మనం కష్టపడితే అధికారం మనదే
నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదేనని ఆయన వ్యాఖ్యానించారు ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్ రావు థాక్రే. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందని ఆయన అన్నారు. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయి.. తను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పచ్చి అబద్దాలు.. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలన్నారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చేయాలని, జనంలోనే ఉండాలి.. వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలన్నారు. మనం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా వివరించాలని ఆయన అన్నారు.
“హనుమంతుడు ఆదివాసీ”.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారాయి. మధ్యప్రదేశ్ మాజీ అటవీ శాఖ మంత్రి, ధార్ జిల్లా గంద్వానీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమర్ సింఘార్.. ‘హనుమంతుడు ఆదివాసీ’ అని అన్నారు. ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీలే రాముడిని లంకకు తీసుకెళ్లారని, కొంతమంది వానరసైన్యం అని రాశారు. నిజానికి వానరులు లేరని, వారు అడవుల్లో నివసించే ఆదివాసీలు అని ఆయన అన్నారు. హనుమంతుడు కూడా ఆదివాసీ అని, మనమంతా అతని వారసులం గర్వపడాలని సింఘార్ అన్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్ పాయ్.. ‘‘ వాళ్లు హనుమంతుడిని దేవుడిగా అంగీకరించరు, హిందువులు హనుమంతుడిని దేవుడిలా ఆరాధిస్తారని గుర్తించరు, వారు హనుమంతుడిని అవమానపరిచారు’’అని కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ చీఫ్ మాస్టర్ ప్లాన్.. వారికి డబ్బులే డబ్బులు..!
వ్యాపారం ఎలా చేయాలంటే ట్విట్టర్ చీప్ ఎలాన్ మస్క్‌ను చూసి నేర్చుకోవాలి.. ఇప్పుడు ఆయన సంపాదించుకోవడమే కాదు.. తనను నమ్ముకున్నవారు కూడా నాలుగు రాళ్లు వెనుకేసుకునే స్కెచ్ వేశారు.. ఇప్పటికే పలు కీలక నిర్ణయాతో ట్విట్టర్‌లో సంస్కరణలు తీసుకొచ్చిన ఆయన.. ఇప్పుడు వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్‌కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపుల ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు ట్విట్టర్ చీఫ్. ప్రపంచ కుభేరుడు, ట్విట్టర్ యజమాని అయిన మస్క్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ రాబోయే ఫీచర్‌ను ప్రకటించారు, దీనితో పాటుగా దాదాపు 5 మిలియన్ డాలర్లు అంటే రూ.41.2 కోట్లు ప్రారంభ చెల్లింపు బ్లాక్‌ను వెల్లడించారు. మస్క్ తన ట్వీట్‌లో, వెరిఫైడ్ ఖాతాదారులై కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు మరియు ధృవీకరించబడిన వినియోగదారులకు అందించబడిన ప్రకటనలు ఖాతాలోకి వస్తాయని పేర్కొన్నాడు. ప్రకటనకర్తలను నిలుపుకోవడంలో ట్విట్టర్ సవాళ్లను ఎదుర్కొంటోంది, ప్రత్యేకించి కంపెనీ యొక్క గణనీయమైన ఉద్యోగుల తొలగింపుల తర్వాత ప్రకటన నియామకం గురించి ఆందోళనల కారణంగా ఈ చర్య వచ్చిందంటున్నారు విశ్లేషకులు.. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్‌లో రిప్లై సెక్షన్‌లో డిస్‌ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించే వెసులుబాటు ఉంటుంది.
నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. ముక్క కొనేదెలా..? ముద్ద దిగేదెలా..?
నాన్‌వెజ్ ప్రియులకు షాక్ తగిలినంత పని అవుతోంది.. మటన్ ధరలో పాటు చికెన్ ధర కొండెక్కుతోంది.. కిలో మటన్ ధర రూ.800కి పైగానే పలుకుతుండగా.. కిలో చికెన్ ఏకంగా 300 రూపాయాలను క్రాస్ చేసి.. రూ.350కి చేరింది.. దీంతో మాసం తినేందుకు సామాన్య ప్రజలు జంకే పరిస్థితి వచ్చింది.. వారం మొత్తం ఎలా ఉన్నా సరే.. ఆదివారం వచ్చిందంటే నీచు ఉండాల్సిందే అనేవారు కూడా.. కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారట.. నాన్‌వెజ్ తినాలంటే పావు కేజీతోనో, అర కేజీతోనే సరిపెట్టుకుంటున్నారట. అయితే, ప్రతీ ఏడాది ఎండలు పెరిగాయంటే.. చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి.. ఈ ఏడాది కొంత భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండడంతో.. నెల రోజుల క్రితం వరకు కిలో చికెన్ రూ.200 నుంచి 250 మధ్య పలికింది.. ఇప్పుడు ఎండలు దంచికొట్టె భరణి కార్తె, రోహిణి కార్తె పోయి.. మృగశిర కార్తె వచ్చినా.. ఎండలు మాత్రం తగ్గడం లేదు.. దీంతో.. కొన్ని రోజుల వ్యవధిలోనే ధరలు ఆకాశాన్నంటాయి.. కిలో చికెన్ రూ.300 దాటి.. ఆ తర్వాత రూ.350కు చేరింది.. హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో, విజయవాడలో కిలో చికెన్ ధర రూ.350గా ఉంది.. ఇక, బోన్ లెస్ చికెన్ అయితే రూ.700లకు చేరగా.. లైవ్ బర్డ్ ధర రూ.166 పలుకుతోందని చెబుతున్నారు..
అర్జున్-శృతి ‘మీటూ’ కేసులో కొత్త ట్విస్ట్.. శృతికి కోర్టు నోటీసులు
గతంలో సినీ పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం చెలరేగినప్పుడు.. బహుభాష నటుడు అర్జున్‌పై కన్నడ నటి శృతి హరిహరన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2018లో విస్మయ సినిమా షూటింగ్ సమయంల ఒక రొమాంటిక్ రిహార్సల్ చేస్తున్నప్పుడు.. అర్జున్ తనని అసభ్యంగా తాకాడని, తన అనుమతి లేకుండానే తనవైపుకి లాగాడని ఆరోపిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. దీంతో.. కబ్బర్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పుడు అర్జున్ కూడా ఆమెపై పరువు నష్టం దావాతో కోర్టుకు వెళ్లాడు. ఇలా వీరి మధ్య జరిగిన ఈ వ్యవహారం.. అప్పట్లో కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా.. ఈ న్యూస్ గురించే చర్చలు. క్రమంగా ఈ వ్యవహారం కనుమరుగవుతూ వచ్చింది. అయితే.. ఈ కేసు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చింది. ఈసారి ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ కేసుకి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించాలని.. బెంగళూరు 8వ ఏసీఎంఎం కోర్టు ఆమెకు నోటీసులు ఇచ్చింది. ఆమె నుంచి సాక్ష్యాలు సేకరించాలని పోలీసులను సైతం కోర్టు సూచించింది. ఈ కేసుకి సంబందించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2021లో పోలీసులు కోర్టుకి బీ-రిపోర్ట్ సమర్పించగా.. దీనిని విచారించిన కోర్టు తాజాగా ఆమె నుంచి సాక్ష్యాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని సూచిస్తూ, ఆమెకు నోటీసులు ఇచ్చింది.
యూనిట్‌లో చేరిన క్రేజీ నటుడు.. మరింత వైబ్రెంట్‌గా ఓజీ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) ఒకటి. ఇంతకుముందు ప్రభాస్‌తో ‘సాహో’ చేసిన యువ దర్శకుడు సుజీత్ ఈ ‘ఓజీ’ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇది క్రేజీ కాంబినేషన్ కావడం వల్ల.. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా.. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒక రియల్ గ్యాంగ్‌స్టర్ అవతారంలో పవన్‌ని చూడాలనుకుంటున్న తమ కల.. ఈ సినిమాతో నెరవేరబోతున్న తరుణంలో, ‘ఓజీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేస్తూ.. ఓజీ మేకర్స్ తాజాగా మరో మైండ్‌బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో కోలీవుడ్ యువ నటుడు అర్జున్ దాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు.. అర్జున్ టోన్, ప్రెజెన్స్ కారణంగా.. తమ ఓజీ సినిమా మరింత వైబ్రెంట్‌గా ఉండబోతోందని ఓ క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ అర్జున్ దాస్‌ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతడు ‘విక్రమ్’ సినిమాలో, అంతకుముందు ‘ఖైదీ’ మూవీలో విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ రెండు సినిమాల పుణ్యమా అని, అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి గుర్తింపు దక్కింది. ఇప్పుడు ఇతను ఓజీలో చేరడంతో.. పవన్, అర్జున్‌ల మధ్య ఎపిసోడ్‌లు పీక్స్‌లో ఉంటాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వీరి కాంబోని చూస్తుంటే.. ‘పంజా’లో పవన్, అడవి శేష్‌ని చూస్తున్న వైబ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ నెట్టింట్లో తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.