శిరోముండనం కేసులో సంచలన తీర్పు.. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష..
అప్పట్లో సంచలనం సృష్టించిన శిరోముండనం కేసులో కీలక తీర్పు వెలువరించింది కోర్టు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మందికి శిక్షలు ఖరారు చేసింది.. అట్రాసిటీ కేసులో ఒక్కొక్కరికి 18 నెలలు.. ఐపీసీ సెక్షన్‌లో 6 నెలల చొప్పున శిక్ష ఖరారు చేయడంతో పాటు లక్షా 50 వేల రూపాయల ఫైన్ విధించింది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు.. అయితే, న్యాయమూర్తి ఆదేశాల కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.. జిల్లా కోర్టు దగ్గర వాహనంతో పాటు మోహరించారు పోలీసులు.. బెయిల్ నిరాకరిస్తే ఎమ్మెల్సీ త్రిమూర్తులు సహా ముద్దాయిలను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించే అవకాశం ఉంది.. కాగా, 1996 డిసెంబర్ 29.. రామచంద్రాపురం మండలం వెంకటాయ పాలెంలో దళితయువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో ఇద్దరికి గుండుకొట్టించి, కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్రకలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈకేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు.. మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు.. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు.. ఇక ఈకేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. 1997 జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ 1/1997గా ఎఫ్ఐఆర్ నమోదయింది.. ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. కేసుని ఫిబ్రవరి 2008న రీఓపెన్ చేశారు.. అయితే, 1994 సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్‌గా రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారు.. ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.. ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్ లు గా పని చేశారు. త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు..
శ్రీరామనవమి ఏర్పాట్లలో అపశృతి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
నెల్లూరు జిల్లా బోగోలు మండలం మంగమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసులు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. అయితే, శ్రీరామనవమి పండుగ జరుపుకునేందుకు కుటుంబ సభ్యులంతా స్వగ్రామమైన చామదలకు వచ్చారు. పండుగకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసేందుకు కావలికి వెళ్తుండగా వారిని మృత్యువు వెంటాడింది.. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఇటీవలే కారును కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, శ్రీరామ నవమి పండుగ సమయంలో ఓకే కుటుంబంలో ఐదుగురు మృతిచెందడం.. ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది..
సీఎంపై దాడి చేసింది టీడీపీ వాళ్లే..! ఆధారాలున్నాయి..
విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయితో దాడి చేయడం కలకలం సృష్టించింది.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.. ఇక ఈకేసులో వైసీపీ ఎమ్మెల్సీ మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీకి చెందినవాళ్లే దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్న ఆయన.. విజయవాడలో సీఎం జగన్ పై దాడి జరగడం బాధాకరం అన్నారు. ఏపీ మొత్తం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎవ్వరూ చేయని విధంగా జరుగుతున్నాయి.. సామాజిక ధర్మం పాటించిన వ్యక్తి సీఎం జగన్ అని అభివర్ణించారు. బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా అందరికీ సమన్యాయం జరిగింది. మీ పాలనలో పెన్షన్ ఎందుకు పెంచలేదు, ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాపీ ఎందుకు కొడుతున్నారు? అని నిలదీశారు. మా నవరత్నాలు సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు కూటమి కాపీ కొడుతున్నారని విమర్శించారు మల్లాది. ఇక, వాలంటీర్ వ్యవస్థ ను కాపీ కొడుతున్నారు.. 2014లో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని చంద్రబాబును నిలదీశారు మల్లాది విష్ణు.. ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయాల లబ్ధి చేకూరుతుందన్న ఆయన.. చంద్రబాబు పాలనలో 12 శాతం పేదరికం ఉందని.. కానీ, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాలనలో అది 6 శాతానికి తగ్గిపోయిందన్నారు. సీఎం జగన్ పై పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. సోషల్ మీడియాలో సీఎం జగన్ పై చేస్తున్న దుష్ర్పచారం బాధ కలిగిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ జరిగింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా.. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు కొనసాగించారు.. అయితే, బెయిల్ షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని సీఐడీ పేర్కొంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారుల లిస్ట్ మా వద్ద ఉందని నారా లోకేష్ అధికారులను బెదిరించారని.. లోకేష్ కొన్ని టీవీ చానల్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఇదే మాట్లాడారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, బెయిల్ వచ్చింది చంద్రబాబుకు అయితే.. కొడుకు మాట్లాడితే ఉల్లంఘన ఎలా అవుతుంది అని వాదించారు సిద్ధార్థ్ లూథ్రా.. ఈ కేసు విచారణ జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ బెంచ్ ముందు సాగింది.. అయితే, బెయిల్ షరతులు ఉల్లంగించవద్దని ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై అభియోగాలు మోపిన సీఐడీ.. ఆయన్ను అరెస్ట్ చేసింది.. ఆయన 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో గడిపారు.. ఆ తర్వాత చంద్రబాబుకు మొదట ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో, ఏపీ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ సీఐడీ.
డ్వాక్రా గ్రూప్‌లకు ఈసీ కీలక ఆదేశాలు
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు.. డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టోద్దని సీఈవో ఆదేశించారు.. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా డ్వాక్రా మహిళలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఈవో.. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయం సహాయక బృందాలను ప్రభావితం చేసేలా కార్యకలాపాలు చేపట్టోద్దని స్పష్టం చేశారు.. వ్యక్తిగతంగా, బృందంగా కానీ ఎస్‌హెచ్‌జీలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వదన్నారు.. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూదదని సెర్ప్ సీఈవో, మెప్మా మిషన్ డైరెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేష్ కుమార్ మీనా. కాగా, మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏపీలో జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం విదితమే. ఇప్పటికే గ్రామ, సచివాలయ వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన కూడదనే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా
హైదరాబాద్ లోని హోటల్ తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పైన ఆధారపడి ఉన్నాయన్నారు. గల్ఫ్ వెళ్లే కార్మికులకు శిక్షణ ఇస్తాం… ఏజెంట్ల చేతిలో మోస పోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి చదువు అందిస్తాం.. గల్ఫ్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు గురంచి ఆలోచిస్తామని ఆయన చెప్పారు.. అలాగే, రైతు బీమా తరహాలో.. గల్ఫ్ కార్మికుల బీమా అందిస్తామని ప్రకటించారు. ఇందులో గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక, గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విభాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తాం అని తెలిపారు. జూన్, జులైలో పాలసీ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు.
కేసీఆర్, కేటీఆర్లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి
హన్మకొండ జిల్లాలోని మడికొండ సత్యం గార్డెన్స్ లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య విరుచుకపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని తెలిపారు. వేరే వారికి విలువల గురించి గొప్పగా చెప్పే కడియం శ్రీహరి ముందు ఆయన మాత్రం విలువల్ని పాటించరు అని ఆయన చెప్పారు. కడియం శ్రీహరిని మాదిగ జాతి తూ అంటూ ఉమ్మి వేస్తుంది అని విమర్శించారు. కడియం శ్రీహరి కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడడు, కంట్లో పెట్టుకొని చూస్తా ఉంటాడు.. కానీ, రాజయ్య దగ్గరికి ఎవరు వెళ్తున్నారు.. ఆయనకు గిట్టని వాళ్లను ఎవర్ని కలుస్తున్నారు చూసి వారిని టార్గెట్ చేసే నైజాం కడియం శ్రీహరిది అంటూ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి హవాల ద్వారా డబ్బులు పంపితే మలేషియా, సింగపూర్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు భూములు కొన్నారు అని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు హవాల ద్వారా విదేశాలకు డబ్బులు పంపించిన ఘనుడు కడియం శ్రీహరి అని పేర్కొన్నారు. ఈయన నా గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు అంటూ మండిపడ్డారు. తొందరలోనే కడియం శ్రీహరికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో దారుణం.. బైక్ పై వెళ్తున్న ఏఎస్సైపై ఓ వ్యక్తి కాల్పులు
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏఎస్‌ఐతో ముఖేష్‌కు గొడవలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీట్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌కు 11:42 గంటలకు సమాచారం అందిందని జిల్లా పోలీసు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జే.టిర్కీ చెప్పారు. ఏఎస్సైపై కాల్పులు జరుపుతుండగా.., పక్కనుంచి వెళ్తున్న బైకిస్ట్ కు కూడా బుల్లెట్ తాకిందని తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు.
వ్యక్తిగత వైద్యుడి కోసం కేజ్రీవాల్ పిటిషన్.. ఈడీ ఏం చెప్పిందంటే..!
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వ్యక్తిగత వైద్యుడ్ని నియమించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వారానికి మూడు సార్లు వైద్యులు పరీక్షించేలా చూడాలని ఆయన కోర్టును కోరారు. ఈడీ కస్టడీలో ఉన్న తొలి రోజుల్లోనే కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన చక్కెర స్థాయి పడిపోయింది. ప్రస్తుతం కూడా షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్చువల్‌గా వ్యక్తిగత వైడ్యుడ్ని సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. తొలిరోజుల్లో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ 46 ఎంజీ/డీఎల్‌కు పడిపోయిందని కేజ్రీవాల్ లాయర్ కోర్టుకు తెలిపారు . కేజ్రీవాల్ తాజా పిటిషన్‌పై స్పందించేందుకు సమయం కావాలని ఈడీ కోరింది. జైల్లో కూడా కేజ్రీవాల్ వైద్య సదుపాయాలు పొందవచ్చని ఈ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది గుర్తుచేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపురి విచారణ ఏప్రిల్ 18కు వాయిదా వేసింది.
నిస్సాన్ మాగ్నైట్ కారులో లోపం.. రీకాల్ చేసిన కంపెనీ
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్‌ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. సమాచారం ప్రకారం.. నిస్సాన్ మాగ్నైట్ యొక్క SUVలో ఫ్రంట్ డోర్ హ్యాండిల్ సెన్సార్‌లో లోపాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత.. భద్రతా కారణాల దృష్ట్యా, కంపెనీ కొన్ని యూనిట్లకు రీకాల్ జారీ చేసింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ లోపం కారణంగా SUV నడపడంలో ఎటువంటి సమస్య లేదు.. కానీ ఆ లోపం ఉన్న భాగం భర్తీ చేస్తున్నారు. మాగ్నైట్ SUV యొక్క రెండు వేరియంట్‌లను నిస్సాన్ రీకాల్ చేసింది. వాటిలో ఎంట్రీ లెవల్ XE, మిడ్ వేరియంట్ XL ఉన్నాయి. ఈ రెండు వేరియంట్‌లలోని కొన్ని యూనిట్లలో లోపాలు నివేదించారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 2020, డిసెంబర్ 2023 మధ్య తయారు చేయబడిన యూనిట్లలో ఈ లోపం ఉండవచ్చు అన్నారు. మరోవైపు.. డిసెంబర్ 2023 తర్వాత తయారు చేయబడిన యూనిట్లలో అటువంటి లోపం లేదని తెలిపారు.
కాల్పుల కేసులో కీలక పరిణామం.. పోలీస్ కస్టడీకి నిందితులు
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం దగ్గర కాల్పులు జరిపిన కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఆదివారం కాల్పుల అనంతరం నిందితులిద్దరూ ముంబై నుంచి గుజరాత్‌కు పారిపోయారు. సోమవారం రాత్రి గుజరాత్‌లోని భుజ్‌లో చిక్కినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇద్దరు నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ శ్రీజోగేంద్ర పాల్ (21)లను ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ముంబైలోని కిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఘటనపై తదుపరి విచారణ నిమిత్తం ఇద్దరు నిందితులకు ఏప్రిల్ 25 వరకు 9 రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 14 రోజులు కస్టడీ కోరగా.. 9 రోజులు కస్టడీకి అంగీకరించింది. పోలీస్ కస్టడీలో సల్మాన్‌ఖాన్ నివాసంపై కాల్పుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు?, కాల్పులకు అసలు కారణమేంటో తెలుసుకోనున్నారు. ఈ ఘటనకు బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించిందని నిందితులు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు నవీ ముంబై పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు ఓ అధికారి తెలిపారు. సల్మాన్‌కు పన్వెల్‌లోనే ఫాంహౌస్ ఉంది. మరోవైపు కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను విచారించారు. వీరిలో నిందితులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమాని, నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనం పాత యజమాని, మోటారు సైకిల్‌ను విక్రయించడంలో సహకరించిన ఏజెంట్ ఉన్నారు. వీరితోపాటు మరికొందరిని సైతం ప్రశ్నించారు. ద్విచక్ర వాహనం పాత యజమానిది కూడా పన్వెల్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
బాలీవుడ్ స్టార్ హీరోని ఫిదా చేసిన ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ జనవరి 2024లో థియేటర్లలో విడుదలై బంపర్ వసూళ్లు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ‘హనుమాన్’కి సీక్వెల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ‘హనుమాన్’ సీక్వెల్ జై హనుమాన్ కోసం రణవీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ చర్చలు జరుపుతున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ కూడా అందుకు ఊతం ఇస్తూ రణవీర్ సింగ్‌ని చాలాసార్లు కలిశాడు. అయితే ఇప్పుడు కొత్త అప్ డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కలయికలో వస్తున్నది ‘హనుమాన్’ సీక్వెల్ సినిమా కాదని, ఒక మెగా బడ్జెట్ సినిమా కోసం అని తెలుస్తోంది. ఇదొక పీరియాడికల్ డ్రామా అని, ఇందులో రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ‘పింక్‌విల్లా’ రిపోర్ట్ ప్రకారం, రణవీర్ సింగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పనికి పెద్ద అభిమాని అయిపోయాడని, ‘హనుమాన్’ విడుదలైన వెంటనే అతన్ని కలిశాడని పేర్కొంది. హనుమాన్ చూడగానే ప్రశాంత్ వర్మ విషయంలో రణవీర్ సింగ్ ఇంప్రెస్ అయ్యాడు. గత 3 నెలలుగా ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ చిత్రం కోసం రణ్‌వీర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఒక సోర్స్ తెలిపిందని రిపోర్ట్ పేర్కొంది. పలుమార్లు వీరి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రణవీర్ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇప్పుడు సినిమా టీం పని మొదలు పెట్టడానికి ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టిందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, స్క్రిప్ట్, స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం రణ్‌వీర్‌కు బాగా నచ్చాయని అంటున్నారు. రణవీర్ మరియు ప్రశాంత్ వర్మ కలిసి చాలా పెద్ద స్టూడియోలతో మాట్లాడుతున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే సినిమాని ప్రకటించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రణవీర్ సింగ్ ‘సింగం ఎగైన్’, ‘డాన్ 3’ చిత్రాల్లో కనిపించనున్నాడు. ఈ లెక్కన జై హనుమాన్ జనవరి 2025కి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని చెప్పొచ్చు.
టిల్లు గాడికి బ్రేకుల్లేవ్.. ఈరోజుకి ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే?
2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించగా భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా 125 కోట్లు కలెక్ట్ చేసినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ రోజే నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందనే నమ్మకం ఉంది, సినిమాకి మంచి టాక్ వస్తోంది. మార్నింగ్ షో కి, మ్యాట్నీకి వసూళ్లలో గ్రోత్ కనిపిస్తుంది. ఉగాది, రంజాన్ పండగలు, వేసవి సెలవులు ఉండటంతో ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందనేని నమ్ముతున్నానన్నారు. అయితే ఆయన అన్న మాటలే నిజమై ఎట్టకేలకు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు 125 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మరింత ముందుకు వెళుతోంది. ఇక ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ రావడంతో మూడవ భాగాన్ని కూడా తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని రెండో భాగం చివరిలోనే అనౌన్స్ చేశారు. టిల్లు క్యూబ్ పేరుతో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా పనులు ఎప్పుడు మొదలవుతాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.