అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజున 5,000 మందితో సామూహిక సూర్యనమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, అనేకమంది విద్యార్థులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగర వీధుల్లో నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు కన్నుల పండుగగా మారింది. తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు, ప్రముఖ దేవస్థానాల నుంచి తీసుకొచ్చిన ఆలయ రథాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, ఇవాళ అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచే ప్రారంభంకానుంది. అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 10వ తేదీ చివరి గడువుగా నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు.
‘ఆప్’ పాలనపై ఏపీ సీఎం విమర్శలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లిక్కర్ స్కామ్ నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అన్ని అంశాల్లో ఆప్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌ను దేశ చరిత్రలోనే అతి దారుణమైన కుంభకోణంగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ఆప్ పాలన వైఫల్యాలను చంద్రబాబు నాయుడు ఢిల్లీ ప్రజలకు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుచేశారు. ఆసుపత్రుల నిర్వహణ, తాగునీరు సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, పట్టణ మౌలిక వసతుల కల్పనలో ఆప్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆలోచించాలని సూచించారు. భవిష్యత్ అభివృద్ధికి ఢిల్లీకి డబుల్ ఇంజన్ సర్కారు అవసరమని, మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే సరైన మార్గం అని చెప్పారు.
శంషాబాద్ లో హైడ్రా కూల్చివేతలు
శంషాబాద్ లో సోమవారం ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్, ఊట్పల్లి లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూమి ఆక్రమించి కబ్జా చేసిన కట్టడాలను, ఊట్పల్లి లో రోడ్డు ఆక్రమించి అడ్డంగా గేటు ఏర్పాటు చేయడంతో రెండిటిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగాయి. ప్రభుత్వ భూములు, నాళాలు, చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమిస్తే చర్యలు చేపడతామని హైడ్రా అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
హిందూపురంలో ఉత్కంఠకు తెర.. టీడీపీ కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నిక
హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 23 మంది మద్దతుతో టీడీపీకి చెందిన కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో వైసీపీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ పార్టీ తన కౌన్సిలర్లకు విప్ జారీ చేసినప్పటికీ, 17 మంది మాత్రమే మద్దతు పొందడం విశేషం.ఈ ఎన్నికలో టీడీపీ నాయకత్వం కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో.రమేష్ గెలుపు సాధించారు. దీనితో వైసీపీకు మున్సిపల్ ఛైర్మన్ పగ్గాలు దక్కలేదు.
వీడిన ఆరుగురు గురుకుల విద్యార్థుల మిస్సింగ్ మిస్టరీ
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు.
ఉపాధ్యాయుల మందలింపుతో మనస్థాపానికి గురైన ఆరుగురు విద్యార్థులు పాఠశాల నుంచి అదృశ్యమయ్యారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన గురుకుల సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విద్యార్థులు విజయవాడకు వెళ్లినట్లు గుర్తించారు.
సంక్రాంతికి వస్తున్నాం ఆల్ టైమ్ రికార్డ్
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఇప్పటివరకు రూ. 303 Cr+ గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా చరిత్రలో తన పేరును లిఖించింది. సీనియర్ నతులలో రూ. 300 కోట్ల గ్రాసర్‌ను అందించిన మొదటి హీరోగా వెంకీ మరో రికార్డు నెలకొల్పాడు. నేటికీ ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సూపర్ గా ఉన్నాయనే చెప్పాలి.
సివిల్ సప్లై అవినీతి అక్రమాలపై చీఫ్ విజిలెన్స్ అధికారులు విచారణ
వనపర్తి జిల్లాలో సివిల్ సప్లై అవినీతి అక్రమాలపై చీఫ్ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు . సియం ఆర్ ధాన్యం మాయం, నిర్మాణాలు పూర్తి కాని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు . డిఫాల్ట్ రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులపై మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది . జిల్లాలో పనిచేస్తున్న సివిల్ సప్లై అధికారి , పౌర సరఫరాల శాఖ మేనేజర్, ఎన్ ఫోర్స్ మెంట్ డిటి లను హైదరాబాద్ లోని కార్యాలయానికి పిలింపించి విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. 2023 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను , కింది స్థాయి ఉద్యోగులను సైతం పిలిపించి విచారిస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం , పెబ్బేరు , కొత్తకోట , పానగల్ , వనపర్తి ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు, అక్రమార్కులకు సివిల్ సప్లై అధికారుల అండదండలున్నట్లు ఫిర్యాదులు రావడం తో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
టీడీపీ ఖాతాలోకే నూజివీడు మున్సిపల్ వైస్‌చైర్మన్ పీఠం
పలు నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది మాత్రమే మద్దతు అందించారు. దింతో వైసీపీకి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సొంత కౌన్సిలర్లే టీడీపీకి మద్దతు ప్రకటించడం విశేషం. మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు చేరడంతో ఈ విజయం టీడీపీకి మరింత చేరువగా మారింది.