ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం జగన్.. అప్పుడేనంటూ క్లారిటీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు జరగడానికి ఇంకా సమయం ఉన్నా.. సీఎం జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు.. ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అని విపక్షాలు కామెంట్లు చేస్తూనే ఉన్నాయి.. ఇదే సమయంలో ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా తాము సిద్ధం అని ప్రకటిస్తున్నారు.. అయితే, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులతో మాట్లాడిన సీఎం జగన్.. ముందస్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చేశారు.. ఎన్నికలకు ఇంకా మిగిలి ఉన్నది 9 నెలలేనన్న జగన్.. ఈ 9 నెలలు కష్టపడితే గెలుపు మనదేనని.. తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది తాను చూసుకుంటానంటూ మంత్రులతో తెలిపారు సీఎం వైఎస్ జగన్.
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ రూ.10,461 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. ఏపీకి రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది.. రూ. 10,461 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోట్ పంపింది కేంద్ర ప్రభుత్వం.. విభజన అంశాల్లో భాగంగా రెవెన్యూ లోటు నిధుల విడుదల చేయనున్నట్టు రెండు వారాల క్రితం కేంద్రం ప్రకటించింది కేంద్రం.. 2014-15 నాటి రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద రూ.10,460.87 కోట్లను ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 19న కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏకమొత్తంలో విడుదల చేసింది. ఎన్నికల ఏడాదిలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం విశేషంగా చెప్పుకోవాలి.
తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు.. కోటిన్నర ఎకరాల మాగాణి అని కేసీఆర్ నిరూపించారు
నాడు దాశరథి జైలు గోడల మీద ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అని రాస్తే.. నేడు సీఎం కేసీఆర్ ‘తెలంగాణ కోటిరత్నాల వీణనే కాదు, కోటిన్నర ఎకరాల మాగాణి’ అని నిరూపించారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన మునుగు జిల్లా పర్యటనలో భాగంగా సాగునీటి దినోత్సవ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. మండు వేసవిలో ఏనాడైనా నీళ్ళు కనిపించాయా? అని ప్రశ్నించారు. తాగునీరు ఇవ్వక చావగొట్టి.. సాగునీరు ఇవ్వకుండా సతాయించింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. సంక్రాంతికి గంగిరెద్దుల మాదిరిగా.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనరు, పెట్టుబడి ఇవ్వరు కానీ.. ఇక్కడ ప్రజల్ని అంగం చేసేలా డైలాగ్‌లు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. ఎన్నో ఏళ్ళుగా గిరిజనులు ఎదురుచూసిన 3100 తండాలను సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ములుగులో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఇక్కడి ప్రజల కోసం కేసీఆర్ నలుగురు మంత్రులను పంపించి, పలు అభివృద్ధి పనులు ప్రారంభింపజేశారని అన్నారు. ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ములుగును మున్సిపాలిటీని మార్చామన్నారు. కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు రూ.133 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలియజేశారు. దళితులకు, గిరిజనులకు, యాదవులకు, మహిళా సంఘాలకు రూ.110 కోట్ల ఆస్తులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17 వేల ఎకరాలకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. తెలంగాణ వస్తే ఏం వచ్చిందని ప్రశ్నించే వారికి.. జాతీయ స్థాయిలో ములుగు రెండో స్థానం సాధించిన ఘనత చాలదా? అని అడిగారు. వడ్లు కోనే తెలివిలేనోళ్ళు.. చేతగాని దద్దమ్మలు.. దిక్కుమాలిన కాంగ్రెస్ నాయకులు డైలాగ్‌లు చెబితే మోసపోతామా? అని ప్రశ్నించారు.
CRCSపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష
ఢిల్లీలో సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (CRCS) కార్యాలయం కంప్యూటరీకరణ పురోగతిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. సీఆర్‌సీఎస్ కార్యాలయం ద్వారా నిర్వహించే పోటీల ద్వారా యువత కూడా పోర్టల్‌ను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని.. అంతేకాకుండా మెరుగైన అనలిటిక్స్‌లో భాగస్వాములు కావాలని అమిత్ షా తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ అయిన ‘శేఖర్ సే సమృద్ధి’ని సాకారం చేసేందుకు సహకార రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని అమిత్ షా పేర్కొన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (MSCS) చట్టం, 2002 నిర్వహణకు బాధ్యత వహించే సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయం, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల కోసం డిజిటల్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడానికి కంప్యూటరైజ్ చేయబడుతోందని అమిత్ షా తెలిపారు. జూన్ 26 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ మరియు పోర్టల్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీల (ఎంఎస్‌సిఎస్) రిజిస్ట్రేషన్‌కు ఎంతో దోహదపడుతుందని.. ఇప్పటికే ఉన్న బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనిని సులభతరం చేస్తుందని షా తెలిపారు.
ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న హైదరబాదీ ఫాస్ట్ బౌలర్.. మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ పోరు జరుగుతుండగా.. ముందుగా టాస్ గెలిచిన.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. అంతకుముందు, ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు. మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపించాడు మహమ్మద్ సిరాజ్. అయితే ఓవల్ పిచ్ లో పేసర్లకు అనుకూలిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ తన అస్త్రాన్ని వాడాడు. ఇంకేముంది భారత్ కు సిరాజ్ రూపంలో ఒక శుభారంభం దొరికింది. ఐపీఎల్ లోని తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ.. సిరాజ్ చెలరేగుతున్నాడు. ముందుగా ఒక వికెట్ తీసి ఫాంలో ఉన్న సిరాజ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరోసారి చెలరేగాడు. క్రీజులో ఉన్న మార్నస్ లబుషెన్ కు తొలి బంతిని 143 కి.మీ వేగంతో విసిరాడు సిరాజ్. అయితే, ఇది అదనపు బౌన్స్, ఔట్ సీమ్‌గా రావడంతో మార్సన్ లబూషెన్ బిత్తరబోయాడు. అంతేకాకుండా ఆ బాల్ వేగంగా చేతికి తాకడంతో బ్యాట్‌ను కిందపడేశాడు. వెంటనే గ్లౌజ్ తీసి చూసుకోగా.. అతని ఎడమ చేతి బొటన వేలికి దెబ్బ తగిలింది. వెంటనే మైదానంలోకి ఫిజియో వచ్చి చెక్ చేసి, ఆయింట్ మెంట్ రాశాడు. దీంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మార్నస్ బ్యాటింగ్ చేసేందుకు ఓకే చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సిరాజ్ మియా ఇలానే మెరుపు వేగంతో బంతులు వేస్తే.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. కమాన్ సిరాజ్ భాయ్.
ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు.. ఆధార్ తో గుగూల్ పే యాక్టివేషన్..
ఆధార్ కార్డు సహాయంతో ఇకపై ‘గూగుల్ పే’ని యాక్టివేట్ చేసుకోవచ్చని మంగళవారం ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ యాక్టివేట్ కోసం ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రారంభించింది. ఇకపై యూజర్లు డెబిట్ కార్డ్ సహాయం లేకుండా యూపీఐ పిన్ యాక్టివేట్ చేసుకునేలా గూగూల్ పే శ్రీకారం చుట్టింది. వినియోదారుడు వారి ఆధార్ నంబర్ ఉపయోగించి సైన్ అప్ చేయడానికి గూగుల్ పే అనుమతిస్తుంది. ఈ ప్రక్రియకు డెబిట్ కార్డ్ వివరాలను ధృవీకరించాల్సిన అవసరం లేదు. భారతదేశంలోని 22 బ్యాంకుల కస్టమర్లు ఆధార్ ఉపయోగించి గూగుల్ పే అథెంటికేషన్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఆధార్ నంబర్ ఉపయోగించి గూగుల్ పేలో యూపీఐ కోసం నమోదు చేసుకోవాలనుకునే వినియోగదారులు UIDAI, బ్యాంక్ అకౌంట్ కు ఒకే రిజిస్టర్ మొబైల్ నంబర్ ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ ప్రక్రియ సమయంలో గూగుల్ పే, వినియోగదారుల ఆధార్ నంబర్లను స్టోర్ చేయడం లేదని తెలిపింది.
ఛీఛీ.. ముసలోడు.. రెండో పెళ్లి అంటున్నారు.. చేసుకుంటే తప్పేంటి
బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న విషయం తెల్సిందే. 57 ఏళ్ళ వయస్సులో తనకంటే చిన్న అమ్మాయిని ఆశిష్ రెండో వివాహం చేసుకున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త రూపాలు బారువాను ఆయన వివాహం చేసుకున్నాడు. ఇక ఆ ఫోటోలు బయటకు వచ్చిన దగ్గరనుంచి ఆశిష్ పై ట్రోలింగ్ ఎక్కువ అయ్యింది. 57 ఏళ్ళ వయస్సులో పెళ్లి ఏంటి.. ? ముసలోడుకు దసరా పండుగ.. అంటూ అసభ్యకరమైన మాటలతో ఆశిష్ ను ట్రోలర్స్ ట్రోల్ చేశారు. అయితే ఇప్పటివరకు ఆయన ఈ పెళ్లిపై స్పందించలేదు. అయితే తాజాగా తన రెండో పెళ్లిపై ఆశిష్ స్పందించాడు. తాజాగా రెండో పెళ్లి తరువాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయ తన రెండో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ పై స్పందించాడు. ” నా రెండో పెళ్లిపై వస్తున్న ట్రోల్స్ నేను చూసాను. ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. ప్రతి మనిషి మనస్సులో తమకు తాము పెద్దవారిగానే పరిగణిస్తారు. ఇతరులకు కూడా అలాగే సలహాలు ఇస్తారు. అప్పట్లో ఒక వయస్సు వచ్చాక అన్ని ఆపేయాలని చెప్తూ ఉండేవారు. కానీ, ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడు ఏ వయస్సులోనైనా ఏ పని అయినా చేయొచ్చు అని మనకు మనమే చెప్పుకుంటున్నాం. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ?. నేను చట్టాన్ని గౌరవించే మనిషిని. చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నాను.కష్టపడి పనిచేస్తున్నాను.. పన్నులు కూడా కడుతున్నాను. నాకంటూ ఒక వ్యక్తిగత కుటుంబం ఉండాలని కోరుకోవడంలో తప్పేంటీ..? అందుకే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను. పెళ్లి చేసుకున్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఈ విషయాన్ని అర్ధం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే.. అంతా మంచే జరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.