*జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా?
తీవ్ర ఎండను కూడా ఖాతరు చేయకుండా ప్రజలంతా సభకు వచ్చారని.. మరో రెండు వారాల్లో జరగనున్న ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని.. వచ్చే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని.. ప్రతి పేదవాడి భవిష్యత్తును నిర్ణయించేవి ఈ ఎన్నికలు అని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తామని.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ఆగిపోతాయని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చంద్రబాబు చెబుతున్నవి మోసాలు అని.. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనన్నారు. అందరూ దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు. అమలు చేసిన కొన్ని పథకాల పేర్లు చెబుతా.. చంద్రబాబు చెప్పగలరా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశానని చెబుతాడని.. 58 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. “ఇంటికే రూ.3000 పెన్షన్ కానుక ఇస్తున్నామని.. ప్రజలకు గుర్తుకు వచ్చేది జగనే.. విద్యార్థులకు వసతి దీవెన.. విద్యా దీవెన అంటే గుర్తుకు వచ్చేది జగనే.. అమ్మ ఒడి పథకం అంటే గుర్తుకు వచ్చేది జగన్.. అక్క చెల్లెమ్మలకు చేయూత.. కాపు నేస్తం ..ఈ బీసీ నేస్తం. ఆసరా.. సున్నా వడ్డీ.. అక్క చెల్లెమ్మల పేర 30 లక్షల ఇళ్ల పట్టాలు… నిర్మిస్తున్న 20 లక్షల ఇళ్ల నిర్మాణం.. మహిళా సాధికారత అంటే గుర్తుకు వచ్చేది మీ జగనే” అని సీఎం పేర్కొన్నారు. రైతులకు అండగా ఉంటూ పెట్టుబడులకు తోడుగా ఉంటూ రైతు భరోసాను అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని.. వీటిని చూస్తే గుర్తుకు వచ్చేది మీ జగనే అంటూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ఆరోగ్య సురక్ష .. ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పేదవారికి అండగా ఉంటున్నామన్నారు. స్వయం ఉపాధికి ఊతమిస్తూ లా నేస్తం..చేదోడు… మత్సకార భరోసా.. ఆటో నేస్తమంటే గుర్తుకు వచ్చేది జగనే అని అన్నారు. గ్రామంలోనూ సచివాలయం… 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ.. నాడు నేడుతో బాగుపడ్డ స్కూళ్లు.. ప్రభుత్వ ఆసుపత్రులు.. గ్రామంలోనే మహిళా పోలీస్.. అక్క..చెల్లెమ్మల ఫోన్లో దిశా యాప్.. ఇవన్నీ చూస్తే గుర్తుకు వచ్చేది జగనేనన్నారు. చంద్రబాబును చూస్తే ఏ పథకమైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్ళు సీఎంగా చేశారు కానీ పేదవారికి ఒక మంచి కూడా చేయలేదన్నారు. 2014-2019 మధ్య జన్మభూమి కమిటీలను చంద్రబాబు పెట్టారు.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు.. నాది సచివాలయ వ్యవస్థ.. జన్మభూమి కమిటీల మీద చంద్రబాబుకు విశ్వాసం ఉంటే.. మళ్లీ అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. జగన్ పెట్టిన వాలంటీర్.. సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. వాలంటీర్లకు జీతం పెంచుతానని చెబుతున్నారే తప్ప దాని రద్దు చేస్తానని చెప్పడం లేదన్నారు. కానీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తానని చెప్పడం లేదన్నారు. “జగన్ రూపాయి ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తానంటావు?.. 14 ఏళ్లు సీఎం అంటావు, నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?.. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా?.. జగన్ అమ్మ ఒడి పెడితే, అంతకంటే ఎక్కువ నేను ఇస్తానంటావు?.. సచివాలయ, వాలంటీర్, రైతు భరోసా వ్యవస్థల ను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా?.” అని జగన్ ప్రశ్నించారు. మా పథకాలే చెబుతున్నారే తప్ప… ఆయన మార్కు పథకాలు లేవన్నారు. జగన్ తెచ్చిన పథకాలు బాగా లేకపోతే వాటిని రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమేనని.. చంద్రబాబును నమ్మడం అంటే .వదలా. బొమ్మాళీ వదలా.. పశుపతిని ఇంటికి తీసుకురావడమేనని తీవ్రంగా విమర్శించారు. 2014లో జనసేన బీజేపీ టీడీపీలు కలిసి మేనిఫెస్టోను తీసుకువచ్చాయన్నారు.”రైతు రుణమాఫీ పై మొదటి సంతకం పెడతానని హామీ ఇచ్చారు …అది అమలైందా?.. ఎందుకు సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారు.. చేశారా?.. ఇంటింటికి ఉద్యోగం అన్నారు..ఇచ్చారా?.. ప్రతి పేదవాడికి మూడు సెంట స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు.. ఒకరికైనా ఇచ్చారా?.. మహాలక్ష్మి పథకం అమలైందా?.. ఎన్నో హామీలు ఇచ్చారు.. ఏమీ జరగలేదు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు..ఎక్కడా కనపడటం లేదు. ఇలాంటి వ్యక్తిని నమ్ముతారా. మళ్లీ ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి వస్తున్నారు. సూపర్ సిక్స్ అని అంటున్నారు… నమ్ముతారా?.. ఎవరి వల్ల మంచి జరిగిందనే విషయాన్ని ఆలోచించండి. ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. పేదవాడి భవిష్యత్ మారాలన్నా.. వాలంటీర్ ఇంటికి రావాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా..ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు …25 ఎంపీ స్థానాలకు 25 స్థానాలూ గెలవాలి.” అని సీఎం జగన్ ప్రజలను కోరారు.
*కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుంది: కిషన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు.
మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ యాత్ర చేసిన దగ్గర కాంగ్రెస్ నాయకులు పార్టీని వదిలి వెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు, బీజేపీకి నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా కనిపిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోడీ పాలన ఎటువంటి విమర్శలు చేయడానికి కారణం లేకుండా ఉందని పేర్కొ్న్నారు. బీజేపీ ఎజెండా ఎంటో మేము చెప్పాలి కానీ కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారన్నారు. రిజర్వేషన్స్ ను రద్దు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్దపు ప్రచారం చేస్తుందని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి ఒక్క సాక్షం చూపించు రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న రిజర్వేషన్స్ రద్దు అనేది ఈ దశాబ్దంలోనే పెద్ద అబద్ధం అని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ కు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ప్రకటిస్తే.. అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధాని చేసిన ఘనత బీజేపీదని తెలిపారు. రాహుల్ గాంధీ ఆశలు నిరాశలు అయ్యాయి.. కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అనేక కల్పితాలు సృష్టించి.. కళ్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్దమైన అధికారాలు కల్పించి.. బీసీలకు గౌరవం పెంచామని కిషన్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చు.. లేకపోతే దిగిపో అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
*12 ఎంపీ సీట్లు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుంది..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనల్ని ప్రజలు ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని కేటీఆర్ తెలిపారు. మనం కూడా జై శ్రీరామ్ అందాం.. రాముడు అందరివాడు.. రాముడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కూడా కాదన్నారు. కరీంనగర్ జిల్లాకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్ కే మధ్య పోటీ అన్నారు. కాంగ్రెస్ తో పోటీ లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి ముక్కు మొహం తెలియని వాడిని తీసుకువచ్చి నిలబెట్టారు.. కరీంనగర్ పార్లమెంటుకు జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి పోటీ చేయాలని ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్ లో కరీంనగర్ కు డమ్మీ అభ్యర్థి నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థికి కండువా లేకుండా తిప్పాపూర్ బస్టాండ్ లో నిలబెడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా గుర్తించరని ఎద్దేవా చేశారు. ఈ ఎంపీ ఎన్నికల్లో 12 సీట్లు బీఆర్ఎస్ కు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు సంవత్సరంలోపు వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం, రాజ్యాంగం మారుస్తాం, డీలిమిటేషన్ లో అన్యాయం జరగవద్దు.. అంటే అడ్డుకునే శక్తి ఒక్క గులాబీ కండువాకే ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో బడే భాయ్.. 2024లో చోటా భాయ్ మోసం చేశారని ఆరోపించారు. 30 లక్షల కోట్లు రోడ్ సెస్ పేరిట వసూలు చేసి అందులో సగం సొమ్ముతో అంబానీ లాంటి వాళ్లకు రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోడీ అని మండిపడ్డారు. పదేళ్లలో ప్రజలను మోసం చేసినవాడు నరేంద్ర మోడీ అని అన్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు మాట వినేవారు.. ఇప్పుడు సుంకరి కూడా పిలిస్తే రావడం లేదు.. మనకు అవమానం కాదా అని ప్రశ్నించారు. వరి పంటకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ బోగస్ అయింది.. ఆరు హామీలు కావడం లేదని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఉచిత బస్సు ఉచిత విద్యుత్ పథకాలు కూడా మాయం అవుతాయని కేటీఆర్ తెలిపారు. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా కేసీఆర్ బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు.. తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన బెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలని కార్యకర్తలకు సూచించారు. రోజులో ఉదయం గంట, సాయంత్రం గంట కష్టపడితే విజయం మనదే అని కార్యకర్తలకు జోష్ నింపారు. ఫోటోలు దిగి వాట్సాప్ లో ఫోటోలు పెట్టుడు కాదు.. అన్నీ అడగాలన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారులు, తోకాడిస్తున్న పోలీసులు మళ్ళీ మన మాట వినాలంటే మనకు 10 – 12 సీట్లు రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. సంవత్సరంలోగా మళ్ళీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే రోజు రావాలంటే.. మన గెలుపే సమాధానం కావాలన్నారు. పంచాయతీలు, పగలు పక్కనపెట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.
*శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత..
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. వన్యప్రాణి విభాగం సిబ్బంది, జూ అధికారులు చిరుత కోసం అక్కడి పరిసర ప్రాంతాల్లో వెతుకుతున్నారు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద చిరుత ఎయిర్ పోర్ట్ ప్రహరీ నుండి దూకడం.. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు కూడా సంచరిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు. ఎయిర్ పోర్ట్ ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగడంతో.. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించడంతో చిరుత సంచరించినట్లు గుర్తించారు. చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు ఉన్నట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. అటవిశాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఎయిర్ పోర్ట్ లోకి చేరుకున్న అటవిశాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాటులో పడ్డారు. చిరుత కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. దాదాపు మూడేళ్ల క్రితం చిరుతపులి విమానాశ్రయం గోడపై నుంచి దూకిన ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. చిరుత విమానాశ్రయం గోడ దూకి గోల్కొండ, బహదూర్ గూడ వైపు వెళుతున్నట్లు కనిపించింది. కాగా.. ఇప్పుడు మరోమారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.
*సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్..
మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.. అంబేడ్కర్ మళ్ళీ పుట్టి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని చూసినా.. మార్చడం జరగదు అని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారని రఘునందన్ రావు పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా రాజ్యాంగం మార్చలేదు.. మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగం మార్చమని రఘునందన్ రావు తెలిపారు. ఇప్పటికీ 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది.. అందులో మెజారిటీ సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగిందన్న విషయం సీఎం గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేశారు. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో లేకున్నా.. ఇందిరాగాంధీ ఆనాడు రాజ్యాంగంలో చేర్చిందన్నారు. అంబేడ్కర్ ని ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ పార్టీ.. ఆయనికి భారత రత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీకి మనసు రాలేదని తెలిపారు. సీఎం రేవంత్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని దుయ్యబట్టారు.మరోవైపు.. బీఆర్ఎస్ పై రఘునందన్ రావు విరుచుకుపడ్డారు. జై శ్రీ రామ్ అంటే కేసీఆర్, కేటీఆర్ కి నొప్పి ఎందుకు అని ప్రశ్నించారు. జై శ్రీ రాం కాకుండా.. జై కేసీఆర్ అనాలా అని విమర్శించారు. కేసీఆర్ వంద అబద్దాలు ఆడితే.. రేవంత్ వెయ్యి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని పేర్కొన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి అబద్ధాల్లో అవిభక్త కవలలని తీవ్ర విమర్శలు గుప్పించారు.
*గుజరాత్ తీరంలో 602 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. 14 మంది పాకిస్థానీలు అరెస్టు..
ఆదివారం జరిగిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) ఉమ్మడి ఆపరేషన్లో., గుజరాత్ తీరంలో 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేసి, వారి నుండి 602 కోట్ల రూపాయల విలువైన 86 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థానీలు, స్ట్రింగ్ ఆపరేషన్ జరిగే సమయంలో అరెస్టును తప్పించుకునే ప్రయత్నంలో, ఎటిఎస్ అధికారులపై తమ పడవను నడపడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. భద్రతా సంస్థలు గత రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు సమీపంలో భారత ప్రాదేశిక జలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్లలో ‘మియావ్ మియావ్’ అని పిలువబడే నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ ను తయారు చేసే మూడు ప్రయోగశాలలను ఎన్సిబి గుర్తించి., ఈ విషయానికి సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. సుమారు 300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను మాదకద్రవ్యాల నిరోధక సంస్థ స్వాధీనం చేసుకుంది. గుజరాత్, రాజస్థాన్లలో మెఫెడ్రోన్ ఉత్పత్తి చేస్తున్న ప్రయోగశాలలకు సంబంధించి గుజరాత్ పోలీసులకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) రహస్య స్థలం నుండి సమాచారం అందుకున్న తరువాత ఈ ప్రయోగశాలలను కనుగొన్నారు.
*అసలు రహస్యాన్ని బయటపెట్టిన ఎంఎస్ ధోనీ!
42 ఏళ్ల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాడు. ఈ వయసులోనూ కూడా కుర్రాడిలా ఆడేస్తున్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేస్తూ మ్యాచ్‌లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ ఎడిషన్ మహీకి చివరిది అని అస్సలు కనిపించడం లేదు. ధోనీ ఎనర్జీ, సక్సెస్‌కు కారణం ఏంటో? తెలిసిపోయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతున్న తరుణంలో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఓ వీడియోను షేర్ చేసింది. గతంలో ధోనీ మాట్లాడిన వీడియో ఇప్పుడు మరోసారి చెక్కర్లు కొడుతోంది. వీడియోలో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ… ‘చాలా మందికి ఇది అసంబద్ధమైన టైమ్-టేబుల్. కానీ సంవత్సరాలుగా అదే నాకు సాయం చేస్తోంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి 5-7 రోజుల ముందు నుంచే నేను మానసికంగా సిద్ధమవుతా. ఒక్కోసారి రాత్రి 12 తర్వాత మేం ఫ్లైట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి నేను ఆలస్యంగా నిద్ర పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆపై కిట్ బ్యాగ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆలస్యంగా డిన్నర్ చేయాలి. దీంతో హోటల్ గదికి చేరుకునే సరికి 1.15 అవుతుంది’ అని అన్నాడు. ‘హోటల్ వెళ్లాక మా వస్తువులను ప్యాక్ చేసుకోవాలి. అప్పుడు 2.30 దాటుతుంది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకు పడుకొని ఉదయం 6 గంటల వరకు లేదా రాత్రి 11 నుంచి ఉదయం 7 గంటల వరకు నిద్రపోతాను. మ్యాచ్ సమయంలో మాత్రం 3 గంటలకు పడుకొని ఉదయం 11 గంటలకు లేస్తా. 8 గంటలు నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటా. రాత్రి బాగా విశ్రాంతి తీసుకుంటా. కాబట్టి ఐపీఎల్ ముగిసినా నాకు పెద్దగా అలసట అనిపించదు’ అని ఎంఎస్ ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ ఎడిషన్‌లో 6 ఇన్నింగ్స్‌లలో 91 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో వచ్చి సిక్సులు, ఫోర్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు.
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం!
టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. మంజునాథ్ తన తండ్రి మృతికి గల కారణాలు వెల్లడించలేదు. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకి కామెంట్ సెక్షన్ సైతం ఆఫ్ చేశారు. తండ్రితో దిగిన ఫొటోస్ మంజునాథ్ షేర్ చేశారు. టాలీవుడ్ ప్రముఖులు మంజునాథ్ కుటుంబంకు సంతాపం తెలుపుతున్నారు. 2017లో మంజునాథ్‌ను లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా లాస్య తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు. లాస్య గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ, ప్రాసలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఏనుగు, చీమ జోక్‌లతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం సంపాదించారు. ఇక యాంకర్ రవితో లాస్య చేసిన టీవీ షోలు బాగా ఆదరణ పొందాయి. బిగ్‌బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని.. మరింత క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు.