ఏపీలో కొత్త పార్టీ.. లిరిసిస్ట్ జొన్నవిత్తుల కీలక ప్రకటన
ఇప్పటికే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న క్రమంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందనే ప్రకటన వచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం ‘జై తెలుగు’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు. అయితే అధికారంలోకి రావడం తమ లక్ష్యం అని కాకుండా రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే చెప్పడం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. తెలుగు భాషకు పునర్‌వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని, తెలుగు భాష, పరిరక్షణ అజెండాతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని ‘జై తెలుగు’ పేరుతో ఐదు రంగులతో జెండా కూడా రూపొందించినట్లు వెల్లడించారు. నీలం,జలం, పచ్చ, వ్యవసాయం, ఎరుపు రంగు.. శ్రమశక్తి, పసుపు.. వైభవానికి, తెలుపు స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందిస్తున్నామని జొన్న విత్తుల వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని ఒకప్పుడు మదరాసీలు అన్నారు, ఇప్పుడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నాం కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మన తెలుగు భాషను మనమే విస్మరించి చులకన చేసుకుంటున్నామని తెలుగు భాష కోసం ఐదుగురు మహనీయులు కృషి చేశారని ఆయన అన్నారు. అందుకే గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజి ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫోటోలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయని అన్నారు.
మా వాడు వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. పవన్‌పై మంత్రి సెటైర్లు
మా వాడు చేస్తున్న వారాహి యాత్రలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై మరోసారి సీరియస్ కామెంట్లు చేశారు.. సీఎం వైఎస్ జగన్‌కు రోజు రోజుకూ ప్రజాభిమానం పెరుగుతోందన్న ఆయన.. జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణను ప్రతిపక్ష పార్టీలు ఓర్చుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు.. జగన్ రహిత పరిపాలన రావాలని పదే పదే చెబుతున్నారు. జగన్ రహిత పాలన జరిగితే చంద్రబాబుకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే లాభం దక్కుతుంది.. చంద్రబాబు రహిత రాజకీయాలుంటేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
90 శాతం కాపుల మద్దతు జగన్‌కే.. ఫ్యాన్స్ కోసమే పవన్ యాత్ర..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వారాహి యాత్రలో అధికార పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుండగా.. వైసీపీ నేతలు పవన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు.. తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు.. ఇంత వ్యక్తిగత దూషణలు చంద్రబాబు కూడా చేయలేదన్న ఆయన.. సబ్జెక్ట్ లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు వస్తాయని మండిపడ్డారు.. అకేషనల్ గా రాజకీయాలు చేస్తూ పవన్ కల్యాణ్ బయటకు వస్తున్నారు.. సభ్యత లేని భాషతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై మాట్లాడారు.. పవన్‌కు దమ్ముంటే ద్వారంపూడిపై పోటీ చేయాలని సవాల్ చేశారు.. ఇక, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో కులాలు, కుంపట్లు ప్రారంభం అయ్యాయని వ్యాఖ్యానించారు కన్నబాబు.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వస్తే చిరంజీవిని టీడీపీ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్‌లోనే నిర్భధించింది.. అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదు.. ప్రశ్నిస్తాను అనే పవన్.. అప్పటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు.. ఏమైనా.. రాష్ట్రంలో 90 శాతం కాపులు సీఎం వైఎస్ జగన్‌కి మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు మాజీ మంత్రి కన్నబాబు.
ఆ లేఖను చదివితే పవన్ వెంటనే ఏపీ వదిలి పారిపోతారు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాయడం ఏపీ రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది.. వీధి రౌడీ భాషలో మాట్లాడటం ఎంతవరకు న్యాయమని పవన్‌ను లేఖలో నిలదీసిన ముద్రగడ.. పవన్ మాట్లాడే భాష వల్ల నష్టం తప్ప లాభం లేదన్నారు. ఇప్పటివరకు ఎంతమందిని చెప్పుతో కొట్టారో.. గుండ్లు గీయించారో చెప్పాలని ప్రశ్నించారు. అయితే, ఈ వ్యవహారంపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి జోగు రమేష్.. ముద్రగడ లేఖను పవన్ కల్యాణ్ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్‌కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్‌లో యాక్షన్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.
విద్యతోనే వికాసం… ఆనందం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. విద్యతోనే వికాసం…ఆనందం అని ఆయన అన్నారు. మంచి చదువు కుంటే ఎవరూ పైరవీలు అవసరం లేదని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక్కతరం చదువు కుంటే ఆ కుటుంబం ఎప్పటికీ బాగుంటుందని, వ్యవస్థ లోపాలు ఎప్పటికీ ఉంటాయని, అన్నింటినీ భూతద్దంలో చూడవద్దని ఆయన అన్నారు. సరిగ్గా 9 ఏళ్ల మన బడి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని, అనాడు కరెంట్ ఎలా ఉండే, సాగునీరు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఆలోచన, చిత్తశుద్ది ఎలా ఉంది అనేది ముఖ్యమని, 3,416 తండాలను గ్రామ పంచాయితీలుగా చేశామని ఆయన అన్నారు. ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు, 9 ఏళ్ల క్రితం ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అగం కావద్దు, ఎవడో వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగానే తొందర పడవద్దని, మేము ఖర్చు పెట్టే డబ్బులు ప్రజలదే మా పైసలు కాదు. అందుకే జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నామని ఆయన అన్నారు. నేను కారులో వస్తుంటే ఇద్దరు ముగ్గురు పొరగల్లు వచ్చి అడ్డం వస్తారు ఏమీ అవుతుంది.. డ్రామాలు వద్దు.. మా కంటే 55 ఎండ్ల నుండి ఉన్నవారు ఏం చేశారని ఆయన మండిపడ్డారు. మా లెక్క ప్రకారం మేము ముందు పోతమని, ఇక్కడ ఎంపీ వలన అర పైసా ఖర్చు చేశాడా అని ఆయన అన్నారు.
కుక్కల నుంచి తప్పించుకోబోయి ట్రాక్టర్ కింద పడ్డ బాలుడు
హన్మకొండ కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో మంగళవారం జరిగిన తెలంగాణ విద్యా దినోత్సవం వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ విద్యా దినోత్సవం పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 6వ తరగతి విద్యార్థి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా మారింది. విద్యా దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో జయపాల్ కుమారుడు ఇనుగాల ధనుష్ (10) తన తోటి విద్యార్థులతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా, రోడ్డు పక్కన ఉన్న కుక్క ఒక్కసారిగా ధనుష్‌పై దాడికి ప్రయత్నించింది. ఊహించని సంఘటనతో ఆశ్చర్యపోయిన బాలుడు కుక్క నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, అయితే అతను ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చక్రం కిందకు వచ్చాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
భారత్‌లో తయారు చేసిన 7 దగ్గు సిరప్‌లను బ్లాక్‌లిస్ట్ చేసిన WHO
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దగ్గు మందు మరణాల విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంది. WHO భారతదేశంలో తయారు చేయబడిన ఏడు దగ్గుమందులను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఓ నివేదిక ప్రకారం అనేక దేశాలలో దగ్గు సిరప్ కారణంగా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. ఆ తరువాత WHO ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యక్తులు దగ్గు సిరప్ తాగడం వల్లే చనిపోయారని WHO అభిప్రాయపడింది. గత కొన్ని నెలల్లో నైజీరియా, గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో దగ్గు సిరప్ తాగడం వల్ల అనేక మరణాలు నమోదయ్యాయి. WHO ప్రతినిధి ప్రకారం.. భారతదేశం, ఇండోనేషియాలోని ఫార్మా కంపెనీలు తయారు చేసిన 20 కంటే ఎక్కువ దగ్గు సిరప్‌లను పరీక్షించారు. విచారణ తర్వాత WHO భారతదేశంలో తయారు చేయబడిన ఈ దగ్గు సిరప్ గురించి హెచ్చరికను కూడా జారీ చేసింది. గాంబియా, ఉజ్బెకిస్థాన్ మరణాల తర్వాత వివాదంలోకి వచ్చినవి ఈ దగ్గు సిరప్‌లు. దగ్గు సిరప్ తాగడం వల్ల 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్, చెన్నైకి చెందిన గ్లోబల్ ఫార్మా, పంజాబ్‌కు చెందిన క్యూపి ఫార్మాకెమ్, హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌తో సహా అనేక ఇతర ఫార్మా కంపెనీలను కూడా విచారించింది. ఈ విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత డ్రగ్ కంట్రోలర్ ఈ కంపెనీల కార్యకలాపాలను నిషేధించింది. ఔషధాలను ఎగుమతి చేసే ముందు వాటి నాణ్యత నియంత్రణ ఉంటుందని సీడీఎస్‌సీఓ వర్గాలు తెలిపాయి.
సినిమాకే హైలైట్ గా నిలవనున్న ఆ సీన్…?
గుంటూరు కారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మూవీ ఇది.. మహేష్ సర్కారు వారి పాట సినిమా తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యాడు. కానీ సినిమాను మొదలు పెట్టిన తరువాత వరుసగా మహేష్ కుటుంబం లో జరిగిన విషాదాల వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.భారీ గ్యాప్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు మహేష్. ఆ సినిమాకు గుంటూరు కారం అనే ఊర మాస్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.తన తండ్రి కృష్ణ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేసారు. అయితే రెండు షెడ్యూల్స్ తర్వాత ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.. ఇప్పటికీ కొత్త షెడ్యూల్ అయితే స్టార్ట్ కాలేదు.. మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం తెలియదు కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి మాత్రం ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుండి మాస్ స్ట్రైక్ అంటూ ఒక గ్లింప్స్,టైటిల్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత మహేష్ బాబు పూర్తిగా రఫ్ అండ్ రగ్గడ్ లుక్ లో కనిపించ బోతున్నాడని అందరికి అర్ధం అయింది… ఇక తాజాగా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో నడుస్తాయని సమాచారం… గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ నడుస్తుందని తెలుస్తుంది.అంతేకాదు ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని సమాచారం ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.
డిజాస్టర్ డైరెక్టర్ కి ఛాన్సిచ్చిన నాగార్జున?
ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన నాగార్జునకు ఇప్పుడు ఏమైంది? అప్పుడెప్పుడో ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ్.. ఇప్పటివరకు తన తదుపరి సినిమా అధికారికంగా ప్రకటించ లేదు. ఒకపక్క ఆయన ఏజ్ ఉన్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్ వరుస సినిమాలను ప్రకటిస్తూ రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ, నాగార్జున ఎందుకో సైలెంట్ అయ్యాడు. ఘోస్ట్ డిజాస్టర్ తరువాత లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్న నాగ్ ఒక మలయాళం సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత రచయిత బెజవాడ ప్రసన్నను డైరెక్టర్ గా చేసే బాధ్యత నాగ్ తీసుకున్నాడని అది కూడా ఆ మలయాళ రీమేక్ సినిమాతోనే అని ప్రచారం కూడా జరిగింది. అయితే అది నిజం కాదని ప్రసన్నకుమార్ నాగ్ కోసం ఒక కథ రెడీ చేశారని కూడా అన్నారు కానీ అది కూడా క్లారిటీ లేదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు నాగార్జున అక్కినేని RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కస్టడీ మేకర్ శ్రీనివాస చిట్టూరి మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే RX 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ తరువాత శర్వానంద్ సిద్దార్థ్ లతో మహా సముద్రం అనే ఒక మల్టీస్టారర్ చేయగా అది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆయన పాయల్ రాజ్ పుత్ ను పెట్టి మంగళవారం అనే సినిమా చేస్తున్నారు. చివరిగా డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
పాప జాతకం అద్భుతం.. మనవరాలిపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు, వారికి మంగళవారం నాడు మహాలక్ష్మి జన్మించింది. ఇక ఈ క్రమంలో మెగా కుటుంబంలో కొత్త అతిధి ఎంట్రీతో ఆ కుటుంబ సభ్యులే కాక అభిమానుజుల్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ ఇంట ఆడ బిడ్డ జన్మించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మనవరాలిని చూసేందుకు వెళ్లిన చిరు అనంతరం మీడియాతో మాట్లాడారు. చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశామని.. ఇప్పటికి ఆ భగవంతుడి దయతో మా ఆశ నెరవేరిందని అంటూనే ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపమని.. మా ఇంటిల్లిపాదీ ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. అలాగే తాము నమ్ముకున్న ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం నాడే పాప జన్మించడం ఆనందకరం, మంచి ఘడియల్లో పుట్టిందని , పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందంటున్నారని ఆయన అన్నారు. ఇక ఆ ప్రభావం ముందు నుంచి మా కుటుంబంలో కనబడుతుందని, చరణ్ కెరీర్ లో ఎదుగుదల, వరుణ్ ఎంగేజ్ మెంట్ ఇలా మా ఫ్యామిలీ లో అన్నీ శూభాలే జరుగుతున్నాయని ఆయన కామెంట్ చేశారు. ఐటీ ఇక మెగా వారసురాలికి ఎవరి పోలిక వచ్చింది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే చిరంజీవి అప్పుడే చెప్పలేమని అన్నారు. చూశాను కానీ ఆ పోలికలు అప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. ఇక మంగళవారం ఉదయం 1.49 గంటలకు ఉపాసనకు పాప జన్మించగా అది శ్రీరాముని జన్మ నక్షత్రం అయిన పునర్వసు అని తెలుస్తోంది.