భూమి కబ్జా చేశారని జవాన్ సెల్ఫీ వీడియో:
తన భూమి కబ్జా చేశారని మడకశిరకు చెందిన ఓ జవాన్ జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. మడకశిర మండలం హుదుగూరు గ్రామంలో కబ్జాదారుల నుంచి తన భూమిని కాపాడాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా అధికారులను వేడుకున్నారు బిఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న తన భూమి గ్రామంలోని తన మామ కబ్జా చేస్తున్నాడని ఆరోపించాడు. తన భూమిలో సాగు చేయడానికి వెళ్తే నాగరాజు అనే వైసీపీ నాయకుడు రాళ్లు, కొడవలి తీసుకుని దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
నల్గొండ టీచర్ సజీవ దహనం:
అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈసారి కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉమ్నాబాద్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. నల్గొండ జిల్లా గొల్లగూడకు చెందిన టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనమయ్యాడు. షిర్డి వెళ్ళి తిరిగి వస్తుండగా ఉమ్నాబాద్ వద్ద కారు అగ్ని ప్రమాదానికి గురైంది. టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనం కాగా, మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం:
తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గద్దర్ సతీమణి విమలకు కోటి రూపాయల నగదు పారితోషికం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు. ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి కి పురస్కారాన్ని అందించారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి నగదు పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.
దశాబ్ధాల పోరాట ఫలితం:
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 60 ఏండ్ల సుధీర్ఘ పోరాట ఫలితంగా జూన్ 02 2014 న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన విషయం తెలిసిందే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల నెరవేరింది. స్వరాష్ట్ర సాధనలో వందలాది మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాల పాటు కొనసాగింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసింది ఈ మూడు అంశాలే. అలుపెరుగని పోరాటం అనంతరం కేసీఆర్ నాయకత్వం, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించి నేటితో పదకొండేళ్లు పూర్తి చేసుకుంది. 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. తెలంగాణ తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, రైతులు, కార్మికులు, రాజకీయ నాయకులు స్వరాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమమే ఊపిరిగా పోరాటాలు చేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పోరాడారు. వారి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
కాళ్లపై పడి క్షమించాలని వేడుకోలు:
బెంగళూర్‌లో ఒక మహిళ ఆటో డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం జరిగిన ఈ సంఘటనలో మహిళను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పంఖూరి మిశ్రా అనే మహిళ డ్రైవర్ లోకేష్‌ను చెప్పుతో కొట్టింది. పంఖూరి తన భర్తతో బైక్‌పై వెళ్తున్న సమయంలో, ఆటో డ్రైవర్ తన కాలుపై నుంచి పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. అయితే, డ్రైవర్ ఆమె వాదనల్ని తోసిపుచ్చాడు. వాదన సమయంలో లోకేష్ ఈ సంఘటనను వీడియో తీశాడు. సదరు మహిళ ‘‘ వీడియో తీస్తావా, తీయి’’ అంటూ తన చెప్పుతో పదే పదే డ్రైవర్ లోకేష్‌పై దాడి చేసింది. అయితే, ఆటో డ్రైవర్ వారే తప్పుగా వస్తున్నారని ఆరోపించారు. స్థానిక కన్నడ భాషలో కాకుండా హిందీలో ఆ మహిళ వాగ్వాదానికి దిగడంతో తాను రికార్డ్ చేసినట్లు లోకేష్ చెప్పారు. అయితే, ఈ మొత్తం ఘటన తర్వాత మహిళ, ఆమె భర్త ఆటో డ్రైవర్‌కి క్షమాపణలు చెప్పారు. అతడి పాదాలకు నమస్కరించి క్షమించాలని కోరారు. ‘‘క్షమించండి. నేను గర్భవతిని. కాబట్టి, నాకు గర్భస్రావం జరిగితే ఏమి జరుగుతుందో అని నేను భయపడ్డాను’’ అని ఆమె డ్రైవర్‌తో చెప్పింది.
రెండు-మూడు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి, ఛత్ పండగల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండు నుంచి మూడు దశల్లో బీహార్ ఎన్నికలు నిర్వహించనున్నట్లుత తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఇలాగే బహుళ దశల్లో ఎన్ని్కలు జరిగాయి. 2020లో ఓటింగ్ మూడు దశల్లో జరిగింది. 2015లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ నెల చివర్లో బీహార్‌ను సందర్శించి సన్నాహాలను సమీక్షిస్తారని భావిస్తున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి బూత్ లెవర్ ఆఫీసర్లు(BLOలు) సహా పోల్ అధికారులకు శిక్షణ అందిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై వచ్చిన ఆరోపణలు, ఈ ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఈసీ చర్యలు తీసుకుంటోంది.
9 ఏళ్ల దళిత బాలిక హత్యాచారం:
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. దీంతో బిడ్డ జాడ వెతుక్కుంటూ వెళ్లిన తల్లికి రక్తపుమడుగులో ఉన్న కుమార్తెను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ ఆస్పత్రి వైద్యులు బాలికను పట్టించుకోలేదు. దాదాపు 6 గంటలు నిరీక్షించినా బెడ్ కేటాయించలేదు. దీంతో బాలిక ప్రాణాలు వదిలింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రోహిత్ సాహ్ని అనే నిందితుడు చేపలు అమ్ముతుంటాడు. తొమ్మిదేళ్ల దళిత బాలిక కనిపించగానే చిరుతిళ్లు ఇస్తానని ప్రలోభపెట్టి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఇంట్లో నిద్రపోతున్న తల్లి.. కుమార్తె కోసం వెతకగా సాహ్నితో కనిపించిందని స్థానికులు చెప్పారు. అతడ్ని నిలదీయగా తనకు తెలియదన్నాడు. దీంతో ఆమె వెతుక్కుంటూ వెళ్లగా నిర్జన ప్రదేశంలో చిన్నారి తీవ్రగాయాలతో రక్తపుమడుగులో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. వెంటనే తల్లి ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు 6 గంటల పాటు నిరీక్షించిన వైద్యులు పట్టించుకోలేదు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ ప్రాణాలు పోయాయని రోధించింది. ఆరు గంటల పాటు డాక్టర్లు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గాజా పౌరులను హమాసే హత్య చేసింది:
గాజాలో ఆదివారం సహాయ పంపిణీ దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది చనిపోయారు. పదుల కొద్దీ గాయపడ్డారు. అయితే ఆకలితో అలమటిస్తున్న ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందంటూ హమాస్ తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ప్రపంచ మీడియా కూడా ఇజ్రాయెల్‌పై ఆరోపణలు చేసింది. అయితే ఈ దాడిని వెంటనే ఐడీఎప్ ఖండించింది. కానీ హమాస్ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దాడులకు పాల్పడింది హమాస్ ఉగ్రవాదులేనని.. ఇవిగో ఆధారాలంటూ డ్రోన్ వీడియోను విడుదల చేసింది.
ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్:
రష్యాపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడితో ప్రపంచమే అబ్బురపడుతోంది. రష్యాలోని సుదూర ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మూడేళ్ల యుద్ధంలో ఈ రకంగా రష్యాపై దాడి జరగడం ఇదే తొలిసారి. అణు సామర్థ్యం కలిగిన బాంబర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. 40 కంటే ఎక్కువ రష్యన్ విమానాలు ధ్వంసమైంది. బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. టర్కీలో శాంతి చర్చలు ప్రకటించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ ఈ దాడిని ‘‘అద్భుతమైన ఆపరేషన్’’ అని పిలిచారు. అయితే, ఈ ఆపరేషన్ కోసం ఉక్రెయిన్ పక్కా ప్లాన్ చేసింది. 117 డ్రోన్లను వినియోగించి విధ్వంసం సృష్టించింది. ఈ దాడి ప్రణాళికకు 18 నెలలు పట్టింది. ఈ విషయాన్ని జెలెన్ స్కీ స్వయంగా ప్రకటించారు. రష్యా నిఘా, భద్రతా సంస్థ అయిన ఎఫ్ఎస్‌బీ స్థానిక ప్రధాన కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయం నుంచే ఈ ఆపరేషన్‌ని సమన్వయం చేసినట్లు వెల్లడించారు. 34 శాతం వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ధ్వంసం చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. దాదాపుగా 7 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు:
బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. నేడు తులంపై రూ. 300 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,764, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,950 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగింది. దీంతో రూ. 89,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగింది. దీంతో రూ. 97,640 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
నేను ఇలానే మాట్లాడతా:
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్, కమెడియన్ అలీని అనుచిత పదజాలంతో సంబోధిస్తూ, “వీడు ఎక్కడ లం****కు.. బుద్ధి ఉందా లేదా..? ఎన్టీఆర్ గారి అవార్డు అంటే చప్పట్లు కొట్టరా..?” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న రాజేంద్ర ప్రసాద్, ఆ సంఘటన కోసం క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో నటించను:
ఎలాంటి హీరో లక్షణాలు లేకపోయినా డబ్బు ఉంటే చాలు హీరో అవ్వొచ్చు. దీన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. అందులో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ ఒకరు. హీరో అవ్వాలి అనే ఆశతో 2022లో ‘ది లెజెండ్’ అనే మూవీ చేశాడు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేల్లా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ కోసం కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రభు, వివేక్, సుమన్, యోగిబాబు, నాజర్ వంటి స్టార్ నటులంతా ఈ మూవీలో భాగం అయ్యారు. కానీ ఏం లాభం సినిమా డిజాస్టర్ అయింది. అయితే తాజాగా శరవణ అండ్ నయనతార కు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. ఏంటీ అంటే.. శరవణ తన రెండో సినిమా పనులు మొదలు పెట్టాడు. అయితే మొదటి సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశిని తీసుకొచ్చిన శరవణన్, తన రెండో సినిమా కోసం కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ నయన్‌తారని ప్లాన్ చేశాడట. ఇప్పటకే శరవణన్ టీమ్, నయనతారని కలిసి సినిమా గురించి చర్చించిందని సమాచారం. అంతే కాదు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంటే, ఎంత రెమ్యూనరేషన్ అడిగితే, అంత ఇచ్చేందుకైనా రెడీ అంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. కానీ రూ.100 కోట్లు ఇచ్చినా సరే, శరవణన్‌తో సినిమా చేయనని తేల్చి చెప్పేసిందట నయనతార.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రజంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
అందరికీ తెలిసేలా చేప్పేది ఆరోజే:
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో సిద్దు జొన్నలగడ్డ యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించాడు. సిద్దు జొన్నలగడ్డ తనదైన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్వాగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సిద్దు, ఇప్పుడు దర్శకుడు నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 17, 2025 న విడుదల కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఈ ఇద్దరు హీరోయిన్లతో సిద్దు జొన్నలగడ్డ రొమాంటిక్ యాంగిల్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో ఈ చిత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతోంది. ‘తెలుసు కదా’ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.
శ్రేయస్ అయ్యర్‌కు బిగ్ షాక్:
ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు గాను రూ.24 లక్షల జరిమానాను బీసీసీఐ విధించింది. పంజాబ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన సభ్యులకు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) జరిమానా పడింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది రెండోసారి. మొదటిసారి కేవలం సారథికి మాత్రమే ఫైన్ పడుతుందన్న విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో శ్రేయస్ ఖాతాలో ఈ అరుదైన ఘనత చేరింది. ఈ ఘనత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వల్ల కూడా కాలే. అయితే ఈ ఇద్దరు ఎక్కువ కాలం ఒకే జట్టుకు ఆడారు. 2017లో రైజింగ్ పూణే సూపర్‌జైంట్ ఫైనల్‌కు వెళ్లినా.. ధోనీ సారథి కాదు. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున రోహిత్ ఆడినా అతడు కెప్టెన్ కాదు.