..
తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో మునిగిపోయింది.. త్వరలో బొంది వాగు ప్రాజెక్ట్ ఫండ్ రాబోతుంది ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల రాబోతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నిరు పేదల ప్రభుత్వంగా ప్రజల్లోకి వెళ్ళింది అని మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు.
మల్కాజ్గిరిలో లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే..
తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోతుందని కలలో కూడా ఊహించలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం ఎట్లుంటదో జనాలకు అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వంపై గ్రామాల్లో మన్నువోసుడు, దుమ్మువోసుడే కనిపిస్తుంది. అయితే, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఒక్కడే లోకల్.. ఇద్దరు నాన్ లోకలే అని ఆయన చెప్పుకొచ్చారు. లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా మన అధ్యక్షుడు ప్రకటించాడు.. మనం గెలిపించాలి.. ప్రతి ఒక్కరు అభ్యర్థినే అనుకుని పని చేయాలి అని తలసాని పిలుపునిచ్చారు. మనం ఏం చేసినం.. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందో జనాలకు చెప్పాలి.. అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో లాగా పాదయాత్ర చేద్దాం అని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
రూ. 2 లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్కి ఓటెయ్యండి.. కానోళ్లు బీఆర్ఎస్కు వేయండి..
చేవెళ్ల సభలో ఒక్క సీటు గెలువు అని రేవంత్ రెడ్డి అన్నాడు.. నేను సవాల్ విసిరిన.. ఇద్దరం మల్కాజిగిరిలో పోటీ చేద్దాం అని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సప్పుడు జేస్తలేడు.. ఓడిపోతా అని భయం.. ఇంకా ఎలక్షన్స్ కు టైం ఉంది.. రా పోటీ చేద్దాం.. రేవంత్ కు నరుకుడు ఎక్కువ.. పెద్ద పెద్ద మాటలు తప్ప చేసేదేం లేదు.. రేపు జరుగుతున్న పోటీ వ్యక్తుల మధ్య కాదు.. మూడు పార్టీల మధ్య అని ఆయన చెప్పుకొచ్చారు. మల్కాజిగిరి పరిధిలో ఒక్కో అభ్యర్థికి తుఫాన్ లాగా మెజార్టీ వచ్చింది.. నువ్వు ఎంపీగా ఉండి ఒక్క కాలనీలో తిరగలేదు.. గులాబీ కుటుంబ సభ్యులం అందరం కష్టపడాలి.. పదేళ్ల నిజానికి.. పదేళ్ల విషానికి.. వంద రోజుల అబద్దానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. పదేళ్ల నిజం బీఆర్ఎస్, పదేళ్ల విషం బీజేపీ, ఇక వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదు: పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరువు రాలేదని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుందని, మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండని, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద తాము ఓట్లు అడుగుతాం అని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. మనకు రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ‘బీఆర్ఎస్ పార్టీ వర్షపాతంపై రాజకీయం చేస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ వచ్చాక కరువు రాలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిన వద్ద బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగండి, ఇందిరమ్మ ఇండ్లు కట్టిన వద్ద మేము ఓట్లు అడుగుతాం. రైతు బందు అందరికీ ఇస్తాం. గతంలో రైతుబందు మార్చ్ నెల వరకు ఇచ్చారు. రాష్ట్రం 7లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 40వేల కోట్ల బిల్లులు ఆగిపోయి ఉన్నాయి. రైతులపై మీకు చిత్త శుద్ది ఉంటే రండి.. మీరు, మేము చేసిన వాస్తవాలు ప్రజలకు చెబుదాం. కేంద్రంతో సత్సంబంధాలతో ఉండి.. కేంద్రం నుండి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటాం’ అని అన్నారు.
చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు. జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరన్నారు. అందితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవనని తెలిసే ఇంటికి వెళ్లి మరి పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నాడని ఆయన ఆరోపించారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేసానని ఎంతో బాధపడిన చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలోగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడన్నారు.
ఉప్పల్‌లో SRH-MI మ్యాచ్.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (బుధవారం) జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు అంత సిద్ధం చేశారు. స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నేటి సాయంత్రం 7. 30 గంటలకు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాగా, ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్‌ఆర్‌టీసీ ) దాదాపు 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. క్రికెట్ అభిమానుల కోసం ఈ ప్రత్యేక ఆర్టీసీ బస్సులు మార్చి 27 మరియు ఏప్రిల్ 5 తేదీలలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు నడపబడతాయి. కోటి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, కొండాపూర్, జేబీఎస్, ఎల్‌బీ నగర్, బీహెచ్‌ఈఎల్ నుంచి ఆర్‌జీఐసీ స్టేడియం వరకు ఇవి నడపనున్నాయి.
జనంలోకి సీఎం జగన్.. సొంతనియోజకవర్గంలో ముగిసిన బస్సు యాత్ర
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో జనంలోకి సీఎం జగన్ వెళ్తున్నారు. ఇడుపులపాయ వద్ద ఎన్నికల ప్రచారాన్ని సీఎం ప్రారంభించగా.. ఇప్పటివరకు ఆయన యాత్ర తన సొంత నియోజకవర్గమైన పులివెందులను దాటి కమలాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గంలో బస్సు యాత్ర కొనసాగుతోంది. బస్సు యాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా జననీరాజనం లభిస్తోంది. హారతులు ఇస్తూ మహిళలు స్వాగతం పలుకుతున్నారు. బస్సులో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో పాటు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, కడప జిల్లా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. కాసేపట్లో ప్రొద్దుటూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
పవన్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డితో కలిసి వెళ్లి జనసేనానిని కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మద్దతు కోరేందుకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయనను కలిసినట్లు తెలుస్తోంది.
తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ మధ్యే వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వరప్రసాద్.. తిరుపతి నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. తనకు కూడా జనసేన తరఫున సపోర్ట్ చేయాలని వరప్రసాద్ పవన్‌ను కోరారు. పవన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
మల్కాజిగిరిలో విజయం బీఆర్ఎస్‌దే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల దాడికి దిగారు. ధైర్యంగా తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తనపై పోటీ చేస్తానని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్‌ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, ముఖ్యమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ, మల్కాజిగిరి నుండి పోటీ చేయాలనే సవాలుకు రేవంత్ రెడ్డి స్పందించలేదని, రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని ఆయన అన్నారు.
30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలోకి ఫిరాయిస్తారని పునరుద్ఘాటించిన కేటీఆర్.. ఈ విషయంలో ఆరోపణలపై ముఖ్యమంత్రి మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి ఓటు వేస్తే అంతిమంగా బీజేపీకే లాభం చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని విమర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం బడా భాయ్ (అన్నయ్య)గా, మిత్రుడని పొగిడారని ఆయన ఎత్తిచూపారు.
ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు 5కే రన్
ఓటు హక్కును ఓటర్లకు తెలియజేసే ప్రయత్నంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ‘నేను తప్పకుండా ఓటు వేస్తాను’ అనే థీమ్‌తో 5కే రన్ నిర్వహించారు. పాత కలెక్టరేట్ నుంచి 5కే రన్‌ను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ జెండా ఊపి ప్రారంభించారు. 5కే రన్ లో వివిధ శాఖల అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక సంస్థల సభ్యులు, యువతీ, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.