కర్ణాటక ఫలితాలపై జోరుగా బెట్టింగ్.. గెలుపెవరిది..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు..?
కర్ణాటక ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం ముగిసింది.. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపెవరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అంచనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇంతకు ముందు వేసిన బెట్టింగ్స్ ను కొంత మంది మార్చుకుంటుంటే ఇంకొందరు.. బెట్టింగ్ పెట్టిన మొత్తాలను పెంచేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ బెట్టింగ్ రాయుళ్లు నమ్ముతుండటం విశేషం. ఎందుకంటే బీజేపీనే గెలుస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో.. అంతే మొత్తంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలుస్తుందని బెట్టింగ్స్ వేస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల కోసం ఎదురు చూస్తున్నారు బెట్టింగ్ బాబులు.. రకరకాలుగా బెట్టింగ్స్ కడుతున్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ ఎన్నిసీట్లు సాధిస్తుంది? జేడీఎస్ పరిస్థితి ఏంటి? కర్ణాటకలో వచ్చేది ఏ ప్రభుత్వం..? సీఎం అయ్యేది ఎవరు? కింగ్ ఎవరు? కింగ్ మేకర్‌గా మారేది ఎవరు? అనే వాటిపై బెట్టింగ్ జరుగుతోంది. వీటితోపాటు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీద కూడా పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న కొందరు అంతకు ముందు తాము కట్టిన పందేలలో నష్టపోకుండా ఉండేందుకు రివర్స్ బెట్టింగ్ వేస్తున్నారు. అంటే.. గతంలో ఒక పార్టీ విజయంపై బెట్టింగ్ వేసిన వాళ్లు.. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకి ఇచ్చిన సీట్లు చూశాక.. డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంకో పార్టీ గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను దగ్గర పెట్టుకుని వాటి యావరేజ్ ఎంత? మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావోచ్చు అనే దానిపై లెక్కలు కడుతున్నారు. రాజకీయ విశ్లేషకులను మించిన విశ్లేషణలు చేస్తున్నారు. సందర్భం ఏదైనా.. ఎన్నికలు ఎక్కడ జరిగినా పందేలు వేయడం షరామామూలుగా మారిపోయింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికలను కూడా వదలడం లేదు. బెట్టింగ్ వేసిన వాళ్లంతా.. ఫలితాల అంచనాలలో తలమునకలై పోయారు. హైదరాబాద్, ఏపీలోని భీమవరం కేంద్రంగానే గతంలో బెట్టింగ్స్ జరిగేవి. ఇప్పుడు చిన్నా చితకా పట్టణాలకు, గ్రామాలకు సైతం బెట్టింగ్ వ్యాపించినట్టు తెలుస్తోంది..
హైదరాబాద్ విమానాశ్రయంకు మరో అరుదైన గుర్తింపు
ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా హైదరాబాద్ విమానాశ్రయం గుర్తింపు పొందింది. ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ సిరియమ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 2023 నెలలో 90.43 శాతం ఆన్-టైమ్ పనితీరును నమోదు చేసింది. ప్రపంచంలోనే 90 శాతం మార్కును దాటిన ఏకైక విమానాశ్రయం హైదరాబాద్. సిరియమ్ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా విమానాలను సమీక్షించింది. దీంతో.. హైదరాబాద్ విమానాశ్రయం ‘గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్’, ‘లార్జ్ ఎయిర్‌పోర్ట్స్’ కేటగిరీలలో చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. విమానాశ్రయం గత ఏడాది నవంబర్ నెలలో 88.44 శాతం ఆన్ టైమ్ ఫెర్ఫామెన్స్ (OTP) తో ‘పెద్ద విమానాశ్రయాలు’ కేటగిరీలో 4వ ర్యాంక్‌ను పొందింది. ఈ విమానాశ్రయం వాస్తవ గేట్ డిపార్చర్ సర్వీస్ ఆధారంగా ఎంపిక చేయబడింది, ఇది 80 శాతం లేదా వాస్తవ బయలుదేరే సమయానికి మెరుగైన కవరేజీని కలిగి ఉంది.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష..
విశాఖపట్నం పర్యటనకంటే ముందు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు. 1402.58 ఎకరాల్లో 50,004 మందికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.. మొత్తం 21 లేఔట్లలో పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తామని తెలిపారు.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 10 లేఔట్లలో, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారులకు 11 లేఔట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు.. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలరు జారీ చేశారు. జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. దాదాపు 180 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసే పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిరుపేదల చిరకాల ఇంటి కలను తీర్చే బృహత్త కార్యక్రమం.. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం… ఇక, రివర్ బెడ్ పై వాకింగ్ ట్రాక్ సహా చేపడుతున్న వివిధ బ్యూటిఫికేషన్ పనులను సీఎం జగన్ కు వివరించారు అధికారులు. అయితే, విజయవాడలో కృష్ణానది వరద ముప్పు నుంచి తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడ్డ రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలన్న సీఎం.. విజయవాడ నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు.
‘సెటిలర్స్’ వ్యాఖ్యలపై వివాదం.. డిప్యూటీ సీఎం వివరణ
సెటిలర్స్ అంటూ డిప్యూటీ సీఎం రాజన్న దొర చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది.. దీంతో.. ఆ కామెంట్‌పై వివరణ ఇచ్చారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర.. సెటిలర్స్ అనే పదం వాడడంపై వివరణ ఇస్తూ.. సెటిలర్స్ అనే సంస్కృతే మాకు లేదన్నారు.. అందరి మద్దతుతోనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. డిప్యూటీ సీఎంగా కూడా నియమించబడ్డాను అన్నారు.. అయితే, షెడ్యూల్ ఏరియాలో చేర్చాలన్న డిమాండ్ ను గతంలో టీడీపీనే ప్రోత్సహించిందంటూ ఫైర్ అయ్యారు.. గిరిజనులు అంతా నా వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం రాజన్న దొర. కాగా, రెండు రోజుల క్రితం విజయనగరంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన విషయం విదితమే.. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుంది. చౌదరి, రెడ్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు భూములను, వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు..గడపగడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెటిలర్స్ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానన్నారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించమని కోరతానన్నారు. అలా జరిగితే సెటిలర్స్ నష్టపోతారు. గిరిజనుల వద్ద బ్రతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.. వారి కోసం వస్తున్న లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి. సెటిలర్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు. గిరిజనుల వద్ద సంపాదించుకొని అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదు అంటూ ఫైర్ అయ్యారు.. ఇక, అభివృద్ధి కార్యక్రమాలను బబ్లూ అనే సెటిలర్ అడ్డుకుంటున్నాడన్నారన్న రాజన్నదొర. ఇక్కడ పనిచేస్తూ అభివృద్ధి చెందుతున్న సెటిలర్లు.. ఇక్కడ తమ వల్ల రోడ్లు పాడయితే పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయిన విషయం విదితమే.
ప్రీ వెడ్డింగ్ షూట్స్ అమ్మాయిలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..
ఈ మధ్య కాలంలో పెళ్లి కన్నా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. చిత్రివిచిత్రంగా ప్రీ వెడ్డింగ్ షూట్లు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కాంట్రవర్సీలకు, ప్రమాదాలకు కూడా కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ల గురించి ఛత్తీస్‌గఢ్ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ కిరణ్మయి నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. కిరణ్మయి నాయక్ అధ్యక్షతన 172వ పబ్లిక్ హియరింగ్ మే9న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ జరిగింది. దీంట్లో భార్యభర్తల మధ్య వివాదాలే ఎక్కువగా లిస్ట్ అయ్యాయి. ఈ సందర్భంలో ఇందులో ఓ కేసును పరిశీలిస్తే.. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన పెళ్లి జరగలేదని ఒకరు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే హియరింగ్ సమయంలో ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఇరు పక్షాలు పెళ్లి ఏర్పాట్లకు, ఫోటోలకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు పెట్టిన ఖర్చులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయని, ఫ్రీ వెడ్డింగ్ వీడియోలను, ఫోటోలను డిలీట్ చేసేలా ఒప్పందం కుదరిందని కమిషన్ ముందు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్య్కులేట్ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారని దరఖాస్తుదారు చెప్పారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత కిరణ్మయి నాయక్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్రజలు పాశ్యత్య సంస్కృతి ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఇది మన భారత సంస్కృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం పెళ్లిళ్లకు ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లను నివారించాలని కోరారు. ఇది ఒకవేళ పెళ్లిళ్లు విఫలం అయినప్పుడు, విడాకుల వరకు వెళ్తే అమ్మాయిలకు హానికరంగా మారే అవకాశం ఉందని అన్నారు.
యూకేలో జీవన వ్యయ సంక్షోభం..పెరుగుతున్న దొంగతనాలు..
ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం సంభవించే ఛాన్స్ ఉన్న దేశాల్లో యూకే ముందు వరసలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, ఇంధన సంక్షోభం ఇలా అన్నీ కలిసి యూకే ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి. ఇప్పుడు యూకేలో చాలా మంది జీవన వ్యయ సంక్షోభాన్ని( Cost Of Living Crisis ) ఎదుర్కొంటున్నారు. దీంతో కొంత మంది దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా ఓ సర్వే తేల్చింది. గత రెండేళ్లుగా యూకే వ్యాప్తంగా ప్రాథమిక అవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే జీతం కన్నా నిత్యావసరాలపై పెట్టే ఖర్చు అధికంగా ఉంటోంది. కొన్ని కుటుంబాలు తాము తినకుండా డబ్బును ఆదా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ పౌరులు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటు8న్నారు. దీంతో గృహాల అవసరాలను తీర్చడానికి కష్టపడుతున్నారు. 2021-2022 మధ్య యూకే అంతటా జీవన వ్యయం బాగా పెరిగింది.
ఉస్తాద్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్
ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది.. అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పాట పాడేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ఇచ్చిన కాంబో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్. ఈ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా..? ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్స్ వస్తాయా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం నుంచి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తామని చెప్పుకొస్తూనే ఉన్నారు. అనుకున్నట్టుగానే కొద్దిసేపటి క్రితమే ఉస్తాద్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఊర మాస్ లుక్ లో పవన్ కళ్యాణ్.. అదరగొట్టేశాడు. ఇక పోస్టరే ఈ రేంజ్ లో ఉంటే.. దానికి మించి ఫస్ట్ గ్లింప్స్ లో ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా ఏ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ చెప్పినట్లుగానే ఈ ఫస్ట్ గ్లింప్స్.. రచ్చ రేపుతోంది. “ఏ కాలమున ధర్మముకు హాని కలుగునో.. అధర్మం మృతినొందునో.. ఆయా సమయంనందు ప్రతి యుగమున అవతారం దాల్చుచున్న..భగత్.. భగత్ సింగ్.. మహంకాళీ పోలీస్ స్టేషన్.. పత్తర్ ఘంజ్, పాత బస్తీ” అంటూ పవన్ ఊర మాస్ పోలీస్ లుక్ అదిరిపోయింది. గబ్బర్ సింగ్ లో క్లాస్ గా కనిపించిన పవన్.. ఈసారి మాస్ లుక్ లో చింపేశాడు. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది.. హట్.. సాలే అని చివరి డైలాగ్ అయితే హైలైట్ గా నిలిచింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో హీరోయిన్ శ్రీలీలను కూడా ఒక షాట్ లో చూపించారు. తేరి రీమేక్ కు, ఈ గ్లింప్స్ కు సంబంధం లేనట్లు కనిపిస్తుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలే మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.