క్షేత్రస్థాయి పర్యటనకు పవన్ సిద్ధం.. రోజుకు మూడు సభల్లో పాల్గొననున్న పవన్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.. ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు పార్టీ అధినేతలను ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.. ఇప్పటికే టీడీపీతో జత కట్టి పోటీ చేయాలని నిర్ణయించింది జనసేన పార్టీ.. మరోవైపు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ నెలాఖరు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు రెడీ అవుతున్నారు.. రోజుడకు ఏకంగా మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నెలాఖరు నుంచి పవన్ కల్యాణ్.. క్షేత్రస్థాయి పర్యటనలు, బహిరంగ సభలు ప్రారంభమవుతాయని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతో పాటు.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగసభలు ఏర్పాటుచేసేలా ప్లాన్ చేశామన్నారు.. రోజుకు మూడు సభల్లో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని వెల్లడించారు.. ఈ సభలను విజయవంతం చేసే బాధ్యతను జోనల్ కమిటీలు తీసుకోవాలని సూచించారు. మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా కష్టపడితే.. వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని దిశానిర్దేశం చేశారు. ఇక, రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించి 191 మందితో కమిటీలు వేశాం.. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేనాని పర్యటించేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. కాగా, ప్రస్తుతం అయోధ్య పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలపై దృష్టిసారించనున్నారు. ఇప్పటికే.. వైసీపీ నుంచి పలువురు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు.. మరికొంతమంది కూడా జనసేనలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఏదేమైనా టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యం అంటున్నారు పవన్ కల్యాణ్.
విధుల నుంచి అంగన్వాడీల తొలగింపు.. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్..!
అంగన్వాడీల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పటికే ఆ ఆదేశాలు అమలు చేసే దిశగా అడుగులేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు.. విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్లు, మిగిలిన జిల్లాల్లోనూ టర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు సిద్ధం అవుతున్నారు. అంతేకాకుండా.. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలకు ఉపక్రమించనున్నారు కలెక్టర్లు. ఇక, పార్వతీపురం మన్యం జిల్లాలో విధులకు హాజరుకాని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచిచూశాం.. నేడు తొలగింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.. అంతేకాకుండా నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ విధులకు హాజరు కాని కార్యకర్తలు 1444 మంది, ఆయాలు 931 మంది ఉన్నారని.. జిల్లా మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి, సాధికారిత అధికారి ఎం ఎన్ రాణి తెలిపారు. ఈ నెల 25న కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
రంగంపేటలో ఆకట్టుకుంటున్న శ్రీరాముని సైకత శిల్పం
‘అంతా రామ మయం.. ఈ జగమంతా రామ మయం’ అనే పాట ఎన్నో సార్లు వింటుంటాం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే నినాదం.. జై శ్రీరామ్.. 550 ఏళ్ల నాటి కల సకారం అవుతుందంటూ హిందువులు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు.. ఎటు చేసినా రామనామస్మరనే.. అన్ని ఆలయాలు.. ఈ వేడుకకు సిద్ధం అయ్యాయి.. అయోధ్యలో బాల రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఆ వేడుకను పురస్కరించుకుని.. ఒక్కొక్కరు.. ఒకలా రాముడిపై తమకు ఉన్న భక్తిని చాటుకుంటున్నారు.. అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ రూపొందించిన శ్రీరాముని సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటుంది. అయోధ్య రాముని ఆగమనం అవనికే ఆనందమయం అన్న నినాదంతో ఇసుకతో శ్రీరాముని రూపాన్ని తీర్చిదిద్దారు. తన కుమార్తెలతో కలిసి శ్రీనివాస్ రూపొందించిన సైకత శిల్పాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలు తరలివస్తున్నారు.
అంతా రామమయం.. సముద్ర గర్భంలోనూ శ్రీరాముడు..
జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలంలో రామాలయం అనేది ప్రతీ హిందువు కల.. ఎన్నో వివాదాలను అధిగమించి మరెన్నో న్యాయ పోరాటాల అనంతరం.. అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన దివ్య రాములోరి ఆలయ ప్రారంభోత్సవ వేడుకకు సిద్ధమైంది.. ప్రతీ రామ భక్తుడు ఆ వేడుకను ఓ పండుగా తిలకిస్తున్నాడు.. ఇక, లోకాభిరాముడి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఊరూరా పండుగ వాతావరణలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.. ప్రతీ హనుమాన్, రామాలయాలను ముస్తాబు చేశారు.. పూలు, కాషాయ జెండాలు, విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి.. ఇంటింటా దీపాలు వెలిగించి రాములోరికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.. అయోధ్యలో బాల రాముడు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుండగా.. ఆ వేడుకను పురస్కరించుకుని.. ఒక్కొక్కరు.. ఒకలా రాముడిపై తమకు ఉన్న భక్తిని, అభిమానాన్ని చాటుతున్నారు.. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. సముద్ర గర్భంలోనూ శ్రీరాముడు చిత్రపటాలను పెడుతున్నారు.. దీంతో సముద్ర గర్భాన్ని కూడా శ్రీ రాముడు ఫీవర్ తాకినట్టు అయ్యింది.. విశాఖలో స్కూబా డైవింగ్ బృందం వినూత్న ప్రయత్నం చేసింది.. ఋషికొండ సముద్రపు లోతుల్లోకి శ్రీరాముడి విగ్రహంతో వెళ్లింది స్కూబా డైవింగ్ టీమ్.. సముద్రపు లోతుల్లో శ్రీరాముడి చిత్రపటాన్ని ప్రదర్శించి ఔరా..! అనిపించారు.
ప్రతి హిందువు కల నెరవేరిన రోజు ఇది..
ప్రతి ఒక్క హిందువుని కల నెరవేరిన రోజు.. ఈ రోజు అని అభివర్ణించారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మితమైన ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మించాలన్న ఐదున్నర శతాబ్దాల కల నెరవేరిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేయడం సంతోషంగా ఉందన్నారు.. దీంతో, ప్రతి ఒక్క హిందువు కల నెరవేరిన రోజు ఈరోజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీల సహకారం లేకపోవడం వలన దశాబ్దాల తరబడి.. కోర్టులో రామ జన్మభూమి కేసు నడిచిందని గుర్తుచేశారు. ఇక, ఈ నెలాఖరు నుంచి అయోధ్య వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
అంగన్వాడీలకు సర్కార్ షాక్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..!
అంగన్వాడీల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఓ వైపు సుదీర్ఘంగా సమ్మె చేయడంతో పాటు.. ఈ రోజు ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్‌యంలో.. వారిపై చర్యలకు సిద్ధం అయ్యింది.. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.. విధుల్లో చేరని అంగన్వాడీలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.. ఆ ఆర్డర్స్‌ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లు. అందులో భాగంగా విశాఖ జిల్లాలోని అంగన్వాడీలకు షాక్ ఇచ్చారు కలెక్టర్.. ఎస్మా ఉల్లంఘనకు పాల్పడ్డ సిబ్బంది తొలగింపుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు సాయంత్రం లోపు విధుల్లో చేరకపోతే టెర్మినేషన్ లెటర్స్ ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ప్రభుత్వం హెచ్చరికలతో విధుల్లో చేరారు 69 మంది వర్కర్లు, 42మంది ఆయాలు.. అయితే, జిల్లాలో మొత్తం అంగన్వాడీలు 752 మంది, ఆయాలు 698 మంది ఉన్నారు. వీరిని వెంటనే తొలగించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్.. మరోవైపు.. కొత్త అంగన్వాడీల భర్తీకి ఈ నెల 25న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.. ఆ తర్వాత ఈ నెల 26వ తేదీ నుంచి సచివాలయాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని చెబుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. భద్రాచలం దేవస్థానాని ఆహ్వానం ఇవ్వలేదు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుని దగ్గర రాజకీయాలు తగదని దేవుడు ముందు అందరూ సమానమేనని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.. అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన ఏకైక దేవస్థానం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అని అని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలవబడుతున్న ఈ దేవస్థానమునకు ఆహ్వానం రాకపోవడం చాలా విచారకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ పార్టీ ఇలాంటి నీచమైన ఆలోచన చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు. భద్రాచల రామాలయానికి ఆహ్వానం పంపించకపోవడంతో తెలంగాణను అవమానించడమేనని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుక్రుతం
గత 500 ఏళ్లుగా యావత్ హిందూ సమాజం చిరకాల వాంఛ నెరవేరబోతున్న ఘట్టం మరి కొద్ది గంటల్లోనే వచ్చింది అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోంది.. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎంతో మంది దీక్షలు తీసుకున్నారు.. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇంటింటా రామ నామ స్మరణ మారుమోగుతోంది.. మధ్యాహ్నం జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట ద్రుశ్యాన్ని వీక్షించి తరించండి.. రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది అని బండి సంజయ్ తెలిపారు. ఈరోజు ప్రతి హిందువు తమ తమ ఇండ్ల ముందు 5 రామ జ్యోతులు వెలిగించండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా టపాసులు పేల్చి దీపావళి సంబురాలు చేసుకునేందుకు సిద్ధం కండి.. సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో దీపావళి సంబురాలు చేసుకోబోతున్నామని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఆర్టిస్ట్ వెంకటేశ్ రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరాన్ని వీక్షించాలని కోరుతున్నాను.. అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుక్రుతం అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
రామ్ లల్లా దీక్షలో మోడీతో పాటు పాల్గొననున్న ఈ దొం రాజా ఎవరు?
ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలా పవిత్రోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని మోడీతో పాటు దేశవ్యాప్తంగా 15 మందిని రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో విశిష్ఠ అతిథులుగా ఎంపిక చేశారు. ఇందులో కాశీకి చెందిన దోమ్ రాజా అనిల్ చౌదరి కూడా ఉన్నారు. కాశీకి చెందిన దోమ్ రాజా అనిల్ చౌదరి తన తల్లి జమునా దేవి, భార్య సప్నా చౌదరి, అతని కుటుంబ సభ్యులతో శనివారం అయోధ్య చేరుకున్నారు. ఆయన శనివారం వారణాసి నుండి బయలుదేరిన సందర్భంగా ఒక మతపరమైన ఊరేగింపు జరిగింది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు వెండి త్రిశూలం, కానుకతో రామమందిరానికి బయలుదేరారు. కాశీలోని గొప్ప శ్మశాన వాటికలో కొన్నేళ్లుగా చితిమంటలను వెలిగించి, మృతదేహాలకు దహన సంస్కారాలు చేసేవాడు దోమ్ రాజా. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సామాజిక సామరస్య సందేశాన్ని అందించడానికి అప్పటి కాశీ జగదీష్ చౌదరిని తన ప్రతిపాదకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియమించారు. జూలై 2021లో ఆయన మరణించిన తర్వాత, మరణానంతరం పద్మశ్రీ అవార్డుతో గౌరవించబడ్డారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం ఆలయ ప్రాణ ప్రతిష్ట సమయంలో అనేక క్రతువులు ఉంటాయని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన అకిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఇటీవల తెలిపారు. నేడు జరిగే ప్రధాన ప్రాణ ప్రతిష్ట పూజలో దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భాగాలకు చెందిన 14 మంది దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొంటారు. యజమానుల జాబితాలో ఉదయ్‌పూర్ నుంచి రామచంద్ర ఖరడి, అస్సాం నుంచి రామ కుయి జెమి, జైపూర్ నుంచి గురుచరణ్ సింగ్ గిల్, హర్దోయి నుంచి కృష్ణ మోహన్, ముల్తానీ నుంచి రమేష్ జైన్, తమిళనాడు నుంచి అదాలరసన్, మహారాష్ట్ర నుంచి విఠల్ రాము కాల్లే, మహారాష్ట్ర లాటూర్‌లోని ఘుమంతు సమాజ్ ట్రస్టు నుంచి మహదేవ్ రావు గైక్వాడ్, కర్నాటక నుంచి లింగరాజ్ బసవరాజ్, లక్నో నుంచి దిలీప్ వాల్మీకి, దోమ్ రాజా కుటుంబం నుంచి అనిల్ చౌదరి, కాశీ నుంచి కైలాశ్ యాదవ్, హర్యానాలోని పల్వాల్ నుంచి అరుణ్ చౌదరి, కాశీ నుంచి కవీంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. వీరంతా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మత గ్రంథాలలో పేర్కొన్న విధంగా సమగ్రంగా పూజలు జరుగుతాయి.
భూకంపం వచ్చినా 1000ఏళ్లు నిలిచేలా నిర్మించిన రాములోరి ఆలయం.. ఎలా కట్టారంటే ?
రాంలాలా జీవితం నేడు అయోధ్యలోని రామాలయంలో పవిత్రం కానుంది. ఈ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రాచీన విశ్వాసం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సమ్మేళనం కూడా. రామాలయం ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూపుతుంది. బలమైన భూకంపాలు, తీవ్రమైన వరదలను సులభంగా తట్టుకోగలిగేంత బలం దీనికి ఇవ్వబడింది. అలాగే, అయోధ్యలోని ఈ దివ్య రామాలయం వెయ్యేళ్ల పాటు బలంగా నిలబడబోతోంది. టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్వహణతో లార్సెన్ & టూబ్రో కంపెనీ రామ మందిరాన్ని నిర్మిస్తోంది. ఇది ఖచ్చితమైన ప్రణాళిక, ఆధునిక నిర్మాణ సాంకేతికత ఫలితం. 360 స్తంభాలు స్థాపించబడిన సాంప్రదాయ నగర నిర్మాణ శైలి ద్వారా రామ మందిరం రూపకల్పన జరిగింది. ఆధునిక ఇనుము, ఉక్కు, సిమెంట్ ఉపయోగించకుండా పూర్తిగా రాతితో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయాన్ని భూకంపాలను సైతం తట్టుకునే విధంగా నిర్మించారు. ఇతర పదార్థాలతో పోలిస్తే ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. వందల ఏళ్ల నాటి అనేక దేవాలయాలు ఇప్పటికీ భద్రంగా ఉండటానికి ఇదే రాయి కారణమని చెబుతున్నారు. రామాలయం 6.5 తీవ్రతతో సంభవించే భూకంపాలను తట్టుకోగలదు. 1,000 సంవత్సరాల వరకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉండదని అంచనా. ఆలయాన్ని నిర్మించే బృందం అయోధ్య నుండి నేపాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో ఇప్పటివరకు సంభవించిన భూకంపాల తీవ్రతను కొలుస్తుంది. దీని తరువాత, ఈ ఆలయానికి ప్రత్యేకమైన పునాదిని రూపొందించడానికి ప్రయోగశాలలో నిపుణులు పరిశోధనలు చేశారు. చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కొన్ని ముఖ్యమైన సూచనలు అందాయి. దీని ఆధారంగా ఇంజినీర్లు 15 మీటర్ల మేర భూమిని తవ్వి అక్కడ ఉన్న పై మట్టిని తొలగించారు. ఇక్కడ రీ ఇంజినీరింగ్ మట్టిని నింపారు. ఈ మట్టి 14 రోజుల్లో రాయిగా మారుతుంది. నిర్మాణ ప్రక్రియలో 47 పొరలు వేయబడ్డాయి.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం.. రెండుసార్లు చాంపియన్‌కు షాకిచ్చిన టీనేజర్!
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ మూడో రౌండ్‌లోనే నిష్క్రమించగా.. తాజాగా రెండుసార్లు చాంపియన్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకకు షాక్ తగిలింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో 93వ ర్యాంకర్, ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమస్క చేతిలో అజరెంక ఓడిపోయింది. 7-6(6), 6-4తో అజరెంకను డయానా మట్టికరిపించింది. ఈ మ్యాచ్ 2 గంటల 7 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. విక్టోరియా అజరెంకాను ఓడించిన 23 ఏళ్ల డయానా యస్ట్రెమస్క.. మొదటిసారి గ్రాండ్ స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఎమ్మా రాడుకాను (2021 యూఎస్ ఓపెన్) తర్వాత గ్రాండ్‌స్లామ్ క్వార్టర్-ఫైనల్‌కు చేరుకున్న మొదటి క్వాలిఫైయర్ డయానా కావడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ రౌండ్ 1లో వింబుల్డన్ ఛాంపియన్ మార్కెటా వొండ్రూసోవాపై అద్భుత విజయాన్ని డయానా అందుకుంది. తర్వాతి రౌండ్లలో వర్వారా గ్రాచెవా, ఎమ్మా నవారోలను ఓడించింది. క్వార్టర్ ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లిండా నోస్కోవాతో డయానా తలపడనుంది. గ్రాండ్‌స్లామ్‌ల్లో వీరిద్దరూ తలపడడం ఇదే తొలిసారి.
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.. స్సెషల్ విషెస్ చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్!
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది సేపట్లో జరగనుంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాంతో 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరనుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపాడు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేశవ్ మహరాజ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ‘అందరికీ నమస్కారం. ప్రపంచ వ్యాప్తంగా, దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నా. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్’ అని కేశవ్ మహరాజ్ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మెడియల్ వైరల్ అయింది. భారత్ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మైదానంలో శ్రీరాముని పాటలు వినిపించాయి.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన రోహిత్!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం ఇంగ్లీష్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రోహిత్ శర్మ మరో 14 సిక్స్‌లు బాదితే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌లో 91 సిక్సర్లు బాదాడు. రెండో స్ధానంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (78) ఉన్నాడు. హిట్‌మ్యాన్ ప్రస్తుతం 77 సిక్సర్లతో మూడో స్ధానంలో ఉన్నాడు. రెండు సిక్సులే కాబట్టి తొలి టెస్టులోనే ధోనీని రోహిత్ అధిగమించనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కాబట్టి.. ప్రస్తుత రోహిత్ ఫామ్ చూస్తే సెహ్వాగ్ రికార్డు కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉంది. హిట్‌మ్యాన్ అలవోకగా సిక్సులు బాదుతాడు అన్న విషయం తెలిసిందే. ఇక టెస్టుల్లో ఇంగ్లండ్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 49.80 సగటుతో 747 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజాకు ఈ టెస్టు సిరీస్ చాలా ప్రత్యేకం. ఈ సిరీస్‌లో జడేజా కేవలం 2 వికెట్లు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 550 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 7వ భారత బౌలర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, జవగల్ శ్రీనాథ్ ఉన్నారు. జడేజా ఇప్పటివరకు భారత్ తరపున 68 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 275, వన్డేల్లో 220, టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు.
ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్!
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమాకి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వైఎస్ జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ మాత్రం ఇష్టం లేదని ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ అన్నారని.. వ్యూహం సినిమాలో తమను కించపరిచేలా తెరకెక్కించారని లోకేష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ.. వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. జనవరి 8న వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను సెన్సార్ బోర్డ్ న్యాయస్థానానికి అందజేసింది. సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు.. సెన్సార్ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని నేడు సెన్సార్ బోర్డును ఆదేశించింది.