మణిపూర్లో హింసాత్మక ఘటనలు.. ఆరు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
మణిపూర్ ఔటర్ లోక్‌సభ స్థానంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్‌ను రద్దు చేసినట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత ఇక్కడ ఏప్రిల్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తాజా ఓటింగ్ జరగనుంది. ఈ ఆరు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు మణిపూర్ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇది చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా సాగుతుందని నిర్ధారిస్తుంది.
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్..
రాష్ట్రంలోనే 45 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్న తొలి ప్రదేశంగా నంద్యాల అవతరించడంతో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఎండలు ఠారెత్తించాయి. ఈ తీవ్రమైన వేడి రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నివాసితులు ఇంటి లోపల ఆశ్రయం పొందవలసి వచ్చింది. తెలుగురాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి పర్యటన
ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎల్బీ నగర్, మల్కాజ్ గిరిలో నిర్వహించే రోడ్ షోలలో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొననున్నారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు లవ్లీ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియాతో విభేదాల కారణంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లవ్లీ చెప్పుకొచ్చారు. బాబారియాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తొలగించాలని తనపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడు.. కానీ, నేను దానికి ఒప్పుకోకపోవడంతో విభేదాలు కొనసాగయాని అరవింద్ సింగ్ లవ్లి తెలిపారు. అలాగే, బాబరియా నిర్ణయాలు నచ్చకపోవడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు.
బీజేపి, ఆర్ఎస్ఎస్ పై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసింది? అని ప్రశ్నించారు. జీఎస్టి పెంచి ఆఖరికి బట్ట కట్టుకొని పరిస్థితి తెచ్చిందన్నారు. చీరల మీద సైతం జీ ఎస్టీ వేశారని మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అడిగితే అయోధ్య ను చూపిస్తున్నారు. మూడు నెలల్లో 34 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే మీ నాయకుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అని హాట్ కామెంట్స్ చేశారు. 50ఏళ్ల నుంచి తిరంగా జెండా ఎగరనీయలే అన్నారు. బ్రిటిష్ వాడు ఎలా జెండా పట్టుకుంటే చంపేశాడని ప్రశ్నించారు.
ఢిల్లీ సీఎంకు మద్దతుగా ఆప్ నేతలు… వాక్ ఫర్ కేజ్రీవాల్ పేరుతో పాదయాత్ర
ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈరోజు (ఏప్రిల్ 28) ‘వాక్ ఫర్ కేజ్రీవాల్’ వాకథాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెడితే, ఆప్ ప్రచారం చేయలేదని బీజేపీ భావించిందని బీజేపీపై అతీషి అన్నారు. కానీ, ఢిల్లీ ప్రజలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాకథాన్ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. మా యువజన విభాగం దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ నుండి మా లోక్‌సభ అభ్యర్థుల కోసం వాకథాన్‌ను నిర్వహించిందన్నారు.’
కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ.. బీజేపీ స్వదేశీ పార్టీ..
కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పార్టీ.. బీజేపీ స్వదేశీ పార్టీ అని ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఐదు సంవత్సరాలనుండి పార్లమెంట్ పరధిలో మేము చేసిన అభివృద్ధిని ఇంటింటికి తీసుకెళ్తునామన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓకే నానానికి బొమ్మ బొరుసు లాంటోళ్ళు అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు చుట్టపు చూపుకు వచ్చి పోయేవాళ్లని తెలిపారు. బీజేపీ అభివృద్ధి చేయలేదంటే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్షాలు బండి సంజయ్ ని, రాములవారిని తిట్టాలి అంతే అన్నారు.
మగువలకు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఏప్రిల్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,080గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,700గా.. 24 క్యారెట్ల ధర రూ.72,760గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,850 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,930గా నమోదైంది.
బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే
బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన తాడిపత్రి నుంచి మలిదశ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన తరువాత తొలి సారిగా ప్రచారంలో పాల్గొన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశానన్నారు. బటన్ నొక్కి రూ.2లక్షల 70 వేల కోట్లు.. ప్రజల ఖాతాల్లో వేశామన్నారు. లంచాలు లేకుండా, వివక్ష లేని పాలనను అందించాం. ఈ 58 నెలల్లోనే 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల యుద్ధానికి మీరు సిద్ధమేనా? తాడిపత్రి సిద్ధమేనా?. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి కాదు. ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. జెండాలు జతకట్టుకుని వారంతా వస్తున్నారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టినట్టేనని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే. జగన్‌కు ఓటు వేస్తే.. పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలకు ముగింపే. అని ఆయన వ్యాఖ్యానించారు.
పదేళ్లలో హామీలు అమలు చేసినట్లు నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటాం..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్ లో మేము పోటీ నుంచి తప్పుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా కోహెడ లోని వెంకటేశ్వర గార్డెన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులు, ఎంపిటిసి సభ్యుడు ఆరుగురు పార్టీ కండువా కప్పుకున్నారు. నాలుగు నెలల తమ పాలనలో 6 గ్యారంటీలలో చేయాల్సినవి అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ పది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ చేస్తున్న అన్నారు.