కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ!
తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు.
శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఇరువర్గాలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ శాంతింపజేశారు.
ఏపీ 2024 ఎన్నికలు.. వర్గ పోరు కాదు.. కుల పోరు..!
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కాకరేపుతున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తుండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్‌గానే పోటీకి సిద్ధమైంది.. ఇక, కాంగ్రెస్, కమ్యూనిస్టుల వ్యవహారం తేలాల్చి ఉంది.. అయితే, రాష్ట్రంలో తాజాగా పొత్తులపై సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి.. ఇప్పటికే మూడు పార్టీల పొత్తుపై సెటైర్లు వేసిన ఆయన.. ఇప్పుడు ”ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలు వర్గ పోరు కాదు కుల పోరు! ” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ”వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పేద, బలహీనవర్గాల కలలను సాకారం చేసుకునేంత వరకు అండగా ఉండాలని కోరుకునే సీఎం వైఎస్ జగన్ పై.. అధికారాన్ని కేంద్రీకరించి నిలబెట్టుకోవాలనుకునే ధనవంతుల మధ్య పోటీ” అంటూ విపక్షాల పేర్లు ప్రస్తావించకుండానే సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు.
టీడీపీ, బీజేపీ పొత్తును ప్రజలు తిరస్కరిస్తారు.. అడ్రస్‌లు వెతుక్కోవాల్సిందే..!
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి.. బీజేపీ అంటే భగ్గుమనే కమ్యూనిస్టు పార్టీలు.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు కలపడాన్ని తప్పుపడుతోంది.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు).. సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు విశ్వాస ఘాతుక పొత్తుగా పేర్కొన్నారు.. ద్రోహం చేసిన బీజేపీతో పొత్తు ప్రజలకు వెన్నుపోటుగా అభివర్ణించిన ఆయన.. జాతీయ స్ధాయిలో పొత్తులు పొడుస్తున్నాయంటే సంకీర్ణ పరిస్థితులు వస్తున్నాయని అర్థం చేసుకోవాలన్నారు. బీజేపీ గెలుస్తామన్న నమ్మకం కోల్పోయింది.. అందుకే పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తుందని దుయ్యబట్టారు.
సింగిల్‌గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం..
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని పేర్కొన్నారు. కులమతాలు, పార్టీలు చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారని అన్నారు.
గతంలో లాగా జన్మభూమి కమిటీలు పెట్టీ ప్రజలను దోచుకున్న పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. ఇక్కడ టీడీపీ నుండి పోటీ చేస్తున్న వ్యక్తి టీడీపీ హయాంలో ఏమి అభివృద్ధి చేశారు ? అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడు, అందుకే వివిధ పార్టీలను ఊదకట్టెలు లాగా తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీ వీడిన మార్నేని రవీందర్ రావు దంపతులు
బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిన్ననే మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ను వీడుతున్న అని ప్రకటించిన మరునాడు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆయన సతీమణి ఐనవోలు ఎంపీపీ మధుమతిలు బీఆర్ఎస్ వీడి మరికొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి సంక్షేమ లో రవీందర్ రావు, మధుమతి దంపతులు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ సీఎం కేసీఅర్ కుటుంబానికి సన్నిహితుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రధాన అనుచరుడిగా ఉన్న మార్నేని ఎన్నికల అనంతరం నాటి నుంచి పార్టీ మారుతాడన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.
టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్..
టీడీపీ- జనసేన- బీజేపీ పొత్తుపై ఎంపీ కేశినేని నాని కౌంటర్ వేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మాట మీద నిలబడే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని తెలిపారు. 3 రోజుల నుండి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
అస్సాం టీ గార్డెన్‌ను ఆస్వాదించిన మోడీ
అస్సాంలో (Assam) ప్రధాని మోడీ (PM Modi) పర్యటిస్తున్నారు. రెండ్రోజుల ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మోడీ శుక్రవారం అస్సాం చేరుకున్నారు. ఈ ఉదయం కజిరంగా నేషనల్ పార్క్ సందర్శించారు. అనంతరం ఏనుగుపై స్వారీ చేశారు. కొంత సేపు జీపులో కూడా ప్రయాణం చేశారు. కాజిరంగా నేషనల్ పార్క్ ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడ పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయని మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మధ్యాహ్నం అస్సాంలోని టీ గార్డెన్‌ను (Tea Estate) కూడా ప్రధాని మోడీ సందర్శించారు. అక్కడ కొంత సమయం గడిపారు. టీ ఉత్పత్తులను గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు.. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం..
వర్ధన్నపేట, పాలకుర్తి నియోజక వర్గాల నుంచి పలువురు బిఆర్ఎస్ నాయకులు ఈ రోజు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి సమక్షంలో ఎమ్మెల్యేలు నాగరాజు, యశస్వని రెడ్డి ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశ్వస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పెద్దఎత్తున చేరుతున్నారు. వారందరికీ హృదయ పూర్వక స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలలుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో మంచి స్పందన కలిగిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విస్తృత స్థాయి కార్యక్రమాలతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది.. ఎవరికి ఏ స్థాయి లో ప్రాధాన్యత ఇవ్వాలో అలాగే ఇస్తామని ఆమె అన్నారు. పాత నాయకులు, కొత్త నాయకులు కలిసికట్టుగా పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాలని ఆమె కోరారు.
కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరుతూ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధి మున్నూరు కాపు సంఘం నేతలు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మీ వినతిని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళతాం. మీ ఆలోచనలను వివరిస్తామన్నారు. కేసీఆర్ గారు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే వ్యక్తి అని, మున్నూరు కాపు నేతలకు గతంలోనూ ఎంతో మందికి అవకాశం కల్పించారన్నారు. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కూడా కరెంట్ పోలేదని, నిన్న ఒక ఊరుకు పోతే కరెంట్ కోతలు మొదలు అయ్యాయని రైతులు అవేదన చెందారన్నారు. పదేళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామని, వంద రోజుల్లో 13 హామీలు అన్నారు. 9 తారీఖు రుణమాఫీ అన్నారని, ఎన్ని 9 తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని హరీష్ రావు విమర్శించారు.
ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్..
ఉత్తరాంధ్రపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. తాడేపల్లిలో నిర్వహించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లతో వైసీపీ ముఖ్యుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.
ఉత్తరాంధ్రలోని మొత్తం 34 నియోజకవర్గాలకు 25 స్థానాలు కైవసం చేసుకోవాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచార సభలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఏఏ ప్రాంతాల్లో సీఎం జగన్ సభలు నిర్వహించాలన్న దానిపై నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పాల్గొనే సభల షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఉత్తరాంధ్ర నేతలకు దిశానిర్దేశం చేశారు.