మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..!
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా అమ్మవార్ల నామస్మరణతో మారిమ్రోగింది. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి బెల్లం (బంగారం) సమర్పిస్తున్నారు. ఉదయాన్నే గుడిసెలు వేసి ముంగిల వద్ద రంగవల్లులను అందంగా అలంకరించారు.
ఈ నెల 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి టీడీపీ
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా పర్యటనలను ఆయన చేయనున్నారు. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పర్యటన ఖారారు అయింది.
బీఎస్పీ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రాంపూర్, పిలిభిత్ సహా 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీఎస్పీ తొలి జాబితా ఇదే. రాంపూర్ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థికి బీఎస్పీ టికెట్ ఇచ్చింది. బీఎస్పీ సహారన్‌పూర్ నుంచి మాజిద్ అలీ, కైరానా నుంచి శ్రీపాల్ సింగ్, ముజఫర్‌నగర్ నుంచి దారా సింగ్ ప్రజాపతి, బిజ్నోర్ నుంచి విజేంద్ర సింగ్, నగీనా నుంచి సురేంద్ర పాల్ సింగ్, మొహమ్మద్. ఇర్ఫాన్ సైఫీ, రాంపూర్ నుండి జీషన్ ఖాన్, సంభాల్ నుండి షౌలత్ అలీ, అమ్రోహా నుండి ముజాహిద్ హుస్సేన్, మీరట్ నుండి దేవవ్రిత్ త్యాగి, బాగ్‌పట్ నుండి ప్రవీణ్ బన్సల్, గౌత్‌బుద్ నగర్ నుండి రాజేంద్ర సింగ్ సోలంకి, బులంద్‌షహర్ నుండి గిరీష్ చంద్ర జాతవ్, ఆమ్లా నుండి అబిద్ అలీస్ అహ్మద్, అనీస్ అలీస్ షాజహాన్‌పూర్ నుంచి పిలిభిత్ ఫూల్‌బాబు, డాక్టర్ దొడ్రం వర్మ అభ్యర్థులుగా ప్రకటించారు.
చేనేత కుటుంబం బలవన్మరణానికి ఆయనదే బాధ్యత..
చేనేత కుటుంబం బలవన్మరణానికి జగన్ రెడ్డిదే బాధ్యత అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేకనే చేనేత కుటుంబం చనిపోయింది.. బీసీల ఆస్తులను కబ్జా చేసి ఇదేమని ప్రశ్నిస్తే బలి తీసుకుంటున్నారు ఆరోపించారు. బీసీలంటే జగన్ రెడ్డికి గిట్టదు.. ఐదేళ్లుగా బీసీల ఆస్తులను కబ్జా చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను అణగదొక్కేస్తున్నారు.. సామాజిక న్యాయం మాటలకే పరిమితమా జగన్ రెడ్డీ? అని ప్రశ్నించారు. బీసీలపై దమనకాండ ఆపి నిందితులపై చర్యలు తీసుకోవాలి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మన సీఎంకు.. మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదని ఎమ్మెల్యేలు తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాక్యలు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల చింతబావి తండాలో ఎండిపోయిన పంట పొలాలను హరీష్ రావు, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో రైతులకు ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఎలక్షన్ సమయంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక రైతులకు మొండి చేయి చూపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి, వడగండ్ల వానలు పడి పంట నష్టం తీవ్రంగా జరిగిందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు.
కవిత కేస్ పై కిషన్ రెడ్డి ఆధారాలు ఉన్నాయన్నారు.. ఈడీ విచారణ చేయాలి..!
ఎమ్మెల్సీ కవిత కేస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు.. ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా చోట్ల పొలాలు ఎండి పోతున్నాయన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. గతంలో కేఆర్ఎండీ అడ్డు చెప్పినా మేము పొలాలకు నీళ్లు ఇచ్చామన్నారు. నాగార్జున సాగర్ కట్ట మీదకు వెళ్ళడానికి మంత్రుల కు లాగులు తడుస్తున్నాయన్నారు.
తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తాం
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వచ్ఛందంగా బీజేపీ కార్యక్రమాలు వస్తున్నారు…మోడీ ప్రధాని కావాలని అంటున్నారు…కేంద్ర పథకాల తో ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. తెలంగాణలో బీజేపీ సానుకూల వాతావరణం ఉంది… అద్భుతమైన పలితాలు సాధిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన డబుల్ డిజిట్ సీట్లు బీజేపీ కే వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ ను కలవాలి… ఏ పోలింగ్ బూత్ కు ఆ పోలింగ్ బూత్ వారీగా కార్యచరణ రూపొందించుకోవాలి… ప్రతి పోలిన్ బూత్ గెలవాలని, ప్రతి బూత్ కి ఒక ముఖ్య నేతను సమన్వయ కర్తగా నియమించాలి.. నేను కూడా ఒక పోలింగ్ బూత్ కు కో ఆర్డినేటర్ గా ఉన్నానన్నారు. ఇక్కడి 17 సీట్లు గెలిస్తే నే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారంటీ లు అమలు అవుతాయని రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన మండిపడ్డారు.
“మాకు ఒక్క సీటు ఎక్కువ వచ్చినా..” మమతా బెనర్జీ సర్కార్ ఉండదు..
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కన్నా ఒక్క సీటు ఎక్కువ వచ్చినా 2026 లోపే మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) బెంగాల్ బీజేపీకి సైద్ధాంతిక అంశమని అన్నారు. రాష్ట్రంలో ఎంపీ స్థానాలను స్వీప్ చేయడానికి ఈ చట్టం సహాయపడుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అవినీతి, అరాచక టీఎంసీని ఓడించాలని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మజుందార్ అన్నారు.
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్..
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ యువతి దుర్మరణం చెందింది. మృతురాలిని అర్షియా జోషిగా గుర్తించారు. మార్చి 21న ఆర్షియా జోషీ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఈ యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ ఘటన గురించి జోషి కుటుంబానికి భారతీయ రాయబార కార్యాలయం సమాచారం అందించింది. ఘటనపై న్యూయార్క్‌లో భారతీయ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆదివారం ట్వీట్ చేసింది. ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది.