ఎన్నికల్లో పోటీపై బాలినేని క్లారిటీ.. నేను ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా.. ఆయన ఎంపీగా..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రకాశం జిల్లాలో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతారు.. రకరకాల మాటలు మాట్లాడుతుంటారు.. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో అందరం కలసి కష్టపడి పనిచేస్తామని తెలిపారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.
గాంధీ, అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన..
మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నా భూమి – నా దేశం కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రాజాబాబు తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.. భారత దేశం ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండాలని.. బ్రిటీష్ వాళ్ళు చెప్పు చేతల్లో ఎన్నో సంవత్సరాలు బానిసల్లాగా బతికాం.. స్వాతంత్రం రావడానికి ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టారు. స్వాతంత్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇక, మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు.. మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన చేస్తున్నారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకొని సీఎం జగన్ సమ సమాజాన్ని నిర్మిస్తున్నారు.. గ్రామ సచివాలయల ద్వారా ప్రజల వద్దకే పాలను తీసుకువచ్చారు.. కులాలకు, మతలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు మంత్రి ఆర్కే రోజా.. కాగా, 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా పండుగను వైభవంగా నిర్వహించుకున్నారు భారతీయులు. ఇక, 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు మంత్రి ఆర్కే రోజా.
మంత్రి మల్లారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్ అవార్డ్..
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డు వరించింది.. ఈ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి.. సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో డైరెక్టర్స్ ప్రీతి రెడ్డి, భద్రా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈ సందర్భంగా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డును అందించారు. ఇక, తనకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని మెడికోలతో పంచుకున్నారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక, మిగిలిఉన్న జీవితం అంతా.. ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు. కష్టపడితే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అనే దానికి ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. స్కూళ్లు పెట్టిన, కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టిన, ఎంపీ అయిన, ఎమ్మెల్యేను అయిన, మంత్రి అయ్యాయని తెలిపారు.. మనిషి ప్రయత్నం చేస్తే.. ఎంత గొప్పవాళ్లు అయినా కావొచ్చు అన్నారు మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కప్పుడు పాలు అమ్మిన, పూలు అమ్మిన.. బోర్‌వెల్స్ నడిపిన, మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు స్థాపించి ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.
మణిపూర్లో స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మారణకాండ
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణకాండ జరిగిందని, ప్రజలు చనిపోయినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. మణిపూర్ రైఫిల్స్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హింసను అరికట్టి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని చెప్పారు. హింసకు పాల్పడింది బయటి నుండి వచ్చిన శక్తులేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. విలువైన ప్రాణాలు, ఆస్తులను కోల్పోవడం పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత ప్రజలను త్వరలో పునరావాసం కల్పిస్తామని సీఎం చెప్పారు. చాలా మంది ప్రజలు సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారని ముఖ్యమంత్రి వాపోయారు. సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, బాధిత ప్రజలకు త్వరలో పునరావాసం కల్పిస్తామని సింగ్ చెప్పారు. స్వస్థలాలకు తరలించలేని వారిని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లలో తాత్కాలికంగా ఉంచుతామని తెలిపారు. తప్పు చేయడం మానవుని సహజ గుణమని.. క్షమించడం, మరచిపోవడం నేర్చుకోవాలి అని ఆయన చెప్పారు. ఒకే కుటుంబం.. ఒకే జీవనోపాధి అనే ప్రాజెక్టును అందించి ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.
జెండావందనం రోజు అపశృతి.. సొమ్మసిల్లి పడిపోయిన స్పీకర్, మంత్రి
దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న చిన్న ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా నిర్వహించుకున్నారు. అయితే మధ్యప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి ఉన్నట్టుండి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు. వెంటనే పక్కనే ఉన్న అధికారులు ఆయనును పట్టుకున్నారు. అనంతంరం చికిత్స నిమిత్తం భోపాల్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. రైసేన్ జిల్లాలోని హోంగార్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అక్కడి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అది ముగిసిన కొంత సమయం తరువాత కొన్ని సెకన్లకే మంత్రి హఠాత్తుగా కిందపడిపోయారు. మంత్రికి అధిక రక్తపోటు, షుగర్ లెవల్స్ కారణంగా అలా జరిగి ఉండొచ్చని ఈ కార్యక్రమానికి హాజరైన వైద్యులు తెలిపారు. మరోవైపు అటు.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ కూడా స్పీచ్ ఇచ్చే క్రమంలో కుప్పకూలారు. ఆయనను కూడా ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి ప్రభురామ్ చురుకుగా పాల్గొన్నారు. ‘హర్ గర్ తిరంగ అభియాన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. సోమవారం తివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీసులు, అధికారులతో సహా ప్రజలందరూ కలిసి భారీ ఎత్తున ర్యాలీలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభురామ్ చౌధరి స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఇలాంటి సంఘటనలు జరగడంతో.. అక్కడి వారంతా నిరాశగా ఉన్నారు.
వాళ్ల డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయాను
టీమిండియా బౌలర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆదివారం నాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని మియామీలో క్రికెట్ అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేసింది. మియామి మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన నగరమైన లాడర్‌హిల్‌లో భారత్- వెస్టిండీస్ మధ్య ఐదవ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు చాహాల్ భార్య ధనశ్రీ వర్మ ప్రేక్షకుల మధ్యలో కూర్చుని ఆటను చూసింది. అదే విషయాన్ని ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. భారత క్రికెటర్ల పట్ల మయామిలోని ప్రేక్షకులకు ఉన్న అభిమానం చూసి ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా ట్విట్టర్ లో మయామిలో మ్యాచ్ అంటే.. ఇంత డెడికేషన్, అద్భుతమైన అభిమానులను చూసి ఆశ్చర్యపోయాను అని ధనశ్రీ రాసింది. బ్రాండన్ కింగ్ అద్భుతమైన అజేయమైన 85 పరుగులతో వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. దీంతో భారత్ టీ20 సిరీస్‌ను 3-2 తో కైవసం చేసుకుంది. ఇక, ధనశ్రీ వర్మ చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది. ఏంటి పాప నీవు ఎక్కడ ఉంటే.. అక్కడ సర్వనాశనం అంటూ సెటైర్లు వేస్తున్నారు. నీవు ఎవరి జీవితంలోకి వెళ్తే.. వారు అదోగతి అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, వెస్టిండీస్-టీమిండియా మధ్య ఆదివారం ఐదో టీ20 మ్యాచ్ లో భారత్ నిర్థేశించిన టార్గెట్ ను విండీస్ టీమ్ అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్- బ్రాండన్ కింగ్ ఇద్దరు కలిసి 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈజీగా వెస్టిండీస్ గెలిచింది.
ఆర్‌బీఐ కొత్త ప్లాట్‌ఫామ్.. ఇక లోన్ పొందడం చాలా ఈజీ
బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి లోన్ తీసుకోవాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే. రకరకాల ప్రాసెస్ లు పూర్తి చేయాలి, డాక్యుమెంట్లు సమర్పించాలి. దీనికి తోడు లోన్ ఇచ్చే కంపెనీలు అడిగిన సమాచారాన్ని అందించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా వెరిఫై చేసి లోన్ రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో కారణంతో లోన్ రిజక్ట్ కూడా కావచ్చు. ఇకపై ఈ ప్రాసెస్ లకు ఫుల్ స్టాప్ పెట్టి లోన్లను సులభంగా పొందేలా చేయడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనికి కోసం కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సరికొత్త ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే పబ్లిక్ టెక్ ప్లాట్ ఫామ్. ఈ ప్లాట్ ఫామ్ లో లోన్ తీసుకోవాలనుకునే వారి వివరాలను డిజిటల్ ఫాంలో అందుబాటులో ఉంచుతారు. ఆధార్ ఇ- కేవైసీ,ల్యాండ్ రికార్డులు, పాన్ కార్డ్ వివరాలు, ఆస్తుల వివరాలు, శాటిలైట్ డేటా, ఇతర అవసరమైన వివరాలు ఈ ప్లాట్ ఫామ్ తో అనుసంధానం అయ్యేలా చూస్తారు. ఫలితంగా మనం లోన్ కోసం అప్లై చేసుకున్న బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ కంపెనీలు మన వివరాలను ఆన్ లైన్ లోనే ఈజీగా వెరిఫై చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇక దీనిని పైలెట్ ప్రాజెక్ట్ కింద మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 17న ప్రారంభించనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ద్వారా రూ. 1.6 లక్షల వరకు కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, డెయిరీ లోన్లు, ఎంఎస్ఎంఈ లోన్లు ఎలాంటి హామీ లేకుండా ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా రుణాలు ఇవ్వనుంది.
‘భోళా శంకర్’పై మీమ్స్ వేస్తే గల్లంతే.. ఎందుకో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. ‘ఆచార్య’ చిత్రానికి మించిన డిజాస్టర్ గా ఆయన కెరీర్లో మచ్చలా నిలిచే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక మీమర్లు అయితే ఈ సినిమాలోని సీన్లను మీమ్స్ గా రూపొందిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. అయితే అసలే మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ట్రోలర్లు రెచ్చిపోతూ ఉండడంతో ఈ ట్రోలింగ్ ను తట్టుకోలేక సినిమా టెక్నికల్ టీం ఈ మీమ్స్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మీమ్స్‌లో ఉపయోగిస్తున్న సినిమా క్లిప్స్, ఫోటోలకు కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం పంపుతూ అకౌంట్స్ బ్లాక్ చేయిస్తామని వార్నింగ్ ఇస్తోందట. అయితే ఈ నిర్ణయంపై మీమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది. కొన్ని ఈవెంట్లకు తమను ఆహ్వానించి ఇప్పుడు తమ మీద ఇలా చేయడం ఏమాత్రం బాలేదని అంటున్నారు.ఇక మరోపక్క ఆర్థికంగా నష్టపోయిన తమను చిరంజీవి ఆదుకోలేదని నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగగా అది నిజం కాదని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘భోళాశంకర్’ను క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటించగా, చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ ఆమె ప్రియుడి పాత్రలో సుశాంత్ కనిపించారు.
సేనాపతి వచ్చేశాడు.. ఇండియన్ 2 నుంచి కమల్ లుక్ రిలీజ్
లోక నాయకుడు కమల్ హాసన్ – స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు. ఈ సినిమా 1996 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. సేనాపతిగా కమల్ హాసన్ నటన ఇప్పటికి ఏ ప్రేక్షకుడు మర్చిపోడు అంటే అతిశయోక్తి కాదు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించాడు శంకర్. ఇండియన్ 2 పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈపాటికే ఈ సినిమా పూర్తికావాల్సి ఉండగా.. మధ్యలో ఎన్నో అడ్డంకులు చిత్రాన్ని చుట్టుముట్టాయి. వివాదాలు, కేసులు.. ఇలా మొత్తాన్ని ఒక కొలిక్కి తెచ్చి శంకర్ గతేడాది ఇండియన్ 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సేనాపతి లుక్ లో కమల్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కమల్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. సేనాపతి కమల్ హాసన్ మిలటరీ లుక్ లో ఆగిపోయాడు. ఖాకీ డ్రెస్ .. జేబుకి జాతీయ జెండా.. గన్బెల్ట్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ముసలివాడిగా కమల్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సడెన్ గా చూస్తే కమల్ కాదేమో అనిపిస్తుంది. అంతలా ఆ పాత్రలో ఇమిడిపోయాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో సేనాపతి ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.
తెలుగులో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’.. ఆ సీన్స్ ఉంటాయా మాస్టరూ.. ?
హాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ లో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అని తెలిసి తెలుగు ప్రేక్షకులే ఎక్కువగా బాధపడ్డారు అంటే అతిశయోక్తి లేదు. జాన్ స్నో, మదర్ ఆఫ్ డ్రాగన్స్, స్టార్క్స్ ఫ్యామిలీ.. ఇలా అందులోని పాత్రలను అభిమానులు ఓన్ చేసుకున్నారు. డేవిడ్ బెనియాఫ్, డి.బి.వైస్ సృష్టించిన అమెరికన్ ఫేంటసీ డ్రామా టీవీ సీరీస్ ఇది. 2011 లో మొదలైన ఈ సిరీస్.. 2019 లో ముగిసింది. వెస్టెరోస్, ఎస్సోస్ అన్న కల్పిత ఖండాల్లో రెండు రాజ్యాల మధ్య జరిగే పోరాటాన్ని ఇందులో చూపించారు. మొత్తం 8 సీజన్స్ ఉన్నాయి. అయితే ప్రతి సీజన్ ఒక అద్భుతమనే చెప్పాలి. వారి కాస్ట్యూమ్స్ దగ్గరనుంచి లొకేషన్స్ వరకు మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక 8 సీజన్స్ చాలామందే ఉంటారు కానీ, కొంతమంది తెలుగులో లేకపోవడంతో ఈ సిరీస్ ను చూడాలనుకున్న చూడలేకపోయారు. ఇక అలాంటివారి కోసం జియో సినిమాస్ గుడ్ న్యూస్ చెప్పింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8 సీజన్స్ ను తెలుగులో డబ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ నుంచి వచ్చిన జియో సినిమాస్ ద్వారా డిజిటల్ రంగంలో మొదటి స్థానంలోకి వెళ్లాలని చూస్తున్న విషయం తెల్సిందే. దీంతో కొత్త కంటెంట్ తో పాటు.. అభిమానులకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేది తెలుసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వార్నర్ బబ్రదర్స్ తో చేతులు కలిసి గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రాంతీయ భాషల్లో చూసే సౌలభ్యాన్నీ కల్పించారు. తెలుగు, హిందీ, మలయాళ కన్నడ భాషల్లో ఈ సిరీస్ ను వీక్షించవచ్చు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎగిరి గంతులేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం.. ఇందులో ఇంగ్లిష్ సిరీస్ లో ఉన్న రొమాంటిక్ సీన్స్ ను, న్యూడ్ సీన్స్ ను ఉంచుతారా.. సెన్సార్ అని కట్ చేస్తారా.. ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం తెలియాలంటే సిరీస్ జియో సినిమాస్ లో వచ్చేవరకు ఆగాల్సిందే. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు.