జగనన్న తోడు నిధుల విడుదల.. లబ్దిదారుల ఖాతాల్లోకి సొమ్ము
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధుల జమకు శ్రీకారం చుట్టారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. లక్షల మంది చిరువ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత జరుగుతోంది. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నా వాళ్ల బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరూ ఇంత ఆలోచన చేయలేదు. నా కళ్ల ఎదుట కనిపించినప్పుడు, దాదాపు నా పాదయాత్రవల్ల జరిగిన పరిస్థితులుగానీ, ప్రతి జిల్లాలోనూ ఇది కనిపించేది అన్నారు. అప్పు కావాలి అంటే, వ్యాపారాలు చేసుకోవాలంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం కూరగాయలు, పనిముట్లు తెచ్చుకోవాలంటే రూ.1000 ఇచ్చే సరికి రూ.100 కట్ చేసుకొని సాయంత్రానికి మళ్లీ తిరిగి 1000 అసలు తీసుకొనే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్.. 10 రూపాయల వడ్డీ వీళ్లు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్ప.. వీళ్ల బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా కనిపిస్తున్నా ఎవరూ సొల్యూషన్ చూపించాలని అడుగులు పడలేదు. కానీ, మన ప్రభుత్వం గర్వంగా చెప్పే అంశం.. మన ప్రభుత్వం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడిందన్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితి గురించి బ్యాంకర్లతో మాట్లాడి ఇన్వాల్వ్ చేయించడం, కాన్ఫిడెన్స్‌లోకి తీసుకోవడం, రూ.10 వేలు ప్రతి ఒక్కరికీ ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఇచ్చేట్టుగా చేశాం. ఆ మొత్తం వడ్డీ భారాన్ని సకాలంలో కట్టేట్టుగా మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించాం. ఇవన్నీ చేస్తూ 8వ దఫా కింద ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. 86,084 మందికి రూ.86 కోట్లు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తున్నాం. గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3.09 లక్షల మందికి రూ.332 కోట్ల రుణాలను రెన్యువల్ కూడా చేస్తున్నాం.. మొత్తంగా రూ.418 కోట్లు 3.95 లక్షల మందికి కొత్త రుణాలుగా ఇస్తున్నాం అని వెల్లడించారు.
కేశినేని నానిపై పీవీపీ సెటైర్లు.. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే..!
విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మిగిలింది.. ఇప్పటికే తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ రాజీనామాకు ఆమోదం లభించగానే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.. ఇక, బుధవారం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసిన విషయం విదితమే.. అయితే, ఆది నుంచి కేశినేని నాని అంటే విరుచుకుపడే ప్రముఖ నిర్మాత, గత ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానంలో వైసీపీ తరఫున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ).. తాజా పరిణామాలపై సెటైర్లు వేశారు. కేశినేని నానిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.. ”బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే.. వీడి బుద్ది గురించి బెజవాడంతా తెలుసుకదరా అబ్బాయ్” అంటూ X లో ట్వీట్ చేశారు పీవీపీ..
కేశినేని బ్రదర్స్.. నాని వ్యాఖ్యలకు చిన్ని కౌంటర్
విజయవాడ లోక్‌సభ స్థానం.. కేశినేని ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది.. బెజవాడ ఎంపీగా ఉన్న అన్న కేశినేని నానిని పక్కనబెట్టిన టీడీపీ.. ఆ బాధ్యతలు తన సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు అంటూ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లకు అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని.. మా కుటుంబ కలహాలు 1999 ఉంచి ఉన్నాయి.. కొనసాగుతూనే ఉన్నాయి.. వాటితో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. నాని నన్ను ఎన్ని అన్నా 1999 ఉంచి నేనే సద్దుకుంటూ పోతున్నాను అని వెల్లడించారు. అసలు నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదన్నారు చిన్ని.. చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని హితవుపలికారు.. ఎంతో మంది మహామహులు టీడీపీని వీడినా పార్టీకి ఏమీ కాలేదని గుర్తుచేశారు. వచ్చే వాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు, ఇప్పటి వరకూ టీడీపీని ఏం చేయలేకపోయారని స్పష్టం చేశారు కేశినేని చిన్ని. ఇక, టీడీపీ నుంచి వెళ్లిపోవాలన్న ఉద్దేశంతోనే గత నాలుగేళ్లుగా వైసీపీ నేతలతో నాని టచ్‌లో ఉన్నారని విమర్శించారు.. ఇక, ఎలాగూ పదవి కాలం అయిపోతుంది.. దాంతోనే ఇప్పుడు రాజీనామా చేసి.. ఆది నుంచి జరుగుతోన్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు కేశినేని చిన్ని.
ముద్రగడతో జ్యోతుల నెహ్రూ భేటీ.. కలిసి ప్రయాణం చేద్దాం..!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి.. ఇప్పటి వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. క్రమంగా దూరం జరుగుతున్నారా? అనే చర్చ సాగుతోంది.. నిన్న జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరపగా.. ఈ రోజు సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ నివాసానికి వెళ్లడం చర్చగా మారింది. కాపు సామాజిక వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ముద్రగడ దృష్టికి తీసుకెళ్లారట నెహ్రూ.. కాపు నేతగానే తాను ముద్రగడ దగ్గరకు వచ్చానని క్లారిటీ ఇచ్చారు. ముందు నా నియోజకవర్గంలో కాపులను కలపాలి.. కాబట్టి ఇక్కడికి వచ్చానని తెలిపారు.. ఇప్పటివరకు ఐక్యత లేకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని సమావేశంలో చర్చ నడిచిందట.. అయితే, టీడీపీ-జనసేన కూటమిలో కాపులకి అధిక ప్రాధాన్యత ఉంటుందని పద్మనాభం దృష్టికి తీసుకెళ్లారట.. జాతికి ప్రయోజనాలు ఉన్నాయంటే కలిసి ప్రయాణం చేద్దామని తెలిపిన ముద్రగడ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, ముద్రగడ పద్మనాభంతో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ, నేను ఇద్దరం కలిస్తే కచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకుంటాం అన్నారు. నాకు మద్దతు ఇమ్మని అడిగానని తెలిపారు. పార్టీ అడిగితే కచ్చితంగా మళ్లీ వస్తాను.. ముద్రగడను కలుస్తానని తెలిపారు. ముద్రగడ రాజకీయాల్లోకి వస్తే.. కచ్చితంగా నేను ఉన్న (టీడీపీ) పార్టీలోకి రావాలని కోరుకుంటాను అని స్పష్టం చేశారు. అయితే, ఈ రోజు వ్యక్తిగతంగా మాత్రమే వచ్చాను.. ముద్రగడను కలిసినట్టు వెల్లడించారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.
పార్టీ మారే ప్రసక్తే లేదు.. నెల్లూరు రూరల్ నుంచి పోటీ..
ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమే.. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఈ సారి టికెట్ దక్కుతుందనే నమ్మకం లేక.. పక్క చూపులు చూస్తు్న్నారు.. ఇక, వైసీపీ సీట్ల మార్పులు, చేర్పులు కాకరేపుతుండగా.. పలువురు నేతలు ఇప్పటికే వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. మరికొందరు పార్టీ జంప్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి.. నేను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. తాను పార్టీ మరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నన్ను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించినప్పటి నుంచి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఒంగోలు మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఈ మధ్య ఆదాల భేటీ ప్రాధాన్యత సంతరించుకోగా.. ఎంపీ మాగుంటతో భేటీ మర్యాద పూర్వకమైనదేనని క్లారిటీ ఇచ్చారు. నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు రూరల్ అసెంబ్లీ నుంచి ఈ సారి పోటీ చేస్తున్నానని.. పార్టీ వీడే ప్రసక్తేలేదని క్లారిటీ ఇచ్చారు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి.
వైఎస్ జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. న్యాయం చేస్తారు..
వైఎస్ జగన్మోహన్‌రెడ్డిది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ప్రభుత్వం ధృడనిశ్చయంతో ఉందన్నారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్జీవో హోంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, పలువురు రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.. సమావేశంలో తమ సమస్యలను ఎమ్మెల్యే నాని దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగులు.. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పథకాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే.. చంద్రబాబు ప్రకటించిన పథకాలతో ఏమవుతుంది..? అని ప్రశ్నించారు. పెనం మీద ఉండడం కరెక్టా..? పొయ్యిలో పడడం కరెక్టో ఉద్యోగులు ఆలోచించుకోవాలన్నారు. మనసుతో ఆలోచించే సీఎం వైఎస్ జగన్ ఉద్యోగుల కష్టాలు ఇబ్బందులను కచ్చితంగా పరిష్కరిస్తారు. ఉద్యోగులను ప్రభుత్వం తమ సొంతవాళ్లుగా భావిస్తూ పేదల పథకాల కోసం కొన్ని సందర్భాల్లో వారికి ఇచ్చే నిధులు వినియోగించాం.. పేదలకు మంచి చేసిన పుణ్యం ఉద్యోగులకు కూడా దక్కుతుందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన సమస్యలను తప్పకుండా సీఎం దృష్టికి తీసుకెళ్తా.. ఉద్యోగుల మద్దతు ప్రభుత్వానికి ఉండాలని కోరారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
వైసీపీపై ఇంట్రెస్ట్ లేదు..! టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ.. క్లారిటీ ఇచ్చిన గిరిబాబు
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం తెలుగుదశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది.. నిన్నటి నుంచి జరుగుతోన్న పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. బుధవారం రోజు ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరిపితే.. ఈ రోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ.. ముద్రగడతో సమావేశం అయ్యారు. ఇక, కలిసి పనిచేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు కూడా ఇచ్చారు. అంతేకాదు.. రెండు, మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతోన్న తరుణంలో.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి బాబు.. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి నాన్న (ముద్రగడ పద్మనాభం) ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు ముద్రగడ గిరిబాబు.. నాన్న, నేను.. ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందన్నారు. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని తన మనసులో మాట బయటపెట్టిన ఆయన.. మరిన్ని చర్చలు జరుగుతాయన్నారు. గతంలోనే చెప్పినట్టు ఈసారి కచ్చితంగా పోటీలో ఉంటాం.. త్వరలోనే నిర్ణయం ఉంటుందన్నారు. అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాం.. టీడీపీ లేదా జనసేనలో చేరడం.. పోటీ చేయడం ఖాయం అని మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు ముద్రగడ గిరిబాబు.
నా కోరిక అదే.. సీతారామ ప్రాజెక్ట్ పై తుమ్మల కామెంట్
తనకు ఉన్న రాజకీయ కోరిక సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయటమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామం లో సీతారామ ప్రాజెక్ట్ పనులపై ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తుమ్మల మాట్లాడుతూ.. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు తలపెట్టినది సీతారామ ప్రాజెక్ట్ అన్నారు. ఇప్పటికే 7 వేలకోట్ల కు పైగా ఖర్చు జరిగిందన్నారు. టన్నెల్ రెండు వైపుల నుండి పనులు చేసి పూర్తి చేయాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించి పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. యాతలకుంట టన్నెల్ పూర్తి అయితే బెత్తుపల్లి, లంకా సాగర్ కు నీళ్లు అందుతాయన్నారు. గండుగలు పల్లి లో నాలుగో పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
టికెట్ కొనకపోతే బిచ్చమెత్తుకున్నట్లే.. మహిళల ఫ్రీ బస్ జర్నీపై బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..!
ఉచిత బస్సుయాత్రపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.10 వేల ఆదాయం ఉన్నా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారంటే అలాంటి మహిళలు తన దృష్టిలో బిచ్చగాళ్లలాంటి వారని అన్నారు. తమకు ఆదాయం, ఆస్తులు ఉన్నా పింఛన్, రైతు పెట్టుబడి సాయం, రేషన్ కార్డు తీసుకున్నా అందరూ బిచ్చగాళ్లేనని అన్నారు. అంతేకాకుండా.. ఉచితం కావాలనుకునే వారికి ఉండాలి కానీ.. మీరు చెల్లించే సామర్థ్యం రూ. 10 వేలు సంపాదించి కూడా ఉచిత బస్సు ప్రయాణం వాడుకుంటే.. నా దృష్టిలో అడుక్కుంటున్నట్టే అన్నారు. మీకు భగవంతుడు చిన్న చూపుచూసి గుడికాడ ఉండి అమ్మా.. అయ్యా అంటూ అడుక్కుంటారు చూశారా వాళ్లలాగే మీరు కూడా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గరీబోళ్ల డబ్బే కదా. అలాగే ఆదాయం ఉండి కూడా పెన్షన్ తీసుకున్నా.. రైతు బంధు తీసుకున్నా.. బిచ్చమెత్తుకున్నట్లే అంటూ మహిళల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ దగ్గర కక్కుర్తి పడేటోళ్ల శవాల మీద పేలాలు ఏరుకునేటోళ్లు. తినటానికి తిండి లేకుంటే ఏరుకున్నట్లే అని కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘వెల్ సేడ్ ఎమ్మెల్యే’ అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తుంటే.. ‘నెలకు రెండున్నర లక్షలకు పైగా జీతం తీసుకుంటూ ప్రభుత్వ వాహనాన్ని వాడడం కూడా సేమ్’ అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆ గ్రామానికి శనిలా పట్టుకున్న బట్టల అద్దకం ఫ్యాక్టరీ.. మూడు నెలల్లో 35మంది మృతి
పంజాబ్‌లోని లూథియానాలోని మంగత్ గ్రామ ప్రజలు ఎటువంటి కారణం లేకుండా మరణిస్తున్నారు. మూడు నెలల్లోనే 35 మంది చనిపోయారు. ఈ సమయంలో కూడా డజన్ల కొద్దీ ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. కలుషిత నీటి వల్లే ఇలాంటి అకాల మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో బట్టల కర్మాగారం నిర్మించినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో గ్రామస్తులు నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలో బట్టలకు రంగులు వేసే సమయంలో విడుదలయ్యే కెమికల్ వాటర్ ను బోరువెల్ ద్వారా భూగర్భ జలాల్లోకి వదులుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. గ్రామంలోని ప్రజలు ఈ నీటిని తాగేందుకు వినియోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వైద్యం అందక నిత్యం రోగాలబారిన పడి మృత్యువాత పడుతున్నారని.. ఇదే నీటిని సాగునీటి అవసరాలకు కూడా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటలు కూడా దెబ్బతిన్నాయి.
జైలులో ఖైదీలు మృతి.. ఇంటికి వచ్చిన మృతదేహాల్లో గుండె సహా అవయవాలు మాయం
అమెరికాలోని అలబామాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి జైళ్లలో ఉన్న ఖైదీలు చనిపోయారు. వారి మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి అప్పగించినప్పుడు, గుండెతో సహా అనేక అవయవాలు మృతదేహాల నుండి మాయమయ్యాయి. దీని తరువాత ఖైదీల కుటుంబ సభ్యులు అలబామా కరెక్షన్స్ డిపార్ట్‌మెంట్‌పై కేసు పెట్టారు. వారి మృతదేహాలను వారి కుటుంబాలకు తిరిగి ఇచ్చే సమయంలో గుండె కనిపించకుండా పోయిందని, శరీరమంతా కుళ్లిపోయిందని పేర్కొంది. మరణించిన ఖైదీ బ్రాండన్ క్లే డాట్సన్ కుటుంబం గత నెలలో అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్, ఇతరులపై దావా వేసింది. డాట్సన్ నవంబర్‌లో అలబామా జైలులో మరణించాడు. గత వారం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మరణించిన మరో ఖైదీ చార్లెస్ ఎడ్వర్డ్ సింగిల్టన్ కుమార్తె 2021లో తన తండ్రి మృతదేహాన్ని తిరిగి తీసుకువచ్చినప్పుడు అతని శరీరం నుండి అన్ని భాగాలు కనిపించకుండా పోయాయని చెప్పారు.
బౌలింగ్ కంటే.. ఫీల్డింగ్ చేయడం అంటేనే వణుకు పుడుతోంది!
మొహాలీ వాతావరణంపై భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెద్ద సవాల్ అని, ఫీల్డింగ్ అంతకంటే ఇబ్బంది అని పేర్కొన్నాడు. కెప్టెన్‌కు నమ్మకం ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం అని, నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం అని అన్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు అఫ్గానిస్థాన్‌తో మొహాలీ వేదికగా భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం మొహాలీ వాతావరణం క్రికెటర్లకు సవాల్ విసురుతోంది. తీవ్రమైన చలితో ప్లేయర్స్ ఇబ్బందులు పడుతున్నారు. నెట్ ప్రాక్టీస్‌లోనూ భారత క్రికెటర్లు గ్లవ్స్, కోట్లు ధరించారు. స్పోర్ట్స్ 18తో రవి బిష్ణోయ్ మాట్లాడుతూ… ‘ఈ చలి వాతావరణంలో బౌలింగ్ చేయడం కంటే.. ఫీల్డింగ్ అంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఈ వాతావరణంలో బంతిపై నియంత్రణ ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్ కంటే.. ఫీల్డింగ్ చాలా కఠినంగా ఉంటుంది. దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం. బౌలింగ్‌లో 100 శాతం మా ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. టీ20ల్లో వైవిధ్యమైన బంతులను విసిరాలి. బంతిని ఎక్కువగా గాల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తా. ఎర్ర బంతితోనే ఇలానే ప్రాక్టీస్ చేశా. అది ఉపయోగపడుతుందని భావిస్తున్నా. కెప్టెన్‌కు మన మీద నమ్మకం ఉన్నప్పుడు.. ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం. నెట్స్‌లో శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం’ అని అన్నాడు.
విరాట్ కోహ్లీ నాకు బావ అవుతాడు: హీరోయిన్
‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ ‘రుహానీ శర్మ’. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్-చాఫ్టర్1 సినిమాలతో తెలుగు అభిమానులకు దగ్గరయ్యారు. రుహానీ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమాలో రుహానీ శర్మ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన రుహానీ.. సైంధవ్ సినిమా సహా తన పర్సనల్ విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ మాట్లాడుతూ.. అనుష్క శర్మ మీకు సిస్టర్ అవుతుంది, విరాట్ కోహ్లీ బావ అవుతాడు? కదా అని రుహానీ శర్మను ప్రశ్నించారు. ‘నిజమే, ఇది టాప్ సీక్రెట్. నా పర్సనల్ విషయాలను ఎప్పుడు నేను చెప్పలేదు. ఈ విషయం మీకు ఎలా తెలిసింది?. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ అవుతారు. విరాట్ నాతో చాలా బాగుంటారు. ఇద్దరూ అందరితో బాగుంటారు. వాళ్లిద్దరూ చాలా సింపుల్‌గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది’ అని రుహానీ శర్మ జవాబిచ్చారు.
‘పుష్ప-2’ సినిమా వాయిదా.. ఒక్క పోస్టుతో క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్‌గా రాబోతుంది.. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు.. దాంతో సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా, నేడు డైరెక్టర్ సుకుమార్ పుట్టిన రోజు కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ‘పుష్ప-2’ 2024 ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా సుకుమార్ ఫొటోను స్పెషల్‌గా క్రియేట్ చేసి మరీ షేర్ చేశారు.. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ న్యూస్ విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి..
ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా! మేకింగ్ వీడియో రిలీజ్
‘గుంటూరు కారం’ సినిమాతో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్‌తో తెరకెక్కింది. చాలా రోజుల తర్వాత బాబు మాస్ లుక్‌లో కనిపించనుండడంతో.. ఫాన్స్ ఈగర్‌గా వెయిట్ చూస్తున్నారు. ఎప్పుడు ప్రీమియర్లు షోలు పడుతాయా? అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు మరికొంత సమయం ఉండడంతో.. ఈ గ్యాప్‌లో చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేసింది. గుంటూరు కారం సినిమా నుంచి మేకింగ్ వీడియోను కొద్దిసేపటి క్రితం మేకర్స్ విడుదల చేశారు. మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం పేరిట ఈ వీడియో విడుదల అయింది. సినిమాను తీర్చిదిద్దడంలో టీమ్ చేసిన హార్డ్ వర్క్ ఈ వీడియోలో కనిపిస్తుంది. శ్రీలీల, త్రివిక్రమ్ నవ్వులు.. మహేష్ బాబు డైలాగ్స్, ఫైట్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. బాబు చాలా స్టైలిష్‌గా, ఇదివరకెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా అనే డైలాగ్ అదిరిపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి నాయికలుగా నటిస్తున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్‌తో పాటు సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.