బెజవాడ దుర్గమ్మ సేవలో మాజీ సీఎం పళనిస్వామి
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే నేత పళనిస్వామి.. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి విజయవాడ చేరుకున్నారు.. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్నారు.. ఇక, పళనిస్వామికి ఘనస్వాగతం పలికారు దుర్గగుడి ఆలయ అధికారులు.. అమ్మవారి దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేశారు.. అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించారు ఆలయ అధికారులు.. ఇక, అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి.. అమ్మవారి దర్శనం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.. దర్శనానికి మాత్రమే వచ్చాను.. రాజకీయాల గురించి మాట్లాడను అని స్పష్టం చేశారు.. మరీ ముఖ్యంగా ఎన్డీఏ నుంచి అన్నా డీఎంకే బయటకి రావడంపై ఇక్కడ మాట్లాడబోనని తేల్చేశారు. రాజకీయాలు గుడిలో మాట్లాడకూడదన్నారు పళనిస్వామి. కాగా, తమిళనాడులో మాజీ సీఎం జయలలిత కన్నుమూసిన తర్వాత అన్నాడీఎంకే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరైంది.. గత ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి.. కానీ, అన్నా డీఎంకేకు ఊహించని షాక్ తగిలి.. డీఎంకే గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్టు తాజాగా అన్నా డీఎంకే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు అంటున్నారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్నేహితులు.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు ఆయన స్నేహితులు.. ఇక, మా స్నేహం మీద ఒట్టు చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు అంటున్నారు ఆయన స్నేహితులు.. చంద్రగిరిలో 14వ రోజు రిలే నిరాహారదీక్షలో ఆయన చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు.. చుట్టుపక్కల గ్రామాల నుంచి చంద్రగిరి స్కూల్‌కు నడచి వచ్చి చదువుకున్నాం.. చంద్రబాబు కష్టం విలువ తెలిసిన వ్యక్తి.. ప్రభుత్వం మూర్ఖత్వంతో మంచితనానికి మచ్చ వేయాలని చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో కూడా పార్టీలకు అతీతంగా వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు అంటున్నారు ఆయన స్నేహితులు.. కుట్ర, కుతంత్రాలు, నీతిమాలిన రాజకీయాలు ఆయనకు తెలియవు.. ప్రజలకు సేవ చేయడం మాత్రమే ఆయనకు తెలుసని చెబుతున్నారు చంద్రబాబు స్నేహితుల. మరోవైపు.. నగరి నుండి తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి వరకు టీడీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, బాబు ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ నగరి నుండి తిరుత్తణి వరకు పాదయాత్ర చేపట్టారు.. పాదయాత్రలో నగరి నియోజకవర్గ ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు.
క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు సీరియస్
క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగిపన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత హైకోర్టు, ఏసీబీ కోర్టుల న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా దూషణలు పెరిగాయి.. ఈ వ్యవహారంలో ట్విట్టర్, ఫేస్బుక్, టీడీపీ నేత బుద్దా వెంకన్న సహా 28 మందిని ప్రతివాదులుగా చేర్చింది ఏపీ ప్రభుత్వం. ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి.. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్.. తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది హైకోర్టు.. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు, ఏసీబీ కోర్టు జడ్జి ఫ్యామిలీలు టార్గెట్‌గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారని ఏజీ వాదనలు వినిపించారు.. టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్న సహా 26 మందికి నోటీసులు ఇవ్వాలని.. ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.
అసెంబ్లీ ముందుకు జీపీఎస్ బిల్లు.. బిల్లులో కీలక అంశాలు
జీపీఎస్ బిల్లును చివరి రోజు శాసన సభ సమావేశాల్లో ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ముందస్తుగా అజెండాలో పెట్టకుండానే నేరుగా అసెంబ్లీ ముందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది.. జీపీఎస్ ను సీపీఎస్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న విషయం విదితమే కాగా.. జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టి.. సభలో మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. బిల్లులోని కీలక అంశాలను పరిశీలించినట్లు అయితే.. రిటైర్ అయ్యే నాటికి ఉన్న బేసిక్ పేలో 50 శాతం గ్యారెంటీ పెన్షన్ ఇవ్వనున్నారు.. పెన్షన్ దారు మరణిస్తే భార్య లేదా భర్తకు పింఛన్లో 60 శాతం గ్యారెంటీ పొందుపర్చారు. ద్రవ్యోల్బణం ప్రకారం సర్దుబాటు చేసిన డీఏగా లాస్ట్ డ్రా బేసిక్ పేపై జీవన వ్యయ సర్దుబాటు చేస్తారు. ఉద్యోగి వార్షిక ఆదాయంలో తగ్గుదల ఉన్నా నెలకు 10 వేలు కనీస పింఛను భరోసా ఇవ్వబోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం వర్తింప జేస్తారు. ఇక, జీపీఎస్ పథకం వర్తించాలంటే బిల్లు ప్రకారం ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు ఓసారి పరిశీలిస్తే.. వాలంటీర్ రిటైర్మెంట్ అయితే కనీసం 20 ఏళ్లు సర్వీస్ చేసి ఉండాలి.. సర్వీస్ మధ్యలో రాజీనామా చేస్తే పథకం వర్తించదు.. క్రమశిక్షణా చర్యలు, బర్తరఫ్ లాంటి సందర్భాల్లో పథకం వర్తించదు.. ఇక, జీపీఎస్‌తో ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఆశా వర్కర్లకు గతంలో రూ. 3వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆశా వర్కర్ల జీతాలను రూ. 10వేలకు పెంచాం.. 108 డ్రైవర్లకు జీతాలు పెంచాం.. హామీ ఇచ్చిన మేరకు ప్రతి విభాగానికీ మేలు చేకూర్చాం అన్నారు..
గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. జిల్లా ఆసుపత్రుల్లోనే క్యాన్సర్‌కు చికిత్స..
అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి సోకితే ప్రాణత్యాగం చేయాల్సి వస్తుంది. అయితే క్యాన్సర్ చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులు కేన్సర్ బారిన పడితే లక్షలు వెచ్చించి వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పటి వరకు ఎంపిక చేసిన పట్టణాలు, జిల్లాల్లో చికిత్స అందిస్తున్నామని, ఇక నుంచి అన్ని జిల్లాల్లోనూ చికిత్స అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, ఖమ్మం, సిరిసిల్ల, కరీంనగర్, వనపర్తి జిల్లా ఆసుపత్రుల్లో కీమోథెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో ఆసుపత్రిలో ప్రత్యేకంగా 100 పడకలను కేటాయించి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇతర జిల్లాలకు చెందిన వారు రేడియేషన్, కీమోథెరపీ కోసం హైదరాబాద్ వస్తున్నారు. ఇక నుంచి నగరానికి రాకుండా జిల్లా ఆస్పత్రుల్లోనే ఎంఎన్‌జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వైద్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కీమోథెరపీ ఇస్తారు. ఆ తర్వాత ఇతర సేవలను కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మల్కాజిగిరి బరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి..! ఖరారు చేసిన కేసీఆర్..
బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ స్థానానికి ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారు కాగా.. తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడ మరో అభ్యర్థిని బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఆ స్థానం నుంచి మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిని పోటీకి దింపాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. మర్రి గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో గులాబీ బాస్ మర్రికి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సీఎం.. వారికి అంతర్గతంగా సమాచారం అందించినట్లు సమాచారం. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఆనంద్ బాగ్ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్డు వరకు సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
‘అప్పటి నుంచే భారత్-చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి’
భారత్ కు పాకిస్తాన్, చైనాతో ఎన్నో ఏళ్లుగా సరిహద్దు వివాదాలు ఉన్న విషయం తెలిసేందే. వీలు చిక్కితే చాలు చైనా భారత్ పై కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది కెనడా. ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధమైన వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా భారత్-చైనా సంబంధాలపై ఎదురైన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ సమాధానమిచ్చారు. 2020 గల్వాల్ లోయ ఘర్షణ తర్వాత నుంచి భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతగా బాగోలేదని ఆయన పేర్కొ్న్నారు. రెండు పెద్ద దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరి తాలూకూ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్న ఆయన ఇదే పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చన్నారు. చైనా ఎప్పుడు ఎందుకు ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదని జై శంకర్ అన్నారు. గత మూడేళ్ల కాలాన్ని చూస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు సహజరీతిలో లేవన్నారు. రెండు దేశాల మధ్య సంప్రదింపులకు విఘాతం కలిగిందన్న ఆయన, రెండు దేశాల మధ్య పర్యటనలు ఆగిపోయాయన్నారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తత నెలకొందని పేర్కొ్న్నన్నారు. చైనా అంటే భారత ప్రజలకు ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని పేర్కొన్న ఆయన ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. 1962 లో చైనా భారత్ మధ్య యుద్దం జరిగిందని పేర్కొన్న ఆయన ఆ తరువాత సైనిక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే 1975 తరువాత సరిహద్దుల్లో ఎప్పుడూ ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..
కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ.. జంతు హక్కుల పరిరక్షణలో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం అని ఆమె ఆరోపించారు. ‘ఆవు షెడ్లను నడుపుతోంది మరియు భారీ భూములతో సహా ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను పొందుతుంది’ కానీ, మోసం చేస్తోందని ఆరోపించారు.. ఒక మీడియా కథనం ప్రకారం, బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్‌లోని ఆవు షెడ్ గురించి ప్రస్తావించారు. తాను ఇస్కాన్‌కు చెందిన అనంతపురం గోశాలకు వెళ్లానని, అక్కడ పాలు ఇవ్వని ఒక్క ఆవు కూడా కనిపించలేదు.. అలాగే డెయిరీ మొత్తంలో ఒక్క దూడ లేదు. పాడిపరిశ్రమలో పాలు ఇవ్వని ఒక్క ఆవులు లేవు.. ఒక్క దూడ కూడా లేదంటే అవి అన్నీ అమ్మేసినట్టే కదా? అన్నారు. ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోందని ఆరోపించారు మేనకా గాంధీ.. ఈ పనిని వాళ్లు చేసినంతగా ఎవరూ చేయరు అని మండిపడ్డారు.. వీధుల్లో ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. దీని తరువాత వారి జీవితమంతా పాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. బహుశా వీరు అమ్మినన్ని ఆవులను కసాయిదారులకు మరెవరూ అమ్మి ఉండరని పేర్కొన్నారు. అయితే, మేనకా గాంధీకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ దాదాపు నెల రోజుల క్రితం అయినట్టు సమాచారం. ‘మదర్స్ మిల్క్’ పేరుతో డాక్యుమెంటరీ తీసిన డాక్టర్ హర్ష ఆత్మకూరి.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక, ఆవులను కసాయిదారులకు విక్రయిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్ స్పందించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో ఇస్కాన్ అగ్రగామిగా ఉందని ప్రకటించింది ఇస్కాన్.
ఏరిపారేయడమే లక్ష్యంగా.. ఖలిస్థాన్ ముఠాలపై ఎన్ఐఏ దాడులు
భారత్- కెనడా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. అది చినికి చినికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ముఠాలు కూడా భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో భారత్ వారిని ఎక్కడికక్కడ అణగద్రొక్కాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూకు పంజాబ్‌లో ఉన్నటువంటి ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్ఐఏ ఖలిస్థాన్ ముఠాలు, ఉగ్రవాదులపై దర్యాప్తును వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా బుధవారం 50 ప్రాంతాల్లో సోదాలకు దిగింది.
ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో త్వరలో ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ఆరంభం కానుంది. ఇందుకు సంబందించిన టీజర్ పేజ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లోకి వచ్చేసింది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరంభం కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో ఇటీవల భారతదేశంలో రిలీజ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే మీ సొంతం అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్‌ఫోన్ (MOTOROLA Edge 40 Neo Caneel Bay, 256 GB, 12 GB RAM) అసలు ధర రూ. 29,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 23 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో ఎడ్జ్ 40 నియో రూ. 22,999కి మీకు అందుబాటులో ఉంది. అంటే మీరు రూ. 7,000 ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 10 శాతం బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో ఎడ్జ్ 40 నియోను మరింత తక్కువ ధరకు మీ సొంతం అవుతుంది. ఎడ్జ్ 40 నియోని గత ఏప్రిల్ నెలలోనే మోటోరోలా పరిచయం చేసింది. మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన మోటోరోలా.. ఎడ్జ్ 40 నియోను మాత్రం విడుదల చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 21న మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఎడ్జ్ 40 నియోకి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో స్టాక్ త్వరలోనే అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే కొనేసుకుంటే బెటర్.
ఆడియో లాంచ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం… లేని ఈవెంట్ కి బ్లాక్ లో టికెట్స్
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న ‘లియో’ పై భారీ అంచనాలున్నాయి. మాస్టర్ సినిమాతో మెప్పించలేకపోయిన ఈ కాంబో… లియోతో ఆ లోటును తీర్చడానికి వస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ కాస్త తేడా కొడుతున్నా… లోకేష్ పై ఉన్న నమ్మకం లియోని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 19న లియో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా గ్రాండ్‌గా ఆడియో,ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుక కోసం దళపతి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కానీ ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తూ… లియో ఆడియో రిలీజ్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ సెవన్ స్క్రీన్ స్టూడియో ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈవెంట్ పాసుల కోసం ఊహించిన దానికంటే ఎక్కువగా రిక్వెస్ట్స్ రావడం, ఆల్రెడీ బ్లాక్ లో ఈవెంట్ పాస్ లని ప్రింట్ చేసి బ్లాక్ మార్కెట్ వర్గాలు అమ్ముకోవడం, భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో ఈవెంట్ రద్దు చేస్తున్నామని వివరణ ఇచ్చారు కానీ కోలీవుడ్ వర్గాల్లో మాత్రం మరోలా ప్రచారం జరుగుతోంది. రాజకీయపరమైన ఒత్తిడుల వల్లే ఈ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అలాంటి వార్తల్లో నిజం లేదని అన్నారు. అయినా కూడా దీని వెనక కోలీవుడ్ హీరో, డీఎంకే మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ హ్యాండ్ ఉందని అంటున్నారు. ఆయనకు సంబంధించిన రెడ్ జెయింట్స్ సంస్థకు లియో రైట్స్ ఇవ్వకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు.
రౌడీ ఫ్యాన్స్ కి స్పెషల్ న్యూస్…
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీడీ 13గా పిలుస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 54వ చిత్రమిది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. వీడీ 13 నుంచి షూటింగ్ ప్రోగ్రెస్ ను మేకర్స్ ఇవాళ వెల్లడించారు. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని వారు తెలిపారు. వీడీ 13 సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ కు ఉన్న బ్లాక్ బస్టర్ ఇమేజ్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద క్రేజ్ పెంచుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.