సింపతీ కోసం చంద్రబాబు ప్రయత్నం.. లోకేష్ తప్పుకి శిక్ష ఖాయం..
టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్‌లో కాదు.. జైల్లో ఉన్నాడు.. నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టిందని సెటైర్లు వేశారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఆయన.. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారం చంద్రబాబు సింపథీ కోసం చేసే ప్రయత్నంగా దుయ్యబట్టారు.. ఇక, సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. దొంగతనం చేసిన వాళ్లు ఒక్కసారితో నిజం చెప్పరన్న ఆయన.. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే ఉంటాయి.. కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాలు గురించి కాదు అని సెటైర్లు వేశారు. హెరిటేజ్ కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మేథావిలా మాట్లాడినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరు.. లోకేష్ తప్పుకి శిక్ష పడడం ఖాయం, కోర్టు కూడా ఈ విషయాన్ని నమ్మిందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు.. మరోవైపు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని సీఐడీ ప్రశ్నిస్తోంది.. తొలిరోజు 50 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. రెండో రోజు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభించిన విషయం విదితమే.
చంద్రబాబు, లోకేష్ వాగుడుతోనే ఇక్కడి దాకా తెచ్చుకున్నారు..
చంద్రబాబు, లోకేష్ వాగుడుతోనే పరిస్థితి ఇక్కడి దాకా తెచ్చుకున్నారన్నారు మంత్రి అంబటి రాంబాబు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నన్నేం చేయలేక పోయాడు.. వైఎస్ జగన్ నన్ను ఏం పీకుతాడు అన్న చంద్రబాబు మాటలకు సమాధానం వచ్చింది.. రెండు పీకి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారంటూ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ పాలనలో చేసిన దోపిడీ బయట పడింది.. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.. పైగా కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు.. కక్ష సాధింపు చేయాలంటే మొదటి సంవత్సరమే లెక్క చూసే వాళ్లం.. ఆధారాలు బయట పడ్డాయి కాబట్టే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక, 17ఏని అడ్డు పెట్టుకొని బయట పడాలని చూస్తున్నారు.. కానీ, తప్పు చేయలేదని ఎక్కడ చెప్పడం లేదని దుయ్యబట్టారు మంత్రి అంబటి.. ఇక, పచ్చగా ఉన్న తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ కాలుతో మాడి పోయిందని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.. తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయితే రాజమండ్రిలో లేకుండా ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్.. ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పని అయిపోయిందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రజలు అర్థం చేసుకోవాలి.. పిల్లిని చంకన పెట్టుకుని పెళ్లికి వెళ్లినట్లు ఉంది.. టీడీపీ.. పవన్ కల్యాణ్ ను కలుపుకుని వెళ్లడం అని సెటైర్లు వేశారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చేది.. కానీ, ప్రజా ధనాన్ని దోచుకుని దొంగలా దొరికితే సానుభూతి రాదన్నారు.. ముఖ్యమంత్రిగా చేసి అవినీతి కేసులో జైలుకు వెళ్లిన నాయకులకు రాజకీయ చరిత్ర లేదు, ఉండదని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు.
చంద్రబాబుకు డీహైడ్రేషన్.. క్లారిటీ ఇచ్చిన జైళ్లశాఖ డీఐజీ
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు గురయ్యారనే వార్తలు వచ్చాయి.. వేడి, ఉక్కబోత ఎక్కువగా ఉన్నట్టు ఆయనను మంగళవారం ములాకత్‌లో కలిసిన కుటుంబసభ్యులకు చెప్పినట్టు.. దీంతో వారిలో ఆందోళన మొదలైనట్టు సమాచారం.. అయితే, దీనిపై కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ కిరణ్ స్పందించారు.. చంద్రబాబుకి డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా నాకు సమాచారం వస్తుందన్నారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.. డీహైడ్రేషన్ కి గురైనట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్న ఆయన.. చంద్రబాబుకి కోర్టు గైడెన్స్ ప్రకారం సౌకర్యాలు కల్పిస్తున్నాం.. రోజుకి మూడు సార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నట్లు కూడా చంద్రబాబు చెప్పలేదన్నారు.. ప్రోటోకాల్ ప్రకారం తమ పని తాము చేస్తున్నట్టు వెల్లడించారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్. మరోవైపు.. రేపటి నుంచి నాలుగు రోజులు పాటు సెలవు పై వెళ్లనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్.. దీంతో, ఇంఛార్జి సూపరింటెండెంట్‌గా డిప్యూటీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్‌కి బాధ్యతలు అప్పగించారు ఉన్నతాధికారులు.
విశాఖ ఉత్తర నియోజకవర్గం 2024 ఎమ్మెల్యే నేనే.. జగన్ పోటీ చేసినా గెలుపు నాదే..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉది.. కానీ, అప్పుడే పొత్తులు, సీట్లపై చర్చ సాగుతోంది.. కొందరు మరో ముందడుగు వేసి.. ఈ నియోజకవర్గం నాదే.. కాబోయే ఎమ్మెల్యే తానే అంటున్నారు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 2024 నేనే ఎమెల్యేను అంటూ భవిష్యవాణి వినిపించారు.. డబ్బులు, మద్యం పంపిణీ చేయకుండా ఎవ్వరు పోటీ చేసినా తనదే గెలుపన్న ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా నాదే విజయం అనే ధీమా వ్యక్తం చేశారు.. పులివెందల నుండి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వచ్చి పోటీ చెయ్యమని సీఎం వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.. పొత్తు ఉన్నా లేకున్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసినా విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో నా గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటున్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ-జనసేన పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు ఉన్నా.. ఈ మధ్య ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్తాయని ప్రకటించారు. ఇదే సమయంలో.. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసివస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ, ఇప్పటి వరకు టీడీపీ, జనసేనతో పొత్తుపై బీజేపీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు.. పొత్తులపై నిర్ణయం తీసుకునేది కేంద్ర నాయకత్వమే అని.. బీజేపీ అధిష్టానంపై నెట్టివేస్తున్నారు బీజేపీ ఏపీ నేతలు.
సింగరేణి ఎన్నికలు వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..
సింగరేణి ఎన్నికలు హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తూ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీ లోపు ఓటర్ లిస్ట్ రెడీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇవాల సింగరేణి ఎన్నికల పై నేడు కీలక విచారణపై హైకోర్టు తీర్పుతో ఉత్కంఠకు తెరలేపింది. ఈ నెల 28 న సింగరేణి లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్ లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. గత ఏడాది నుండి హై కోర్ట్ లోనే సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతుంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడగిస్తు హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23 న సింగరేణి ఎన్నికలపై హై కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల పై సింగరేణి యాజమాన్యం చీఫ్ కోర్ట్ లో అప్పీల్ చేసింది. నేడు సింగరేణి ఎన్నిక పై హై కోర్ట్ తీర్పు కోసం చూస్తున్న వారికి స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పఠాన్‌కోట్ దాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ హతం!
2016 పఠాన్‌కోట్ దాడి ప్రధాన సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ (41) మృతి చెందాడు. మంగళవారం పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోని మసీదులో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. లతీఫ్ సమాచారం గురించి తెలిసిన షూటర్లు అతడిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. స్థానిక, స్వదేశీ ఉగ్రవాదులు ఈ హత్యలో పాల్గొన్నారని సమాచారం. జమ్మూకశ్మీర్‌లోని పలువురు ఉగ్రవాదులతో షాహిద్ లతీఫ్‌కు సంబంధాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. తీవ్రవాద సంస్థలతో కలిసి అతడు అనేక దాడులు చేశాడు. ఉగ్రవాద సంస్థ ‘జైషే మహ్మద్’ కమాండర్ అయిన లతీఫ్‌పై భారత్‌లో పలు కేసులు ఉన్నాయి. పాకిస్థాన్‌తో సంబంధాలను సరిదిద్దుకునేందుకు యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలో భాగంగా లతీఫ్‌తో పాటు మరో 24 మంది ఉగ్రవాదులను 2010లో భారత్ విడుదల చేసింది.
ప్రియుడి గుట్టు బయటపడుతుందని దారుణం.. చెల్లెళ్లను గొంతుకోసి చంపిన అక్క
యూపీలోని బల్రాయ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఇద్దరు చిన్నారుల హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బహదూర్‌పుర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ప్రియుణ్ని రమ్మని చెప్పింది.. అతడితో అత్యంత సన్నిహితంగా ఉంది.. అయితే, ఆ దృశ్యాలను ఏడు, నాలుగేళ్ల వయసున్న ఆ యువతి ఇద్దరు చెల్లెళ్లు చూశారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతారేమోనని భయపడిన యువతి.. ఆ చిన్నారులు తన చెల్లెళ్లు అనే విషయాన్ని కూడా మరిచి కర్కషంగా వ్యవహరింంచింది.. పదునైన ఆయుధంతో గొంతు కోసి చెల్లెళ్లను దారుణంగా హత్య చేసింది. అయితే, ఓ కట్టుకథ అల్లి బయటపడాలని చూసింది.. చెల్లెళ్లను ఎవరో చంపేశారని తల్లిదండ్రులకు చెప్పింది.. కానీ, ఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న ఆ యువతి దుస్తులను గుర్తించిన పోలీసులు.. జంట హత్యలపై ఆమెను నిలదీశారు. దీంతో.. అసలు విషయం బయటపెట్టింది.. వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, ఇద్దరు చిన్నారుల హత్యకు.. నిందితురాలైన అంజలికి ప్రియుడు, మరికొందరు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆ దేశంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ కు పెరుగుతున్న డిమాండ్..
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్ల్‌ఫ్రెండ్స్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్నది. అమెరికాలో ఈ ట్రెండ్ పెరుగుతుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ అందుబాటులోకి రావడంతో పురుషుల ఒంటరితనాన్ని మరింత దిగజార్చుతున్నదని ఒలిన్ బిజినెస్ స్కూల్ ప్రాక్టీస్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్ లిబర్టీ విటెర్ట్ తాజాగా హెచ్చరించారు. ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ వాటిగురించి బాహాటంగా వెల్లడించేంతగా ప్రధాన స్రవంతిలోకి వచ్చాయని చెప్పారు..
శుభ్‌మన్ గిల్ పాకిస్థాన్ మ్యాచ్ ఆడుతాడా?.. టీమిండియా కోచ్ సమాధానం ఇదే!
టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ‘డెంగ్యూ’ బారిన పడిన విషయం తెలిసిందే. గిల్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోవడంతో.. ముందు జాగ్రత్త చర్యగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో బీసీసీఐ వైద్య బృదం చేర్పించింది. ఆదివారం ఆసుపత్రిలో చేరిన గిల్.. మంగళవారం డిశ్చార్జి అయ్యాడు. డెంగ్యూ కారణంగా ఈరోజు అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తెలిపింది. అయితే శనివారం అహ్మదాబాద్ వేదికగా దాయాది పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అతడు ఆడతాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పందించాడు. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విక్రమ్ రాఠోడ్ మాట్లాడుతూ… ‘శుభ్‌మన్ గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడు ఆసుపత్రిలో చేరిన మాట నిజమే. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేర్చాం. త్వరగా కోలుకోవడంతో తిరిగి హోటల్‌కు చేరుకున్నాడు. ఎప్పటికప్పుడు బీసీసీఐ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తూ ఉంది. గిల్ చాలా త్వరగా కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. వాస్తవానికి అతను బాగానే ఉన్నాడు. త్వరలోనే మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పటికే 70-80 శాతం కోలుకున్నాడు. అయితే ఏ మ్యాచ్‌లో ఆడతాడనేది ఇప్పుడే చెప్పలేము’ అని అన్నాడు.
ఫ్యాక్షన్ సినిమాలకి టార్చ్ బేరర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న డైలాగ్ డెలివరీ ఇండియాలో సగం మంది హీరోలకి ఉండదు. అందుకే రాజమౌళి అంతటి దర్శకుడు ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ లో ఏ యాక్టర్ చెయ్యలేడు అని చెప్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ పిచ్ లో డైలాగ్ చెప్పే ఎన్టీఆర్ కి, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారు? త్రివిక్రమ్ మాట ఎన్టీఆర్ నుంచి ఎలా పేలుతుంది? ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే చూడాలని కొన్ని సంవత్సరాలుగా కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ త్రివిక్రమ్ ఫ్యాన్స్. వారి కోరికని నిజం చేస్తూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’. ఫ్యాక్షన్ సినిమాలు అనగానే కొట్టు కోవడం, నరుక్కోవడం మనం చాలా సినిమాల్లో చూసాం కానీ అరవింద సమేత వీర రాఘవ సినిమా అందుకు పూర్తిగా భిన్నం. యుద్ధం జరిగిన తర్వాత పరిణామాల పైన… పోస్ట్ వార్ పైన ఈ సినిమా ఉంటుంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, అంతే ఇంటలెక్చ్యువల్ రైటింగ్, సోల్ ఫుల్ మ్యూజిక్, థాట్ ప్రవోకింగ్ క్లైమాక్స్ అన్నీ కలిసి అరవింద సమేత వీర రాఘవ సినిమాని స్పెషల్ గా మార్చాయి. సెటిల్డ్ గా ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మెన్స్ ముందెన్నడూ చూడని ఎన్టీఆర్ ని పరిచయం చేస్తుంది. ఇంట్రో సీన్ ని త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం చూస్తే త్రివిక్రమ్ లో ఇంత మాస్ డైరెక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ క్లాసిక్ రిలీజ్ అయ్యి నేటికి ఐదేళ్లు అవ్వడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. #5YearsForAravindaSametha #NTR ట్యాగ్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. క్లాస్-మాస్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవనుంది… హారిక హాసినీ బ్యానర్ పై స్టార్ట్ అవనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం… ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కి ఉన్న లైనప్ కంప్లీట్ కాగానే మొదలవనుంది.
థర్డ్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. వైరల్ అవుతున్న పోస్టర్..
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రంతో యంగ్ డైరెక్టర్ వంశీ డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే సాంగ్ లుక్ ను విడుదల చేశారు.. ఈ పాటను అక్టోబర్ 12న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పోస్టర్ లో రవితేజ బీడి కాలుస్తూ..తలపాగా చుట్టుకొని కొంచెం సీరియస్‌గా కనిపిస్తుంటే.. హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ తన ప్రియుడి ఒడిలో వాలిపోయి ఉంటుంది.. ఈ సినిమా లో నుపుర్ సనన్ సారా పాత్ర లో నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన సారా లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌లో గూస్ బంప్స్ తెప్పించే రవితేజ విజువల్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.అలాగే రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.