ప్రకాశంలో ట్రాఫిక్ మళ్లింపు..
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు మీదుగా కాట్రగుంట, చౌటపాలెం మీదుగా మార్కాపురం వెళ్లాలి. బస్సు యాత్ర కనిగిరి నుంచి బహిరంగ సభ వేదికకు వచ్చే సమయంలో కనిగిరి వైపు వెళ్లే వాహనాలను కంభాలపాడు వద్ద కొంత సమయం ఆపుతారు. బస్సు యాత్ర బహిరంగ సభ వేదిక నుంచి పొదిలి పట్టణంలోగుండా దర్శి వెళ్లే సమయంలో ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలను కాటూరి వారిపాలెం సబ్ స్టేషన్ వద్ద, గిద్దలూరు వైపు నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలను చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత కంభాలపాడు వద్ద కొంత సమయం ఆపుతారు. ఒంగోలు వైపు నుంచి గిద్దలూరు, దర్శి వెళ్లే భారీ వాహనాలు, కంకర టిప్పర్లను పొదిలి టౌన్ వైపు అనుమతించరు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యం..
బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం నాడు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు రాజకీయ విశేషాలను పెమ్మసానికి వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకుగాను 12 రోజులు తీహారు జైల్లో ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా వనమా తెలిపారు. బీజేపీ కూడా ఎన్నో ప్రజా రంజక పథకాలను మోడీ నాయకత్వంలో అమలు అవుతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని చెప్పుకొచ్చారు.
ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన ఉద్యోగులు.. షోకాజ్ నోటీసులు
ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల శిక్షణకు డుమ్మా కొట్టిన 71 మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 4,5 తేదీల్లో ఎన్నికల నిర్వహణ పై శిక్షణకు 20 శాఖలకు సంభందించిన 71 మంది గైర్హాజర్ అయ్యారు. దీనిపై సీరియస్ అయిన అధికారులు వారికి నోటీసులు పంపారు. ఎందుకు హాజరు కాలేదో వారందరూ కారణం చెప్పాలని కోరారు. ఎన్నికల శిక్షణకు 20 శాఖలకు సంబంధించన వారిపై సీరియస్ అయ్యారు. ఎన్నికల శిక్షణకు హాజరు కాకపోతే.. కోడ్ నియమాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుకాలేనందుకు కారణాలు తెలపాలని కోరారు. మరి దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
పాకిస్థాన్లో అయితే.. మీ మేనిఫెస్టో కరెక్ట్‌గా సరిపోతుంది..
కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోఫై అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గమనిస్తే.. భారత్‌లోని ఎన్నికల కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు తగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో విభజన వాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాని కాంగ్రెస్ చూస్తుందని ఆరోపించారు. శనివారం నాడు జోరాట్ స్థానంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు.. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీలకు నిదర్శనం అని పేర్కొన్నారు. సమాజంలో విభజన చిచ్టుపెట్టి అధకారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకుంటుంది.. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నారు. భారత దేశాన్ని విశ్వగురువుగా మర్చేందుకు కమలం పార్టీ ఉద్యమాన్ని చేపట్టిందని సీఎం హిమంత శర్మ అన్నారు.
ఆదిలాబాద్ లో చిరు జల్లులు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లా వాసులకు వాన జల్లులు పలకరించాయి. ఇవాళ ఉదయం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురవడంతో నేల తల్లి తడిసింది. దీంతో ఇన్ని రోజులు తీవ్ర ఎండలతో అల్లాడుతున్న జనం చిరు జల్లులల్లో తడిసి ముద్దయ్యారు. మరోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
తెలుగుదేశం విజయానికి బీసీలు ఐక్యంగా కృషి చేయాలి..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేసి తగిన ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం అని కనుక బీసీలు అందరు ఐక్యంగా కృషి చేసి తెలుగుదేశానికి అండగా నిలవాలని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన సీతారాంపురం పట్టణంలో శనివారం నాడు బీసీ జయహో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ పై కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం.. అలాగే, పెళ్లి కానుక లక్ష రూపాయలకు పెంపు.. చంద్రన్న బీమా 10 రూపాయలకే పునరుద్ధరణ చట్టబద్ధంగా కుల గణన విద్యా పథకాలు పునరుద్ధరణ చేస్తామని కాకర్ల సురేష్ తెలిపారు.
కొండెక్కిన కోడి ధర..
విశాఖలో చికెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.. వారం రోజుల వ్యవధిలో 50 రూపాయలు పెరిగి ట్రిపుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతుంది.. సాధారణంగా వేసవికాలంలో చికెన్ ధరలు నేలచూపు చూసేవి కానీ ఈ సారి మాత్రం భిన్నంగా చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి… దీని గల కారణం చికెన్ కు డిమాండ్ ఉన్న దానికి తగ్గ సప్లై లేకపోవడమే అని వ్యాపారులు చెబుతున్నారు.. మరోవైపు పెరిగిన చికెన్ ధరలతో సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు.. కేజీ రెండు కేజీలు కొనే వారు 1/2 కేజీ పావు కేజీ తో సరిపెట్టుకుంటున్నారు… రానున్న రోజుల్లో రూ.350 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు..
మెట్రో ప్రయాణికులకు షాక్.. రాయితీ, హాలిడే కార్డులు రద్దు..
హైదరాబాద్‌లో ప్రజా రవాణాలో రైలు ప్రధాన మార్గంగా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో మెట్రోలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఎండలు మండుతుండటంతో ప్రజలు మెట్రో బాట పట్టారు. అయితే ప్రయాణికులను చూసి అధికారులు అవాక్కయ్యారు. మెట్రో కార్డుపై 10 శాతం రాయితీని ఎత్తివేసిన అధికారులు రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేశారు. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది ఏప్రిల్‌లో కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీ సమయాల్లో డిస్కౌంట్ పూర్తిగా రద్దు చేయబడుతుంది. తాజాగా మరోసారి అదే విధానాన్ని అమలు చేస్తున్నారు.
కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ఆప్ దీక్ష..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆప్ ప్రకటించింది. సామూహిక నిరాహార దీక్షల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ వాట్సాప్ నంబర్‌ను రిలీజ్ చేసింది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సామూహిక నిరాహారదీక్ష కార్యక్రమం ప్రారంభం అయింది. ఇక, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు అందరూ ఇందులో నిరసన చేస్తున్నారు. దీంతో పాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న పౌర సమాజానికి చెందిన వారు కూడా సామూహిక నిరాహార దీక్షలో పాల్గొనేందుకు జంతర్ మంతర్‌కు చేరుకుంటున్నారు.
హమ్మయ్య.. జేపీ నడ్డా భార్య కారు దొరికిందోచ్..
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికేసింది. గత నెల 19వ తేదీన ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో కనిపించింది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేపీ నడ్డా సతీమణి మళ్లికా ఫార్చునర్ ఎస్‌యూవీ కారు మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో దొంగతనానికి గురైంది. కారు డ్రైవర్ జోగిందర్ దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పురిలో ఉన్న ఓ సర్వీసింగ్ సెంటర్ నుంచి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
బస్తీ దవాఖానాలకు మోడీనే నిధులు ఇస్తున్నారు..
బస్తీ దవాఖానాలకు మోడీనే నిధులు ఇస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాగ్ అంబర్ పేట్ మల్లికార్జున నగర్ బస్తీ లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. పదమూడు కోట్ల టాయిలెట్లను కట్టించారు మోడీ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కారణంగా ఇండ్లు కట్టలేదన్నారు. దేశంలో నాలుగు కోట్ల ఇళ్లను కట్టించారు మోడీ అన్నారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని తెలిపారు. రేషన్ కార్డ్ ఉన్న పేదలకు అందరికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నామన్నారు. కరోనా సమయంలో పేదల ప్రాణాలు కాపాడటం కోసం ఉచిత వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. బస్తీ దవాఖానలకు మోడీనే నిధులు ఇస్తున్నారని తెలిపారు. స్కూల్ లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.
భానుడి భగ భగ.. రోడ్లన్నీ ఖాళీ
పర్యాటక నగరం విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.. మాడు పగిలే ఎండకు నగర వాసులతో పాటు పర్యాటకులు కూడా ఇళ్ల నుండి హోటల్స్ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. వేడి వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. సాధారణ రోజుల కంటే వీకెండ్స్ ఆదివారాల్లో రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయాయి.. ఉదయం 8-9 గంటల నుండే సూర్యుడు సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు.. విశాఖలో భగ్గుమని మండుతున్న ఎండల తీవ్రంగా ఉన్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా, బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీప్రజలకు చల్లనివార్త చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో ఈ మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గత పదిరోజులుగా పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనానికి.. ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు.
తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైంది..
తుక్కుగూడ లో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైందని ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హాజరై డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తుక్కుగుడ మీటింగ్ లో కాంగ్రెస్ పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచించడానికి పంగనామాలు పెట్టడానికి తెర లేపారని తెలిపారు. తెలంగాణలో ఇస్తామన్న 2500 రూపాయలకు దిక్కులేదన్నారు. కానీ.. దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష ఇస్తామని ప్రకటిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీ లకి దిక్కు లేదు కానీ మరోసారి గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.