*కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అఖిలపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆనాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పదేళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్‌ఎస్ బండారం బయట పెడతామన్నారు. సమగ్ర సర్వే వివరాలు బయటపెడ్తే తమకు ఖర్చు తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు వెయ్యి కోట్లు ప్రకటించి వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టలేదని మంత్రి విమర్శించారు. బలహీన వర్గాల కోసమే తమ పోరాటమని ఆయన చెప్పారు. బీసీ మంత్రిత్వ శాఖ కోసమే తాము పోరాటం చేశామన్నారు. 2011 చట్టం చేయకుండానే ఓబీసీల కులగణన జరిగిందని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కులగణనపై కేటీఆర్ మాట్లాడుతూ.. “కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టమని కేసీఆర్ అడిగారు.. తెలంగాణ అసెంబ్లీలో కులగణనపై పెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం.. చట్టబద్ధత లేకుంటే కులగణన సఫలం కాదు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని అందరికీ ఉంది. బీసీల డిక్లరేషన్‌లో ఉన్న అన్ని అంశాలను అమలు చేయాలి. దీనికి చట్టబద్ధత ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అప్పుడే కులగణన సఫలం అవుతుంది. శాసనసభను మరో 2 రోజులు పొడిగించాలి. కులగణనపై బిల్లులు తీసుకురావాలి.” అని కేటీఆర్ సూచించారు.
*ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. అప్పుడే మన భవిష్యత్ మారుతుందన్న సీఎం..
విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అన్నారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారు.. ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం.. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి.. మంచి మంచి జీతాలు సంపాదించాలి.. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి అన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చు.. కానీ, ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు.. ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చు అన్నారు. అయితే, మనం వేసిన ప్రతి అడుగు కూడా ప్రాథమి విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నాం.. మానవవనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ప్రతి అడుగులోనూ కూడా చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం అని వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం.. గ్లోబల్ సిటిజన్ కావాలంటే మన మాట్లాడే భాషలో మార్పులు రావాలి.. ప్రపంచస్థాయితో పోటీపడాలి.. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు అన్నారు సీఎం వైఎస్ జగన్.. అందుకనే ఇంగ్లీషు మీడియం నుంచి నాడు-నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది.. అక్కడితో మనం ఆగిపోలేదు .. వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యా్ర్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. కాగా, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.. నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదిరింది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్ మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి.
*ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు..
8మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్‌ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్‌ను ఎన్డీఏలో చేరుతామనీ అడిగితేనే చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో మేము 17కి 17సీట్లు గెలుస్తామని.. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదన్నారు. బీఆర్‌ఎస్‌కు ఎంపీ అభ్యర్థులు లేరని, ఉన్న వాళ్లు పక్క చూపులు చూస్తున్నారన్నారు. ఎంపీకి పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బతిమలాడుతున్నారన్నారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి ఎవరు హరీష్ రావుతో సహా బీజేపీలోకి వస్తామని అంటే ఆహ్వానిస్తామన్నారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు అవగాహన ఒప్పందం ఉందన్నారు. అందుకే బీఆర్‌ఎస్ ఇన్ని స్కాంలు బయటపడుతున్న చర్యలు కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉంటే కేటీఆర్, కేసీఆర్ ఇప్పటికే జైలులో ఉండేవాళ్లన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కర్ణాటకలోనే కాదు.. తెలంగాణలో సైతం గ్యారంటీల పేరుతో మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆ పార్టీ నేతలే చెప్పాలన్నారు. కేఏ పాల్ కూడా 17సీట్లు గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాముడు మోడీ ఒక్కవైఫు , రజాకార్లు, ఎంఐఎం, బీఆర్‌ఎస్ ఒక వైపు ఉన్నాయన్నారు. దేవుడిని రాముడిని నమ్మే వాళ్లు బీజేపీకి ఓటేస్తారన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన పార్టీని ప్రజలే బహిష్కరిస్తారన్నారు. ఏ ప్రభుత్వం అయిన ఐదు ఏళ్లు ఉండాలని కోరుకుంటామన్నారు. ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయకుంటే ప్రజలే కాంగ్రెస్‌కి బుద్ది చెప్తారని బండి సంజయ్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు కూడా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనని ఆరోపించారు… అప్పుడు కూడా కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేశారు… అప్పుడెందుకు సీబీఐ ఎంక్వైరీ అడిగారు … ఇప్పుడెందుకు వెనక్కి తగ్గుతున్నారని ప్రశ్నించారు.
*జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం.. రేపు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ ద్వారా 2 వేల 275 కిలోల బరువు కలిగిన INSAT-3DS అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపతరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ఫ్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
*బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు
బీఆర్‌ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్‌ఎస్ నేతలు చేరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి టీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆహ్వానించారు. వీరితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపారు. ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిదద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కొట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
*కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారు.. కుల గణన పై అసెంబ్లీలో భట్టి విక్రమార్క
కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కుల గణన పై అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సంపద, రాజ్యాధికారం అంతా కొందరికి వస్తుందని రాహుల్ గాంధీ కుల జనగణన చేద్దాం అన్నారు. చెప్పిన మాట ప్రకారం కుల జన గణన చేస్తున్నామన్నారు. ఇది చరిత్రాత్మక తీర్మానం అన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీ.. దాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారి వివరాలు సేకరిస్తామన్నారు. ప్రతీ ఇంటిని.. కులాలను సర్వే చేస్తామన్నారు. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తామని తెలిపారు. సర్వరోగ నివారణ లాగా సర్వే ఉంటుందన్నారు. సామాజిక..ఆర్థిక..రాజకీయ మార్పులకు పునాదిగా మారబోతుందని తెలిపారు. మార్పు కోరుకునే వాళ్ళు మద్దతు ఇవ్వాలని కోరారు. సలహాలు ఇవ్వండన్నారు. క్లారిటీ మాకు ఉంది..కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారని కేటీఆర్, కడియం శ్రీహరికి తెలిపారు. కన్ఫ్యూజన్ లేదు..క్లారిటీ ఉందన్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలిపారు. తీర్మానం క్లియర్ గా ఉందన్నారు. ఇల్లు ఇల్లు సర్వే చేస్తున్నామన్నారు. కుల గణన అన్నం..క్లారిటీగా ఉన్నాం.. కన్ఫ్యూజ్ కాకండి అన్నారు. కేటీఆర్.. కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నష్టం చేసేలా చేయకండని తెలిపారు. ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకండన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సర్వే.. దేశంలో సామాజిక, ఆర్థిక మార్పుకు పునాదన్నారు. జనాభా దామాషా ప్రకారం సంపదపంచాలన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వర్గాల వారి సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా పూర్తి చేస్తామన్నారు. ఇది మనం భారతదేశ చరిత్రలోనే గొప్పదన్నారు. సంపద రాజకీయం విద్య అధికారం కొన్నిచోట్ల మాత్రమే కేంద్రీకృతమై ఉంది ఇది అందరికీ సమానంగా పంచపడాలి. ఇ దుకు ఒక కార్యక్రమం తీసుకోవాలని అసెంబ్లీ ఎన్నికలవేళ జడ్చర్ల షాద్ నగర్, కరీంనగర్ లో మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారని గుర్తుచేసారు. ఈ కుల గణన దేశవ్యాప్తంగా జరగాలని ముందుగా తెలంగాణ నుంచి ప్రారంభం కావాలని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై క్యాబినెట్లో పూలను కశంగా చర్చించి జనాభా దామాషా ప్రకారం సంపద పంచాలని నిర్ణయించామన్నారు. సర్వే అయిపోయాక అందరి ఆలోచనలు పరిగణలో తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ సర్వే సర్వరోగ నివారిలా ఉంటుందన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనినీ తాము చేపడుతున్నామన్నారు.
*ఢిల్లీలో విషాదం.. నిరసనలో పాల్గొన్న అన్నదాత మృతి
అన్నదాతలు చేపట్టిన చలో ఢిల్లీ (Farmers Protest) కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిరసన దీక్షలో పాల్గొన్న ఓ రైతన్న అసువులు బాశాడు. శంభు సరిహద్దు దగ్గర ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విషాదం చోటుచేసుకుంది. 79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే శంభు సరిహద్దు దగ్గర హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర వార్డుకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జియాన్ సింగ్ మరణించాడని రాజేంద్ర ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హర్నామ్ సింగ్ తెలిపారు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు జియాన్ సింగ్‌కు అసౌకర్యంగా అనిపించడంతో రాజ్‌పురాలోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లామని.. అనంతరం అక్కడి నుంచి పాటియాలాలోని రాజేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు రైతులు తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. గత మంగళవారం నుంచి పంజాబ్-హర్యానా నుంచి పెద్ద ఎత్తున కర్షకులు హస్తినకు తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆయా వాహనాలతో ఢిల్లీకి బయల్దేరి వచ్చారు. మరోవైపు రైతులు సరిహద్దులు దాటకుండా భద్రతా బలగాలు తీవ్రంగా అడ్డుకుంటున్నాయి. ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలు, బారికేడ్లు, రోడ్డుపై మేకులు వేసి అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా వారిపై భాష్పవాయువు కూడా ప్రయోగిస్తు్న్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు రైతుల్ని కంట్రోల్ చేసేందుకు అత్యధికమైన సౌండ్‌తో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీతో చెవులు దెబ్బతినడం.. అలాగే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.
*రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది
పంటకు కనీస మద్దతు(ఎంఎస్‌పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘ఢిల్లీ ఛలో’ పేరుతో దేశ రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, వీరందరిని హర్యానా-ఢిల్లీ బోర్డర్‌లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమణపై హామీ రాలేదు. ఇదిలా ఉంటే రైతు ఉద్యమ నేపథ్యంలో హర్యానాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులకు మేలు చేసే పథకాలపై కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని శుక్రవారం అన్నారు. రైతుల బ్యాంకు రుణాలకు తమ ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శుక్రవారం నాలుగో రోజుకు చేరిన రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. హర్యానా రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతులకు ప్రయోజనాలు అందించేందుకు పనిచేస్తుందని అన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం రైతులకు ‘గ్యారంటీ’ ఇచ్చిందని, ఇంతకు ముందు వాటిని తిరస్కరించారని ప్రధాని అన్నారు.
*గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) చుక్కెదురైంది. ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సంజయ్ సింగ్‌లు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనలపై న్యాయస్థానం స్పందిస్తూ.. ట్రయల్ కోర్టులోనే వారి వాదనలు వినిపించుకోవాలని సూచిస్తూ పిటిషన్లు కొట్టివేసింది. ప్రధాని మోడీ డిగ్రీ (PM Modi Degree Case) విషయంలో ఆప్ నేతలు చేసిన ఆరోపణలపై గతేడాది ఏప్రిల్‌లో గుజరాత్ యూనివర్సిటీ మెట్రోపాలిటిన్ కోర్టును ఆశ్రయించింది. ఆప్ నేతల వ్యాఖ్యలు వెకిలిగా.. అవమానకరంగా ఉన్నాయంటూ పిటిషన్‌లో పేర్కొంది. అదే నెలలో న్యాయస్థానం ఇద్దరు నేతలకూ సమన్లు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్, సంజయ్‌సింగ్ పైకోర్టులో ఈ సమన్లను సమీక్షించాలని కోరారు. అక్కడ దిగువ న్యాయస్థానం చర్యలను సెషన్స్ కోర్టు సమర్థించింది. దీంతో ఇద్దరు నేతలు తాత్కాలిక స్టే కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయినా కూడా వారికి అక్కడ ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా విచారణకు నిరాకరించింది. ఈ విషయాన్ని సెషన్స్ కోర్టు కొత్త బెంచ్‌కు అప్పజెప్పిన తర్వాత 10 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని తాజాగా హైకోర్టు సూచించింది.